Tuesday, August 19, 2014

'ఈనాడు' లో ఉద్యోగుల పని గంటల తగ్గింపు!!!

ఉద్యోగుల సంఖ్యను, తద్వారా ఖర్చును  తగ్గించుకోవాలని పలు పద్ధతులు పాటిస్తున్న ప్రముఖ తెలుగు దినపత్రిక 'ఈనాడు' లో మెషిన్ సెక్షన్ ఉద్యోగుల పని గంటలను తగ్గించారు. ఈ విభాగపు ఉద్యోగులు ఎనిమిది గంటలు పని చేయాల్సిన పనిలేదని, ఒక ఐదు గంటలు చేస్తే చాలని నోటీసు బోర్డులో మరీ ప్రకటించారట. ప్రస్తుతానికి జీతం మాత్రం తగ్గించలేదు. అంతవరకు సంతోషం. 

ఈ ప్రపంచంలో ఏ యజమాని అయినా... ఉద్యోగి నుంచి ఎక్కువ పనిగంటలు రాబట్టాలని అనుకోవడం సహజం. దానికి భిన్నంగా... ఎనిమిది గంటలు వద్దు... ఐదు గంటలే ముద్దు.... అని 'ఈనాడు' చెప్పడం మెషిన్ సెక్షన్ శ్రామికుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తోంది. 

"అన్నా... మొన్న ఎనిమిదో తేదీ నుంచి పనిగంటలు తగ్గించారు. మాకు బతుకు మీద భయం ఏర్పడి బితుకు బితుకున బతుకుతున్నాం," అని ఒక మిత్రుడు రాశాడు. మెషిన్ సెక్షన్ ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణ చేయించడానికి ప్రయత్నించి.... శ్రామికులు ఎదురు తిరగడంతో 'ఈనాడు' యాజమాన్యం ఈ కొత్త ఎత్తుగడ వేసిందని భావిస్తున్నారు. 

"మమ్మల్ని ఇళ్ళకు పంపేందుకు తీవ్రంగా ప్రయత్నం జరుగుతోంది. దాన్ని అంతే తీవ్రంగా ప్రతిఘటించాలని మేము గట్టి నిర్ణయంతో ఉన్నాం. 'ఈనాడు' 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మా యజమాని రామోజీ రావు గారు సిల్వర్ కాయిన్ బహుమతిగా ఇచ్చారు. 50 ఏళ్ళ పండగ అప్పుడు గోల్డ్  కాయిన్ ఇస్తామని ఆయన మాట ఇచ్చారు. గోల్డ్ కాయిన్ తీసుకోవాలని మేమంతా ఆశతో ఉన్నాం," అని ఈ విషయంలో ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్న ఒక ఉద్యోగి చెప్పారు. 
మొన్నీ మధ్యన 'ఈనాడు' నలభై వసంతాలు పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. 

0 comments: