చేతిలో యావత్ కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం, జేబులో దండిగా వనరులు, పుష్కలంగా రాజకీయ రచనా దురంధరులు, క్రమశిక్షణ కలిగిన క్యాడర్ ఉన్నా... పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ చేతిలో కమలనాథులు, ముఖ్యంగా నరేంద్ర మోదీ-అమిత్ షా ద్వయం- దెబ్బతినడానికి ముఖ్య కారణం... ఆమె సాహసోపేత రాజకీయ పోరాటంతో పాటు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పకడ్బందీ వ్యూహరచన, శాస్త్రీయ సాంకేతిక ప్రచార భేరి.
దాదాపు ఒక ఏడాది నుంచీ వందల మంది సైనికుల లాంటి యువతీ యువకులతో కూడిన ఐ-పాక్ బృందం పీకే నేతృత్వంలో బీజేపీని ఆఫ్ లైన్, ఆన్ లైన్ దీటుగా ఎదుర్కొని నిలబడి విజయహాసం చేసింది. మోదీ, షా తో పాటు కేంద్ర మంత్రులు పెద్ద సంఖ్యలో ర్యాలీల్లో, సభల్లో పాల్గొని మమత ఖేల్ ఖతం అని చెప్పినా... బీజేపీ కి రెండంకెలను మించి సీట్లు రాబోవని పీకే ధీమాగా చెబుతూ వచ్చారు. ఆయన ట్వీట్స్ గానీ, టీవీ ఇంటర్వ్యూలు గానీ అర్థవంతంగా, ఆకట్టుకొనేవిగా ఉన్నాయి.
డిసెంబర్ 21. 2020 నాడు పీకే ఎక్కడలేని ధీమతో చేసిన ఈ కింది ట్వీట్ ఇప్పటిదాకా పెద్ద చర్చనీయాంశం అయ్యింది. సమకాలీన భారతీయ ఎన్నికల చరిత్రలో ఇది ఒక మరిచిపోలేని అంశంగా నిలిచిపోతుంది. బీజేపీ ఎంత హడావుడి చేసినా వచ్చేవి వంద లోపేననీ, అంతకు మించి వస్తే తానుచేసే ఈ పని (స్పేస్) నుంచి వైదొలుగుతానని, మరిచిపోకుండా ఉండడానికి ఈ ట్వీట్ ను దాచుకోండని కూడా తను చెప్పాడు. కమలనాథుల కనుసన్నల్లో ఉన్న నేషనల్ మీడియా గుచ్చినా, కుళ్ళ బొడిచినా తను ఈ విషయంలో ఆయన వెనక్కుపోలేదు. నిజానికి ఇంత ధైర్యంగా ఈ ప్రకటన దేశ ముదుర్లయిన బీజేపీ నేతలకు బహిరంగ సవాల్. అయినా... పీకే తప్పని నిరూపించకపోయిన నాయకమణ్యులు ఆయన్ను లోలోపలైనా అభినందించకుండా ఉండలేరు.
సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకుని, మమతను ఒక్కదాన్ని ఒంటరి చేసి ఆమెనే లక్ష్యంగా చేసుకుని పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు విమర్శలు సంధించడం, ఎన్నికల సంఘం వీరికి అనుకూలంగా ఎనిమిది దఫాలుగా ఎన్నికలు నిర్వహించడం, తమ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరో ప్రకటించకపోవడం, నందిగ్రామ్ లో మమతపై దాడి జరగడం, రెండు రోజుల పాటు ఆమె ప్రచారం చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇప్పించడం... వంటి తప్పులకు కమలనాథులు మూల్యం చెల్లించాల్సివచ్చింది. బెంగాల్ లో ముఖ్యమైన విజయాన్ని సాధించలేక మోదీ-షా బృందం చతికిల పడింది. అయినా... అలనాటి కమ్యూనిస్టుల కోటలో, మేథావులు గడ్డపైన బీజేపీ ఇప్పుడు సాధించిన ప్రతిపక్ష హోదా తక్కువేమీ కాదు. కాకపోతే.... దశాబ్దాల తరబడి బెంగాల్ ను ఏలిన కామ్రేడ్లు పూర్తిగా జీరోలు కావడం ఒక విషాదం!
అనుకున్నట్లు తృణమూల్ ను గెలిపించినా... తాను ఈ స్పేస్ నుంచివైదొలుగుతున్నానని, ఐ ప్యాక్ నాయకత్వం ఇకపై ఈ బాధ్యతలు చూసుకుంటుందని పీకే తృణమూల్ విజయోత్సవాల మధ్యన ప్రకటించడం కొసమెరుపు. కొద్దికాలం పాటు భార్యా బిడ్డలతో గడిపి... తర్వాత సంగతి తర్వాత చూస్తానన్న అభిప్రాయం ఆయన మాటల్లో ధ్వనించింది. పదవీభాగ్యం కలిగించే ఇలాంటి రాజకీయ మాంత్రికుడిని వదులుకోవడానికి మన భారత నాయకులు అమాయకులు కాదు, పేదలూ కాదు.
0 comments:
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి