Monday, May 21, 2012

కట్నం తీసుకున్నవాడొక కుక్క!

టీచర్ గా పనిచేస్తూ...నా దగ్గర జర్నలిజం చదువుకున్న యువతి నాకు నిన్న ఉదయం ఫోన్ చేసింది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష కు వెళుతూ...నా శుభాశీస్సు కోసం చేసింది. కలక్టర్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉన్న తనను ఈ కోర్సు అయిన తర్వాత జర్నలిజం లో చేరవద్దని, సివిల్స్ కు సిద్ధంకమ్మని నేను గట్టిగా చెప్పాను ఒక ఏడాది క్రితం. అందుకే మళ్ళీ వెళ్లి టీచర్ ఉద్యోగం లో చేరి బాగా చదువుకుంది. ఈ ఏడాది కాకపోయినా, వచ్చే ఏడాది అయినా సివిల్స్ కు ఎంపిక అవుతుందన్న గట్టి నమ్మకం నాకుంది.  తన ఫోన్ అందుకున్నాక....ఆమె జీవితం నా కళ్ళ ముందు కదలాడింది. 

ఒక మారుమూల పల్లెలో పుట్టి స్వయంకృషితో ఎదిగిన దళిత యువతి...ప్రేమించి అగ్ర కులానికి చెందిన ఒక అబ్బాయిని చేసుకుంది. ఏ పనీ చేయకుండా జులాయిగా తిరిగే తను డబ్బు కోసం ఈ అమ్మాయిని వేధించే వాడు. తాగుడుకు బానిసయ్యాడు. ఒక బాబు పుట్టిన తర్వాత నరకం చూపించ సాగాడు. కులం పేరుతో కూడా దూషించేవాడట. తన చెల్లెలు ఫీజు కూడా తనే చెల్లించింది. తన బాంక్ సేవింగ్స్ లో డబ్బు విత్ డ్రా చేయడం వల్ల తాను మా సంస్థలో ఫీజు కట్టలేక పోయింది. వారి దీన గాధ విని నేను ఫీజులో సగానికి సగం రాయితీ ఇచ్చాను. ఫీజు కట్టమని ఒత్తిడి చేయలేకపోయాను. డబ్బుకు బానిసలైన వాడిని నమ్మబట్టి అమ్మాయి జీవితం ఇలా అయ్యిందని, ఎంతో తెలివిగల తాను ఒక మనిషిని ఎందుకు అర్థం చేసుకోలేక పోయిందో కదా అని నాకు అనిపిస్తుంటుంది. ఫోన్ లో విషెస్ చెప్పాక...నేను ఆఫీసుకు వచ్చాక...స్టార్ లో అమీర్ ఖాన్ అద్భుతంగా నిర్వహిస్తున్న 'సత్యమేవజయతే' తారస పడింది. అందులో  అంశమైన...వరకట్న దురాచారం కథనం నన్ను కాసేపు ఏడిపించింది. అదే సమయంలో నా ఆలోచనలను ఒక పద్దెనిమిదేళ్ళ వెనక్కు తీసుకువెళ్ళింది.  

జన్యురీత్యానో, పెంపకం వల్లనో, స్టూడెంట్ యూనియన్లో తిరగడం వల్లనో డబ్బు మీద, కట్నం మీద స్కూలు దశలోనే నాకు ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది. డబ్బు మనిషిని శాసించకూడదని, కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నవాడంటే...చేతగాని చవట అనే అభిప్రాయం నాలో ఎందుకో నాటుకుపోయింది. అదృష్టవశాత్తూ 1988 వేసవిలో ఒక మల్లెచెట్టు నీడన ఆమె (మా ఇంటి ఓనర్ గారమ్మాయి) కనిపించింది. అదిగో...ఆమే జీవిత భాగస్వామి అని మనసు స్పష్టంగా చెప్పింది. ఇంట్లో చేరిన శుభ ముహుర్తాన కొట్టిన కొబ్బరికాయ ముక్కను ఇచ్చే మిషతో తనతో మాట్టాడదామనుకుంటే...వాళ్ల ఢాఢీ వచ్చి...'బాబూ...ఆ ముక్క ఆ గోడ మీద పెట్టు....ఇంట్లో వాళ్లు తర్వాత తీసుకుంటారు...' అని అడ్డుపడ్డారు. 

ఇంటర్మీడియెట్ చదివే పోరగాడు...ఈ విషయం ఎవడికైనా చెబితే ఏమైనా ఉందా? డిగ్రీ ఫస్టియర్ చివర్లో పథకం ప్రకారం...ఐ లవ్ యూ చెప్పడం...ఇది సాధ్యమయ్యే పనికాదని మేడం గారు అనడం...నీవు లేని జీవితం వ్యర్ధమని సినిమా లెవల్లో మనం స్పష్టం చేయడం...సరే...దోస్తానా సాగిద్దామని ఒక ఒప్పందానికి రావడం చకచకా జరిగిపోయాయి. ఎలాగైనా ఆమెతోనే జీవితం పంచుకోవాలన్న పిచ్చి తపనతో డిగ్రీ సతుకుతూ 'ఈనాడు' లో కంట్రిబ్యూటర్ గా, ఆకాశవాణిలో క్యాజువల్ ప్రొడక్షన్ అసిస్టెంట్ గా పనిచేసి నాలుగు డబ్బులు సంపాదించడం మొదలైంది. ఇద్దరం ఒకే కాలేజీ నుంచి మొదటి ఏ.ఐ.ఆర్. ప్రోగ్రాం ఇవ్వడం ఇప్పటికీ గుర్తు. 

డిగ్రీ పూర్తయ్యేసరికి ఒక నాలుగైదు వేల లవ్ లెటర్ల మార్పిడి పూర్తయింది. ఆమెతో కూర్చొని హాయిగా చెస్ ఆడుతున్నప్పుడు మన బండారాన్ని నాన్న పసిగట్టడం కూడా జరిగిపోయింది. ఆ రోజున మా నాన్న వేసిన డైలాగ్ నాకు బాగా గుర్తు. ''పిల్లి పాలు తాగుతూ కళ్లు మూసుకుని...ప్రపంచం నన్ను చూడట్లేదనుకుంటుంది...'' అని అన్నారు. అప్పుడు ధైర్యంగా నాన్నను డాబా మీదకు తీసుకుపోయాను. ఆ అమ్మాయి ఎంతో మంచిదని, ఆమెతో జీవితం పంచుకుంటే బాగుంటుందని అనిపిస్తున్నదని చెప్పాను. ఎంతో ఉదార మనస్సు వున్న మా నాన్న వెంటనే ఇల్లు ఖాళీ చేయించారు తప్ప...మరేమీ అనలేదు. 'ముందు డిగ్రీ పాస్ కా...ఆ తర్వాత జీవితంలో సెటిల్ అయ్యాక చూద్దాం' అన్నారాయన. 

విశ్వవిద్యాలయ స్థాయిలో నేను డిగ్రీ ఇరగదీయడం...వెంటనే 'ఈనాడు జర్నలిజం స్కూల్'లో సీటు పొంది ఉద్యోగం సాధించడం...  మా అన్నయ్య సహకారంతో వాళ్ళ నాన్న గారికి మా ప్రేమ గురించిన పిడుగు లాంటి వార్త చేరవేయడం...కూడా చకచకా జరిగిపోయాయి. 

ఈ దశలో మాకు ఇక్కడ కట్నం చిక్కు వచ్చింది. మాట్లాడుకునే మిషతో పెద్దలు కలిసి నా ఖరీదు ఒక 30 వేలు లేదా 40 వేలుగా నిర్ణయించారు. ఇద్దరం ఫీల్ అయ్యాము. నా అభిమతానికి భిన్నంగా జరిగిన ఈ విషయంతో నేను తల్లడిల్లి పోయి వెంటనే సెలవు తీసుకుని హైదరాబాద్ నుంచి ఇంటికి పోయాను. కట్నం గురించి తెలిసిన నాటి నుంచీ దయ్యాలూ...భూతాలూ కలలోకి వస్తున్నాయని తిక్క తిక్కగా ఉండని అబద్ధం చెప్పాను అమ్మా నాన్నలకు. ఏ మాత్రం డబ్బు మనుషులు కాని అమ్మానాన్న ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించారు. పెళ్ళికి అయ్యే ఖర్చులు చెరి సగం భరించేలా...నాకూ నాన్నకు ఒప్పందం కుదిరింది. పెళ్లి మా ఊళ్ళో జరగాలని నాన్న షరతు పెట్టారు. దానికి వాళ్ళ (అమ్మాయి) నాన్న గారిని ఒప్పించాను. 

మొత్తం మీద నయా పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాం. ఇది మా ఇద్దరి జీవితంలో ఒక పెద్ద లక్ష్యం. పెళ్లి రోజున మామ గారు పెట్టిన డ్రస్సు ఒక్కటే నేను వాళ్ళ నుంచి తీసుకున్నది. 'ఈనాడు' లో శర్మ అనే నరరూప రాక్షసుడు నంజుకు తింటుంటే...ఎందుకైనా మంచిదని తుర్క్ ఎమ్జాల్ లో ఒక స్థలం కొన్నప్పుడు మామ గారు కొంత అప్పు ఇచ్చారు. దాన్ని ప్రాంప్ట్ గా తిరిగి చెల్లించాను. ఆయన మంచాలూ, కంచాలూ కొని ఇచ్చినా మేము తీసుకోలేదు. మా నాన్న గారికి పెళ్లి ఖర్చుల కింద ఒక చిట్టీ పాడి నేను ఇచ్చిన 25,000 ఇంస్టాల్మెంట్ కట్టడం పూర్తికావడానికి నాకు నాలుగేళ్ళు పట్టిందనేది వేరే విషయం. బ్యాంకు బాలెన్సులు పెద్దగా లేకపోయినా...హాయిగా బతుకుతున్నాం. మా ఇద్దరి మధ్యా డబ్బు ఒక అంశంగా ఎప్పుడూ ప్రస్తావనకు రాదు. ఎందుకంటే...'డబ్బును మనం శాసించాలి  తప్ప మనల్ను డబ్బు శాసించ కూడదని' ఇద్దరం గట్టిగా నమ్ముతాం కాబట్టి. ఆ నాడు కాసులకు కక్కుర్తి పడితే ఇప్పటికీ కుమిలి పోవాల్సివచ్చేది. సరే...ఇదీ ఒకసొంత సోదే.    

ఇదెందుకు చెబుతున్నానంటే...మగ పిల్లలు కట్నం తీసుకోవడం దారుణమని చెప్పడానికే. ఏదో ఒక శూలం అదనంగా ఉందని....జీవితాంతం కలిసి ఉండే వ్యక్తి కుటుంబం నుంచి డబ్బులు తీసుకోవడమా? పాపిష్టి డబ్బు ప్రమేయం వున్న ఏ సంబంధమైనా నిలకడగా ఉంటుందా? నిలుస్తుందా? అమీర్ ఖాన్ షో లో ఒకరు అన్నట్లు....డబ్బు ప్రమేయం లేని వివాహాల కోసం అందరం ప్రయత్నిద్దాం. డబ్బు మదంతో ఖర్చులు చేసే పెళ్ళిళ్ళను బాయ్ కాట్ చేద్దాం. మనిషిని మనిషిగా గౌరవిస్తూ హాయిగా బతికే సమాజం కోసం పాటు పడదాం. మా అబ్రకదబ్ర అన్నట్లు...కట్నం తీసుకున్నవాడొక కుక్క! కాదంటారా?             

23 comments:

Anonymous said...

ఏమండీ మీకు కుక్కంటే అంత చులకనా? దానికి విశ్వాసం ఉంది కదండీ!!

Sri Kanth said...

కట్నం ఇవ్వడం తీసుకోవడం రెండూ నేరమే. సమాజములో పారంపర్యంగా పాటిస్తున్న ఒక ఆచారం కానీయండి, అలవాటు కానీయండి .. దాన్ని పాటిస్తున్న వారిని కుక్క, గాడిద అంటూ తిట్లంకించుకోవడం దేనికి. కట్నం తీసుకోవద్దు అని చెబుతున్నారు అది చాలుకదా. ఇలాంటి తిట్లు తిట్టడం వలన మీరు సాధించేది శూన్యం, అవతలి వారు రివర్సులో కౌంటర్లు ఇవ్వడం మినహా.. (నిజానికి అలా ఇచ్చే అవకాశం ఈ కట్నం విషయములో పుష్కలంగా ఉన్నాయి).

satya said...

Ramu garu, I have respect for u.. But please mind your language and selection of words.. I am against dowry. But What is your problem if both parties are fine in giving and taking?

Prashant said...

Katnam adigayvaadoka KUKKA annaru..baanay vundi...Mari katnam icchay Vaadu ???

Indian Minerva said...

మీప్రేమ కబుర్లు బాగున్నాయి.
కట్నం గురించిన మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను.

Prashant said...

The father may transfer some property to his daughter for his personal satisfaction which may not really come under the concept of dowry harassment.As long as the bridegroom don't demand and the bride 's father likes to give his daughter some property,the guy is not a KUKKA.

Ramu S said...

కామెంట్స్ చూశాక సవరణలు....
1) మామ ప్రేమతో ఇస్తే తీసుకునే వాళ్ళు కుక్కలు కాకపోవచ్చు
2) కావాలని కట్నం ఇచ్చే వాడు ఒట్టి తిక్క
3) కట్నం కోసం వేధించే వాళ్ళు మాత్రమే కుక్కలు
4) కుక్కలంటే చులకన కాదు...కానీ ప్రాస క్రోసం ప్రాకులాట
రాము

Anonymous said...

/...కట్నం తీసుకున్నవాడొక కుక్క! కాదంటారా?/
కట్నాలు, లాంచనాలు తీసుకుని కాపురం చేసే కుక్కలని నేనింతవరకూ ఎక్కడా చూడలేదు!! కట్నాలపై కుక్కలకు పెద్ద పట్టింపు వుంటుందనుకోను. ఆ సాంప్రదాయం మనుషుల్లోనే వుంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాదనే అంటాను. :)

Praveen Mandangi said...

కట్నాలు తీసుకునేవాళ్ళు కుక్కలనే అంటాను. మామగారు స్వచ్ఛందంగా ఇచ్చినా తీసుకునేవాళ్ళు కుక్కలే. ఎందుకంటే ఫ్రీ సొమ్ము తీసుకోవడం కుక్క లక్షణం కనుక.

నేను ఎట్టి పరిస్థితిలోనూ కట్నం తీసుకోకూడదనే ఇక్కడ ప్రొఫైల్ పెట్టాను: http://idontwantdowry.com/profile.php?profile=127087

భాస్కర్ కె said...

bhagundandi mee premakatha.

Bullabbai said...

కొంచెం ఎక్కువైందన్నా!

అద్దె పేరుతో ఇంట్లో దిగి, ఇంటి ఓనరు పిల్లని పటాయించినోడు అని ఇంకెవడైనా అనొచ్చు జాగర్త!

Unknown said...

sharma ante surya nunchi ippudu prabhaku vacchi tikka tikkagaa pravartistunnadata atanenaa?

Unknown said...

sharma ante surya nunchi ippudu prabhaku vacchi tikka tikkagaa pravartistunnadata atanenaa?

Ghanta Siva Rajesh said...

i guess there is no dowry now a days

Only people who have some property, they are sharing their property at the time of marriage for the women but not after parents death.
If the male don’t have any property, or wealth, do you think a girl who has wealth will marry you ?
Absolutely not
If your father or you have some X property she will bring more or less some X/2

if you have ‘0’ no matter how good you are no one will give you single pennyo

Ghanta Siva Rajesh said...

i guess there is no dowry now a days

Only people who have some property, they are sharing their property at the time of marriage for the women but not after parents death.
If the male don’t have any property, or wealth, do you think a girl who has wealth will marry you ?
Absolutely not
If your father or you have some X property she will bring more or less some X/2

if you have ‘0’ no matter how good you are no one will give you single penny

కిరణ్ said...

హ్హహ్హహ్హ..హ్హహ్హహ్హ..హ్హహ్హహ్హ..హ్హహ్హహ్హ

కట్నం వరకు ఎందుకు భాయ్ సాబ్.. పెళ్ళి నే నిశేదిస్తే సరిపోదా ?.. అప్పుడు ఇద్దరికీ ప్రేమాభిమానాలు ఉంటే కలిసి ఉంటారు.. ఒకరు ఒకరికి భారం కారు.. ఒకరంటే ఒకరికి భయం లేకుండా సమంగా కలిసి జీవించొచ్చు.. ఇంకా కట్నం లేకుండా నేను పెళ్ళి చేసుకున్నా అని ఫోజు కొట్టడం ఉండదు..

చివరి వాక్యం చూసి అంచనా వేయొద్దు.. పెళ్ళి తతంగాన్ని ఆపేస్తే ఎన్నో లాభాలున్నాయ్.. విద్యా విధానం మార్చి కులాలను నిశేధిస్తే అప్పుడు అసలైన స్వాతంత్ర్యం పొందే అవకాశాలు ఎక్కువ..

Anonymous said...

గురువుగారూ ఇక్కడ నాకో సందేహం!
నేనూ మీలాగానే కాస్త వామపక్షభావాలున్నవాణ్ణేనండీ. మరియు స్కూల్లెవల్ నుండే వరకట్న పిశాచంగురించీ, స్త్రీ పురుష సమానత్వం గురించీ తెగ ఉపన్యాసాలు దంచి బోలెడ్డన్ని 'ఎలొక్యూషన్ ప్రైజులు' అందుకున్నవాణ్ణే. అయితే చదువు సగంలో ఉండగానే మన ముఖంలో అదేదో స్టార్ కనపడ్డ ఓ చుట్టాలంకుల్ వీడే నా అల్లుడంటూ,అప్పటిదాకా చదివించడానికే అష్టకష్టాలుపడుతున్న మా అమ్మానన్నలతో కుదుర్చుకున్న ఓ అవగాహనమేరకు నేను కట్నం తీసుకుని మరీ పెళ్ళిచేసుకొవాల్సొచ్చిందని చెప్పడానికి చింతిస్తున్నాను.
అయితే ఇక్కడో Twist - (అప్పటికి మామకాని) మామగారు చెప్పిన లాజిక్ ఏంటంటే - తాను కట్నానికి వ్యతిరేకమేననీ(ఆయన పక్క సీపీయం లీడరులెండి), కానీ తనకున్న ఆస్ఠి (పదహారెకరాల పొలం) కొడుకు, కూతురుకు సమానంగా పంచాలన్నది ఆశయమనీ, నువ్వెలాగూ ఒద్దన్నా అమ్మాయిపేరున పంపకం జరిగిపోతుందనీ(వాస్థవానికి అప్పటికే కూతురు పేరుమీద 5 ఎకరాలూ, కొడుకు పేరుమీద 8 ఎకరాలూ, మిగిలిన ముడు తన పేరుమీద పట్టాలు చేయించబడి ఉన్నవట)..........ఇలా చెప్పుకు వచ్చాడు. మరొక ట్విస్ట్ - కూతురికి తను ఇవ్వాల్సిన మూడెకరలకు బదులుగా తాను మూడు లక్షలు క్యాష్ ఇస్తాననీ, అప్పటికే నీ చదువుకోసం కొన్ని అప్పులు చేసియున్న తల్లిదండ్రులను ఋణ విమోచన చేసి మిగతా డబ్బుతో అప్పటికప్పుడు ఏదో ఉద్యోగంల్లాంటివి చూసుకోవడం కాకుండా నీ గోల్ (సివిల్ సర్వీసుకు సెలెక్ట్ కావడం) కోసం ప్రయత్నించాలనీ చెప్పి.....ఎట్టకేలకు ఒప్పించాడు. అప్పటికి మనపైన మనకున్న కాన్‌ఫిడెన్స్ ఎంతో మనమే కొలుచుకోలేని స్థితిలో ఆయనకు మనమీదున్న నమ్మకాన్ని చూసి ఆశ్చర్యపోయా. ఆయన చెప్పినదాంట్లో ఉచితానుచితాల సంగతి పక్కనబెట్టి నాకొక గోల్ ఉన్నపుడు దాన్ని సాధించడానికి ఇదేదో మంచి ఆఫరేకదా అనిపించి proceed అయ్యాను.
అయితే నాకు నేను మనసులో క్లియర్ గా చెప్పుకున్నదేమంటే - 1. ఇప్పుడు ఈయన తనకూతురుకిస్తా అంటున్నదాంట్లోనుంచి ఏదైతే నేను వాడుకోబోతున్నానో దాన్ని యధాతదంగా రెప్లెనిష్ చేసి తన కూతురు కూతురు/ కొడుకులకు అందించాలి, ఇంకా వీలైతే అత్తా మామలకు తిరిగిచ్చెయ్యొచ్చు కదా?
2. ఈయన చెబుతున్న సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని యధాతదంగా పాటించి నా పిల్లలకు కూడా లింగ వివక్ష లేకుండా ఆస్థుల్ని సమానంగా పంచివ్వాలి
కాల గమనంలో పదమూడేళ్ళు గడచిపోయాయి. ఇప్పుడు చూసుకుంటే నేననుకున్న విధంగానే(ఇంకాస్త బెటరుగానే అనవచ్చేమో) చెయ్యగలిగాను.
ఇంతకీ నేను మీరు చెబుతున్న జాబితాలోకే వస్తానా? లేక అవసరార్ధం ఎవడిదగ్గరో వడ్డీలకు అప్పులు చేసి అవస్థలు పడేబదులు అయిన(అవుదామనుకుంటున్న)వాడిదగ్గర అప్పు చేసి తిరిగి తీర్చడం అనుకోవాలా?? ధర్మ సందేహం తీర్చగలరు :)

Ramu S said...

రెడ్డి గారూ...
'నువ్విస్తానంటే...నే వద్దంటానా...' అని పాడుకుంటూ పుణ్యానికి వచ్చినవి తీసుకోవడం లో తప్పు లేదని నాకు అనిపిస్తున్నది. మా మామ ఇవ్వడు గానీ....ఒక పదో పరకో ఇస్తే...అది చేదా? డబ్బు కోసం భార్యను పీడించే పున్డాకోర్లను ఉద్దేశించి రాసానీ పోస్టు. మీ లాంటి బుద్ధిమంతులకు వ్యతిరేకంగా కాదు.
కలుద్దాం...
రాము

Unknown said...

yes.. correct

Anonymous said...

Thanks boss! well said. even those who harass the brides for dowry/ extra dowry after (marriage) are not comparable with dogs. better you compare them with PIGS :)

Swapna said...

చాలా కరెక్ట్ గా చెప్పారు కానీ అత్తమామ లు ప్రేమతో ఏమైనా ఇస్తే తిస్కోవడం లో తప్పు లేదని న అభిప్రాయం.

కిరణ్ said...

naaku samadhaanam ivvale inkaa..

కాయ said...

పెళ్ళిల్లైన కాకులన్నీ ఒక దగ్గర చేరి కావ్..కావ్ మంటున్నాయే.. కట్నం బాధలు ఉండే కుటుంబాల సామాజిక, మానసిక, ఆర్థిక, ఇంకా కుల-మత-జాతి మొదలైన పిచ్చిలూ, ఎలా ఉంటాయో పరిశోధిస్తే మార్చాల్సిన అసలు సమస్యలు వెలుగు లోకి వస్తాయి... ఇలా ఒక పెద్దాయన సీత-బూతా అన్నా పక్షులు వాలుతున్నాయ్.. కట్నం-కుక్క అన్నా.. పక్షులు వాలుతున్నాయ్..

మార్చాల్సిన విద్యా విధానం మీద దృష్టి ఏది.. కులాలను ఇంకా ఎన్నేళ్ళు పెంచి పోషిద్దాం.. నా దేశం గొప్ప, నా రాష్ట్రం గొప్ప, నా భాష గొప్ప, నా జిల్లా తోపు,, మా ఊరు పిచ్చ తోపు.. అందులో మా కులపోళ్ళమే తోపులం.., మా ఇంట్ల మగ వాళ్ళమే గొప్ప, మగవాళ్ళలో యూత్ లో ఉన్న నేనే గొప్ప.. నాకెవరైనా దండేసి అంగ రంగ వైభవం గా, కట్న కానుకలతో నన్ను అల్లుడి గా చేస్కోవాలె.. ఎందుకంటే నేను తోపు.. ఇంతకు ముందే చెప్పిన కదా..

అయినా.. కట్నం తీస్కుంటే తప్పేంది.. కుక్కలను, పందులనూ గుర్తించి సర్టిఫై చేసే అధికారం,హక్కు మీకు వచ్చినట్టున్నాయే..

మగ వాళ్ళకీ కట్నం ఇవ్వాలనే ఉద్యమం రానంత వరకు ఈ సమస్య తీరదు.. అయినా రాముడేమీ మంచి బాలుడు కాదులెండి..

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి