Friday, February 19, 2016

TV-5 యాజమాన్యానికి అభినందనలు

సరే, మనుషులమన్నాక... కింద పడి మీద పడి... చచ్చీ చెడీ బతుకు వెళ్ళబుచ్చి... చివరకు నిజంగానే చావక తప్పదు. ఇది నిత్యసత్యం. మరి... బతికినన్ని రోజులు మనం చేసేది ఏమిటండీ?

1) ఊహ వచ్చింది లగాయితూ మనుగడ కోసం పోరు
2) అజ్ఞానాన్ని జాగ్రత్తగా కప్పిపుచ్చుకుంటూ తెలివిగల వాడిలా పోజు కొడుతూ సొసైటీ లో స్టేటస్ కోసం, ఎంపిక చేసుకున్న వృత్తిలో నిలబడడం కోసం నానా డ్రామాలు
3) ఫాల్స్ ప్రిస్టేజ్ తో, అహంకారంతో తెలిసీ తెలియక వింత ప్రవర్తన-పర జన పీడన
4) ఎదుగుతున్న క్రమంలో మనకంటూ ఒక భజన బృందం ఏర్పాటు చేసుకోవడం
5) పనిలో పనిగా, మనం పోయాక... పెళ్ళాం బిడ్డల కోసమని కొంత కూడా బెట్టడం.

నోట్లో బంగారు చెంచాతో పుట్టిన ఏ కొందరో తప్ప మిగిలిన వాళ్ళంతా చేసేది ఇదే... అటూ ఇటుగా. రామోజీ అయినా సరే...రవి ప్రకాష్ అయినా సరే... చేసేది ఇదే. ఈ ఐదు అంచెల క్రమంలో... ఇతరుల గురించి పట్టించుకోకుండా...  చెలరేగిపోయి చిన్ని నా బొజ్జ... శ్రీరామ రక్ష అనుకుంటూ నానా గడ్డి కరిచి ఎడా పెడా నాలుగు రాళ్ళు వెనకేసి డాబూ దర్పంతో బతికేవాడిని  'సక్సెస్ ఫుల్' మనిషి అని, జీవిత పరమార్ధమెరిగి కేవలం విజ్ఞాన్ని సాధించడం నిజమైన ఆనందమని నమ్మి సర్వే జనా సుఖినే భవంతు... అనుకునే వాడిని 'ఒట్టి పిచ్చోడు/వెర్రి బాగులోడు' అని మనం అంటుంటాం. 

పాపం... చాలా మంది జర్నలిస్టులు ఈ లిస్టులో మొదటి మూడు, నాలుగు పనులు బాగానే చేస్తారు. ఐదో పని చేయలేరు. అది చాలా మంది వల్ల కాదు. వృత్తి విలువలు నమ్ముకునే సత్తెకాలపు మనుషులకు అది అందని ద్రాక్షే. ప్రభుత్వాలు దయ తలచి చీప్ రేట్ కు స్థలాలు ఇవ్వబట్టి సరిపోయింది గానీ లేకపోతే...అంగన్ వాడీ వర్కర్లకు, జర్నలిస్టులకు పెద్ద తేడా ఉండేది కాదు. నిజానికి చాలా తక్కువ మందికి స్థల సౌకర్యం తక్కిందనేది వేరే విషయం.

చాలా మంది జర్నలిస్టు మిత్రులు పోయాక... పట్టించుకునే నాథుడే ఉండడు. ఇప్పుడు సోషల్ మీడియా, వాట్స్ అప్ గ్రూపులు ఉండబట్టి...చావు కబురు చల్లగా అందరికీ తెలుస్తుంది... మహా వేగంగా.  'ఈనాడు' లో చేస్తూ పోయినోడి చావుకు వాడితో పనిచేస్తూ ఇప్పుడు ఇతర మీడియా హౌజ్ లలో ఉన్న ఒక పది పదిహేను మంది వస్తారు. కానీ వేరే సంస్థ... ముఖ్యంగా 'సాక్షి'లో చేస్తూ పోతే... ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా 'ఈనాడు'వాడు రాడు. అంటే.. వచ్చే అవకాశం తక్కువని! "పోతూ పోతూ (వేరే పత్రికలో చేరే ముందు) డీ ఎన్ లేదా ఎం ఎన్ ఆర్ లేదా రాహుల్  తో గొడవ పెట్టుకుని ఎండీ (కిరణ్) కు పెద్ద లెటర్ రాసి పోయాడు. అందుకే... నేను రాలేకపోయాను. అంత్యక్రియలు బాగా జరిగాయా?" అని ఈనాడు మిత్రుడు అడుగుతాడు.. ఎంతో ప్రేమతో.

మనోడు స్వర్గస్థుడు అయ్యాక...కాస్త హృదయం ఉన్న మిత్రుడు ఒకడు తెగించి చొరవ చూపి ఒక సంతాప సభ జరిపినా వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువే. ప్రాంత-కుల-గోత్ర సమీకరణాలు కలిసి, అన్ని ఇతర కాలిక్యులేషన్స్ సజావుగా ఉంటే పది ఇరవై మంది వస్తారు. అదే గొప్ప. తెలుగు జర్నలిజంలో ఆద్భుతమైన జర్నలిస్టులు ఇలా చివరకు ఘన నివాళులకు నోచుకోకుండానే పోతున్నారు. వారి అకాల మరణం తర్వాత వారి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నా... పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదొక విషాదం. 

సీనియర్ ఎడిటర్ కావడం వల్ల... అరుణ్ సాగర్ గారి కి ఇబ్బంది లేకుండానే జరిగిపోయింది. సన్నిహిత మిత్రుల అశ్రు నివాళితో  అంతిమ యాత్ర బాగా జరిగింది. 'మహాప్రస్థానం' దగ్గర ఆయన భౌతిక కాయం దిగగానే... "కామ్రేడ్ అరుణ్ సాగర్ అమర్ హై" తో పాటు "గోవిందా... గోవిందా..."అని కూడా ఒక సారి వినిపించిది. దీన్ని బట్టి ఆయనకు అన్ని రకాల మిత్రులు ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చేమో!  తుది వీడ్కోలు దగ్గర ఈ పిచ్చి లెక్కలు చూసుకోకూడదు.

అరుణ్ సాగర్ గారి విషయంలో TV-5 యాజమాన్యం స్పందించిన తీరు ను ప్రశంసించడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.  బహుశా... మొట్టమొదటి సారిగా ఒక మీడియా ఆఫీసు దగ్గ భౌతిక కాయం వుంచి అక్కడి నుంచి అంతిమ యాత్ర జరిపారు. అరుణ్ సాగర్ గారి భార్య కు నెలకు కొంత మొత్తం ఇవ్వడానికి నిర్ణయించడం, వాహన సౌకర్యం కొనసాగించడం, పాప చదువు ఖర్చులు భరించడం, టీవీ ఫైవ్ ఆఫీసులో సమావేశ మందిరానికి ఆయన పేరు పెట్టడం... అద్భుతమైన విషయాలు. ఇందుకు... ఆ సంస్థ యాజమాన్యానికి.. సీ ఆర్ నాయుడు గారికి... మా కృతజ్ఞతాపూర్వక ప్రశంసలు. ఇవన్నీ ఎంత గొప్ప పనులు!

మరి... సమ సమాజ స్థాపనే ధ్యేయంగా పనిచేసే వీర కమ్యూనిస్టులు స్థాపించిన 10 టీవీ కోసం అహరహం కృషి చేసిన అరుణ్ సాగర్ గారికి ఆ సంస్థ ఏమి చేసింది? విలేకరులకు యాడ్స్ టార్గెట్ లు ఇస్తూ ఇతర సంస్థల కన్నా ఘోరంగా హీనంగా జర్నలిజం  మాన మర్యాదలు తీస్తున్న కామ్రేడ్స్ ను... అరుణ్ సాగర్ అంతరాత్మ అంగీకరించి ఉండదు, ఆత్మా క్షమించదు.

ఏతావాతా...టీవీ 5 నాయుడు గారి నుంచి ఇతర యాజమాన్యాలు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది! అరుణ్ సాగర్ విషయంలో మాదిరిగా అందరు జర్నలిస్టుల విషయంలో వ్యవహరించడానికి కుదరదు. సాధారణ జర్నలిస్టుల అకాలమరణం సందర్భంగా అన్ని మీడియా యాజమాన్యాలు కాస్త ఉదారంగా స్పందించి మృతుల కుటుంబాలను ఆదుకుంటే బాగుండు.

1 comments:

Ravi said...

టీవీ5 ను అభినందించడం వరకు బాగానే ఉంది సార్. నిజంగా అభినందించాల్సిన విషయమే. కానీ 10టీవీ ని నిందించడం సమంజసం కాదని అనిపిస్తుంది. దాని స్థాపనలో, అది త్వరగా టాప్ ఛానళ్లతో సమానంగా రావడంలో అరుణ్ సాగర్ గారి క్రుషి లేదని ఎవ్వరూ అంగీకరించరు. కానీ వారికున్న పరిమితుల ద్రుష్ట్యా వారు చేయాల్సినది చేశారు అని నాకున్న సమాచారం. ఆర్థికంగా టీవీ5 ఉన్న స్థాయిలో 10టీవీ ఉందా అన్న విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సరే 10టీవీని పక్కకు పెడితే టీవీ9 ను మీరు ఎందుకు ప్రస్తావించలేదు? టీవీ9 ప్రారంభం నుంచి అది ఈ స్థాయికి రావడంలో అరుణ్ సాగర్ గారి క్రుషి లేదా? ఆన్ స్క్రీన్ రవిప్రకాష్ గారు అయితే.. ఆఫ్ స్క్రీన్ ఛానల్ కు మొదటి నుంచి ఎవరి క్రియేటివిటితో నడిచింది? సాగర్ గారితో టీవీ9 కు ఎన్నేళ్ల బంధం ఉంది? ఇవన్నీ మీలాంటి సీనియర్ జర్నలిస్టుకు తెలియవని అనుకోవాలా? అలాంటప్పుడు రెండు ముక్కల్లో 10టీవీని, పనిలో పనిగా కమ్యూనిస్టులను ఏకీపారేసిన మీరు టీవీ9 ను ఎందుకు నిందించే సహసం చేయలేకపోయారో అర్ధం కావడం లేదు.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి