Sunday, March 8, 2015

సూపర్ ఎడిటర్ వినోద్ మెహతా మృతి


భారతీయ జర్నలిజం లో కురువృద్ధుడి లాంటి సీనియర్ ఎడిటర్, 40 ఏళ్ళ పాటు ఈ వృత్తిలో క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తి, తన పెంపుడు కుక్కకు 'ఎడిటర్' అని పేరు పెట్టుకున్న వినోద్ మెహతా ఈ రోజు దీర్ఘ కాలిక అనారోగ్యంతో దేశ రాజధానిలో కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఆయనకు భార్య (సుమితా) ఉన్నారు, పిల్లలు లేరు.
భారత దేశంలో అత్యంత స్వతంత్రంగా, నిర్మొహమాటంగా పనిచేసిన జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్న ఆయన డెబోనైర్, ది సండే అబ్సర్వర్, ది ఇండియన్ పోస్ట్, ది ఇండిపెండెంట్, ది పయోనీర్ లలో పనిచేసారు. జర్నలిజంలో ఎలాంటి డిగ్రీ లేకున్నా... భాషా పటిమ, విశ్లేషణా సామర్థ్యం, తెగింపు లతో అవుట్ లుక్ అనే పత్రికు వ్యవస్థాపక ఎడిటర్.

పత్రికలు మూతపడుతూ... ప్రింట్ జర్నలిజం శకం ముగిసిందని అనుకుంటున్న సమయంలో మాగజీన్ జర్నలిజాన్ని నిబద్ధతతో నిర్వహించి... కొత్తపుంతలు తొక్కించిన కలం యోధుడు వినోద్ మెహతా.  రహేజా గ్రూప్ తరఫున వినోద్ మెహతా 1995 అక్టోబర్ లో అవుట్ లుక్ ను ఆరంభించి అద్భుతమైన వ్యాసాలు అందించారు. అనారోగ్యం తో ఎడిటర్ బాధ్యతల నుంచి తప్పుకుని 2012 నుంచి అవుట్ లుక్ కు ఎడిటోరియల్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్న రావుల్పిండి లో 1942 లో జన్మించిన ఆయన ఎడిటర్ గా జర్నలిజం ఆరంభించడం చెప్పుకోదగ్గ విశేషం. బీ ఏ థర్డ్ క్లాస్ లో పాసయినట్లు చెప్పుకునే వినోద్ మూడు పుస్తకాలు రాసారు. అందులో మూడు జీవిత చరిత్రలు (ముంబాయి, సంజయ్ గాంధీ, మీనా కుమారి), రెండు తన అనుభవాల సారం (లక్నో బాయ్, ఎడిటర్ అన్ ప్లగ్డ్), ఒకటి సంకలనం (మిస్టర్ ఎడిటర్, హౌ క్లోస్ అర్ యు టు ది పీఎం?).

టెలివిజన్ జర్నలిజాన్ని అరుపులు, కేకలు, గాండ్రింపులు, గద్దింపులతో కొత్త పుంతలు తొక్కిస్తున్న అర్నబ్ గోస్వామి లాంటి ఎడిటర్లు సైతం.. వినోద్ ను 'జర్నలిజం దేవుడి' గా భావిస్తారు, ఆరాధిస్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో పాటు పలువురు సీనియర్ ఎడిటర్లు ఆయన మృతికి సంతాపం వ్యక్తంచేసారు.

2009 జనవరిలో ఉస్మానియా యూనివర్సిటీ, ప్రెస్ అకాడమీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వినోద్ మెహతా హైదరాబాద్ వచ్చారు. ఆ సందర్భంగా ఆయనతో పిచ్చాపాటా మాట్లాడే అవకాశం లభించింది. ఆ వివరాలు సందర్భానుసారం తర్వాత...

1 comments:

kanthisena said...

"అనారోగ్యం తో ఎడిటర్ బాధ్యతల నుంచి తప్పుకుని 2012 నుంచి అవుట్ లుక్ కు ఎడిటోరియల్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు."

రాముగారూ, నీరా రాడియా కేసులో రతన్ టాటా ప్రమేయంపై అవుట్ లుక్ మేగజైన్ పేల్చిన బాంబుదాడికి కినిసిన టాటాలు తన్నిన తన్నుకు వినోద్ మెహతా ఎడిటర్ పదవి గాలికెగిరిపోయిందన్న పచ్చినిజాన్ని రాయడంలో మీకున్న మొహమాటం ఏమిటి. చివరికి అన్ని పత్రికలూ ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాయి కూడా. ఇది క్షాత్రపరీక్ష కాకపోవచ్చు కానీ మీ విశ్వసనీయతకు మాత్రం గట్టి పరీక్షే. మీకు తెలియక ఇలా రాశారనుకోవడానికి ఆస్కారమే లేదు. కాని అసలు నిజాన్ని ఇంత గుంభనంగా దాచి పెట్టడానికి మీకున్న కారణాలేమిటన్నది మాత్రం నాకేమాత్రం అర్థఁ కాలేదండి. క్షమిస్తే ఒక చిన్న ప్రశ్న. మీరూ ఆ తానులో ముక్కేనా?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి