Sunday, April 12, 2020

1994-95 'ఈనాడు' బ్యాచ్: ఇద్దరు కేఎంలూ...ఇతర కలం వీరులూ...

తెలుగు జర్నలిజం చరిత్రలో ఏప్రిల్ 13, 2020 ఒక విశేషమైన రోజుగా మిగులుతుంది.
'ఈనాడు' అధినేత రామోజీ రావు గారు, ప్రముఖ భాషావేత్త డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ గారు మేథోమథనంతో ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చిన ఈనాడు జర్నలిజం స్కూల్ 1994-95 బ్యాచ్ విద్యార్థులు వృత్తిబాధ్యతలు స్వీకరించి నేటికి పాతికేళ్ళు పూర్తి అవుతుంది.

తెలుగు జర్నలిజంలో ఎందరో ఆణిముత్యాలను తయారుచేసే జర్నలిస్టుల కర్మాగారం 'ఈనాడు జర్నలిజం స్కూల్' ఎన్నో బ్యాచులను ఉత్పత్తి చేసింది. కానీ ఈ బృందానికి ఒక ప్రత్యేకత ఉంది. ఖైరాతాబాద్ లో ఈనాడు లో జర్నలిజం అక్షరాభ్యాసం చేసి, ఈనాడుకు ఇప్పటికీ అద్భుతమైన సేవలందిస్తున్న వారు కొందరైతే, నిత్య సంచలనశీలురైన కొందరు ఎవరూ చేయని ప్రయోగాలు చేసి సాధారణ జర్నలిస్టు ఊహించడానికైనా సాధ్యపడని ఎత్తులకు ఎదిగారు. వారిలో ఒకరు కృష్ణ మోహన్ కాగా, మరొకరు కృష్ణ మూర్తి (ఇద్దరూ కేఎం లే). మిగిలిన వారూ అద్భుతంగా రాణిస్తూ తామెంచుకున్న వృత్తిలో తమదైన ముద్రవేస్తూ మట్టిలో మాణిక్యాలను వెలికితీయడంలో దిట్టలైన రామోజీ-రాధాకృష్ణ ద్వయానికి ఎంతో పేరుతెస్తున్నారు.   



ఈనాడు సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డులో వందలాది వ్యాసాలు రాసి తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న జీవీడీ కృష్ణమోహన్ వివిధ కారణాల రీత్యా దాదాపు దశాబ్దం కిందట సాక్షి పత్రికలో చేరి... అక్కడి యాజమాన్యానికి వ్యతిరేకంగా ఈనాడు ప్రచురించే వ్యాసాలకు దీటుగా 'ఏది నిజం?' అనే కాలమ్ నిర్వహించి ఒక చరిత్ర సృష్టించాడు. కేవలం నాణ్యమైన ఆలోచనలు, సమయస్ఫూర్తి, నికార్సైన జర్నలిజం విలువలతో అప్పుడు రాజశేఖర్ రెడ్డిగారిని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిగారిని ఆకర్షించారు. సమర్థంగా బాధ్యతలు నిర్వహించినందుకు గానూ కృష్ణమోహన్... జగన్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాక ప్రభుత్వానికి కమ్యూనికేషన్ సలహాదారుగా క్యాబినెట్ ర్యాంకులో నియమితులయ్యారు. రాజకీయ వైకుంఠపాళిలో కేవలం జర్నలిజం బుద్ధిబలంతో ఎదిగిన కలం వీరుడు కేఎం. 

ఈ మధ్యనే నమస్తే తెలంగాణా పత్రిక ఎడిటర్ గా బాధ్యతలు స్వీకరించిన టి కృష్ణమూర్తి గారిదీ ఈ బాచే, ఇలాంటి కథే. ఈనాడు జనరల్ డెస్క్ లో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన కృష్ణమూర్తి కూడా ఒక దశాబ్దం కిందట ఆంధ్రజ్యోతిలో చేరి ఆ పత్రిక పురోగతిలో కీలకభూమిక పోషించారు. అక్కడ జనరల్ పేజీల బాధ్యతలు చూస్తూనే  కృ తి పేరుతో ఆయన రాసిన కాలమ్ విశేష ప్రజాదరణ పొందింది. తన రాతల నాణ్యతే... తనను ఒక పత్రిక ఎడిటర్ ను చేసింది. గాడ్ ఫాదర్లు లేకుండా కలాన్ని, కాలాన్ని నమ్ముకుని అతి పిన్నవయస్కుడైన ఎడిటర్ గా చరిత్ర సృష్టించిన కృష్ణమూర్తి సైతం తెలుగు జర్నలిజంలో తనకంటూ ఒక అధ్యాయాన్ని ఏర్పరుచుకున్నారు.

ఈనాడు లోనే ఉండి సృజనాత్మకతతో ఫీచర్స్ ఎడిటర్ గా రాణిస్తున్న ఆర్. సంతోష్, ఆంధ్రజ్యోతి లో నాణ్యతా ప్రమాణాలు చూస్తూ కృష్ణమూర్తి నిష్క్రమణ తర్వాత పేజీల బాధ్యతలు సమర్ధంగా నిర్వహిస్తున్న వి. రమణ, ఎంతో ముందుచూపుతో ఇంగ్లిష్ జర్నలిజంలో చేరి ఈ మధ్యనే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో డాక్టరేట్ పొందిన డా. మహేష్, స్వశక్తితో ఎదిగి ఈనాడులోనే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వై తిమ్మప్ప, వెంకూ, తామెంచుకున్న రంగాల్లో రాణిస్తున్న విశేష్ (మనో విజ్ఞానం), జిలానీ (ఫిలిం ప్రొడక్షన్) కూడా ఈ బ్యాచ్ విద్యార్థులే, స్ఫూర్తి ప్రదాతలే. 

ప్రస్తుతం ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఎం. నాగేశ్వర రావు గారి దగ్గర క్వాలిటీ సెల్ లో పనిచేసి వృత్తి నైపుణ్యం పొందిన శ్రీనివాస్, బిజినెస్ జర్నలిజంలో ఒక వెలుగు వెలిగిన మూర్తి, కంప్యూటర్ ల గురించి ఎన్నడో పుస్తకం రాసిన సృజనశీలి వి. కిషోర్... ఇలా మిగిలిన ఈ బ్యాచ్ జర్నలిస్టులంతా ఈనాడు గర్వపడే జర్నలిస్టులే.

ఈ బ్యాచుకు బూదరాజు రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో అధ్యాపక బృందం (శ్రీ రామచంద్ర రావు, శ్రీ నాగేశ్వర రావు, శ్రీ  దక్షిణామూర్తి, శ్రీ సత్యనారాయణ మూర్తి) చదువు విజ్ఞానం పంచి తీర్చిదిద్దింది. గురువులను సత్కరించుకునే సంస్కారమున్న వీరంతా కరోనా గొడవ లేకపోతె రేపు కాసేపు కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకుని ఉండేవారు. వీరందరీ... పావు శతాబ్దపు జర్నలిజం జీవితం పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు.

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి