Thursday, February 12, 2015

మూతపడుతున్న 'ఇండియా టుడే' తెలుగు

సీరియస్ తెలుగు రీడర్స్ ను ఇరవై ఏళ్ళ కు పైగా ప్రత్యేక కథనాలతో, వినూత్న కవర్ స్టోరీ లతో, మసాలా సర్వేలతో,  అద్భుతమైన సినీ సమీక్షలు, కార్టూన్లతో అలరించిన 'ఇండియా టుడే' తెలుగు పత్రిక ఈ నెలలో మూతపడబోతున్నది. దీంతో పాటు తమిళ, మలయాళ ఎడిషన్స్ కూడా నిలిచిపోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 'ఫిబ్రవరి 16 వ తేదీ మీకు ఆఖరి పనిదినం," అని యాజమాన్యం  ఉద్యోగులకు సమాచారం ఇచ్చి అకౌంట్లు సెటిల్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

నాణ్యమైన జర్నలిస్టులు, ఎడిటర్లు ఇంగ్లిష్ లో రాసే వార్తలను అనువదించి, స్థానికంగా ముఖ్యమైన కథనాలతో లోకల్ ఫ్లేవర్ తెచ్చి 'ఇండియా టుడే' ఒక పక్ష పత్రికగా తెలుగు రీడర్స్  పై చెరగని ముద్ర వేసింది. 1990-91 ప్రాంతంలో మొదలైన ఆ పత్రిక... తెలుగులో మంచి మాగజీన్ లేని లోటును తీర్చింది. 2004-05 లో అది వార పత్రికగా మారింది. పత్రిక  ప్రాంతీయ భాషల ఎడిషన్లు చెన్నై కేంద్రంగా పనిచేస్తున్నాయి. అక్కడి నుంచే మంచి చాకుల్లాంటి తెలుగు జర్నలిస్టులు రాజసుఖ, ప్రసాద్, పసునూరి శ్రీధర్ బాబు, రెంటాల జయదేవ,  కార్టూనిస్ట్ నర్సింగ్ తదితరులు పనిచేసే వారు. 

పత్రికలో ముసలం మొదలు కాక ముందు టెలివిజన్ జర్నలిజం మీద మక్కువతో శ్రీధర్ బాబు, మొదలయ్యాక పై జర్నలిస్టులు అందరూ హైదరాబాద్  చేరుకొని స్థిరపడ్డారు. రాజసుఖ, ప్రసాద్ ల ఎడిటర్ షిప్ తర్వాత ఎం కిషోర్ అక్కడ చేరారు. ఆయన ఇప్పుడు అక్కడే ఉన్నారో, ఎక్కడ ఉన్నారో తెలియదు.  

'ఈనాడు' జనరల్ డెస్క్ లో పనిచేసిన మిత్రులు ఇండియా టుడే ఇంగ్లిష్, తెలుగు ఎడిషన్లు రెండూ దగ్గర పెట్టుకుని పోల్చుకుంటూ అనువాదం అభ్యాసం చేసే వారు. ఉద్యోగులను ప్రత్యేకించి బైటికి పంపి ప్రత్యేక కథనాలు తెప్పించి ప్రచురించే సంస్థ అది. అలాంటి పత్రిక మూత పడడం బాధాకరం. 

"ఖర్చులు పెరిగాయని... కాస్ట్ కటింగ్ అని మొదలు పెట్టారు. చాలా రోజులుగా మూత వేసే విషయం మాట్లాడుతున్నారు. మొత్తానికి ఇప్పుడు మూతేస్తున్నారు," అని ఒక మాజీ జర్నలిస్టు చెప్పారు. ప్రాంతీయ భాషా ఎడిషన్లు మూయడం వల్ల యాభై కి పైగా మంచి జర్నలిస్టులు వీధిన పడేట్లు కనిపిస్తున్నది. వారందరికీ మంచి జాబులు దొరకాలని ఈ బ్లాగు కోరుకుంటున్నది.  

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి