Thursday, November 26, 2009

తెలుగు ఛానెల్స్--'మసాజ్ జర్నలిజం'

ఒళ్ళు నొప్పిగా వుందని ఒక మసాజ్ సెంటర్ కు వెళితే ఏమవుతుంది? అక్కడ వున్న అమ్మాయో, అబ్బాయో నూనె దట్టంగా పట్టించి ఒళ్ళు మర్దన చేస్తారు. ఆరోజుకు నొప్పి తగ్గినా...మర్నాడు అది తిరగపెట్టదని చెప్పలేం. అంటే...సమస్యకు మూలం తెలుసుకోకుండా నూనెతో మసాజ్ చేసి అప్పటికి నాలుగు డబ్బులు తీసుకొని వదిలేస్తారు ఆ మసాజ్ సెంటర్ వారు.  అప్పటికి ఆ కార్యక్రమం సుఖంగానే వుంటుంది.


కొన్ని రోజులుగా...ఈ తెలుగు ఛానెల్స్ "వెలుగులోకి తెస్తున్న" మసాజ్ సెంటర్ ల బాగోతం చూస్తే ఈ జర్నలిజం "మసాజ్ జర్నలిజం' అని అనిపిస్తున్నది. అంటే ఏ విషయాన్నైనా పైపైన స్పృశించి మర్నాడు వదిలేయడం అన్న మాట. 

ఏదో ఒక ఛానల్ పోలీసు వారి సహకారం తీసుకుని ఒక ప్రణాళిక ప్రకారం మసాజ్ సెంటర్లపై "దాడి" చేస్తుంది. కొందరు పురుషులతో పాటు ముఖాలకు చీరనో, చున్నీనో అడ్డం పెట్టుకుని బైటికి వస్తున్న ఆడపిల్లల విజువల్స్ చూపిస్తారు. మసాజ్ సెంటర్ల ముసుగులో జరుగుతున్న సెక్స్ రాకెట్ ను తమ ఛానల్ వెలుగులోకి తెచ్చిందని యాంకర్ మాటి మాటికీ చెప్పి...ఇప్పుడు మీరు చూస్తున్నవి "ఎక్స్ క్లూసివ్" విజువల్స్ అని డప్పు కొట్టుకుంటారు.

కొందరు ఉత్సాహవంతులైన రిపోర్టర్లు అయితే...ముఖం కనపడకుండా తంటాలు పడుతున్న యువతుల మూతి దగ్గర గొట్టం (మైకు) పెట్టి..వీర ప్రశ్నలు గుప్పిస్తారు. (మొన్న రాత్రి 'సాక్షి' ఛానల్ లో ఒక క్రైం రిపోర్టర్ లైవ్ లో మసాజ్ సెంటర్ పై దాడిని చూపించి ఇలాగే అక్కడ దీనంగా కూర్చున్న ఒక మహిళను ఇంటర్వ్యూ చేయబోయాడు. అంతలోనే...న్యూస్ యాంకర్ రిపోర్టర్ ను  వారించి...ఆమెతో మాట్లాడకుండా నిలువరించాడు. ఆ క్షణం లో తెలివిగా వ్యవహరించిన ఆ యాంకర్ కు అభినందనలు.  జర్నలిస్టులు అందరికీ ఈ స్పృహ వుంటే ఎంత బాగుండు!)


ఒక పోలీసు బైటు కాగానే...సంధ్య అక్కను స్టూడియోలో కూర్చోపెట్టి ఈ దారుణంపై మాట్లాడిస్తారు సదరు ఛానల్ వారు. ఆమె చక్కగా స్త్రీ ఎలా వస్తువుగా మారిందీ వివరించి ఒక లెక్చర్ దంచుతారు. మరికొందరు లైవ్ లో, ఫోన్ లో ఈ వ్యవహారంపై మాట్లాడతారు. ఇలాంటి 'మసాజ్' స్టోరీలు చూస్తే నాకు భలే బాధ వేస్తోంది.

ఆ క్షణానికి...అలా దొరికి పోయిన అమ్మాయిలను జనాలకు వివిధ కోణాలలో చూపించే  ఛానెల్స్ వారి జీవితాలలోకి తొంగి చూడక పోవడం బాధాకరం. ఈ అమ్మాయిలు...ఏదో సుఖం కోసం ఈ రొంపిలోకి దిగి ఉండరు. నిరుద్యోగం, దారిద్ర్యం, ఇంటి దగ్గర ఆర్ధిక ఇబ్బందులు...వంటి కారణాల వల్ల నిస్సహాయ స్థితిలో మరొక దారి లేక వాళ్ళు ఇలాంటి పనికి పాల్పడతారు.
రిపోర్టర్ లు ఈ కోణం మరిచి వారిని దోషులుగా చూపించడం మీదనే దృష్టి పెడితే అది అసంపూర్తి జర్నలిజం అవుతుంది. ఏ దిక్కూ లేక పొట్ట పోషించుకునేందుకు వేరే మార్గం తెలియక ఈ పిచ్చి తల్లులు ఈ పనికి పాల్పడుతున్నారని ఒకటి రెండు కేసులు దగ్గరినుంచి చూస్తే నాకు అర్థం అయ్యింది. వారు ఈ వృత్తిని ఎంచుకోవడం ప్రభుత్వం, వ్యవస్థ లోపం వల్ల కాదా?


మావోయిస్టులకు ఇచ్చినట్లు ఇలాంటి అభాగినులకు ప్రత్యేక ప్యాకేజి ఎందుకు ఇవ్వరు? అన్న ప్రశ్న వేధిస్తున్నది. శరీరాన్ని అమ్ముకుంటూ దొరికిపోయినంత మాత్రాన వీరిని దోషులుగా ఛానెల్స్ చిత్రీకరించడం తప్పు కాదా?. రాజ్యాంగం ప్రకారం 'జీవించే హక్కు' కల్పించాల్సిన ప్రభుత్వానికి ఈ విషయంలో బాధ్యత ఏమీ లేదా? ఈ అంశం మీద బహిరంగ చర్చ జరిగితే బాగుంటుంది.

మీడియా 'మసాజ్ జర్నలిజం' ను ఒదిలి...సమస్యను లోతుగా పరిశీలించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే....ఇలాంటి అభాగినులకు ఎంతో కొంత మేలు జరిగే అవకాశం వుంది.

Wednesday, November 25, 2009

N-TV కి రాజశేఖర్-పుట్టి మునగనున్న i-news!

సమకాలీన టెలివిజన్ రంగంలో కులం, గోత్రం, ప్రాంతం ఆధారంగా కాకుండా...కేవలం ప్రతిభతో ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కుని ఒక స్థాయికి వచ్చిన జర్నలిస్టు రాజశేఖర్. వివాదాస్పద పరిస్థితుల నడుమ...TV-9 నుంచి బైటకు వచ్చి...కొంత కాలం అజ్ఞాతంలో వుండి ఎం.ఎన్.ఆర్.విద్యా సంస్థల వారితో i-news కు రూపకల్పన చేశాడు రాజశేఖర్.

బిల్డింగ్ నుంచి టెక్నాలజీ వరకూ దగ్గర వుండి చూసుకున్న రాజశేఖర్ ఐ-న్యూస్ ఆనతి కాలంలో మంచి పేరు తెచ్చుకోవడానికి కారకుడయ్యాడు. రాజశేఖర్ పిలవగానే...ఆయన గతం తెలిసీ సీనియర్ జర్నలిస్టులు ఆ ఛానల్ లో చేరారంటే...వృత్తిగతంగా అతని మీద వున్న నమ్మకమే కారణం. తనే సొంతగా కొత్త వారికి శిక్షణ నిచ్చి టీం ను తయారు చేసుకుని....ప్రముఖ ఛానెల్స్ కు దడ పుట్టించాడు. వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు. ఛానల్ కోసం, తనను తాను నిరూపించుకోవడం కోసం ఆయన వెయ్యి అబద్ధాలు చెప్పడానికైనా వెనుకాడ లేదు. తన మనుగడకు ముప్పు తెస్తారనుకున్న వారిని తెలివిగా తెరకు దూరం చేశాడు. జనం నాడి బాగా అధ్యయనం చేసి..."దాదా" లాంటి వివాదాస్పద ప్రోగ్రాం లు రూపొందించాడు. అనైతికమని సదాలోచన పరులు మొత్తుకున్నా...వైరి ఛానల్ ను దెబ్బతీయడమే ధ్యేయంగా పలు కొత్త ప్రోగ్రాం లు తెలుగు వారికి పరిచయం చేశాడు.   


అలాంటి రాజశేఖర్ ను వదులు కోవడానికి ఐ-న్యూస్ యాజమాన్యం సిద్ధపడింది. మనం ఊహించినట్లుగానే...కందుల రమేష్ TV-5 నుంచి i-news లోకి జంప్ చేయడంతో..ఐ-న్యూస్ లో పెను పరిణామాలు సంభవించాయి. రాజశేఖర్ N-TV లో చేరడం దాదాపుగా ఖాయం అయ్యింది. తనతో పాటు ఒక పది మంది సీనియర్లను చౌదరి గారి ఛానల్ లోకి ఆయన తీసుకుపోతున్నట్లు తెలుస్తున్నది.

ఇప్పటికే...విపరీతమైన పోటీతో ఏమిచేయాలో పాలుపోక రక్తపోటును, కొమ్మినేని శ్రీనివాస రావు గారిని తెచ్చుకుని...అయినా రేటింగ్స్ పెరగక తంటాలు పడుతున్న N-TV లో రాజశేఖర్ చేరితే...అది కచ్చితంగా...ఆ ఛానల్ కు వరం, i-news కు శాపం కానున్నదని మీడియా విశ్లేషకుల అభిప్రాయం.

రాజశేఖర్ కు చెప్పకుండా...కందుల రమేష్ ను ఐ-న్యూస్ ఉన్నత పదవిలో కూర్చోపెట్టింది. మరొక పక్క రవి కి రాజశేఖర్ కు మధ్య బాగా బెడిసింది.  దాంతో...రాజశేఖర్ N-TV తో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఒక వారం లోపు ఆయన ఆ ఛానల్ లో చేరబోతున్నట్లు పక్కా సమాచారం. విషయాన్ని పసిగట్టిన i-news అధినేత వాసు ఉద్యోగులకు ఒక అంతర్గత లేఖ రాసారు. 
ఇక నుంచి న్యూస్ అంతా కందుల రమేష్ చూసుకుంటారని, దీనికి సంబంధించి అంతా ఆయనకు  రిపోర్ట్ చేయాలని, ప్రత్యేక కార్యక్రమాలు వంటి వాటిని రాజశేఖర్ చూసుకుంటాడదన్నది దాని సారాంశం. 
 అంతా బాగున్నది కానీ...ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తామని సారు చెప్పలేదు. (గత నెల జీతాన్ని యాజమాన్యం నిన్నటికి గానీ అందరు ఉద్యోగులకు అందజేయలేదు మరి).


చివరి క్షణంలో మార్పులు జరగకుండా...రాజశేఖర్ నిజంగానే నిష్క్రమిస్తే...ఐ-న్యూస్ ను ఒక దెబ్బ తీయడానికి దాని వైరి ఛానల్ సిద్ధంగా వుంది. "ఐ-న్యూస్ నుంచి రాజశేఖర్ వెళ్ళేటట్లు చేయడం ఆత్మహత్యా సదృశం. ఒక మూడు నాలుగు నెలల్లో...ఛానల్ దారుణంగా దెబ్బ తినడం ఖాయం," అని రాజశేఖర్ కు నమ్మిన బంటు లాంటి ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పాడు. అన్ని కోణాలలో చూస్తే ఇది నిజమే అనిపిస్తున్నది. పాపం...రాజశేఖర్ ను నమ్ముకుని ఐ-న్యూస్ లో చేరిన దాదాపు యాభై మందికి భవితపై బెంగ పట్టుకుంది. 


ఇంకొక పరిణామం ఏమిటంటే....రాజశేఖర్ పొడ పెద్దగా గిట్టని ఒక "బొబ్బిలి పులి", మరొక "తమిళ తంబి" N-TV నుంచి బైటికి వెళ్ళాలని చూస్తున్నట్లు మీడియా లో బాగా ప్రచారం జరగడం. వీరిద్దరూ....వేరే ఛానల్ లో వున్న వారి సహచరుడైన మరొక తురుం ఖాన్ జర్నలిస్టుతో కలిసి ఐ-న్యూస్ లో చేరితే ఎలా ఉంటుందా అని సమాలోచనలు చేస్తున్నట్లు భోగట్టా.
"ఈ ముగ్గురూ కలిసి అక్కడ చేరాలని అనుకుంటున్నారని మేము కూడా విన్నాం. అది ఎంతవరకూ నిజమో తెలియదు," అని చౌదరి గారి ఛానల్ లో ఒక పెద్దాయన చెప్పారు. మొత్తం మీద అందరికీ శుభం కలుగు గాక!    

మీడియా తీరుతెన్నులపై మంచి చర్చలు

"పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విషపుత్రిక ఆ పత్రిక," అని ఒక పెద్దాయన ఒకానొక పత్రికను ఉద్దేశించి గతంలో తెగనాడాడు. ఇప్పుడు ఏ ఛానల్ లో , ఏ పత్రికలో చూసినా...పెట్టుబడుల వ్యవహారం పెద్ద చర్చనీయాంశం అయి కూర్చుంది.  


'ఈనాడు', 'సాక్షి' పత్రికలు ఒక దానిపై మరొకటి మొదటి పేజీలో దుమ్మెత్తి పోసుకుంటున్నాయి...ఈ పెట్టుబడి గురించే. మీకు పెట్టుబడి ఎవరు పెట్టారంటే...మరి మీ సంగతి ఏమిటి అని రెండు పత్రికలు అక్షర యుద్ధానికి దిగాయి.


నిజం చెప్పుకోవాలంటే వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరణం తర్వాత 'ఈనాడు' లో ధైర్యం పెరిగింది. ఓబులాపురం విషయంలో జగన్ అనుయాయులు బద్నాం కావడాన్ని ఆ పత్రిక మంచి అవకాశంగా తీసుకుని...సోదర పత్రిక 'ఆంధ్రజ్యోతి' తరహాలో ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఈ లోపు...రామోజీ గారు కష్టాలలో వుంటే...ఆదుకున్నది ఎవరా అని ఆరా తీసి 'సాక్షి' పేపర్, ఛానల్ ఒక కథనాన్ని వెలుగులోకి తెచ్చాయి. చంద్రబాబుకు, రిలయన్స్ కు సంబంధం వుంది కాబట్టి...'ఈనాడు' కు పరోక్షంగా బాబు ఆర్ధిక దన్ను ఇచ్చారని, ఇది అపవిత్రమని ఆ కాంగ్రెస్ ఎం.పీ. పత్రిక, ఛానల్ ఘోషించాయి.

నిజానికి ఇలాంటి కథనాలు రాగానే...రామోజీ గారు మొదటి పేజీలో తన సంతకంతో కూడిన ఎడిటోరియల్ వేస్తారని అనుకున్నాం కానీ...అప్పటికి కిమ్మనని 'ఈనాడు' మూడు రోజులు పోయాక ఒక బ్యానర్ ప్రచురించింది. 'సాక్షి'కి ఎవరు, ఎలా, ఎందుకు పెట్టుబడులు  పెట్టిందీ వివరంగా తెలిపిందీ కథనం. పెట్టుబడులు పెట్టిన వారి గురించి చాలా వార్తలు ప్రచురించింది.

'సాక్షి' ఆగుతుందా? వెంటనే....'ఈనాడు'ను దూది ఏకుతూ "మాది రాచబాట...మాది అద్దాల మేడ" అన్న శీర్షికతో 'ఏది నిజం'గా  'సాక్షి" విరుచుకుపడింది. ఎప్పటిలాగానే అందులో...'ఈనాడు'ను ఇరకాటంలో పెట్టే పలు ప్రశ్నలు లేవనెత్తింది. ఇలా..పరస్పరం బురదచల్లుకోవడం ద్వారా...రెండు 'మీడియా హౌసులు' జర్నలిజాన్ని బజారుకు ఈడుస్తున్నాయి. 

సత్యం జనానికి తెలియడం మంచిదే కానీ...మరీ ఇలా ఒకళ్ళ బట్టలు మరొకరు ఊదదీసుకుంటే...మీడియా మీద ఉండాల్సిన విశ్వసనీయత గంగలో కలుస్తుంది. ఒక పక్క...నీతీ జాతీ లేని ఛానెల్స్...మరొక పక్క రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తున్న పత్రికలు...వెరసి...జర్నలిజం ఒక పచ్చి వ్యాపారం...వీటి రాతలు బోగస్..అని జనం అనుకునే పరిస్థితి. పాపం పొట్ట చేతపట్టుకుని సమాజ సేవ పరమార్ధంగా జర్నలిజంలోకి దూకిన  జర్నలిస్టులు ఈ ఎనుబోతుల కుమ్ములాటలో పావులై...ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. విలేఖరులను జనం రాజకీయ కళ్ళ అద్దాలతో చూస్తున్నారు. 

ఈ నేపథ్యంలో...హెచ్.ఎం. టీవీ లో రామచంద్ర మూర్తి గారు రెండు రోజుల కిందట ఒక మంచి కార్యక్రమం నిర్వహించారు. అ చర్చ నేటి మీడియా లో దౌర్భాల్యాలను, కర్తవ్యాన్ని విశదీకరించింది. పొత్తూరి గారు తన సీనియారిటీ తో మంచి విశ్లేషణ చేసారు.


అలాగీ 'గ్రేట్ డిబేట్" పేరిట 'ఏ.బీ.ఎన్.--ఆంధ్ర జ్యోతి" రాధాకృష్ణ గారు కూడా బుధవారం సాయంత్రం ఒక మంచి చర్చ పెట్టారు. కొందరు సో కాల్డ్ జర్నలిస్టు సంఘాల నేతలు ఎలా దారుణంగా తయారయ్యిందీ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే ఆర్.కే. నిర్మొహమాటంగా వివరించారు. జర్నలిజాన్ని అడ్డం పెట్టుకుని నేతలుగా ఎదిగి నీతీ గీతీ లేకుండా తెగ బలిసిన వారికి ఆ వ్యాఖ్యలు చెంప పెట్టులాంటివి. పదవిలోకి వచ్చిన పార్టీ వారిని కాకా పట్టి, సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటూ...ఆస్తులు, పదవులు సంపాదించుకుంటూ...పైరవీలు చేస్తూ.. అచ్చోసిన ఆంబోతుల మాదిరిగా నేతల ముసుగులో తిరుగుతున్నవారికి ఈ చర్చలు గుణపాఠం కావాలని ఆశిద్దాం. జర్నలిస్టుల సంక్షేమం ఏ మాత్రం పట్టని దగాకోరు నేతలను ఆర్.కే.మాటలు కదిలిస్తాయా అన్నది అనుమానమే.

ఈ చర్చలో సీనియర్ జర్నలిస్టులైన  శ్రీనివాస్ గారు, శ్రీనివాస రెడ్డి గారు, అమర్ గారు పాల్గొని తమ అభిప్రాయాలను అందించి చర్చకు సొగసు తెచ్చారు. నిజానికి ఇటీవలి కాలంలో మీడియా పై జరిగిన మంచి చర్చ ఇది. మరీ మసక బారిన  మీడియా ప్రతిష్టను పెంచాల్సిన బాధ్యత ఇలాంటి జర్నలిస్టుల భుజస్కందాలపైననే వున్నదన్నది అక్షర సత్యం. 
అయితే...ఇలాంటి చర్చలలో...ఆస్థాన విద్వాంసులైన వృద్ధ జర్నలిస్టులకు బాగా అవకాశం ఇస్తున్నారు. వారు చర్విత చర్వణంగా  చెప్పిందే చెబుతున్నారు...కానీ...కొత్త తరం జర్నలిస్టులు  ఏమనుకుంటున్నారో తెలుసుకొనే  ప్రయత్నమే చేయడం లేదు.

Monday, November 23, 2009

వ్యక్తిగత విషయంపై చర్చ....రచ్చ రచ్చ

గత రెండు రోజులుగా...విజయవాడకు చెందిన వివాహిత జ్యోతి, కర్నూలు కుర్రోడు కార్తీక్ ల మధ్య వివాదం TV-9 కు మంచి మసాలాను అందించింది. ఆదివారం నాడు ఒక్క జ్యోతి కథనాన్ని మాత్రమే అందంగా అందించిన ఆ ఛానల్, కార్తీక్ వాదనను పట్టించుకోలేదు. తన బిజినెస్ భాగస్వామి అయిన కార్తీక్ హ్యాకింగ్ కు పాల్పడి...తనకు తన భర్తకు మధ్య జరిగిన ఆన్ లైన్ సంభాషణను అందరికీ పంచాడని, తనను పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తూ మానసికంగా హింసించాడని ఆ అమ్మాయి ఆరోపిస్తున్నది.

కార్తీక్ ఈ ఆరోపణలను ఖండిస్తూ...తనను పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయే వేధిస్తున్నదని ప్రత్యారోపణ చేస్తున్నాడు. TV-9 లో జ్యోతి కథనం విన్న కార్తీక్ తన వాదన కూడా వినాలని ఆ ఛానల్ ను కోరాననీ, కానీ తనకు అందుకు అవకాశం ఇవ్వలేదని వాపోయాడు. సాయంత్రానికి 'Zee- 24 గంటలు' వారు కార్తీక్ ను లైవ్ లోకి తీసుకున్నారు. తన వాదన వినిపించేందుకు మంచి అవకాశం కల్పించారు. దాంతో కథ మరింత రక్తి కట్టింది. 

ఆరా తీస్తే తెలిసింది ఏమిటంటే...టీ వీ రంగాన్ని శాసిస్తున్న కేబుల్ నెట్ వర్క్ లో ఒక పెద్ద మనిషితో జ్యోతి కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయనీ, ఆయన వల్లనే మొదటి రోజు కార్తీక్ వాదన బుల్లి తెరపై కనిపించలేదని తెలియవచ్చింది. జీ ఛానల్ లో కూడా కార్తీక్ వాదన రాకుండా వుండాలని సదరు ప్రముఖుడు ప్రయత్నించి విఫలమైనట్లు సమాచారం.

అదలా వుండగా...సోమవారం రాత్రి అటు జ్యోతిని లైవ్ లో వుంచి, ఇటు కార్తీక్ ను టెలిఫోన్ లైన్లో తీసుకుని రజనీకాంత్ దాదాపు ఒక గంట పాటు నానా యాగీ సృష్టించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముగిసిన రాత్రి ఈ అంశంపై TV-9 అంత సమయం కేటాయించడం వింతగా తోచింది. యాంకర్ గారు జడ్జ్ పాత్రను పోషిస్తూ కార్యక్రమం నడిపారు. మధ్యలో ఇద్దరు సాంకేతిక 'నిపుణుల'తో కూడా మాట్లాడించారు. "ఈ నేరం కార్తీక్ చేసేందుకు అవకాశం వుంది అని మీరు భావిస్తూ వున్నారా?" అని రజనీకాంత్ అడిగారు. ఆయన ఒక దశలో కార్తీక్ ను మందలించారు. "మీరు ఇప్పటికే చాలా సవాళ్లు విసిరారు," అని ఒకటి రెండు సార్లు కటువుగా, అచ్చం జడ్జి మాదిరిగా, అన్నారు. మొత్తం మీద అమ్మాయి, అబ్బాయి లైవ్ లో మరీ పచ్చిగా మాట్లాడు కోకుండా నిలువరించినందుకు రజనీకాంత్ ను అభినందించాల్సిందే.

ఇంతకూ కోర్టులో తేలాల్సిన విషయాన్ని మిడిమిడి జ్ఞానంతో ఒక ఛానల్ ఎందుకు పరిష్కరించాలని చూస్తున్నదో తెలియడంలేదు. 

చివరకు మంగళవారం కర్నూల్ లో కార్తీక్ ఇంటికి ఒక ఓ.బీ.వ్యాన్ పంపుతున్నామని, ఆయన తన సాక్ష్యాలను ప్రజలకు లైవ్ లో చూపించి "నిర్దోషి" గా బైట పడాలని ఆ ఛానల్ సూచించింది. మీకు ఏమనిపించిందో నాకు తెలియదు కానీ...ఈ వివాదం ఒక పిచ్చి వ్యవహారంలా తోచింది నాకు.

పెళ్లి అయిన అమ్మాయి...భర్తకు తెలీకుండా...మరొకడితో విచ్చలవిడిగా ఆన్ లైన్ వ్యవహారం నడపడం ఏమిటి? వాడినే వ్యాపార భాగస్వామిని చేసుకోవడం ఏమిటి? శ్రుతిమించిన మెసేజ్ లు వాడికి పంపి చనువు ఇవ్వడం ఏమిటి, కంపు కంపు చేసుకోవడం ఏమిటి? పోలీసులు కేసును పరిష్కరిస్తూ ఉండగానే ఒక ఛానల్ కు ఆమె ఎక్కడం ఏమిటి, చస్తా అనడం ఏమిటి? ఆ ఛానల్ వారు ఆ అమ్మాయి కి మాత్రమే అవకాశం ఇచ్చి ఆరోపణలు ఎదురుకుంటున్న వ్యక్తిని దోషిగా చూపించడం ఏమిటి? అమ్మాయి, అబ్బాయి లైవ్ లో బూతులు దోక్కోవడం ఏమిటి? అబ్బాయి "ప్రూఫ్" చూపించడానికి ఒక లైవ్ వ్యాన్ ను వాడి ఇంటికి పంపడం ఏమిటి?---అంతా గందరగోళం, అగమ్యగోచరం. ఛానల్ కు తమాషా, జనానికి టైం పాస్.

రాజకీయ పలుకుబడి వల్ల ఒక అమ్మాయికి నిజంగానే అన్యాయం జరుగుతున్నదని ఛానెల్స్ భావించి ఆ అంశానికి ప్రాముఖ్యత ఇవ్వడం తప్పు కాదు. కానీ...ఇప్పుడు లైవ్ లో చేస్తున్న రచ్చ...గుట్టు చప్పుడు కాకుండా రిపోర్టర్ ఆరా తీయాల్సిన అంశం. రిపోర్టర్ గారు ముందుగా రెండు వైపులా వాదనలు విని...ఆధారాలు స్వయంగా పరిశీలించి...సైబర్ నిపుణులు, పోలీసుల వెర్షన్ తీసుకుని ఒక మంచి స్టోరీ చేస్తే బాగుండేది. దానికి అప్పుడు ఒక పరిపూర్ణత్వం వచ్చి వుండేది. దాని బదులు రిపోర్టర్ సరైన లెగ్ వర్క్ చేయకుండా...లైవ్ లో ఆరోపణలు, ప్రత్యారోపణలు జనాలకు వినిపించడం...ఇలా ఒక సున్నితమైన విషయంపై బహిరంగంగా 'కోర్టు విచారణ" జరపడం దారుణం. ఇది తప్పుడుమారి వికృత జర్నలిజం. 
మసాల అంశాలు (అంటే అమ్మాయిలు ఎక్కువగా మోసపోయి ఇరుకున పడిన విషయాలు)  దొరికినప్పుడు...ఎలెక్ట్రానిక్ మీడియా ఇలా గీత దాటి వ్యవహరిస్తుంది. ఇది చూడటానికి బాగుంటుంది కానీ...ఇందులో భాగాస్వామ్యులైన ఇద్దరి వ్యక్తిగత జీవితాలు తీవ్రంగా దెబ్బ తింటాయి. ఇది కనిపించని అపార నష్టం. ఇప్పుడు అనాలోచితంగా రచ్చకెక్కి....రెచ్చిపోయి తిట్టుకుంటున్న ఈ  ఇద్దరిలో ఒకరు రేపు ఈ వేదన భరించలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటే...ఎవరండీ బాధ్యులు?

Thursday, November 19, 2009

అయ్య వృత్తే కొడుక్కి...టాలెంట్ హుళక్కి

తెలుగు సినిమా సృజనాత్మకత ఎక్కువగా లేని 'గొర్రె దాటు' వ్యవహారం. ఎవడో ఒక మహానుభావుడు కాస్త బుర్ర పెట్టి వినూత్నంగా రాయలసీమ రక్తపాతం మీద సినిమా తీస్తాడు. కనీసం ఒక ఏడాది పాటు అదే వస్తువుతో కథ కొంచెంగా మారి పలు సినిమాలు వస్తాయి. మరెవడో...కాలేజ్ లలో ప్రేమ మీద సినిమా తీస్తాడు. దాదాపు అదే లైన్ లో మరింత వినూత్నంగా స్కూల్ లెవెల్ లో గర్భవతి కావడం మీద ఒక సినిమా వస్తుంది. ఆ ట్రెండ్ కొంత కాలం కొనసాగుతుంది. కొత్త యాంగిల్ దొరికే వరకూ మూస సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయన్నమాట. 


ఒక గొర్రె వెళుతున్నప్పుడు దారికి అడ్డంగా కర్ర పెట్టండి. కొన్ని గొర్రెలు దూకుతూ దాటిన తర్వాత కర్ర తీయండి. కర్రలేకపోయినా సరే...ఇతర గొర్రెలు సైతం దూకుతూనే ఆ దారిన పోతాయి తప్ప...కర్ర లేదు కదా...దూకడం ఎందుకు...అని అనుకోవు. సృజనాత్మకత ముసుగులో మితిమీరిన అశ్లీలం, హింస ఎక్కువ చూపిస్తూ పబ్బం గడుపుకుంటున్న దర్శక నిర్మాతలు ప్రేక్షకుడిలో సున్నితత్వాన్ని చంపి పారేశారు.

ఈ రోజుల్లో సినిమా తీయడం అంటే ఏముంది చెప్పండి! ఒక సన్నటి ముంబై భామను పిలిపించి...సముద్రం ఒడ్డున నడుము సాధ్యమైనన్ని వంకర్లు తిప్పమనాలి. ఆమెది 'జీరో సైజు' (ఎంత అసహ్యకరమైన మాట?) అయివుంటుంది కాబట్టి...కాస్త పెద్ద సైజు వున్న ముమైత్ ను పిలిచి ఊరిబైట దాబాలో ఒక కిక్ ఇచ్చే పాట వేసుకోవాలి. అలా బ్యాలన్సు చేయాలి.


బ్రహ్మానందం, సునీల్ లలో ఒకరిని పిలిచి మాస్టారి పోర్షన్ ఇవ్వాలి. క్లాసు రూం లో వారిని ఇతర విద్యార్థులచేత అమ్మనా బూతులు తిట్టించాలి. లేదా, సార్ ను తెలివితక్కువ వెధవగా చూపే డైలాగులు అనిపించాలి. ఈ చెత్త పనులకు వేణు మాధవ్ ఉండనే వున్నాడు. అప్పుడు ఏ హీరో కొడుకో అయిన మన సినిమా హీరో రంగ ప్రవేశం చేస్తాడు. సన్న నడుము సుందరిని చూసి మనసు పారేసుకుని...పోరంబోకులైన తన స్నేహితులకు అమ్మాయి గురించి చెప్తాడు. 
వీరంతా ఇంకా ఏమీ పని లేనట్టు వాడిని రెచ్చగొట్టి పారేస్తారు. ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన ఆ అమ్మాయిని పటాయించడానికి, దానితో వీడు ఒకటి రెండు పాటలు వేసుకోడానికి ఈ ఎదవలు సహకరిస్తారు. హీరో కండలు చూపాలి కాబట్టి...ఒక విలన్ ను ప్రవేశపెట్టాలి. కనీసం యాభై మందిని ఒక్కసారే హీరో చేత కొట్టించాలి. హీరో ఫైట్ అయ్యాక పోతూ పోతూ లావుపాటి నీళ్ళ పైపును ఒక్క గుద్దు గుద్దు తాడు. నీళ్ళు చిమ్ముతున్న బ్యాక్ గ్రౌండ్ లో పొదల పక్కనుంచి హీరోయిన్ హీరో హీరోఇజాన్ని సంబ్రమాశ్చర్యాలతో చూస్తున్న సీన్ ఒకటి వుండాలి. 


చివర్లో ఆ అమ్మాయి తండ్రి పెళ్ళికి ఒప్పుకోడు. హీరో నానా తంటాలు పడి..అంటే బెదిరించి బామాలి పెళ్లి చేసుకుంటాడు. ఎవ్వరు చూడకుండా హీరోయిన్ బొడ్డు మీద లేదా నడుము మీద హీరో గిల్లడంతో శుభం కార్డు పడుతుంది. 
విదేశాల్లో చిత్రీకరించిన రెండు పాటలు, కొత్త టెక్నాలజీ తో చేయించిన గ్రాఫిక్ లు, వెరైటీ ఫైట్లు అదనపు ఎట్రాక్షన్. యేవో...కమల హాసన్ లాంటి వాళ్ళు నటించిన..విశ్వనాథ్ గారు తీసిన లాంటి  కొన్ని సినిమాలు తప్ప అన్ని తెలుగు సినిమాలు ఇలానే వచ్చాయి...గత దశాబ్ద కాలంలో.    

తెలుగులో మూస సినిమాలు ఎందుకు వస్తున్నాయో సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మొన్న సూటిగా చెప్పారు.  'తారే  జమీన్ పర్' లాంటి సినిమాలు తీసే దమ్ము మనోళ్ళకు లేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎవ్వరూ దీనికి బాధ పడకూడదు. ఎందుకంటే...అది పరమ చేదు సత్యం. 


“The mindset of our heroes is very bad. They don’t watch international cinema and know nothing about movies. Their parents are actors and so they have become actors too. They don’t have passion for cinema. They don’t experiment at all” అని భరద్వాజ చేసిన ప్రకటనలోనే కిటుకు అంతా వుందని అనిపిస్తున్నది.


మన చిత్ర సీమలో ఒక దరిద్రపు తంతు నడుస్తున్నది. హీరో అయిన తండ్రి కొడుకు కండలు పెంచిపిచ్చి హీరోను చేస్తాడు. కొడుకు చింపాంజీ అయినా, బుద్ధిహీనుడైనా పర్వాలేదు. తండ్రి హీరో అయి వుండి...సిక్స్ పాక్స్ ఉంటే చాలు..ఏ గొట్టం గాడైనా హీరో కావచ్చు మన దగ్గర. ఎన్ని ఉదాహరణలైనా కనిపిస్తాయి తరచి చూస్తే. సినిమా సంబంధ ఫంక్షన్లు కుటుంబ వ్యవహారాల మాదిరిగా కనిపిస్తాయి. ఒకొక్క సారి  ఈ దారుణం చూస్తే కడుపు రగులుతుంది. 


తండ్రికి ఒక కులం, ఒక సర్కిల్ వుంటాయి కాబట్టి...వాటిని అండగా చేసుకుని పిల్ల హీరో రెచ్చిపోతాడు. దర్శకులు, హీరోలు తమ కొడుకులను మాత్రమే దగ్గర వుండి హీరోలుగా మలిచి, కూతుళ్ళను ఈ రొంపిలోకి దింపకుండా ముంబై భామలపై ఆధారపడతారు...అది వేరే విషయం. 
నోట్లో బంగారు చెంచాతో పుట్టినోడికి...జీవితం మీద పూర్తి భరోసా  ఉన్నవాడికి...సృజనాత్మకత, వినూత్నత్వం ఎలా అబ్బుతాయి చెప్పండి? కానిస్టేబుల్ గారి అబ్బాయి చిరంజీవి చెన్నై వెళ్లి నానా ఇబ్బందులు పడి హీరో అయ్యాడు. తనను తాను నిరూపించుకునేందుకు, మంచి అవకాశాలు పొందేందుకు ఆయనకు వుండే తపన, ఆరాటం...అదే స్థాయిలో ఆయన కొడుక్కి ఉంటాయని చెప్పలేం. అలాగని  హీరోల కొడుకులు అంతా చెత్త యాక్టర్లు అని ముద్ర వేయడమూ తప్పే కానీ బైటి వాళ్లకు అవకాశం ఇస్తే...ఇంతకన్నా రాణించే అవకాశం ఉందనిపిస్తున్నది. 

"ఒక్క అవకాశం ప్లీజ్," అని బైట లైన్ లో ఎదురు చూస్తున్న జనం సవా లక్ష మంది వున్నారు కానీ పట్టించుకునే  వాళ్ళు ఏరీ? తమ కొడుకులు ఎస్టాబ్లిష్ అయ్యేదాకా వేరే వాడికి ఎవడు అవకాశం ఇస్తాడు చెప్పండి? నిజంగా కళా పోషణ చేయాలి, లోకల్ టాలెంట్ ను ప్రోత్సహించాలన్న పెద్ద మనసు ఎంతమందికి ఉంది? ఈ సమస్యకు పరిష్కారం లేక పోలేదు.

కొన్ని రోజుల పాటు ముంబై భామల దిగుమతి ఆపి...తండ్రులు హీరోలైన నవ తరం హీరోలకు విశ్రాంతి ఇచ్చి...కొత్త వారికి అవకాశం ఇస్తే...భరద్వాజ గారు బాధ పడాల్సిన పరిస్థితి వుండదు. 
అయ్య అడుగు జాడల్లో మీడియా నిర్వహణ బాధ్యతలు కొడుకులు తీసుకోవడం కూడా తెలుగులో మొదలయ్యింది. ఇది చాలా చోట్ల వినాశానికి దారి తీసింది. రామోజీ రావు గారిలో వుండే ఫైరు ఇప్పుడు 'ఈనాడు'ను నడుపుతున్న కిరణ్ గారికి ఉంటుందని ఎలా అనుకోగలం? టాలెంట్ ను వాడుకోవడం రావు గారికి తెలిస్తే...ఎవడో ఇచ్చిన పిచ్చి రిపోర్ట్ ఆధారంగా మంచి జర్నలిస్టులను ఇంటర్నెట్ డెస్క్ లాంటి సృజనాత్మకత పెద్దగా లేని చోట్ల వేయడం ఇప్పుడు జరుగుతున్నది.  అలాగని...కొడుకు ఎందుకూ పనికి రాని వాడని అనలేము. ఆయన బలం ఆయనకు వుంటుంది. నిజంగా జర్నలిజాన్ని నమ్ముకున్న నికార్సైన వ్యక్తిని 'ఈనాడు' చీఫ్ ఎడిటర్ గా నియమిస్తే...ఆ పత్రిక దూసుకోపోదూ? టాలంట్ ను ప్రోత్సహించి వృత్తిలో ప్రమాణాలు పెంచాలన్న ఉత్సాహం, ఉత్సుకత ఇక్కడ ఎవ్వడికీ లేవు. విశాల దృక్పథం కొరవడి, సంకుచితత్వం పెరగడం వల్లనే...నాణ్యత, ప్రమాణాలు దిగజారుతున్నాయి అటు సినిమాలలో, ఇటు మీడియా ప్రపంచంలో.


స్వశక్తినే నమ్ముకుని ఎదిగిన తండ్రి నుంచి పగ్గాలు తీసుకున్న పిల్ల హీరోలు వినూత్నత్వం కోసం శ్రమించడం తక్కువ. తండ్రి వెలుగులో వారు కాలక్షేపం చేసేస్తున్నారు...సిగ్గూ ఎగ్గూ లేకుండా. మీడియా హౌస్ లలోనూ ఇంతే. పిల్ల యజమానులు ఒక కోటరీ ని నమ్ముకొని వ్యవస్థను బ్రష్టుపట్టించడం చాలా చోట్ల కనిపిస్తున్నది. మరీ పరిణామాన్ని ఎవడు అడ్డుకోగలడు? 
భరద్వాజ గారు ఆవేదంతోనో, ఆవేశంతోనో ఆ ప్రకటన చేసివుండవచ్చు. కానీ..అది అర్థవంతమైనది.విశాల హితం కోసం మనం అంతా ఆలోచించాల్సిన పాయింట్ ఇది.

Wednesday, November 18, 2009

మరో మారు తెరపైకి ఎం.ఎన్.ఆర్.మెడికల్ వివాదం

''ఆన్ యువర్ సైడ్" అని జనానికి భరోసా ఇస్తూ....i-news ను స్థాపించిన ఎం.ఎన్.ఆర్. గ్రూప్ మరొక వివాదంలో మరొక సారి చిక్కుకుంది. మెదక్ జిల్లాలో వున్న ఎం.ఎన్.ఆర్. మెడికల్ కాలేజ్ లో తనఖీకి ఒక వున్నత స్థాయి బృందం వస్తున్న నేపథ్యంలో...ఆ యాజమాన్యం రోగులుగా నటించేందుకు ఎక్కడి నుంచో జనాన్ని తరలిస్తున్నదని ఆరోపిస్తూ 'టీ.జే.ఆర్.' అనే సంస్థ హడావుడి చేసింది.

సంస్థ సభ్యులు ఎం.ఎన్.ఆర్. ఉద్యోగి ఒకరిని దారుణంగా కొట్టారు. బండ బూతులు తిట్టారు. సెక్యూరిటీ సిబ్బందిని పక్కకు నెట్టి గందరగోళం సృష్టించారు. ఇది అక్కడి సంగారెడ్డి ఎం.ఎల్.ఏ.జగ్గా రెడ్డి మనుషుల పని అని i-news స్క్రోల్ మీద స్క్రోల్ వేస్తూ ఆయన పరువు తీసేందుకు మీడియాను వాడుకుంది. ఈ రోగుల తరలింపు వివాదం గురించి చెప్పకుండా ఆ ఛానల్...ఉద్యోగిని కొట్టడం, తిట్టడం ఒక్కటే పదే పదే చూపించి జగ్గా రెడ్డి మీద నిప్పులు చెరిగింది రాత్రి న్యూస్ లో.

సత్యం ఆగదు కదా! వైరి ఛానల్ TV-5 వారు జగ్గా రెడ్డి అనే మాట లేకుండా చాలా సేపు ఒక కథనాన్ని ప్రసారం చేసారు అదే సమయంలో. రోగుల తరలింపు విజువల్స్ తో పాటు వారిలో ఒకరి బైట్ కూడా వాడారు. ఆ కథనం చూస్తే...అర్థమయ్యేది ఏమిటంటే...ఎం.ఎన్.ఆర్. మెడికల్ కాలేజ్ వారు తప్పుడు వ్యవహారాలకు పాల్పడుతున్నారని, దాన్ని ఒక లోకల్ సంస్థ అడ్డుకుంటుందని అర్థమవుతుంది. 

"రోగుల" తరలింపు గురించి టీ.జే.ఆర్. అనే ఆ సంస్థకు అంత పట్టింపు ఎందుకో నాకు అర్థం కాలేదు కానీ... ఇన్నేసి ఛానెల్స్ ఉండబట్టే కదా..నాణానికి మరొక వైపు కూడా జనం చూడగలుగుతున్నారు అనిపించింది.

సరిగ్గా ఇలాంటి వ్యవహారం సందర్భంగానే TV-9 కు, ఎం.ఎన్.ఆర్. సంస్థకు మధ్య ఒక రెండు, మూడేళ్ళ కిందట పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ దరిమిలానే....ఒక సీనియర్ జర్నలిస్టు ఆ ఛానల్ వదిలి ఐ-న్యూస్ అనే దాన్ని ఎం.ఎన్.ఆర్. వారి చేత పెట్టించే వరకూ వెళ్ళింది. నిజానికి తనిఖీ కోసం ఒకటి రెండు రోజులు రోగులుగా నటించే వారిని తెచ్చుకోవడం చాలా చోట్ల జరుగుతుంది. కేంద్రం వారి పిచ్చి పిచ్చి రూల్స్ ను సంతృప్తి పరిచేందుకు...ఇలా చేయాల్సి వస్తుందని మెడికల్ కాలేజ్ వాళ్ళు వాదిస్తారు. అదేదో...పేద్ద పరిశోధనాత్మక కథనమని భావించి విలేఖరులు గొట్టాలతో వెళ్లి గొడవ పడుతుంటారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ.
-----------------------------------------------------------------------------
సవరణ: ఎక్కడో పాత పోస్టులో ఒక చోట "నక్కకు నాగ లోకానికి" అని రాసినట్లు నేను జర్నలిజం స్కూల్ లో వుండగా...ప్రేమతో వేడి వేడి చారు చేసిపెట్టిన ఒక సీనియర్ 'ఈనాడు' నుంచి ఫోన్ చేసి చెప్పాడు. నిజమే, తప్పు నాదే. దాన్ని "నక్కకు నాక లోకానికి" అని చదువుకోగలరు. సిల్లీ తప్పునకు సారీ. చారు మిత్రుడికి 'థాంక్స్."

Sunday, November 15, 2009

TV-5 కు కందుల గుడ్ బై....i-news లో చేరిక

తెలుగు జర్నలిజంలో ప్రొఫెషనలిజం వున్న అతి కొద్ది మందిలో ఒకరైన కందుల రమేష్ TV-5 కు గుడ్ బై చెప్పారు. ఆ ఛానల్ లో ఎగ్జిక్యుటివ్ ఎడిటర్ గా వున్న రమేష్ గారు i-news లో న్యూస్ డైరెక్టర్ గా వెంటనే చేరిపోయారు. ఈ పరిణామం రెండు ఛానెల్స్ లో పెను పరిణామాలకు దారి తీసేలా కనిపిస్తున్నది.

TV-5 కు ఒక పేరు రావడానికి కష్టపడిన టీంలో రమేష్ గారిది కీలక పాత్రగా చెప్పుకోవాలి. మరొక సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావు గారు పాత గూడు అయిన N-TV కి వెళ్ళిపోయిన తర్వాత రమేష్ గారిపై పని భారం పెరిగింది. అయినా సమర్ధంగా చర్చలు సాగిస్తూ...నాణ్యత కోసం ఆయన ప్రయత్నించారు. 
మూడు రోజుల కిందటనే రమేష్ గారి నిర్ణయం తెలిసి నేను ఆయనకు నేరుగా  ఫోన్ చేసి మాట్లాడాను. "అలాంటి (వేరే ఛానల్ కు వెళ్ళే) ఆలోచన ఏమీలేదు. అలాంటిది వుంటే..మీకు చెప్తాను," అన్నారాయన కూల్ గా. చివరకు తెలిసింది...శనివారం సాయంత్రం రమేష్ గారు ఐ-న్యూస్ లో జాయిన్ అయ్యారు.

రమేష్ గారిని తీసుకోవడం ద్వారా ఐ-న్యూస్ యాజమాన్యం ఒక కీలకమైన బ్యాక్-అప్ వ్యవస్థను నెలకొల్పుకున్నది. ఐ-న్యూస్ కు కళ్ళూ, చెవులూ, కాళ్ళూ, గుండె... అన్నీ తనే అయిన రాజశేఖర్ కు ఇది కచ్చితంగా మింగుడుపడని వ్యవహారంగా భావిస్తున్నారు మీడియా విశ్లేషకులు. రాజశేఖర్ కు ఇప్పటి వరకూ ఆ ఛానల్ లో ప్రత్యామ్నాయం ఒక్కరూ లేరు. ఆ కొరతను తీర్చే సత్తా రమేష్ గారికి వుంది.

రాజశేఖర్ వాయు వేగం, రమేష్ ప్రొఫెషనలిజం కలగలిస్తే  ఐ-న్యూస్ కు ఎంతో మేలు జరుగుతుంది. కానీ...ఈ ఛానెల్స్ లో వ్యవహారం...'డాగ్ ఈట్స్ డాగ్ బిజినెస్' లాంటిది. ఎప్పుడు ఏమవుతుందో...చెప్పలేము. మొత్తానికి....గుడ్ లక్ రమేష్ జీ. 
ఒక వేళ ఆ రాజశేఖర్ అక్కడ అలిగి వచ్చి తమ ఛానల్ లో జాయిన్ అవుతాడన్న అనుమానం TV-5 లో కొందరికి అప్పుడే కలిగినట్లు సమాచారం. "అయ్యా...ఆయన వస్తే మాత్రం మేము వుండం," అని కొందరు యాజమాన్యానికి తెగేసి చెప్పారట.