Saturday, June 1, 2019

తెలంగాణాలో జగన్ కు సూపర్ అవకాశం!

(సీతారామ శేష తల్పశాయి)
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని నేలమట్టం చేసి రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించేందుకు తెలంగాణా ముఖ్యమంతి కే చంద్రశేఖర్ రావు వెళ్లి వచ్చారు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలప్పుడు హైదరాబాద్ వచ్చి నోరుపారేసుకున్న తన మాజీ బాస్ కు 'రిటర్న్ గిఫ్ట్' ఇస్తానని కేసీఆర్ ప్రకటించి ఉండడం, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా జగన్ కు అనుకూలంగా గులాబీ దళం ప్రకటనలు చేయడం, వై ఎస్ ఆర్ సీ పీ అనుకున్న దానికన్నా ఎక్కువగా సీట్లు గెలవడం- నేపథ్యంలో తెలంగాణా ముఖ్యమంత్రి జగన్ ప్రమాణస్వీకారానికి వెళ్లడం ప్రాముఖ్యత సంతరించుకుంది. 

తన సంక్షిప్త ప్రసంగంలో కీసీఆర్.. జగన్ ను ఆశీర్వదించారు. తండ్రి నుంచి వారసత్వంగా  వచ్చిన  నాయకత్వ లక్షణంతో జగన్ ఘనవిజయం సాధించారని, చాలా ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని చెబుతూ నదీ జలాల వినియోగం గురించి సూచనలు చేశారు. ఇచ్చిన వాగ్దానాలపై ప్రకటనలు చేసే హడావుడిలో ఉన్న జగన్, తన ప్రసంగం ఆరంభంలో ఒక్క సారి కేసీఆర్ ప్రస్తావన  చేశారు. కానీ, ఆయన చేసిన సూచనల గురించి సూచన మాత్రంగానైనా మాట్లాడలేదు. కే సీ ఆర్ ను పొగడ్తలతో ముంచెత్తలేదు.  సాయంత్రం జగన్, కే సీ ఆర్ కలిసి దేశ రాజధానిలో మోదీ గారి ప్రమాణ స్వీకారానికి వెళ్లాల్సివున్నా కారణాంతరాల వల్ల పోలేదు.

కేసీఆర్ ను జగన్ కుటుంబం వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి బెజవాడ రావాల్సిందిగా ఆహ్వానించిన రోజే ... సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. జగన్ ను కేసీఆర్, కేటీఆర్ తిడుతున్న వీడియో అది. రాజకీయాల్లో అదొక పెద్ద సీరియస్ విషయం కాదు గానీ, కేసీఆర్ వెంట తిరగడం అటు ఆంధ్రప్రదేశ్ కు గానీ, ఇటు జగన్ కు గానీ మంచిది కాదు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి బతికి ఉండగా... కేసీఆర్  తెలంగాణా వాదాన్ని ముందుకు తీసుకువెళ్ళలేని పరిస్థితి ఉండేది. వై ఎస్ ఆర్ ను సందర్భం దొరికిన ప్రతిసారీ తె రా స విడువలేదు. నిజానికి జగన్ తండ్రి గారు బతికి ఉంటే తెలంగాణా నినాదం సన్నగిల్లి ఉండేది, ప్రత్యేక రాష్ట్రం చాలా ఆలస్యమయ్యేది. 

ఇప్పటికే తెలంగాణాలో కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఊపు అందుకుంటున్నది. మూడునెలల  ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించిన పార్టీ పార్లమెంటరీ ఎన్నికల్లో ఘోరంగా (అనుకున్నది 16, వచ్చింది 9) దెబ్బతిన్నది. ప్రత్యేక రాష్ట్రం వస్తే తాను కాపలా కుక్కలా ఉంటానన్న పెద్దాయన, దళితుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని వందల సార్లు చెప్పి మాట తప్పడం జనం మరిచిపోరు. కేసీఆర్ కుటుంబ పాలన పట్ల నిజామాబాద్ ఓటర్లకు ఉన్న అభిప్రాయమే మేధావులకు, విద్యార్హులకు  ఉంది. ఉద్యమానికి గళం, కలం, బలం అందించిన ముఖ్యులను అవమానించి బైటికి పంపి, సొంత కుమారుడ్ని  వారసుడిగా పోషించుకుంటున్న వైనాన్ని  జనం గమనిస్తున్నారు. తాను దండం పెట్టిన ప్రొఫెసర్  కోదండరాం, ఎంతో ఆశతో కాంగ్రెస్ నుంచి వచ్చి సీటు రాక భంగ పడిన కాకా వెంకట స్వామి కుమారుడు వివేక్, ప్రజా గాయకుడు గద్దర్  వంటి వారితో పాటు ఉద్యోగులు, నిరుద్యోగులు రగులుతున్నారు. విశ్వవిద్యాలయాల విద్యార్థులు రానున్న రోజులల్లో కీలక భూమిక పోషించబోతున్నారు.  

ఇప్పుడు తెలంగాణాలో... ఒక రాజకీయ ప్రత్యామ్నాయం కోసం జనం చూస్తున్నారు. భూస్థాపితం అయిన కాంగ్రెస్ కు, ఊసే లేని బీజీపీ కి పార్లమెంటరీ ఎన్నికల్లో సీట్లు రావడం అందుకు ఒక సూచిక. ప్రజాబలం ఉన్న కాంగ్రెస్ నేతలను కలుపుకుని, టీ ఆర్ ఎస్ అసంతుష్టులను చేరదీసి తెలంగాణపై ఇప్పటినుంచే  దృష్టిపెడితే జగన్ పార్టీకి ఇక్కడ కూడా మంచి అవకాశం ఉంది. తెలంగాణ లోని వై ఎస్ ఆర్ అభిమానులకు జగన్ విజయం బలాన్ని, ధీమానుఇచ్చింది . ఇది గమనించి ఇక్కడ క్యాడర్ ను ఏర్పాటు చేసుకుని... రాజనీతిజ్ఞతతో  వ్యవహరిస్తే జగన్ కు భవిష్యత్తులో మేలు జరుగుతుంది. 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి