Saturday, January 7, 2012

మన పత్రికలు...గమ్మత్తైన శీర్షికలు

ఇంగ్లిషులో  ‌‌HEADLINES అనే శీర్షికలు భలే బాగుంటాయి....కొన్ని సార్లు. కాపీ ఎడిట్ చేసిన సబ్ ఎడిటర్ కు కాస్త ఫ్రీ హ్యాండ్, టైం ఇస్తే...మంచి శీర్షికలతో అద్దరకొడతారు. ఇవ్వాళ పత్రికలలో వచ్చిన కొన్ని శీర్షికలు ముచ్చటగా అనిపించాయి. ఆలోచింపజేసే విధంగానూ ఉన్నాయి.
వై..దిస్...
క్విడ్ ప్రొ కోలవెర్రి

అని కష్టాల కడలిలో ఉన్న "సాక్షి" దినప్రతిక పతాక శీర్షిక ఇచ్చింది. జనాలను వెర్రెక్కిస్తున్న కొలవెర్రి పాటకు ప్యారడీగా సీ.బీ.ఐ. ను దూదేకుతూ పెట్టిన శీర్షిక నాకైతే హిట్ వికెట్ అనిపించింది.
సీఎం హోదాలో ఉన్న  అయ్య దగ్గర భూములు తీసుకుని...దానికి బదులుగా కొడుకు కంపెనీల్లో కోట్ల కొద్దీ పెట్టుబడులు పెట్టారని (ఈ ఇచ్చుకుంటు వాయనం...పుచ్చుకుంటు వాయనం వ్యవహారాన్ని ఇంగ్లిషులో క్విడ్ ప్రొ కో అంటారు) విమర్శలు ఎదుర్కుంటున్న ఎంపీ గారి పేపర్లో తాటికాయంత అక్షరాల్లో ఈ శీర్షిక రావడం నవ్వు తెప్పించింది. వారు కొలవరితో 'క్విడ్ ప్రొ కో' కలిసిందనుకున్నారు. కానీ...పైన ఉన్న 'వై.దిస్.' ను 'వై.ఎస్.' చేసి జనం చదువుకుంటారేమో అని సబ్బుగారు అనుకున్నట్లు లేరు.
పైగా 'క్విడ్ ప్రొ కో' అనే ఇంగ్లిషు పదానికి అర్ధం ఎంత మంది తెలుగు జనాలకు తెలుస్తుందనేది మరో కీలక విషయం. శీర్షికల్లో పదాల పదనిసలు చేసినా...బాడీలో ఎక్కడో ఒక దగ్గర దాని అర్థాన్ని తెలియజేస్తే జనం నేర్చుకుంటారు. ఈ పేపర్ బాడీలో అలా విడమరిచినట్టు నాకు కనిపించలేదు.

ఇదే 'సాక్షి' లో స్పోర్ట్సు పేజీలో "సిడ్నీలో షేమిండియా" అని పెట్టారు...కసితీరా. ఆటల్లో ఓడిపోకుండా ఉంటారా?
ఇదే 'సాక్షి' మినీ పేజీలో పెట్టిన శీర్షిక నిజంగా నాకు నచ్చింది. అది A ఫర్ అడ్మిషన్,  B ఫర్ బాదుడు. అదరహో.

"యహ చెప్పు...నీకెవరితో సంబంధాలున్నాయో చెప్పు..." అని అదేదో అద్భుతమైన జర్నలిజం ప్రశ్న అన్నట్టు మోచేయి గీక్కుంటూ నవ్వుతూ గుండీలూ, గుండె మొత్తం విప్పి అడిగే Open Heart వేమూరి రాధాకృష్ణ గారి పేపర్లో ఒక శీర్షిక వచ్చింది. అది..
నీ సంగతేంది
సీఎం?

ఇది కిరణ్ కుమార్ రెడ్డి ని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కడిగేసిన అంశానికి సంబంధించిన వార్త. రాజనరసింహ తెలంగాణా మనిషి కాబట్టి "సంగతేంది?" అని రాశారన్న మాట. మన రాతలతో నేతల మధ్య చిచ్చు ఎలా పెట్టాలో తెలుసుకోవాలంటే...జర్నలిస్టులంతా ఈ వార్తను, దాని పక్కన ఉన్న బారెడు సింగిల్ కాలం వార్తను చదివి తీరాల్సిందే. అందుకే పచ్చ మీడియా అని జనం గగ్గోలు పెడుతున్నారు.

చంద్రబాబు గారి టూరు పై వివిధ పత్రికలు పెట్టిన శీర్షికలు ఇలా ఉన్నాయి.
ఈనాడు--అడుగడుగునా పోరుబాటే
టైమ్స్ ఆఫ్ ఇండియా--Naidu stirs up 'T'rouble 
ది హిందూ--Naidu scores a point over TRS
ఇండియన్ ఎక్స్స్ ప్రెస్--Brickbats and bouquets on Naidu's day out
ది హన్స్ ఇండియా-- Naidu Does it
నాకైతే ఈ చివరి హెడ్ లైన్ నచ్చింది.

నిష్పక్షపాతం దానింటి పేరని జనం అనుకునే 'ది హిందూ' పత్రిక మొదటి పేజీలో ఒక వ్యాసం ఉంది. దాని శీర్షిక..."All eyes on TRS stand on Jagan's tour in Telangana." అన్ని కళ్లూ పళ్లూ ఒళ్లూ...జగన్ టూరు విషయంలో టీ ఆర్ ఎస్ ఏమి వైఖరి తీసుకుంటుందా? అని ఎదురుచూస్తున్నాయట. వండర్ ఫుల్...

అన్నింటికన్నా వింత అనిపించే విషయం ఒకటుంది. మాజీ నక్సలైట్ పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హంతకులను నిన్న పోలీసులు విలేకరుల సమావేశంలో హాజరుపరిచారు...వాళ్ల మొహాలకు నల్ల తొడుగులు తొడిగి. నిజానికి పటోళ్లను మేమే వేసేసాం...అని బబుల్ గమ్ నములుతూ చెప్పిన ప్రధాన హంతకుడు అనిల్, మిగిలిన నలుగురితో కూడిన సీ డీని Zee-24 వాళ్లు మూడు రోజుల కిందటే ప్రసారం చేశారు. అంత గొప్ప వార్తను తమకు మాత్రమే హంతకులు చెప్పారని...ఆ ఛానల్ చాలా సేపు డబ్బా కొట్టుకుంది కూడా. అది మిగిలిన పేపర్లలో కూడా వచ్చింది. అంతా చూసిన నిందితుల మొహాలకు మళ్లీ తొడుగులు ఎందుకు చెప్మా!

4 comments:

Anonymous said...

రామూ గారు..మీరు జనం తెలివిని చాలా తక్కువగా అంచనావేస్తున్నారేమోనని రెండోసారి అనిపించింది. క్విడ్ ప్రో కో అన్న మాటను ఏమాత్రం రాజకీయ అవగాహన ఉన్న వారెవరికైనా తెలుస్తుంది. పైగా ఇది ఆర్నెల్లుగా పత్రికల్లో బాగా నలుగుతున్న మాట. గతంలో కూడా మీరు వణిక్ ప్రముఖ్ అన్న మాటపై పెద్ద చర్చనే పెట్టారు. ఆ మాటకు అర్ధం మీకు కూడా తెలియదన్నట్లు గుర్తు( బూదరాజు శిష్యుడికి అంత చిన్న మాట తెలియకపోవడమేమిటా అని అప్పట్లో ఆశ్చర్యపోయాను. ఎందుకంటే..జర్నలిజంలో ఒనమాలు కూడా తెలియని నేను కూడా ఆ మాటను అంతకు ముందే విన్నాను. అర్ధం కూడా తెలుసు. )
ఇప్పుడున్న పరిస్థితుల్లో రెగ్యులర్ పేపర్లు చదివేవారికి క్విడ్ ప్రొ కొకు అర్ధం విడమరిచి చెప్పాల్సిన పనేలేదు. మరి చదవని వారికంటారా...ఇలా విడమరిచి చెప్పాల్సిన మాటలు ప్రతిరోజూ వస్తూనే ఉంటాయి. ఇక శీర్షికల్లో మీరు మెచ్చిన naidu does it కన్నా...Naidu scores a point over TRS అత్యద్భుతంగా అనిపించింది. పచ్చమీడియా అంటే ఒక్క ఈనాడుకే చెల్లుతుంది. ఆంధ్రజ్యోతి పచ్చ అనే స్థాయిని దాటి రొచ్చుగా ఎప్పుడో మారిపోయింది. ఈనాడు పక్షపాతానికి కూడా ఓ పద్ధతి పాడూ ఉన్నాయి. రాధాకృష్ణకు మొహం చూస్తేనే వీడు నాటుగాడు, మహాకేటుగాడు అన్న భావన కలుగుతుంది.

Ramu S said...

నాకెందుకో అనుమానం సార్...క్విడ్ ప్రొ కో అనే ఇంగ్లిష్ పదాన్ని జనం తేలిగ్గా అర్ధం చేసుకోలేరేమోనని. ఏదిఏమైనా...సాధారణ పాఠకులకు ఎన్ని ఎక్కువ పదాలు తెలిస్తే అంత మంచిది.
మరో విషయం, బూదరాజు గారి దగ్గర నాలాంటి మందమతులూ చదువుకుని ఇప్పుడు పెద్ద పెద్ద డెస్కులలో పనిచేస్తున్నారు సార్. మా తెలివితక్కువ తనానికి ఆయనకు ముడిపెట్టకండి.
ఛీర్స్
రాము

నండూరి వెంకట సుబ్బారావు said...

రామూ గారు,
"క్విడ్ ప్రో కో" ల వెర్రి అనే శీర్షిక తెలిసి పెట్టినా తెలియక పెట్టినా అర్థవంతంగానే ఉంది. సినిమాల వెర్రి,, నాటకాల వెర్రి,, పుస్తకాల వెర్రి అని చదివి క్విడ్ ప్రో కోలవెర్రి అని చదవండి. చాలా గమ్మత్తుగా ఆ పదబంధం కుదిరింది. అన్ని సార్లూ అలాంటివి కుదరవు. మీరు చెప్పినట్లు కథనంలో క్విడ్ ప్రో కో అంటే వివరించి ఉండాలి.

shine said...

శనివారం ఆంధ్రజ్యోతిలో ఆర్.కే రాసిన వ్యాసం చదివారా రామోజీరావు క్విడ్ ప్రో కో గురించి చెబితే రామోజీరావు చెప్పాలంట లేకపోతే సిబిఐ వాళ్ళు చెప్పాలట మిగిలిన వారందరి మీద మాత్రం ఈయన చూసినట్లే రాస్తాడు దీనిమీద మీ అబిప్రాయం చెప్పండి

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి