Friday, February 22, 2019

ఒక మంచి ప్రయోగాన్ని (10 టీవీ) నాశనం చేసిన మార్క్సిస్టులు!

"రోజూ టీవీ లో వార్తలు చూసే ప్రతొక్కడూ తనకు టీవీ ఛానెల్ నడపగల అనుభవం వచ్చేసిందని గట్టిగా నమ్మి మంది సొమ్ముతో ఛానెల్ నడిపితే ఏమవుతుంది?"

సీరియస్ జర్నలిజం కోసం ప్రత్యామ్నాయ మీడియా అంటూ 2013 లో ఆరంభమై బొక్కబోర్లా పడ్డ 10 టీవీ ని కమ్యూనిస్టులు గత ఏడాది తెగనమ్ముకోవడానికి కారణం ఏమిటని అడిగితే తలపండిన ఒక జర్నలిస్టు చెప్పిన మాట ఇది.

"నాణ్యత, అర్హతలతో సంబంధం లేకుండా పార్టీ (సీపీఎం) వాళ్ళను ఎక్కువగా చేర్చుకోవడం. ప్రొఫెషనలిజం లేకపోవడం. రిపోర్టర్లను ప్రకటనల సేకరణ కు వాడుకోవాలన్న నిర్ణయం తీసుకున్నప్పుడే ఈ ఛానెల్ పతనం ఆరంభమయ్యింది."
-అని మరొక మహిళా జర్నలిస్టు చెప్పారు.

"నిజానికి 10 టీవీ విజయవంతమైన ఛానల్.  అరుణ్ సాగర్ దీన్ని ఒక సూపర్ రేంజ్ కు తీసుకుపోతే, వీళ్ళు (కమ్యూనిస్టు గ్రూప్) ఒక రేంజ్ లో ముంచేసి అమ్మేసి చేతులు దులుపుకున్నారు,"
-అని ఛానల్ లో కొంతకాలం పనిచేసిన అనుభవంతో మరొక జర్నలిస్టు చెప్పారు.

సహకార రంగంలో ఒక మీడియా హౌస్ ఉంటే బాగుండని అనుకుంటున్న సమయంలో మార్క్సిస్టు లు పార్టీ కార్యకర్తలు, అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేసి ఈ ఛానెల్ పెట్టారు. కావలసిన దానికన్నా ఎక్కువ డబ్బులు వస్తే, కమ్యూనిస్టులు చాలా చోట్ల భూములు కొని 'ఇన్వెస్ట్' చేశారట. మొత్తం మీద ఛానెల్ నడపడం కష్టమని బోధపడి నష్టాలు ఇంకా భరించలేక   గత ఏడాది మై హోమ్ గ్రూప్ కు అమ్మేశారు. దాదాపు ఆరేళ్ళ కిందట ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ కే నాగేశ్వర్ ఛైర్మన్ గా, టీవీ 9 లో రాటుదేలిన అరుణ్ సాగర్ సారథ్యంలో ఛానెల్ మొదలయ్యింది.
కొత్త యాజమాన్యం వచ్చీ రాగానే జీతాలు పెంచి... ఉద్యోగుల్లో నైరాశ్యాన్ని పోగొట్టడానికి శ్రీకారం చుట్టింది. ఆఫీసును ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గరకు మార్చింది.   'ఈనాడు' లో బిజినెస్ రిపోర్టర్ గా వృత్తిలోకి అడుగుపెట్టి  కార్పొరేట్ ప్రపంచంలోకి దూకిన సింగారావు గారు అనే ఘటికుడు ఇప్పుడు ఛానెల్ హెడ్ గా ఉన్నారు. యాజమాన్యం మార్పిడి జరగ్గానే, కొందరి ఉద్యోగాలకు ముప్పు రావడం, ఈ క్రమంలో సీనియర్ జర్నలిస్టులు వేరే ఛానెల్స్ చూసుకోవాల్సి రావడం జరుగుతున్నది. ఛానెల్ ను పునరుద్ధరించే పనిలో భాగంగా గట్టి నోరున్న సింగారావు గారు జర్నలిస్టులతో ఎట్లా చెడుగుడు ఆడుతున్నారన్న దానిపై మాకు వస్తున్న సమాచారం అంత బాగోలేదనది అప్రస్తుతం.

వివిధ కారణాల వల్ల ప్రొఫెసర్ నాగేశ్వర్, అరుణ్ సాగర్ (ఆ తర్వాత టీవీ 5 లో చేరి అనారోగ్యంతో ఆయన మరణించారు) 10 టీవీ ని వీడారు. అది నిజానికి ఛానెల్ కు పెద్ద దెబ్బ. సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం గారి ఆధ్వర్యంలో, ఎల్ ఐ సి లో నాయకుడైన వేణుగోపాల రావు అనే పెద్ద మనిషి మానేజింగ్ డైరెక్టర్ గా ఛానెల్ నడిచింది. ఒక దశలో నెలకు దాదాపు కోటి రూపాయల ఆదాయం సంపాదించింది కానీ, సీనియర్ జర్నలిస్టులను గౌరవించి కాపాడుకోవడంలో వీళ్ళు విఫలమయ్యారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి.

ఖమ్మం జిల్లా కమ్మ కామ్రేడ్స్, నల్గొండ జిల్లా రెడ్డి కామ్రేడ్స్ చాలా ఘటికులు. ఉద్యమాల గడ్డలో పుట్టారు కాబట్టి...పెద్దగా గుజ్జు లేకపోయినా... గంటల తరబడి ప్రజారంజకమైన ఉపన్యాసాలు సమసమాజ స్థాపనలో భాగంగా దంచడం, సొంత కులపోళ్ళను కాకుండా వేరే వాళ్ళను దూరకుండా చేయడం రెండూ వీళ్ళు సమర్థంగా నిర్వహిస్తారన్న అపవాదు మూటగట్టుకున్నారు. 10 టీవీ లో కనిపించకుండా కుల ధోరణులు కూడా ప్రభలాయన్న విమర్శ ఉంది. అది నిజమేమో అనడానికి కొన్ని ఉదాహరణలు కూడా కనిపించాయి.

మొత్తం మీద ఛానెల్ అమ్మగా వచ్చిన మొత్తాన్ని, రియల్ ఎస్టేట్ లో పెట్టిన సొమ్ము బైటికి తీస్తూ వచ్చిన డబ్బులను మదుపుదారులకు పంచే పనిలో కమ్యూనిస్టులు నిమగ్నమయ్యారు. ఎందరో జర్నలిస్టులకు ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఛానెల్ పతనాన్ని రోజూ దగ్గరినుంచి చూసిన  కార్మిక నేత కామ్రేడ్ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్టర్లకు డబ్బులు తిరిగి చ్ఛే కార్యక్రమం జరుగుతున్నట్లు  సమాచారం.

ఇదిలా ఉండగానే...  ఛానెల్ స్థాపన, నిర్వహణ, అమ్మకం వంటి విషయాలపై తెలుగు రాష్ట్రాల నుంచి పొలిట్ బ్యూరోకు ఫిర్యాదులు అందాయి. వీటి మీద వివరణ ఇవ్వాలని ఢీల్లీ పెద్దలు కోరారట. దీనిమీద ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్త దిగువనిస్తున్నాం.
మొత్తం మీద ఒక మంచి ప్రయోగం విఫలం కావడం బాధకలిగిస్తున్నది.

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి