Wednesday, July 17, 2013

ఈనాడు జర్నలిజం స్కూల్ 1996-97 బ్యాచ్ సమాగమం

ఈనాడు జర్నలిజం స్కూల్ (ఈజస్కూ) 1996-97 బ్యాచ్ మిత్రులు ఈ వారం సమావేశమయ్యారు. ఆ అపూర్వ కలయిక మీద సీనియర్ జర్నలిస్టు మిత్రుడు కోవెల సంతోష్ కుమార్ రాసి పంపిన వ్యాసం ఇది. కలిసి చదువుకున్న మిత్రులు కలిసి అనుభవాలు, అనుభూతులు పంచుకోవడం మంచి విషయం కదా! సంతోష్ కు థాంక్స్...రాము 
-----------------------------------------

ఏ క్యాలెండర్‌ కూడా ప్రస్తావించని ఓ పండుగ.. పదహారేళ్ల క్రితం కలిగిన ఎడబాటు అమాంతంగా తొలగిపోయిన సందర్భం.. ఓ అపూర్వ సమాగమం.. అపురూపమైన వేడుక.. ఎన్నో ఏళ్ల తరువాత జరిగిన స్మృతుల వేకువ.. ఏ వినోదానికీ.. ఏ పండుగకూ.. ఏ సంబరానికీ.. ఏ సంతోషానికీ, అతీతమైన ఆనందం 24మనసుల్లో నిండిన శుభ సమయం.. మాకు తప్ప ఎవరికీ ఇంత సంతోషం కలగలేదేమోనన్న గర్వం.. 14 జూలై 2013 ఈనాడు జర్నలిజం స్కూలు 1996-97 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల కళ్లల్లో కనిపిస్తుంటే.. ఆ మెరుపులను ఏమని వర్ణించేది?

హైదరాబాద్‌ సితారా గ్రాండ్ హోటల్లో  మొన్న ఆదివారం అనూహ్యమైన పండుగే జరిగింది. 1996-97 బ్యాచ్‌కు చెందిన ఈనాడు జర్నలిజం స్కూలు విద్యార్థులు ఒకటిన్నర దశాబ్దం తరువాత ఒక్కచోట కలుసుకున్నారు. వేర్వేరు వృత్తుల్లో కొనసాగుతున్న వారు కొందరు.. పాత్రికేయులుగానే కొనసాగుతున్న వారు మరికొందరు.. వేర్వేరు పత్రికల్లో.. వేర్వేరు చానళ్లలో.. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు.. ఒక్కచోట కలిసి సంబరం చేసుకున్నారు. 

రాష్ట్రంలో నలుదిక్కుల ఉన్నవారిని ఒకటి చేసి.. సమీకరించి అందరికీ అనువయ్యేలా సమావేశం ఏర్పాటు చేయటం ఎంత కష్టమో తెలియంది కాదు.. కానీ, అది సాధ్యమైంది.. అదీ పదహారేళ్ల తరువాత.. అదీ గురువులు తల్లాప్రగడ సత్యనారాయణ మూర్తి, పోరంకి దక్షిణామూర్తి (కింది ఫోటో) సమక్షంలో...అందరం కలుసుకోవటం ఒక ఎత్తైతే.. ఇద్దరు గురువులను తీసుకుని వచ్చి వారిని గౌరవించుకోవటం మరో ఎత్తు. ఒకరు 82 సంవత్సరాలు నిండి సహస్ర చంద్రదర్శనం పూర్తి చేసుకుని పూర్ణ చంద్రుడిలా వెలిగిపోతున్నారు. మరొకరు 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పుంభావ సరస్వతిగా మూర్తిమంతమై ఉన్నారు. ఒక్కొక్కరినీ చేతులు పట్టుకుని స్పృశించి  ప్రియంగా మాట్లాడుతుంటే.. ఆ స్పర్శకు ఒళ్లంతా పులకరించని వాళ్లు లేరు. అతిశయోక్తి కాదు.. అత్యుక్తులసలే లేవు.. ఇన్నేళ్ల తరువాత వారిని చూస్తుంటే.. మాట్లాడుతుంటే.. చలించకుండా ఎలా ఉండగలరు? 

ఇన్నేళ్ల తరువాత ఒకరినొకరు కలుసుకుంటుంటే.. వాళ్ల కళ్లల్లో ఆనందం అనిర్వచనీయంగా అనిపించింది. కొందరు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. మరి కొందరు అప్పుడెలా ఉన్నారో.. ఇప్పుడూ అలాగే ఉన్నారు. కొందరు నేను ఫలానా అని పరిచయం చేసుకోవలసి వచ్చింది. 36మంది ఉన్న బ్యాచ్‌లో ఒకరు (వెంకటరమణ) మరణించగా.. 24 మంది హాజరయ్యారు. శంకర్‌బాబు, ప్రసన్నకుమార్‌ల సమాచారం దొరకలేదు. ఇక ఒకరేమో (రమాకాంత శర్మ) శివరాంపల్లిలో శంకర పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పీఠాధిపతి అయిపోయారు. ఆయన హోటళ్లకు వచ్చే పరిస్థితిలో లేరు. అయిదుగురేమో పంచాయతీ ఎన్నికల బిజీలో ఉండి రాలేకపోయారు. ఎన్నికలు లేకుంటే.. వీరందరితో మరింత సందడిగా ఉండేది.


ముందుగా పాత్రికేయ సమాజానికే ఆది గురువులైన బూదరాజు రాధాకృష్ణ గారికి, సహచర మిత్రుడు వెంకటరమణకు నివాళి అర్పించాము. 
ఆ తరువాత ఒకరికొకరు పరిచయ కార్యక్రమం ఎంతో ఉద్వేగభరితంగా సాగింది. ఎన్నెన్నో జ్ఞాపకాలు మేలుకున్నాయి.. తీపిచేదుల మేలు కలయిక జరిగింది.. ఈ వేడుకలో పాల్గొన్న వారిలో నలుగురు ప్రభుత్వోపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఒకరు ఆర్టీసీలో మేనేజర్‌ స్థాయిలో ఉన్నారు. ఒకరు గ్రూప్‌ వన్‌ అధికారిగా పనిచేస్తుంటే.. మరొకరు ఎంపిడిఓగా పనిచేస్తున్నారు. మిగతా వాళ్లంతా చక్కగా పాత్రికేయులుగానే కొనసాగుతున్నారు.  మరొకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూనే జీవని పేరుతో అనాధలకోసం ఒక స్వచ్ఛంద సంస్థను నడిపిస్తూ ఉన్నారు. 
పరిచయ కార్యక్రమం ముగిశాక, ఇద్దరు గురువులకు ఉడతాభక్తిగా సత్కరించుకున్నాం. వారు చాలా ప్రేమతో స్వీకరించటం ఎంతో ఆనందం కలిగించింది. సత్కారం తరువాత భోజన కార్యక్రమంతో కాసింత విరామం తీసుకుని.. ఆ తరువాత గురువులిద్దరి అమూల్యమైన సందేశాల్ని విన్నాం.. 16 ఏళ్ల తరువాత వాళ్ల మధుర పలుకులు మరోసారి అందరిలోనూ ఉత్సాహాన్ని నింపాయి. ఇంత వయసులో కూడా ఇవాళ్టి పాత్రికేయులు ఎలా వ్యవహరించాలో మార్గనిర్దేశనం చేయటం అపూర్వం. అలాంటి గురువులకు శిష్యులమైనందుకు అంతా గర్విస్తున్నాం. 


గురువుల సందేశం పూర్తయిన తరువాత నంది అవార్డు అందుకున్న ఈనాడు సీనియర్‌ స్పెషల్‌ కరస్పాండెంట్‌ చక్రవర్తికి, విదేశాల్లో పాత్రికేయుడిగా రాణించి వచ్చిన సాక్షి అసిస్టెంట్‌ ఎడిటర్‌ రమణమూర్తికి, అన్నింటికీ మించి జీవని సంస్థ ద్వారా ఎవరూ చేయలేని అత్యున్నతమైన సామాజిక కార్యాన్ని నిర్వహిస్తున్న ఎస్వీ ప్రసాద్‌కి అభినందనలు అందించాం. జీవని సంస్థ ఇక నుంచి అందరి కుటుంబంగా భావించాలని నిర్ణయించుకున్నాం. 
సాయంత్రం 4.30 గంటల దాకా సితార అంబరాన సంబరాలు నడిచాయి. వచ్చే సంవత్సరం నెల్లూరులో, మరుసటి సంవత్సరం మిడ్‌ మానేర్‌ డ్యాం దగ్గర కలుసుకోవాలని అంతా నిర్ణయించుకున్నాం.

3 comments:

Unknown said...

నిజంగా ఇది అపూర్వ కలయికే... ! కానీ మరీ మీలా దశాబ్ద కాలానికి కాకుండా.. మేమంతా ఏడాదికో.. రెండేళ్లకో ఒకసారి కలుస్తూనే ఉన్నాం. చిన్నా చితకా హోటళ్లలో సమావేశమై.. పాత స్మృతులను గుర్తు చేసుకుంటున్నాం. అయితే గురువులను కూడా సంతోషంలో భాగం చేయడం.. వారిని అక్కడికి పిలిచి సత్కరించడం.. సంతోషంగా గొప్పగా ఉంది. ఈ ఏడాది మేం కూడా.. వీలైతే.. ఒకరిద్దరు గురువులైనా పిలిచి.. మీ బాటలో నడిచేందుకు ప్రయత్నిస్తాం.
మీ మధ్యలో రమణ గారు లేకపోవడం నిజంగా లోటే.. తొందరపడి వెళ్లిపోయారు ఇటువంటి ఆనందాలన్నీ చూడకుండా.. !

నాగేంద్ర సాయి
ఈనాడు జర్నలిజం 2004 బ్యాచ్ - (టివి)

Unknown said...

its indeed a memorable event. As a student of eenadu journalism school under boodaraju gaaru i appriciate efforts taken by 1996-97 batch journo's. But I would like to make one thing clear. There are some un necesary boasting of some persons in the writing. In Which way Mr.Ramana murthy shine as a journalist even in foriegn land. Did he publish a single piece on the outcome of his tour's as a representative of Sakshi daily. I seriously doubt that.

Kishor said...

జర్నలిజం అన్నది దెబ్బతినిపోతున్నా గురుభక్తి అన్నది ఇంకా పవిత్రంగానే ఉంది. అందుకు ఇదే నిదర్శనం! వాళ్లిద్దరినీ చూడడం ఎంతో సంతోషకరం. బూదరాజుగారు లేకపోవడం బాధాకరం!

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి