Saturday, March 24, 2012

చేదుతో మొదలైన...నందన నామ సంవత్సరం

పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటి సారిగా ఈ ఉగాది షడ్రుచుల పచ్చడి తినకుండానే ముగిసింది. ఉగాది నాడు పచ్చడి తిని...చక్కగా ఇంగ్లిషులో కొత్త బ్లాగు ఒకటి ఆరంభించాలని...ఇండియన్ మీడియా లో అదొక గుర్తుండిపోయే బ్లాగుగా తీర్చిదిద్దాలని ఒక పదిహేను రోజుల నుంచీ పథక రచన చేస్తున్నాను. ఇక మీదట సొంత సొద తగ్గించి...కేవలం మీడియా మీదనే టూ దీ పాయింట్ రాయాలని తీర్మానించుకున్నాను. రేపటి రోజు పండగనగా రాత్రి పదకొండున్నరకు ఖమ్మం నుంచి  ఫోన్ వచ్చింది. మా కుటుంబ పెద్ద, నాకు పెదనాన్న అయ్యే రాధాకృష్ణ మూర్తిగారు (74 ఏళ్లు) కన్నుమూసారని.

మార్చి పన్నెండున కుటుంబంలో జరిగిన పెద్ద విషాదం నుంచి భాదతప్త హృదయులను దగ్గరుండి ఊరడిస్తున్న పెద్ద మనిషిని మృత్యువు కబళించింది. మా బంధువలబ్బాయి ఒకడు నలభై ఏళ్ల వయస్సులో...ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. షుగర్ వ్యాధి వచ్చినందున తన భవిత పెద్దగా బాగుండదు కాబట్టి...తాను బతికి లాభం లేదని అందరితో అనేవాడట. మొన్నా మధ్యన మా నాన్న వాడిని కలిసి షుగర్ గురించి అంతగా బాధపడాల్సిన పనిలేదని కౌన్సిలింగ్ ఇచ్చారు కూడా. మరి కారణం ఇదేనా...ఇంకేదైనా ఏడ్చిందా అన్నది తెలియలేదు. ఈ మరణం గురించి ఎవరికి తోచింది, ఎవరికి తెలిసింది వారు మాట్లాడుకుంటున్నారు.

 ఆ ఆత్మహత్యకు ఆరేళ్ల క్రితమే జ్వరం వచ్చి వాడి అన్నయ్య, నా సన్నిహిత మిత్రుడు ఇంగువ మురళి మరణించాడు. మురళి చాలా చలాకీ. మా ఇంట్లోనే ఉండి వైరాలో టెన్త్ క్లాస్ చదువుకున్నాం. ఈ రెండు ఘటనలతో వీరి తల్లిదండ్రులకు మతిచెడినంత పనయింది. అలాంటి పరిస్థితుల్లో మా పెదనాన్న, నాన్న దగ్గరుండి వారిని ఊరడిస్తూ...మనోధైర్యం ఇస్తూ వస్తున్నారు. 

ఉదయాన్నే వారింటికి వెళ్లాలని అలారం పెట్టుకుని పడుకున్న పెదనాన్నకు ఆయాసం లాంటిది వచ్చి...ఇంట్లోనే మరణించారు. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. ఈ నేపథ్యంలో నేనూ హేమా ఉగాది నాటి ఉదయం బయలుదేరి ఖమ్మం వెళ్లి కార్యక్రమాలన్నీ అయ్యే దాకా ఉండి అత్యవసర పనుల ఒత్తిడి వల్ల ఏడున్నరకు బస్సెక్కి ఈ ఉదయం రెండు గంటల కల్లా ఇంట్లో ఉన్నాం. మధ్యలో ఫిదెల్ ఫోన్ చేసి..."పక్కింటి వాళ్లు ఉగాది పచ్చడి ఇచ్చారు...మనం తినవచ్చా...అక్క అయితే వద్దని అంటున్నది..." అని ఫోన్ చేశాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది..."అరే...ఈ ఏడాది ఉగాది పచ్చడి మిస్ అయ్యామే" అనిపించింది. 

నిరుపేద కుటుంబం కుదుటున పడి...ఇంట్లో అందరికీ చదవు క్రమశిక్షణ అందటానికి పెదనాన్న పడిన కష్టం మామూలుది కాదు. "ఏమోయ్..." అంటూ నవ్వే కళ్లతో నన్ను నవ్వుతూ పలకరించే పెద్ద మనిషి, బంధువుల ఇళ్లలో ఏ కార్యక్రమం జరిగినా ముందుండి నడిపించే పెద్దాయన...భౌతికంగా లేకపోవడం మా అందరికీ పెద్ద లోటే. ఎలెక్ట్రసిటీ శాఖలో పనిచేసిన ఆయన కార్మిక ఉద్యమంలో కూడా ఉన్నారు. పుట్టుకతోనే అంగవైకల్యం ఉన్న కూతురును కంటికి రెప్పలా చూసుకుంటూ...జీవితంలో బాధలను దిగమింగి...ఏ పనినైనా...టెన్షన్ గా ఫీల్ కాకుండా ఏదైతే అదవుతుందన్న మొండి ధైర్యంతో చేయాలని మాకు నేర్పిన పెదనాన్న కనీసం మరో పదేళ్లయినా జీవించే శారీరక దారుఢ్యంతో ఉన్నారు. 

తనతో కలిసి పనిచేసి రిటైర్ అయిన ఒక ముస్లిం పెద్ద మనిషి అందరినీ ఆశ్చర్యపరుస్తూ....శ్మశాన వాటికలోకి వచ్చి దహన సంస్కారాలు అయ్యే వరకూ ఉండి వెళ్లడం నాకు బాగా అనిపించింది. ఎవడిదారి వాడిదే...అనిపించే ఈ కాలంలో మా పెదనాన్న, ఆయనకు  సముచిత గౌరవమిస్తూ వచ్చిన మా నాన్న, బాబాయిల ప్రవర్తన ఎప్పుడూ విద్యా విషయకంగానే అనిపిస్తుంటుంది. వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఈ పోస్టును పెదనాన్నకు అంకితం ఇచ్చేందుకే రాస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక!

2 comments:

Dr. Suneel Pooboni said...

May his soul rest in peace

చిన్ని ఆశ said...

మంచి మనుషులు ఎప్పుడూ మంచి నే వదలి పది కాలాల పాటు అందరికీ గుర్తుండిపోతారు.
మీ పెదనాన్న ఆత్మకి శాంతి కలగాలని మేమూ ప్రార్ధిస్తున్నాం.