Tuesday, February 24, 2015

'ది న్యూస్ అవర్' లో బీజేపీ కి ఖాళీ కుర్చీ వేసిన అర్ణబ్

గోల గోల గందరగోళపు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజాన్ని ఇంకొక అడుగు ముందుకు తీసుకుపోయి తన గద్దరితనంతో 'ది న్యూస్ అవర్' అనే కార్యక్రమంతో గగ్గోలు పుట్టించే 'టైమ్స్ నౌ' ఎడిటర్ అర్ణబ్ గోస్వామికి ఒక దుర్లక్షణం ఉంది. తన వాదనతో ఏకీభవించని వారిని పరుష పదజాలంతో నోటికొచ్చింది తిట్టి.. నిప్పులు చెరిగి అవమాన పరిచి పరిశుద్ధ జర్నలిజానికి తానే ఏకైక ప్రతినిధినని మనసా వాచా కర్మణా నమ్మే అర్ణబ్ తన షో కు రానివారిని భయకరంగా ఎద్దేవా చేస్తారు. ఈ క్రమంలో తక్కువలో తక్కువ ఐదారుగురితో ఆయన చేసే రోజూ రాత్రి పూట చేసే న్యూస్ అవర్ కు భయకరమైన జనాదరణ ఉందట. 'టు నైట్ ది నేషన్ వాంట్ టు నో... యూ మస్ట్ అపాలజైజ్..." అని గద్దించి అడిగే అర్ణబ్ ను చూస్తే... ఒకోసారి భయమేస్తుంది.   

అదలా ఉండగా... ఈ రోజు (ఫిబ్రవరి 24, మంగళవారం) రాత్రి షో లో అర్ణబ్ ఒక ఖాళీ కుర్చీ వేసి ఇది బీజేపీ కి ఉద్దేశించిందని ప్రకటించి తన షో ఆరంభించారు. కరుణామయి మదర్ థెరిస్సా ఉద్దేశం మత మార్పిడని ఆర్ ఎస్ ఎస్ అధినేత భగవత్ చేసిన ప్రకటనను ఖండిస్తూ ఈ ప్రోగ్రాం ఆరంభమయ్యింది. అంతవరకూ బాగానే ఉంది కానీ... తన షో కు రాని బీజేపీ కి దమ్ములు లేవని...ఆర్ ఎస్ ఎస్ ఆదేశాలు లేకుండా పనిచేసే బీజేపీ నేత ఎవ్వరైనా వస్తే లైవ్ లోకి తీసుకుంటానని అర్ణబ్ ప్రకటించారు. 

మదర్ థెరిస్సా అన్నట్లు చెబుతున్న రెండు కోట్స్ తో అర్ణబ్ తన వాదన ఆరంభించారు. తర్వాత... భగవత్ వాదన సమర్ధించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు దుమ్ము దులుపుకున్నారు. గందరగోళం మధ్యన అపుడప్పుడూ అర్ణబ్ ఆజ్యం పోస్తూ మంటలు సృష్టిస్తూ కార్యక్రమం నడిపారు. "మాట్లాడే అవకాశం ఇవ్వవయ్యా.... మహా ప్రభో..." అని గెస్టులు ప్రాధేయపడడం, ఆవేశపడడంతో చాల సమయం ఆవిరయ్యింది. ఒక షో లో ఏడు, ఎనిమిది మందితో అర్ణబ్ సృష్టించే బీభత్స కాండకు మంచి టీ ఆర్ పీ రేటింగ్, ప్రకటనలు రావడం విశేషం. ఆర్ ఎస్ ఎస్ ప్రకటన కరెక్టని చెప్పడం మా ఉద్దేశం కాదు గానీ, ఈ గందరగోళపు చర్చల వల్ల ఫలితం ఏమి ఉంటున్నదన్నదే అనుమానం.  

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి