Saturday, October 23, 2010

"ఈనాడు" లో ఇదేమి సంపాదకీయం?

"ఈనాడు" పత్రికలో వచ్చే సంపాదకీయం చదవడం అంటే ఇనుప గుగ్గిళ్ళు  నమిలే ప్రయత్నం చేయడమే! ఎందుకంటే...వాటి రచయితలు తమ తమాషైన భాషా విన్యాసంతో జనాలకు "పలుగు రాళ్ళతో నలుగు పెడతారు." అడుగడుగునా "నిగ్గు తేలుస్తారు." అంతేకాక  ఇంకా రకరకాల హింసాకాండ సృష్టిస్తారు. ఇందులో వచ్చే ప్రతి ఎడిటోరియల్లో... సామాన్యులకు అర్థం కాకూడదు అన్న రాతగాళ్ళ తపన కనిపిస్తుంది...అన్న అపవాదు వుంది. కానీ...ఆదివారం వచ్చే సంపాదకీయం మాత్రం చాలా బాగుంటుందండోయ్!

ఈ శనివారం నాడు "జగన్మాయగాళ్ళ జమానా" శీర్షికన వచ్చిన ఒక మంచి  సంపాదకీయంలో విషయం కన్నా తిక్కల మాటల వాడకం కనిపించింది. అదేమిటో చూద్దాం.

ఒకటి) "వెనుక దగా, ముందు దగా, కుడి ఎడమల దగా, దగా-రాష్ట్ర రాజధాని నుంచి దేశ రాజధానిదాకా విక్రమించిన ఎమ్మార్ అక్రమాలు విని సగటుజీవి గుండెల్లో పొంగే ఆక్రోశం అది." అన్నది ఇందులో మొదటి వాక్యం. 
--సరే...మహాకవి  మాటలు లేకపోతే సగం తెలుగు జర్నలిజం లేదు, ఆయన మాట వాడుకున్నారు...అంతవరకూ ఒకే. ప్రాస ప్రిచ్చ కాకపోతే...విక్రమించిన అక్రమాలు ఏమిటి? ఆ ప్రాస ఒరవడి కొనసాగిస్తూ...'ఆక్రోశం' తెచ్చి పెట్టారు. 'పొంగే ఆక్రోశం' అనే మాటను చదివితే...కాస్త కృతకంగా అనిపించింది. 'పెల్లుబుకే/ తన్నుకొచ్చే ఆక్రోశం' అంటే అతికినట్టు సరిపోయేదేమో! గుండెల్లో ఆనందం పొంగినట్లు...ఆక్రోశం కూడా పొంగుతుంది?

రెండు) "క్రీడా సంబరాల ఆరంభ, ముగింపు సంరంభాల్ని మించి కామన్వెల్త్ అక్రమాల్లో కైంకర్యం అయిపోయిన వేలకోట్లు కళ్ళు మిరుమిట్లు గొల్పుతున్నాయి!" అన్నది రెండో వాక్యం.  
--జనం డబ్బు వేల కోట్లు ఎవడో కొట్టేస్తే...దాన్ని చూసి రచయితకు కళ్ళు 'మిరుమిట్లు గొల్పుతున్నాయి.'  "రామోజీ రావు గారు కట్టిన ఫిలింసిటీ కళ్ళు మిరుమిట్లు గొల్పేదిలా వుంది," అంటే బాగుంటుంది కానీ...ఈ నెగిటివ్ సెన్స్ లో వాడితే అది సెన్స్లెస్ గా అనిపిస్తుంది.  ఇక్కడ 'బైర్లు కమ్ముతున్నాయి' అంటే ఒకరకంగా వుండేది.

మూడు) "ఆడిన మాట నిలబెట్టుకుంటూ 'దేశ ప్రతిష్ఠను మంటగలిపిన' అక్రమార్కులపై కఠిన చర్యలకు కేంద్రం ఉపక్రమించింది" అన్నది మూడో వాక్యం.
---ఇందులో దేశ ప్రతిష్ఠను మంటగలిపిన అనే మాట పైన సింగిల్ కొటేషన్ గుర్తు ఎందుకు పెట్టారో నా బుర్రకు తోచలేదు. పైగా...ఈ అక్రమార్కులు దేశ  ప్రతిష్ఠను మంటగలుపుతామని ముందే చెప్పారని, ఆ తర్వాత 'ఆడిన మాట నిలబెట్టుకుంటూ' ఆ పని కానిచ్చారని కూడా అర్థమయ్యింది. 
దాని బదులు...దేశ ప్రతిష్ఠను మంటగలిపిన అక్రమార్కులపై ఆడిన మాట ప్రకారం కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది అని రాస్తే బాగుంది కదా!

నాలుగు) మధ్యలో పలు వాక్యాల నిర్మాణానికి రచయిత పడిన ప్రసవ వేదన, ప్రాస వేదన మాట అలా ఉంచితే...మూడో పేరాలో..."...చర్యలు తప్పవంటూ 'మ్యావ్..మ్యావ్' అని గాండ్రిస్తోంది!" అని రాసారు. ఇక్కడ కవి హృదయం అర్థమయ్యింది కానీ...ఇంత సీరియస్ ఎడిట్ లో యింత కామిడీ అవసరమా అనిపిస్తుంది. జనాలకు అర్థంకాని మాటలు రాసి, ప్రయోగాలు చేస్తేనే గానీ అది సంపాదకీయం కాదన్న భ్రమ కలిగించకండి మహాప్రభువులూ....

ఐదు)  ఇంత బారెడు ఎడిట్ అచ్చేసి...చివర్లో..."ఒక్కటి మాత్రం నిజం" అని రాసారు. అంటే...ఇంతవరకు రాసింది నిజం కాదని అర్థమా? లేక సొల్లని అర్థమా? ఈ నిజానికి ముందు ఇంకొక నిజం కూడా వుంది. "సలహాదారులు తెరవెనుక చక్రం తిప్పుతుండబట్టే ఈ దుస్థితి దాపురించిందన్నది నిజం!" అని కూడా వుంది.  

ఆరు) ఎడిట్ లో కాస్త సూటిగా రాయకపోతే రాయకపోయారు. విషయమైనా...సూటిగా చెప్పవచ్చు కదా! 'జగన్మాయగాళ్ళు' అంటారు....వారు ఎవరో చెప్పరు. ఏదో ఆ మాటలో జగన్ పేరు కలసి వచ్చింది కాబట్టి...ఇది రాసిన సారుకు ఆనందం, రాసింది ఫోనులో విన్న రామోజీ రావు గారికి పరమానందం. కానివ్వండి సార్లూ...

(నోట్: తెలుగులో దిట్టనని ఈ బ్లాగు రచయిత చెప్పుకోవడం లేదు. ఇందులో కూడా దోషాలు కనిపిస్తాయి. 'ఈనాడు' లాంటి పత్రికలో సరళమైన సంపాదకీయం ఒక్కటైనా రావాలన్న, అలా రాసేవారిని కిరణ్ గారు నియమించి తెలుగు ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో ఈ పోస్ట్ రాసాము తప్ప వేరే ఉద్దేశ్యం లేదని మనవి) 

6 comments:

శివ said...

For a long time, I have been skipping reading editorials for fear of losing my sanity, due to the mania of such writers and their craze for high sounding words.

కృష్ణశ్రీ said...

ఈనాడులో తెలుగు మీద నేనే కాదు--ఇంకా వ్రాసేవాళ్లున్నారన్నమాట!

సంతోషం రాము గారూ!

యేమైనా, వాగాడంబరాన్ని వీడితేగానీ మన తెలుగు బాగుపడదు. యేమంటారు?

Sasidhar said...

రామూ గారు,
మీ విశ్లేషణ అదిరింది. మీ "పలుగు రాళ్ళతో నలుగు పెట్టే" పదప్రయోగం నవ్వు తెప్పించింది.
ఇకపోతే (ఎవరూ, అని అడక్కండి) #2 - "మిరుమిట్లుగొల్పడం" చదవగానే, ఒక కొత్త జర్నలిస్టు పలు గ్రామాల ప్రజలు తాగునీటి ఎద్దడి తట్టుకోలేక "కేరింతలు కొడుతున్నారు" అని రాసిన వార్త గుర్తుకొచ్చింది.
Anyway, hats-off to your analysis on this editorial.

~ Sasidhar
www.sasidharsangaraju.blogspot.com

అప్పి-బొప్పి said...

రాము గారికి నమస్కారము.
మీరు చాలా మంచి పని చేస్తున్నారు. మీరు జర్నలిజము లో చెడుని కడగడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ తెలుగు బ్లాగు లోకములో మేము కూడా ఒక చర్చా వేదికను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని రాజకీయాలు ఉన్నాయో,తెలుగు బ్లాగు లోకములో కూడా అన్ని రాజకీయాలు ఉన్నాయని మేము భావిస్తున్నాము.
మీరు ఎప్పుడన్నా ఈ తెలుగు బ్లాగు లోకము చర్చా వేదిక కావాలంటే మా బ్లాగు ఉపయోగించుకోవచ్చు. మా దగ్గర స్వేచ్చ బాగా ఎక్కువ. మేము చాలా లిబరల్.

ఇట్లు,
అప్పి-బొప్పి

అప్పి-బొప్పి said...

మా బ్లాగు http://appi-boppi.blogspot.com/

ఇట్లు,
అప్పి-బొప్పి

RSReddy said...

రాము అన్నయ్యా!
మీ విశ్లేషణ అదిరింది. (ఇక్కడ అదిరింది అనే పద ప్రయోగం భాషా పరంగా కరక్ట్ కాకపోవచ్చు, కానీ వాడుక భాష లో కామన్).
ఇక ఏ మాటకామాటగా చెప్పుకుంటే - మీరన్న పై సంపాదకీయంలోనూ, ఈ మధ్య ఇంకొన్ని సందర్భాల్లోనూ ఈ బండతప్పులు బాగా చోటుచేసుకుంటున్న మాట వాస్థవేమేగానీ, ఎందుకో వారి సంపాదకీయాలు చదువుతున్నంతసేపూ పద ప్రయోగాలను మాత్రం మేం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. కాకపోతే సూటిగా విషయం చెప్పకుండా ఆ ఇనప గుగ్గిళ్ళ భాష అవసరమా అనేది మీలాంటి మీడియా వాళ్ళు చెప్పాలి. మరి ఇదే పరిస్థితి మీరు గతంలో పనిచేసొచ్చిన 'ది హీందూ 'లో కూడా ఉంటుంది కదా? ఐ మీన్ మిగతా ఆంగ్ల పత్రికలతో పోలిస్తే 'ది హీందూ ' లో కాస్త కఠిణ పదాల వాడకం ఎక్కువే కదా?
@'జగన్మాయగాళ్ళు' అంటారు....వారు ఎవరో చెప్పరు.
మీరుకూడా అప్పుడప్పుడూ ఎవరో, ఏమిటో చెప్పకుండా వ్రాస్తుంటారు గదా? మొన్నొక 'ఆసామి ' అన్నారు, తరచుగా 'అబ్రకదబ్ర ' పేరు వాడుకుంటుంటారు. ఇకనుండి మీరుకూడా డైరక్ట్‌గా వ్రాయండన్నయ్యా:)