Friday, January 6, 2012

రోజంతా మౌనం....ఒక పసందైన అనుభవం

2012 జనవరి 5 (గురువారం-వైకుంఠ ఏకాదశి)
నలభై ఏళ్ల పాటు నోటికి ఏ మాత్రం విరామం ఇవ్వకుండా వాగీవాగీ రెండు నాల్కల జనం వల్ల, నిష్ప్రయోజపు మాటల వల్లా విసిగిపోయిన నాకు ఇది ఒక మధురానుభూతి మిగిల్చిన రోజుగా గుర్తుండిపోతుంది. జీవితంలో పూర్తిగా ఒక్కరోజు మౌనంగా ఉండగలిగాను. ఊరుకున్నంత ఉత్తమంలేదని పెద్దలు ఎందుకు చెప్పారో అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది.

కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల ఆకర్షితుడినై అన్ని సమస్యలకు మందు గతితార్కిక భౌతికవాదమని నమ్మిన నేను...జీవితంలో కొత్త ఫేజ్ ను చూస్తున్నానన్న అనుభూతి కలుగుతున్నది. వికీపిడియా వారు తెలుగులో నిర్వచించినట్లు....గతితర్కం అంటే ప్రతి వస్తువు\విషయం యొక్క synthesis(నిర్మాణ ప్రక్రియ లేదా పరిణామ ప్రక్రియ) మరియు antithesis (విఛ్ఛిన్న ప్రక్రియ)ని అర్థం చేసుకోవడమైతే...మనుషుల విషయంలో నేనీ సిద్ధాంతాన్ని చూసి విశ్లేషించి భౌతికవాదం నుంచి భావవాదం (సోకాల్డ్ ఊహాజనిత వస్తువులని (దేవుడు, ఆత్మ లాంటివి) నమ్మడం) వైపు మళ్లానని అనిపిస్తున్నది. 

ఒక పది పన్నెండు మందిని మినహాయిస్తే ఈ జీవితంలో నేను కలిసిన మనుషుల్లో అంతా రెండు నాల్కలవాళ్లు, దొంగ మాటలు...అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసగాళ్లు, మనసుతో స్పందించనివాళ్లు, స్వార్ధపరులు, దురహంకారులు, ఎదుటివాడి పట్ల సానుభూతిలేనివాళ్లు, మనిషిని మనిషిగా చూడనివాళ్లు, తోటిమనిషి చస్తున్నా పట్టించుకోనివాళ్లు, దేశభక్తిలేనివాళ్లు. ఇలాంటి వారిని నమ్మడంకన్నా దేవుడ్ని నమ్మడం ఉత్తమమని ఒక మూడు నాలుగేళ్లుగా అనిపిస్తున్నది. కొన్ని అనుభవాలను బట్టి అర్థమైంది ఏమిటంటే...కనిపించే ఈ దొంగ మనుషులకన్నా కనిపించకపోయినా మానసిక శాంతినిస్తున్న, మేలు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తున్న దేముడ్ని నమ్మడంలో తప్పులేదని...ఆ దిశగా కొంత పరిశోధన మొదలుపెట్టా. కర్మవశాత్తూ జనం అలా ఎవరికి తోచినట్లు వారు స్పందిస్తారని, దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదనీ, మనసు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నాలు చేయాలని రామకృష్ణయ్య గారు (హేమ తండ్రి) చెబుతుంటారు.  అందులో మొదటి మెట్టు...మౌన వ్రతం అని ఫీలయ్యాను.

మాట్టాడక తప్పని రెండు మూడు సంఘటనలు ఎదురుకావడం మినహా...24 గంటల మౌనం నిర్విఘ్నంగా సాగింది. చూపు సమస్య వల్ల నా ఎస్.ఎం.ఎస్. చదువుకోలేని, నేను గౌరవమిచ్చే ఒక పెద్ద మనిషి పదేపదే ఫోన్  చేస్తుండటంతో ఏమన్నా ముఖ్యమైన విషయమేమో అని రాత్రి ఎనిమిది గంటలకు మాత్రం ఒక క్షణం మాట్లాడాను ఫోన్లో. నా సైగలను మా అమ్మాయి బాగా అర్ధం చేసుకుని నాకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. కాస్త మసాలా కూడా జోడించి నా సైగలకు భాష్యం చెప్పడం, ఈ రోజు మనం ఎంత గొడవ చేసినా నో ప్రాబ్లం...అని అబ్బాయి చిలిపిగా అనడం గుర్తుంటాయి. కొన్ని విషయాలు హేమకు, ఫిదెల్ కు మాత్రం కాగితం మీద రాసి చూపాల్సి వచ్చింది. మిగిలిన వారితో డీల్ చేసేటప్పడు ఈ రాసి చూపే జంఝాటం పెట్టుకోలేదు...అదొక డిస్ట్రబెన్స్ అని.

24 గంటల మౌనం వల్ల అనుభవంలోకి వచ్చిన కొన్ని అంశాలు....
1) ప్రతి రోజూ ఉన్నదానికి భిన్నంగా గుండె చాలా స్థిమితంగా ఉన్నట్లు అనిపించింది. గందరగోళం లేకుండా సాగింది.
2) ఆలోచనల వేగం తగ్గింది.  ఆలోచనల తీవ్రతలో కూడా మార్పు వచ్చింది.
3) ఎవరేమి చేసినా, ఏమి మాట్లాడినా...పోనీలే...అనే భావన ఏర్పడింది. వాదన చేసే వీలులేకున్నా...వాదన చేయాలన్న అభిప్రాయమే కలగలేదు.
4) కోపం, ఆవేశం, విసుగు తగ్గాయి.
5) కాఠిన్యం తగ్గింది. ఉదాహరణకు...రాష్ డ్రైవింగ్ తో కారుకు ఎవరైనా అడ్డం వస్తే...అప్రయత్నంగా నోట్లోంచి కఠినమైన మాటలు వచ్చేవి. వాడు చేసింది తప్పు కాబట్టి, మనకు ప్రమాదం జరిగేందుకు కారణమయ్యాడు కాబట్టి మనం ఒక మాటైనా అనాలని అనిపించేది అంతకుముందు.
6) మనసు స్పందన తగ్గింది. ఉదాహరణకు...ఫిదెల్ ఏ టోర్నమెంటైనా గెలిస్తే గతంలో మనసంతా ఆనందంతో ఉప్పొంగేది. నిన్ననే డెక్కన్ క్రానికల్ వారు నిర్వహించిన పోటీల్లో పెద్దగా ఆటరానివాడిని పెట్టుకుని జూనియర్ బాలుర విభాగంలో టైటిల్ గెలిచాడు. అయినా...మనసు పెద్దగా స్పందించలేదు.

7) సెల్ ఫోన్ వాడకపోవడం వల్ల చాలా సమయం దొరికినట్టనిపించింది. (మరీ బాగుండదని టెక్స్ట్ మెసేజ్ లు ఆపరేట్ చేశాను...సంక్షిప్తంగా, మితంగా. అదీ అవాయిడ్ చేస్తే బాగుండేది)
8) చాలా టైం దొరికి మనసు ప్రశాంతంగా ఉండటంతో చాలా చదివాను, రాశాను.
9) ఓల్గా తదితర ప్రసిద్ధ రచయితలవి కావాలని నాలుగైదు కథలు చదివి చూశాను. కథనం, వస్తువు, పాత్రల ప్రభావం మనసు మీద పడలేదు. ఇమోషన్స్ ప్రభావం మనసు మీద లేదనిపించింది
10) మౌనంగా గమనిస్తూ ఉండటం వల్ల ఇతరుల మాటల్లో డొల్లతనం, ప్రవర్తనలో అతి తేలిగ్గా కనిపించాయి.
11) 24 గంటల మౌనం ముగిసిన తర్వాత మాటల్లో పొందిక కనిపించింది. 

12) ఈ రోజు ఉదయం లేవగానే ఫ్రెష్ డే ప్రారంభమైన ఫీలింగ్ కలిగింది. మెదడంతా ప్రశాంతగా, ఒక రెండు రోజులు గాఢ నిద్రపోయి లేచిన ఫీలింగ్ కొనసాగుతోంది. ఇది గతంలో ఎన్నడూ లేని ఫీలింగ్.

....అదండీ సంగతి. నాకు తోచింది... రికార్డై పడి ఉండటం కోసం రాశాను. మీకు తోచింది మీరూ రాయండి. నిన్ననే వచ్చిన ఒక చిన్న ఆలోచన ఏమిటంటే...అభిప్రాయాలు కలిసేవారు నెలకోసారైనా కలిసి ఒక ఐదారు గంటలు మౌనంగా గడిపి ఎవరిదారిన వారు వెళ్లిపోతే ఎలా ఉంటుందని. అదీ చూద్దాం. సెలవ్.

6 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

very nice. congrats!!!

సురేష్ బాబు said...

మంచి అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండీ.

ఇంటర్ చదివేటప్పుడు నేను కూడా ఒక రోజు మౌనవ్రతం చేయబోతే నా స్నేహితులందరూ కూడబలుక్కుని వ్రతభంగం చెయ్యాలని పలురకాలుగా ప్రయత్నించి ఎట్టకేలకు రాత్రి 10 గంటలకు వాళ్ళ ప్రయత్నంలో సఫలీకృతులయ్యారండీ.

chanukya said...

చాలా బాగుంది

Mass said...

ramu garu, mee idea chala bagundii.

try chessi chusthaaa(casual gaa roju nenu matladeydi chala thakkuva).

weeknds try chessi chudallii (weekdays ayithey office lo work chesey vallaki chala kastham)

చిలమకూరు విజయమోహన్ said...

"భౌతికవాదం నుంచి భావవాదం (సోకాల్డ్ ఊహాజనిత వస్తువులని (దేవుడు, ఆత్మ లాంటివి) నమ్మడం) వైపు మళ్లానని అనిపిస్తున్నది."
శుభ పరిణామం.

Satish Suryanarayana said...

chalabhagundi sir mee idea.nenu kuda alochista. satish vandemataram

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి