Wednesday, May 23, 2012

అతి త్వరలో మరొక వినోదాత్మక ఛానల్ "చిత్రసీమ"?


జనాలకున్న సినిమా పిచ్చను మరింత పకడ్బందీగా క్యాష్ చేసుకొనేందుకు త్వరలో "చిత్రసీమ" పేరిట ఒక ఛానల్ రాబోతున్నదట. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం...తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యుల్లో ఆసక్తిగలవారు పది, ఇరవై లక్షల చొప్పున వేసుకుని నరేంద్రనాథ్ చౌదరి నేతృత్వంలోని ఎన్..టీవీ సాంకేతిక సహకారంతో ఈ ఛానల్ ను తీసుకొస్తున్నారు. తెలుగు చలనచిత్ర సీమ లో ఒక బలమైన సామాజిక వర్గం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టును చేపడుతున్నది.
ఇప్పటిదాకా ఏ ఛానల్ పడితే ఆ ఛానల్ సినిమాల క్లిప్పింగ్ లు, కథనాలు కుమ్మిపారేస్తూ జనం మదిని దోచుకుంటున్న విషయం తెలిసిందే.  బీచ్ లను, బికినీలను, చిచ్ లను వివిధ కోణాలలో చూపించడం...సినిమాతో సంబంధంలేని వార్తలకూ సినిమా క్లిప్పులను జోడించి ప్రసారం చేయడం కూడా పెరిగిపోయింది. వార్తా ఛానళ్లలో వార్తల కన్నా సినిమా క్లిప్పులు చూపిస్తున్న ఛానల్స్ సంఖ్య అంతకంతకూ పెరిగింది. సినిమాల ప్రమోషన్ కోసం దాదాపు అన్ని సినిమాల వారూ బుల్లితెర ను బాగా వాడుకుంటున్నారు. షూటింగ్ ఆరంభమయిన నాటి నుంచీ సినిమా హీరో, హీరోయిన్, ఇతర నటీనటులతో విభిన్నమైన ప్ర్రోగ్రాంలు, ఇంటర్వ్యూలు గుప్పించి ప్రేక్షకుడిని సినిమా హాలు వైపు నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ ఛానళ్లకు ప్రమోషన్ లో భాగంగా లక్షలకు లక్షలు కోట్లకు కోట్లు కుమ్మరించాల్సి వస్తున్నది. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ప్లస్ కళామతల్లికి సేవ చేసుకోవడానికి తమకంటూ ఒక ఛానల్ ఉండాలన్నది ఈ వర్గం  ప్లాన్.

చిత్రసీమ ప్రాణం పోసుకుంటే...ఆ ఛానలే సినిమాలకు రేటింగ్ ఇవ్వాలనీ, రేటింగ్ ను బట్టి రేటు చెల్లించి ప్రత్యేకంగా తమ ఛానల్ లో మాత్రమే ఆ సినిమా తాలుకు మాల్ మసాలా వచ్చేలా చేయాలని భావిస్తున్నారు. అప్పుడు నటీ నటులు టీవీ స్టూడియోలలో కూర్చుని సొల్లు కబుర్లు చెప్పడానికి వీలుండదు. ఈ ఛానల్ కే వారి ప్రమోషన్ రైట్స్ వస్తాయట. జూబ్లీహిల్స్ లో నరేంద్రనాథ్ చౌదరి గారికున్న అనేకానేక బిల్డింగ్ లలో ఒక దానిలో ఛానల్ పనులు ప్రారంభమయినట్లు కూడా చెబుతున్నారు. గతంలో "మా" ఛానల్ లో పనిచేసిన శరత్ మరార్ ను ఇందులో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఇమేజ్ హాస్పిటల్ వారు ఐదు ఛానళ్లు ప్లాన్ చేశారు. న్యూస్, ఇంగ్లిష్ న్యూస్, మ్యూజిక్, హెల్త్, డివోషనల్ ఛానల్ లను సాధ్యమైనంత త్వరగా తేవాలని ప్రయత్నిస్తున్నది. మరొక పక్క తులసి సీడ్స్ వారి నేతృత్వంలోని ఛానల్ ను తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు ఊపందుకున్నాయని సమాచారం.

1 comments:

Thirmal Reddy said...

sir jee

చిత్తూరు జిల్లా కాంగ్రెస్స్ నాయకుడు ఆర్.వెంకటస్వామి (చిలుకూరు బాలాజీ ఇంజనీరింగ్ కాలేజీల అధినేత) RVS TV పేరుతో మరో కొత్త వినోద చానెల్ ప్రారంభిస్తున్నారు.

Thirmal Reddy
thirmal.reddy@gmail.com