Thursday, August 21, 2014

ఖాన్ సాబ్... అమర్ హై...

విద్యార్థి ఉద్యమాలలో గానీ ప్రజా ఉద్యమాలలో గానీ తిరిగి... జర్నలిజంలోకి వచ్చిన వారి మానసిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ ప్రజాస్వామ్యంలో ఆయుధం పట్టలేము కాబట్టి అక్షరమే ఆయుధంగా చేసుకోవచ్చనీ, సమస్యలపై స్పందించే హృదయం ఉండబట్టి ఇతరత్రా ఉద్యోగాలకన్నా మీడియా నే బెటరని అనుకుంటారు. కొంతకాలం పనిచేశాకగానీ  వీరికి తత్వం బోధపడదు. 
యజమానుల కుల-వ్యాపార-రాజకీయ ఈక్వేషన్స్, వారి సేవ పరమావధిగా భావించే వృత్తి నిబద్ధతలేని బాసులు, తమ స్వతంత్ర భావజాలానికి తల పొగరు, తల బిరుసు అని ముద్రవేసే కుక్కమూతి పిందెలు, లాజిక్కు-ఆత్మవిశ్వాసంతో మాట్లాడితే రెబెల్ అని ముద్రవేసే ఒక బేకార్ సెక్షన్ తో విచిత్ర అనుభవాలు  ఎదురయ్యాక... తెలుస్తుంది ఈ చెత్త వెధవల మధ్యన జీవితం ఆగం అయిపోయిందని. 

ఈ రొంపి (నిజంగానే వ్యభిచారానికి, జర్నలిజానికి ఉన్న సారూప్యం గురించి వేరే పోస్టులో చూద్దాం) నుంచి బైట పడడం ఎలానా? అనుకునే లోపు పెళ్లి, పిల్లలు, బాధ్యతలు, బతుకు మీద భయం ఘోరంగా కుంగతీస్తాయి. కాబట్టి...ఒక పత్రిక నుంచి మరొక పత్రికకు మారడమో... దొంగతనంగా (బాసులకు తెలీకుండా) డిగ్రీ లు చేసి టీచరు పొస్టో మరొకటో సాధించి దాదాపు శరీరం చిద్రమైనా రొంపి నుంచి బైట పడడమో, ఏదీ చేతకాకపోతే... వ్యవస్థను నిందిస్తూ... కాలక్షేపం చేయడమో జరుగుతాయి. 
ఇలాంటి సంకట స్థితి ని ఎదుర్కున్న ఈ వ్యాస రచయిత... 1992 లో 'ఈనాడు' లో చేరిన రోజుల్లో కనిపించిన విచిత్రమైన వ్యక్తుల్లో మహమ్మద్ తాజుద్దీన్ ఖాన్ (ఎం టీ ఖాన్) ఒకరు. ఆయన అప్పట్లో... ఎప్పటిలానే తెల్ల లాల్చీ పైజామా ధరించి యమ సీరియస్ గా ఉండే వారు. తనను చూడగానే భిన్నమైన వ్యక్తిగా కనిపించే వారు. ఇతరులతో అనవరంగా ఒక్క మాటైనా మాట్లాడేవారు కాదు. ఆఫీసులో ఆయన ఐదు నిమిషాల పాటు ఇతరులతో మాట్లాడడం చూడలేదు. 

ఆయన గురించి... ఆయన పోరాట పటిమ గురించి తెలిసి... ఆయనతో మాట్లాడాలన్న ఉబలాటం ఒకవైపు, ఇంగ్లిష్-హిందీ తప్ప ఆయన మరొకటి మాట్లాడడేమో అన్న సంశయం మరొక వైపు ఉండేవి. ఆయన ఎప్పుడూ సీరియస్ గా చదువుతూ కనిపించే వారు. రామోజీ రావు గారి మీద (అప్పట్లో) గొప్ప అభిప్రాయం కలగడానికి కారణం ఖాన్ సాబ్ ఒకరు. 
ఇలాంటి విప్లవ కారుడికి కూడా తెలిసి తెలిసి ఉద్యోగం ఇచ్చారంటే.. రామోజీ మనసు అంతా ఇంతా పెద్దది కాదన్న దృఢ అభిప్రాయం ఉండేది. ఖాన్ సాబ్ పేరు మీద పత్రికా ప్రకటనలు కూడా వచ్చేవి.... ఆయన అక్కడ పనిచేస్తున్నప్పుడు. 'ఈనాడు' లో అది మామూలు విషయం కాదు. 

ఎప్పటికైనా... ఖాన్ సాబ్ తో సుదీర్ఘంగా మాట్లాడి... (అప్పటి) ఆంధ్రప్రదేశ్ లో ఒక నికార్సైన కార్మిక సంఘం ఏర్పాటు చేయాలని బలంగా ఉండేది. కానీ... ఈ భావన ఉన్నట్లు తెలిసినా... ఎక్కడ ఉద్యోగం పీకుతారో అన్న పరమ పరికితనంతో ఆయనతో మాట్లాడకుండానే కాలం గడిచిపోయింది. అయన లైబ్రరీ కి వచ్చినప్పుడు, ఈనాడు ఫ్లోర్ కు వచ్చినప్పుడు... ఎన్ని సార్లు ఆయన నడవడికను, ధోరణిని, పలకరింపులను ఆయనకు తెలీకుండా చూస్తూ గడిపాము. అలా ఆయనతో సాంగత్యం లేకుండానే.. ఆయన పట్ల ఆరాధనా భావం పెరిగి మనసులో నాటుకుపోయి స్థిరపడింది. ఇలా భావ ప్రసరణ లేకుండానే స్ఫూర్తినిచ్చే మనుషులు తక్కువగా ఉంటారనిపిస్తుంది. 

ఖాన్ సాబ్ పోయారని తెలిసి ఒక ఆత్మీయుడ్ని కోల్పోయిన ఫీలింగ్ కలిగింది. అందుకే.. సీనియర్ జర్నలిస్టు కూర్మనాథ్ గారు ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఒకటి స్వీకరించి ఈ పోస్టు రాస్తున్నా. ప్రజల కోసం జర్నలిజాన్ని వాడుకోవాలని చూసిన ఖాన్ సాబ్ లాంటి వారు చరిత్రలో మిగిలి పోతారు. ఖాన్ సాబ్... అమర్ హై. 

సివిల్ లిబర్టీస్ నాయకుడు లతీఫ్ మొహమ్మద్ ఖాన్ గారు ఖాన్ సాబ్ గురించి ఫేస్ బుక్ లో తెలిపిన సంతాపం మీ కోసం:

Civil Liberties Monitoring Committee expresses its deep condolence on demise of Mr. M.T.Khan a veteran Civil Liberties leader from Hyderabad.Passing away of M.T.Khan on the morning of of 20th August, 2014 has saddened all those who are concerned with Civil liberties, human rights, democracy. 

 In the demise of M.T.Khan Telangana has lost a great champion of human rights and a fearless fighter against all that is illegal and oppressive. CLMC express its deep condolences and solidarity with the family members and the activists of Civil Liberties movement.

1 comments:

Bendalam KrishnaRao said...

manchi vyasam andinchaaru...He is a Good Journalist Not a Earnalist

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి