Wednesday, June 12, 2019

వార్నీ...జర్నలిస్టుల గుట్టు రట్టు చేస్తివే...పేర్నీ!

నిజానికి  జర్నలిజం ఒక భయకరమైన తీట ఉద్యోగం. ప్రజాసేవకోసమని ఉజ్జోగంలో చేరి...ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా...  బైలైన్స్, సాల్యూట్స్ కు మరిగి... వెనక్కిచూసుకునేలోపు ఏ ఉద్యోగానికీ అర్హులుకారు కలం వీరులు, మీద పడిన వయస్సు వల్ల. ఈ తత్వం బోధపడి నీతిని గోతిలో పాతిపెట్టి అందినంత కుమ్మే బతకనేర్చిన జర్నలిస్టులు కొందరైతే, నీతినియమాలతో మాత్రమే నేసిన బట్టలు వేసుకుని వృత్తిలో మచ్చరాకూడదని అనుకుంటూ నెలసరి జీతం ఆలస్యమైతే వెంపర్లాడుతూ... చేబదుళ్ల మీద బతికే సత్యసంధులు మరికొందరు.  ఏ డబ్బుతో పెట్టారన్నది మనకు ప్రస్తుతం అనవసరం  గానీ, ఆ మహానుభావుడు వై ఎస్ ఆర్ సాక్షి మీడియా అనే ఆలోచన చేసి ఉండకపోతే...చాలా మంది జర్నలిస్టులు చచ్చివూరుకునే వారు.

ఇదిలావుండగా,  వై ఎస్ ఆర్ గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ కాబినెట్ లో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని మంత్రి హోదాలో మొదటి ప్రెస్ మీట్ లో జర్నలిస్టుల గురించి భలే వ్యాఖ్యలు చేశారు. 'విలేకరులతో నేను ఫ్రెండ్లీ గా ఉంటాను. యాజమాన్యాలు మీతో ఎలా ఉంటాయో నాకు తెలుసు. మీరు నాకు కొత్త కాదు. మీ చినిగిపోయిన బనీన్ల గురించి నాకు తెలుసు. చొక్కా బాగుంటే బనీనుండదు. బూటుబాగుంటే లోపల సాక్స్ చినిగిపోయి ఉంటది. మోటార్ సైకిల్ ఉంటది, లోపల ఆయిల్ ఉండదు. పిల్లల ఫీజు కట్టలేదని బాధలు. ఇంట్లో సరుకులు లేవని బాధలు...." అంటూ అయన ఆరంభించారు.

 ఇన్ని బాధలు పడి విలేకరులు ఈ వృత్తిలో ఎందుకు ఉంటున్నారంటే... మర్యాద కోసమే... అని కూడా నాని గారు చెప్పారు. "డబ్బులేకయినా, బాధలున్నా, ఇంట్లో వాళ్ళు మన మీద తిరగబడినా... ఇంట్లోంచి బైటికి రాగానే... ప్రతోడు 'నమస్తే సార్' అంటాడు.. ఆ నమస్కారం కోసమే ఇది ఒదలట్లేదని మీకూ తెలుసు.. నాకూ తెలుసు..." అని అయన నమస్తే చేసి చూపిస్తూ  చెప్పారు (ఫోటో చూడండి). తాను పండితుడిని కాదని, పామరుడ్నని, ఏ టైంలో వచ్చయినా విలేకరులు తనను కలవొచ్చని... ఈ బాధలు తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని నాని హామీ ఇచ్చారు.

అమాయకంగా మనసులో మాట చెప్పినా...నాని గారి అబ్సర్వేషన్ అక్షర సత్యం. జర్నలిస్టులకు ఉద్యోగభద్రత ఏ మాత్రం లేదు లేదు, చాలా వరకు కులం ప్రాతిపదికన నడుస్తున్న  ఈ తెలుగు జర్నలిజంలో. జీతాలు రాక కొందరు, ప్రతిభకు-సీనియారిటీకి తగినట్టు జీతాలు, పదోన్నతులు లేక కొందరు అవస్థలు పడుతున్నారు. నిజంగా చిత్తశుద్ధితో జర్నలిస్టులకు నాని, జగన్ గార్లు మేలు చేస్తారని ఆశిద్దాం.
ఈ లోపు జర్నలిస్టులకు జగనన్న వరాలు ఇచ్చారనీ, త్వరలోనే అమలుకు కార్యాచరణ సిద్ధమయ్యింది... అంటూ ఈ కింది మాటలు ప్రచారంలోకి వచ్చాయి. నిజానిజాలు మనకు తెలియదు.

త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు 
తెలంగాణ తరహాలో డబుల్ బెడ్ రూం ఇళ్లని నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం 
ఏ  పాఠశాలలో చదివించినా జర్నలిస్టుల పిల్లలకు ఫీజు ప్రభుత్వమే చెల్లించాలి అని నిర్ణయం 
స్కూల్ ఫీజు సంవత్సరానికి గరిష్ట పరిమితి 50 వేలు ... కాలేజ్ ఫీజు సంవత్సరానికి గరిష్ట పరిమితి 70 వేలు 
రాష్ట్రంలో జర్నలిస్టు కుటుంబాలకు బస్సు ప్రయాణం పూర్తిగా ఉచితం...
వర్కింగ్ జర్నలిస్టులకు మండల స్థాయి జర్నలిస్టులకు 5 వేలు గౌరవ వేతనం నియోజకవర్గం,రాష్ట్ర స్థాయి జర్నలిస్టులకు 10 వేలు గౌరవ వేతనం 
పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు 15 వేల  పెన్షన్ 
చిన్న పత్రికలకు జీవం పోసేలా భారీగా ప్రబుత్వ ప్రకటనలు ఇవ్వాలి అని నిర్ణయం 
-జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు నూతన పథకం 
-20 లక్షల వరకూ  వైద్య సహాయం ఉచితంగా అందించేలా రాజన్న జర్నలిస్ట్ హెల్త్ స్కీం 
-అక్రిడేషన్ల జారీ ప్రక్రియ సులభతరం చెయ్యాలి అని నిర్ణయం 
-సచివాలయం లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా క్యాంటిన్ ఏర్పాటు ఉచిత భోజన సదుపాయం

0 comments: