Saturday, February 13, 2016

అరుణ్ సాగర్ గారికి రెండు అక్షర నివాళులు!!!

మిత్రులు అరుణ్ సాగర్ గారి మరణానంతరం ఆయన మీద వచ్చే నివాళులను ప్రచురించాలని అనుకున్నాం కానీ ఎవ్వరూ పంపలేదు. సాగర్ గారి సన్నిహిత మిత్రుడు కస్తూరి శ్రీనివాస్ గారు మా విన్నపాన్ని మన్నించి ఒకటి పంపే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ రాలేదు. ఈ లోపు.. ఫేస్ బుక్ లో ఒక రెండు మంచి మాటలు కనిపించాయి. ఒకటి... సీనియర్ జర్నలిస్టు సాయ శేఖర్ గారు (శీర్షిక: వెనక్కి రా.. ఫినిక్స్) రాసారు. అదీ 'వాడి స్ఫూర్తి తో రాసిందే...'అని ఆయన చెప్పారు. రెండోది... తప్పు చేసారు బాస్... అంటూ విజయ్ సాధు గారి పేజ్ లో కనిపించింది. అవి ఇక్కడ మీ కోసం...


1) వెనక్కి రా ... ఫీనిక్స్
వింజామరలు వీయించుకుంటున్నావా
విచ్చు కత్తులూ, విస్ఫోటనాలూ, విస్ఫులింగాలూ విచలితుడవై వీక్షిస్తున్నావా
ఇక్కడ చేరలేని తీరాలు 
ఎక్కడున్నాయో వెతుక్కుంటున్నావా ???
పోలవరం నిర్వాసితుల ని-వేదనలు
కాలసర్పాల నిర్హేతుక
ని-వేదికలూ నిర్వాకాలు
నీ నిర్భీతి వ్యాఖ్యానాల
నీ నిబద్ధ నీతి వాక్యాల
నిగళాలలో ఘల్లుమంటునే ఉన్నాయ్...
అబ్భ ... ఏముంది బాస్ ... అని
నువ్వు అన్ని ఫీలింగ్స్ నీ మేళవించి
అబ్బురపడే అవ్యయాలు
నా అంతరంగంలో ఆడుతునే ఉన్నాయ్
...
ఆ బక్కోడి లవ్ స్టోరీ
వాడి గవర్మెంటాఫీసర్ మామ పిటాంబర్
డాంబికం
ఫ్యాన్ ఒంటి మీద పడి నడుం విరిగిన ఇంటిఓనర్
ఆ పీల కాయుడి మీద కక్ష కట్టిన తీరు ...
నువ్వు ఆ కథ పంపినప్పుడు
తెరలు తెరలు గా వచ్చిన నవ్వుతోనూ ...
నువ్వు లేవనే చేదునిజం తెలిసినప్పుడు
అంతులేని వేదనతో
పొరలు పొరలుగా కట్టిన కన్నీటి
చారికలతోనూ...
నీ కలం లో కదలాడిన
కవితా పరిచారికలతోనూ
నీ మనో బలం లో మెదలాడిన
యారొగెంట్ అభిసారికలతోనూ
నీ పెక్కడిల్లోస్
ఇంకా మెమరీస్ లో ఫ్రెష్ గానే ఉన్నాయ్ ...
మియర్ మేల్, మేల్ కొలుపు
మ్యూజిక్ నెవర్ డైస్ ... ఇవన్నీ ...
నేనూ నీ అంతటి కవినయ్యుంటే
ఒక యాభయ్యేళ్ళకో, డెబ్భయ్యేళ్ళకో
తెలుగు వాచకం ఉంటే ...
అందులో నా కవిత్వం అచ్చైతే...
కవి కాలాదుల్లో నన్నూ
నీ సమకాలికుడిగా రాసి
నీ వైభవాన్ని ... ఆ పక్కనే
నా ప్రాభవాన్నీ ... పిల్లలు కీర్తించే వారేమో
తెలుగు మేష్టర్లు ఆనందపడేవారేమో ...
కానీ ...
మై డియరెస్ట్ ఫ్రెండ్ !!!
నాకు నీ స్థాయి లేదు
ఏడు దశాబ్దాల తర్వాత తెలుగు కూడా
సంస్కృతమైపోతుందేమో తెలీదు
లేక... మరు జన్మ ఉంటే ...
నువ్వే ఆ తెలుగు మేస్టరవుతావేమో
ఊహించలేను...
గుండెలనిండా ప్రేమ నింపుకున్న
అనురాగ మూర్తివి ...
ఆవిరవుతున్న ఆశలకి కొత్త
ఊపిరులూదే అభిమాన స్ఫూర్తివి...
తలపై కూస్తున్న తీతువుని
ఇలలో భయపిస్తున్న హేతువుని
కలలో జడిపిస్తున్న మృత్యువుని
ప్రెస్ క్లబ్ లో తలపై ముసిరే దోమల్ని
తోలినట్టూ ... హుష్ అంటే పోతాయనుకున్నావా?
కొత్తేడాది రెండో రోజే
నువ్విచ్చిన బర్త్ డే పార్టీ లో
మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే
అని నీకు చెప్పిన గ్రీటింగ్స్
నిరర్ధకం.. అసంబద్ధం ...
అండ్ అబద్ధం
అని నాడు తెలీదు
నేడు తెలిసినా చెయ్యగలిగిందేమీ లేదు ...
అరుణ సాగర మధనం చేస్తే
ఉత్సాహం ఉరకలెత్తే కవితా
ఉచ్చైశ్రవం ...
నికృష్టుల వికృత చేష్టలు
నిర్జించే హాలాహలం...
నీ మందస్మిత వదనం లాంటి
చంద్రుడూ ... నువ్వెక్కిరించే
వైట్ ఎలిఫెంట్...
ఇలా అన్నీ పుడతాయ్ ...
నీ రాతల మధనం చేస్తే
బూడిదలోంచి పైకి లేచే ఫీనిక్స్...
గుర్రం ఎగరావచ్చని నిరూపించే
పెగాసస్
ఇంకా ... గ్రిఫిన్, యూని కార్న్ లాంటి ఇతర మిథికల్ మిరకిల్స్ అన్నీ
పుట్టుకొస్తాయ్ ...
అదేదో ఒక జీనస్ ... ఒక స్పీషీస్ నించీ
నేను లిబరేటెడ్ అని చెప్పుకున్నావ్
ఈ స్థాయికి ఎదగక పోతే
ఆస్ట్రసైజ్డ్ అనాల్సొచ్చేది అని కూడా
అన్నావ్ ...
నువ్వు జ్జానదర్శివి
అన్నా... మనస్తే ...
అని మనసుతో నమస్తే చెప్పి న
సోమవారం నాటి నీ వాట్స్ ఆప్
మన ఐహిక స్నేహానికి ఫుల్ స్టాప్
అయ్యింది ...
నా కవితలకి తొలి పాఠకుడివి
నా ఆవేశానికి ఆపోశన వి
నా ఆలోచనలకి ఆది గురువు వి
నా ఆలాపనకి ఆలంబనవి
నువ్వు వెళ్ళిపోయిన ఆ తెలియని
చోటిక్కూడా మెసేజ్ పంపే
యాప్ ఒకటి వస్తుందేమో లే ఫ్రెండ్
అప్పటి వరకూ ...
అల్విదా ...
2) తప్పు చేసారు బాస్... 
తప్పు చేసారు బాస్...సరిదిద్దుకోలేని తప్పు చేశారు
కోపంగా ఉంది బాస్... మిమ్మల్ని ఎన్నటికి క్షమించలేని కోపం ఉంది
ఎలా వెళ్లిపోతారు బాస్... అలా ఎలా వెళ్లిపోతారు..?
మిమ్మల్నే నమ్ముకున్నోళ్లందర్నీ అనాధలను చేసి...
మీరున్నారనే ధైర్యంతో కాలరేగరేసిన నన్ను నడిరోడ్డులో వదిలేసి ...
మీరొక్కరే... ఇక సెలవంటూ అలా ఎలా వెళ్లిపోతారు..???
టన్నుల కొద్ది మంచితనం ఉంటే సరిపోదు..!!
కాసింత జాలి,దయ కూడా ఉండాలి...!!!
మరణాన్ని వెంటేసుకు తిరిగే గట్స్ మీకు ఉండొచ్చు బాస్...!!!
కానీ మృత్యువు ముందు ఓడిపోయిన మిమ్మల్ని చూసే గుండెధైర్యం ఉండాలిగా..?
ఏం నడుస్తుంది బాస్....?
ప్రపంచం ఎటు పోతోంది గురు..?
అని నవ్వుతూ అడిగే వారు కదా.....!!!!
మీ చివరి చూపుకోసం ఎంతదాకా నడిచానో..
మీ కోసం ప్రపంచాన్ని ఎలా పక్కకు నెట్టేసి వచ్చానో...
ప్రశ్నించేందుకైనా... కనీసం తెలుసుకునేందుకైనా ఓసారి రావొచ్చుగా...!!!
"అరుణ్ సాగర్" అనే పేరుకు న్యాయం చేసేందుకైనా..??
చీకటిని చీల్చుకుంటూ వచ్చే సూర్యుడిలా ఉదయించొచ్చుగా..!!
ఇది టూమచ్ గురు...!!
మరీ అత్యాశ బాస్ అంటారా....!!!
సరే సార్.... సరే నా కన్నీళ్లకు ఏమని బదులిస్తారు...??
మీరు చదివిన "మహాప్రస్ధానమే"....
మీ ప్రస్ధానానికి ముగింపుగా నిలిచినప్పుడు..
మీకోసం తపించిన నా హృదయానికి ఏమని సమాధానం చెప్తారు..??
Come on BOSS...Come on
Dont b Quiet...BREAK this SILENCE
Please say Something...!!

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి