Tuesday, April 21, 2020

ఈ టీవీ సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ దుర్మరణం

చెన్నైలో ఈ-టీవీ వాయిస్ ఓవర్లు చదివే స్థాయి నుంచి సీనియర్ రిపోర్టర్ స్థాయికి ఎదిగి మంచి జర్నలిస్టుగా, అత్యంత సౌమ్యుడిగా పేరుతెచ్చుకున్న శ్రీనివాస్ అనారోగ్యంతో నిన్న (ఏప్రిల్ 20, 2020) హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయనకు 47 సంవత్సరాలు. ఆయనకు భార్య, పదో తరగతి అభ్యసిస్తున్న కుమారుడు ఉన్నారు.

కుక్కకాటును సీరియస్ గా తీసుకోకపోవడంతో రాబిస్ వల్ల శ్రీనివాస్ మరణించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంత్యక్రియలు ఈ రోజు ముగిసాయి.

ప్రకాశం జిల్లా కొండపి మండలం అనకర్లపూడి గ్రామానికి చెందిన శ్రీనివాస్ కుటుంబం ఉద్యోగరీత్యా చెన్నైలో స్థిరపడింది. తిరువత్తియూరులో ఉండి ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఆయన విశాఖపట్నంలో డిగ్రీ చదివి మళ్ళీ చెన్నైకి వెళ్లారు. ప్రఖ్యాత అన్నా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తిచేశారు.

జర్నలిజం మీద మక్కువతో అక్కడ కష్టపడి మాస్ కమ్యూనికేషన్ లో సీటు సాధించారు. అప్పటికే ఈ-టీవీ 1, ఈ-టీవీ 2 లలో న్యూస్ బులెటిన్స్ కు వాయిస్ ఓవర్ లు చదివేవారు. ఈనాడు కంట్రిబ్యూటర్ గా కూడా పనిచేశారని తెలుస్తోంది. పీజీ అయ్యాక 2005 లో ఈ టీవీ పూర్తిస్థాయి విలేకరిగా చేరి సేవలందించారు. రెండు నెలల కిందటనే ఈ టీవీ భారత్ కు బదిలీ మీద వచ్చి హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. అంతకుముందు ఈనాడు ఎడిట్ పేజీకి కూడా ఆర్టికల్స్ రాసారు.
"శ్రీనివాస్ చాలా మంచి జర్నలిస్టు. వృత్తి పట్ల ఎంతో నిబద్ధత ఉండేది. విధి నిర్వహణలో ఎంతో చలాకీగా ఉండేవారు. వార్తలు, విశ్లేషణలతో మేధావిగా మనం చెప్పుకోవచ్చు. అవినీతి రహితుడిగా ఆయనకు మంచి పేరుంది. చెన్నై సినీ పరిశ్రమ, రాజకీయ రంగాలపై ఆయనకు అమోఘమైన పట్టువుంది," అని తనతో కలిసి పనిచేసిన ఒక చెన్నై జర్నలిస్టు చెప్పారు. 

ఏ. కిశోర్ బాబు అనే జర్నలిస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన సమాచారం ప్రకారం--శ్రీనివాస్ ఎప్పుడూ చిక్కటి చిరునవ్వుతో కనిపించేవాడు. మంచి భాషా సౌందర్యం కూడా ఉన్నవాడు.  తెలివైన వాడు. ఫిబ్రవరిలో ఇంట్లో ఓరోజు ఉదయం శ్రీనివాస్ చేతిని కుక్క కరిచింది. కుక్క కాటును పట్టించుకోకపోవడం వల్ల ప్రాణాల మీదికి వచ్చింది. చెన్నైలో తనకు సన్నిహితుడైన ఒక వైద్యుడు ఫోన్ లో ఇచ్చిన సలహా మేరకు శ్రీనివాస్ హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రిలో చేరాడు.
కానీ అప్పటికే సమయం మించిపోయింది. రేబిస్ బ్రెయిన్ కు పాకి ప్రాణాలను హరించింది.

ఆరంభంలో శ్రీనివాస్ స్వరం పీలగా ఉండడంతో వాయిస్ ఓవర్ కు అవకాశమివ్వకపోతే సాధన చేసి మరీ సాధించాడని అప్పట్లో ఈ టీవీ కి పనిచేసిన మరొక సీనియర్ జర్నలిస్టు చెప్పారు.

"గొంతు సూట్ కాని కారణంగా దాదాపు ఇతణ్ణి తిరస్కరించేశాము. కానీ, పట్టుదల విషయంలో శ్రీనివాస్ ని ప్రశంసించి తీరాల్సిందే. చెన్నైలో ఆఫీసుకి చాలా దూరంలో ఉండేవాడు. అతను రోజూ రాత్రిళ్లు వాయిస్ ఓవర్ చెప్పేందుకు కొద్దికాలం ఉచితంగానే (ప్రాక్టీస్ అన్న వంకతో) పనిచేశాడు. అతడి చిత్తశుద్ధిని చూసి.. అవకాశం ఇచ్చారు. తను ఎంచుకున్న రంగంలోొ మెళకువలు తెలుసుకునేందుకు ఎప్పుడూ ఆసక్తిని కనబరిచేవాడు. అప్పట్లో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి సోదరి వసంతలక్ష్మి గారు కూాడా ఈటీవీలో న్యూస్ యాంకరింగ్ చేసేవారు. ఆమె దగ్గర కూడా స్వరజ్ఞానానికి సంబంధించి కిటుకులు తెలుసుకుంటుండేవాడు. తను పలుకరించే ప్రతి ఒక్కరినీ ఆత్మీయులుగా భావించేవాడు," అని అయన గుర్తుచేసుకున్నారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు శ్రీనివాస్ మృతి పట్ల విచారం వ్యక్తంచేశారు. "వృత్తి పట్ల నిబద్ధత, కష్టపడి పనిచేసే తత్వం, విలువలకు కట్టుబడిన వ్యక్తిత్వం వారిని ఆదర్శ పాత్రికేయుడిగా నిలిపాయి. ఆయన  వ్యక్తిగతంగా నాతో చాలా అభిమానంగా ఉండేవారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను," అని ఆయన పేర్కొన్నారు. 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి