Thursday, February 21, 2019

నైస్.... కిరణ్ కు మళ్ళీ యాంకర్ ఉద్యోగం వచ్చింది....

జర్నలిజం వృత్తిలో ఒక వెలుగు వెలిగిన వాళ్ళు... దుర్దినాలు దాపురించిన కాలంలో... అవసరానికి ఆదరించే వాళ్ళు లేక ఉదర పోషణార్థం వేరే కొలువు చూసుకోవడం బాధకలుగుతుంది. అన్నేళ్ళు వృత్తిలో సాధించిన అనుభవం ఒక్కసారిగా నిర్వీర్యమై పోతుంది. ఈ-టీవీ లో యాంకర్ గా ప్రస్థానం ప్రారంభించి... స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ కొండుభట్ల రామచంద్ర మూర్తి గారి ఆధ్వర్యంలో వచ్చిన హెచ్ ఎం  టీవీ లో  కీలక భూమిక పోషించి... కొత్త తరానికి యాంకరింగ్ సూత్రాలు చెప్పే స్థాయికి వచ్చిన  పొలుదాసు కిరణ్ కారణాంతరాల వల్ల పూర్తిగా కొత్త రూట్ ఎంచుకోవాల్సి వచ్చింది... దాదాపు ఐదేళ్ల కిందట. 

ఆ పరిణామం చూసి బాగా నొచ్చుకున్న వాళ్లలో మేమూ ఉన్నాం. ఒక్క కిరణే కాదు... ఎవరికీ ఇలాంటి స్థితి రాకూడదు. అదొక నరకం. అక్కడా ఇక్కడా ప్రయత్నాలు చేసి.. ఏపీ విద్యా మంత్రి నారాయణ గారి దగ్గర చేరారు కిరణ్. నిజానికి... తడబాటు లేకుండా వివిధ చర్చలను ప్రత్యక్ష ప్రసారాల్లో సమర్థంగా నిర్వహించి, తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న యాంకర్ వెళ్లి వేరే కొత్త పనిలో కుదిరి పూర్తి స్థాయిలో మనసు లగ్నం చేసి పనిచేయడం అంత  తేలికేమీ కాదు. తాను అభిమానించిన వృత్తికి దూరమైనందుకు తాను మానసికంగా కుమిలిపోయాడు. పాపం కిరణ్... మొత్తం మీద ఇన్నాళ్లు ఎలాగో బండి నడిపాడు.   
   
ఈ రోజు ఉదయం ఫేస్ బుక్ లో కిరణ్ ఈ పోస్ట్ పెట్టారు, తాను సొంత గూటికి తిరిగి చేరుకున్నానని చెప్పడానికి. ఏపీ 24/7 అనే ఛానెల్ లో చేరారాయన. 

నాలుగున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ నా సొంత గూటికి (మీడియా) చేరుకున్నాను. మనసుకి నచ్చిన పని ప్రారంభించాను. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా మనసంతా మీడియా మీదనే. జర్నలిస్టుకు ఎన్నికల వేళకు మించిన సందర్భం, పండుగ ఉండవ్. అందుకే ఈ సమయంలో మీ ముందుకు వచ్చాను. ఆదరించమని, ఆశీర్వదించమని... మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్స్ తో వీకే (వెంకట కృష్ణ) గారు. 

ఈ వార్త మాకు ఆనందం కలిగించింది. ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపిస్తూ... జీవితంలో ఎదగాలని అహరహం తపించే లక్షణం ఉన్న కిరణ్ గారికి సెకండ్ ఇన్నింగ్స్ లో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం. అల్ ద బెస్ట్ డియర్. 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి