Wednesday, August 27, 2014

నా పాకిస్థాన్ మిత్రురాలు-స్నేహిత్ -ఒక అనుభూతి

సుందరమైన ప్రకృతి కాక సృష్టిలో అత్యంత అద్భుతమైనది ఏమైనా ఉందా అంటే...అమ్మ ప్రేమ తర్వాత నిస్సందేహంగా స్నేహానుబంధమే. ఫ్రెండ్స్ గా కలిసిన మేము (రాము, హేమ) ఇద్దరు పిల్లలకూ ఫ్రెండ్ షిప్ అర్థం వచ్చేలా... మైత్రేయి, స్నేహిత్ అని పెట్టాం. మన చాదస్తం కొద్దీ... మా వాడి పేరులో మరొక రెండు పేర్లు (ఫిదెల్ రఫీక్) కూడా తగిలించి సన్నిహిత మిత్రులతో తిట్లు తింటూ ఉంటానన్నమాట! 
నేను 'ది హిందూ' వదిలి... 'మెయిల్ టుడే' అనే ఒక అడ్డగోలు పత్రికలో చేరి... ఏ క్షణాన జర్నలిజం వీడి పారిపోదామా అని అనుకుంటున్న సమయంలో దేవుడు ఇచ్చిన వరం... అమెరికా వెళ్ళే అవకాశం. 2009 లో ఒక ఇద్దరు అమెరికన్ ప్రొఫెసర్లు (జ్యోతిక రమాప్రసాద్-మయామీ యూనివెర్సిటీ, జిమ్ కెల్లీ- ఇండియానా యూనివెర్సిటీ)వచ్చి ఉస్మానియాలో జర్నలిస్టుల కోసమని ఒక వర్క్ షాప్ పెట్టి... ఒక సైన్స్ రిపోర్టింగ్ లో భాగంగా ఒక స్టోరీ రాయమంటే... దంచి కొట్టాను. నా స్టోరీ బాగుందని చెప్పి.. అమెరికా వెళ్ళాక... అక్కడ ఫ్రీగా 21 రోజులు ఉండడానికి టికెట్స్ పంపారు... పాస్ పోర్ట్ అవీ చూసుకుని. ఇండియా నుంచి నేను, ఒక గుజరాతీ రాజేష్ గుప్తా; పాకిస్తాన్ నుంచి అఫ్షాన్ ఖాన్, అయేషా సదన్; శ్రీలంక నుంచి మిలింద రాజపక్ష, దాసున్ ఎదిరిసింఘే ; కెన్యా నుంచి జాకోబ్ ఒటీనో, లూసియానే లిమో ఆ టూర్ కు సెలెక్ట్ అయ్యాము.

2009 ఏప్రిల్-మేలో జరిగినదది. ఆ టూర్ లో చాలా నేర్చుకున్నాం. ఒక్క ఇండియా వాడు తప్ప... మిగిలిన ఆరుగురూ నాకు మంచి మిత్రులయ్యారు. మేము వచ్చేటప్పుడు బాధాతప్త హృదయాలతో వీడ్కోలు పలుక్కున్నాం. ఈ పక్క ఫోటో లో ఏడుగురుం ఉన్నాం... కెన్యాలో ఫోటో ఎడిటర్ అయిన జాకోబ్ ఫోటో తియ్యడం వల్ల మిస్సయ్యాడు. సరే.. మా మధ్యన ఫేస్ బుక్ ద్వారా మంచీ చెడూ మాట్లాడుకోవడం జరుగుతున్నది. 
మా వాడు ఫిదెల్ దక్షిణాసియా టేబుల్ టెన్నిస్ పోటీలలో భారత్ తరఫున పాల్గొనేందుకు ఆగస్టు 20 న ఇస్లామాబాద్ వెళతాడని ఒక నెల ముందు తెలియగానే చాలా ఆనందం అనిపించింది. మిత్రురాలు అఫ్షాన్ గారి కోసమని నేను మా కోచ్ సోమనాధ్ ఘోష్ భార్య, మిత్రుడు శంకర్ కలిసి షాపింగ్ చేసి ఒక మంచి ముత్యాల కంఠహారం కొన్నాం. దాన్ని భద్రంగా పాక్ చేసి.. అఫ్షాన్ గారికి ఇవ్వమని ఫిదెల్ కు చెప్పాము నేను, హేమ. 


ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న దౌత్య సంబంధాలు, అక్కడి రాజకీయ పరిణామాలు కల్పించిన ఉద్రిక్త పరిస్థితుల వల్ల టూర్ ఉండదేమో అని ఒక దశలో అనుకున్నాం. ఎందుకొచ్చిన గొడవలే... పోకపోతేనే మేలని వాస్తవానికి నాకనిపించింది. కానీ ఇస్లామాబాద్ లో గొడవలు 'రెడ్ జోన్' అన్న ప్రాంతానికి మాత్రమే పరిమితమని, అంతగా భయపడాల్సిన పనిలేదని ఆమె భరోసా ఇచ్చారు. 
మొత్తం మీద ఆదివారం (ఆగస్టు 24) నేను ఊళ్ళో లేని కారణంగా... మా వాడిని హేమ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశ రాజధాని విమానం ఎక్కించగా (ఈ పక్క ఫోటో) మర్నాడు భారత జట్టుతో కలిసి పాకిస్థాన్ లో అడుగుపెట్టాడు. అప్పటికే భారత బృందం ఇస్లామాబాద్ లో విడిది చేసే బస, క్రీడా ప్రాంగణం వివరాలు అఫ్షాన్ గారు (ది న్యూస్ అనే ఆంగ్ల పత్రికలో ఆమె సీనియర్ జర్నలిస్ట్) తెలుసుకుని సిద్ధంగా ఉన్నారు. 
నిన్న ఉదయం (ఆగస్టు 26) అఫ్షాన్ గారి భర్త స్నేహిత్ ప్రాక్టీస్ చేస్తున్న స్టేడియం కు వెళ్ళారు, తనతో మాట్లాడి వచ్చారు. సాయంత్రం మేడం.. తన కుమారుడు ఐజాజ్ తో కలిసి వెళ్లి పలకరించి వచ్చారు. కింది ఫోటోను ఆమె వెంటనే ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు. ఇది మాకు ఎంతో ఆనందం కలిగించింది. అక్కడకు హైదరాబాద్ నుంచి వెళ్ళిన మరొక క్రీడాకారిణి శ్రీజ, కోచ్ ఇబ్రహీం ఖాన్ లను కూడా కలవమని చెప్పాను. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలుసుకున్న అమెరికన్ ప్రొఫెసర్లు (జ్యోతిక రమాప్రసాద్-మయామీ, జిమ్ కెల్లీ-ఇండియానా) చాలా ఆనందించారు.  

ఐదేళ్ళ కిందట నేను దేశం కాని దేశంలో కలిసిన ఒక పాకిస్థానీ మిత్రురాలిని, వారి కుటుంబాన్ని నా సన్ కలవడం.. ఒక గొప్ప అనుభూతి. నేను పంపిన నెక్లెస్ ఆమె కు బాగా నచ్చింది. హేమ కోసమని తను ఒక గిఫ్ట్ స్నేహిత్ కు ఇవ్వడమే కాకుండా... ఆటలు అయ్యాక... తనను ఇంటికి ఆహ్వానించారు. 
స్నేహిత్ ను కలిసాక... ఆమె నాకు పంపిన సందేశం: 

Thankyou so much for a wonderful gift Ramu ...Im highly obliged and honoured by your lovely gift. Give my big thanks to hema too because I know she must have chosen it for me. I have also given a small token for Hema I hope she likes it .. my husband shiraz also met Fidel and he said that hes very innocent Mashallah ..All the best for his championship ...take care..my son will see all the matches tomorrow

ఫ్రెండ్ షిప్ తో పాటు క్రీడల గొప్పతనం ఇదే. ఎక్కడి మనుషులను, మనసులను కలుపుతాయి. ఆనందాన్ని పంచుతాయి. అదీ సంగతి!

3 comments:

http://smruthivanam.blogspot.com/ said...

its wonderful to have such friendships.........

katta jayaprakash said...

A great experience with love spreading like fragrance of a rose.This is the need of the hour for both the countries.Hope rest of the people understand realise it.My kudos to your Pak frineds. JP,

sasi said...

Congrats Ramugaru,
Just saw a news in eenadu that snehith won two medals in the tournament.Happy to know and all the best for his future endeavors

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి