ప్రభుత్వ బలగాల దాడులు ఎక్కడ, ఎవరిపై జరిగినా...మీడియా, ముఖ్యంగా టెలివిజన్ ఛానెల్స్, 'సోర్సులు', 'విశ్వసనీయ వర్గాలు', 'అత్యంత విశ్వసనీయ అధికార వర్గాలు', 'ఉన్నత స్థాయి వర్గాలు' అంటూ కథనాలు కుమ్మేస్తుంది. ఆ కథనాలన్నీ నమ్మదగ్గవి గానే ఉంటాయి. ఎవరికి తోచింది వారు ప్రసారం చేసుకునే ఒక భయంకరమైన విచ్చలవిడి జర్నలిజం ఈ సందర్భంగా వర్థిల్లుతుంది. ఈ తెల్లవారుఝామున భారత వైమానిక బలగాలు పాకిస్థాన్లోని ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలపై చేసిన దాడి సందర్భంగా ఈ వాతావరణం మరొకసారి ఏర్పడింది.
దాడులపై విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ కేశవ్ గోఖలే... రాసుకొచ్చిన ఒక ప్రకటన చదివి... 'ప్రశ్నలు స్వీకరించబడవు' అని తెగేసి చెప్పి హాయిగా వెళ్ళిపోయాడు. దాడులపై అనేకానేక ప్రశ్నలు మదిలో మెదిలే మన జర్నలిస్టులు దీంతో ఒక్కసారిగా బిక్కచచ్చారు. ఎంత మంది ముష్కరులు చచ్చారు? అంతమంది ఖతమై పోయారనడానికి ఆధారం ఏమిటి? అసలు వారు అక్కడే ఉన్నారని అంత కచ్చితంగా ఎలా తెలిసింది? వంటి కీలక ప్రశ్నలకు సమాధానం రాలేదు.
ఈ క్షణం నుంచి రాత్రి దాకా టీవీ ల్లో ప్రత్యక్ష ప్రసారాల్లో, స్టూడియో చర్చల్లో అంటా 'ఊహాత్మక జర్నలిజం' రాజ్యమేలింది. కొత్తగా వచ్చిపడ్డ కమ్యూనికేషన్ సాధనం ట్విట్టర్ లో జర్నలిస్టులు తమ సోర్సులను ఉటంకిస్తూ సమాచారం ప్రసారం చేసారు. ఒక పక్కన పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ భారత్ దాడులు ఒక కట్టుకథ అని చెబుతుండగానే... మన ఇంగ్లిష్, హిందీటెలివిజన్ ఛానెల్స్ వాళ్ళు దాదాపు 300 మంది ముష్కరులు ఖతమయ్యారని ఊదరకొట్టడం మొదలుపెట్టాయి. సరిహద్దుల దగ్గర భారత విమానాలు చక్కర్లు కొట్టితే తాము వాటిని సమర్థంగా తిప్పి కొట్టామని ఆయన చెప్పుకొచ్చారు, 'ది డాన్' పత్రిక వారి వెబ్ సైట్ కథనం ప్రకారం. చాలా వరకు ఇంగ్లిష్ ఛానెల్స్ ను మక్కికి మక్కీ కాపీ కొట్టే తెలుగు, తమిళ, కన్నడ భాషా చానెల్స్ కూడా 300 కు పైగా పోయినట్లు ఏకంగా ప్రకటించడం మొదలుపెట్టాయి.
కొందరు తెలుగు జర్నలిస్టులు సైతం, సంచలన కథనాలతో సంసారం చేసే ఇంగ్లిష్, హిందీ మీడియా మిత్రుల మాదిరిగా, దాడుల గురించి ఇష్టమొచ్చినట్లు లైవ్ లలో మాట్లాడుతన్నారు, వాళ్ళను వీళ్ళను ఉటంకిస్తూ. "సీనియర్ జర్నలిస్టులు సైతం నిష్పాక్షికతను గాలికివదిలి సొంత కథనాలను ప్రసారం చేస్తున్నారు," అని హఫింగ్ టన్ పోస్ట్ ఎడిటర్ ఇన్ చీఫ్ అమన్ సేథీ ఒక కథనంలో పేర్కొన్నారు.
కొన్ని ఛానెల్స్ దాడులకు సంబంధించిన విజువల్స్ చూపిస్తూనే ఉన్నాయి... రోజంతా. ఇవి నిజమైనవా, లేక పాత క్లిప్పింగులా అన్న మాట ఎవ్వరూ చెప్పలేదు. జర్నలిజం దాడిలో వాస్తవం బుగ్గిబుగ్గి అవుతోంది ప్రభో!
0 comments:
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి