Wednesday, February 20, 2019

ఉగ్రవాదుల దాడిపై జనాల ఓవరాక్షన్

నల్గొండ జిల్లాలో 'ది హిందూ' రిపోర్టర్ గా పనిచేస్తున్నప్పుడు... ఒక తరహా వార్తలు కవర్ చేస్తున్నప్పుడు చాలా బాధ కలిగేది. ఊళ్లలో చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో... జనాలు ఊళ్ళో ఒక స్త్రీ ఇంటి మీద దాడి చేసి, ఆమెను బైటికి లాగి, రాళ్లతో పళ్ళు రాలగొట్టి...బట్టలు చించేసి... ఇంకా కసి తీరక కొట్టి చంపడమో, సజీవ దహనం చేయడమో చేసేవారు. ఇది మాబ్ రియాక్షన్, ఒక ఘటనపై  మూక స్పందన. దీన్ని సభ్యసమాజంలో ఎవరమైనా మంచి పని అనగలమా?

గత వారం పుల్వామా లో జరిగిన ఉగ్రవాది దాడిలో వీరమరణం పొందిన సైనికుల పార్థివదేహాలను, పెద్ద దిక్కును కోల్పోయిన వారి భార్యా బిడ్డలను, పసి పిల్లలను చూసిన ప్రతి భారతీయుడి గుండె తరుక్కుపోయింది.   ఎదురు కాల్పుల్లోనో, సరిహద్దు దగ్గర పహారా ఉన్నప్పుడో శతృవు తూటాలకు బలికావడం వేరు. విధి నిర్వహణలో భాగంగా ఒక చోటు నుంచి మరొక చోటుకు పోతున్న సైనిక బలగాలపై ఒక ముష్కరుడు ఆత్మాహుతి దాడి చేయడం వేరు. రెండు బలిదానాలు సమానమే అయినా... పుల్వామా లో జరిగిన నిష్కారణ దాడి యావత్ జాతిని కలచివేసింది. 2300 మంది సైనికులు వెళ్తున్న దారిలో చెక్ పోస్ట్ ఎత్తివేయడానికి కారణం రాజకీయ నిర్ణయమని మాజీ మేజర్ ఒకాయన మొత్తుకుంటున్నాడు. నిజంగానే, ఈ నిర్ణయం తీసుకున్న వాళ్ళను శిక్షించడం కనీసం లో కనీసంగా ప్రభుత్వం చేయాల్సిన మొదటి పని.

ఈ కేసులో పడిన ఫస్ట్ వికెట్... పంజాబ్ కాంగ్రెస్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ. నోరు ఎప్పుడు మూసుకోవాలో, ఎప్పుడు తెరవాలో తెలియక... యావత్ జాతి రోదిస్తుంటే... సుద్దులు చెప్పబోయి ఆయన సోనీ టీవీ లో  వచ్చే 'ది కపిల్ శర్మ షో' నుంచి ఊస్ట్ అయ్యాడు. టైమింగ్ సరిగా లేక హిట్ వికెట్ అయ్యాడు సర్దార్జీ... తాను చెప్పదలుచుకున్న విషయంలో ఎంతో కొంత నిజాయితీ ఉన్నా. ఇందుకు కారణమైన నెటిజెన్స్ గ్రూప్ ఒకటి వివిధ ఫోరాల్లో పాకిస్థాన్ పై దుమ్మెత్తి పోస్తూ... యుద్ధోన్మాద నినాదాలుగూబలు బద్దలయ్యేలా చేస్తున్నది.

ఈ నెటిజన్స్ దేశభక్తిని శంకించడానికి వీల్లేదు. కొందరు టీవీ యాంకర్ల పెను పోకడలు జర్నలిజం సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయి. స్టూడియోల్లో కూర్చొని వాళ్ళు చేస్తున్న కామెంట్స్ జుగుప్స కలిగిస్తున్నాయి.  అర్జెంట్ గా పాకిస్థాన్ పై యుద్ధం ప్రకటించాలని, బాంబింగ్ చేయడానికి ఆలస్యం ఎందుకన్నట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు.  మనకున్నది ఎంత 'పాగల్ పడోసీ' అయినా... మనకు అననుకూలమైన చైనా లాంటి పొరుగు దేశాలు, నమ్మడానికి వీల్లేని అమెరికా లాంటి అగ్రదేశాలు ఉండగా చెటక్కునముందూ వెనకా ఆలోచించకుండా ఒక దేశాన్ని భూస్థాపితం చేయడం కుదురుతుందా... ఈ రోజుల్లో?  పిచ్చోడి చేతిలో రాళ్లు ఉన్నాయో... వాడి విసిరితే మనకు ఎక్కడ దాకా వచ్చి తగులుతుందో... ప్రభుత్వానికి అంచనా  ఒకటి ఉండాలి కదా! పైగా కవ్వింపు చర్యలో భాగంగా... వాడు ఈ అఘాయిత్యానికి పాల్పడితే... మనం వ్యూహం ప్రకారం వ్యవహరించకపోతే యెట్లా?

రేటింగ్స్ పెంచుకునే పనిలో భాగంగా... వివిధ ఛానెల్స్ దేశభక్తి ని ఉన్మత్త భావనలను రెచ్చగొడుతున్న తీరు బాధ కలిగిస్తున్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయిన ప్రొఫెసర్ పద్మజా షా  ఈ టీవీ ఛానెల్స్ ను అమర సైనికులకు వందన సూచికంగా ఒక నెల  పాటు యాడ్స్ ప్రసారం చేయబోమని చెప్పమనండి చూద్దాం. అట్లాకాకపోతే... నెల పాటు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని అమరుల కుటుంబాల అభ్యున్నతికి వెచ్చిస్తామని రాసి ఇచ్చి చేయమనండి చూద్దాం. ది హిందూ రిపోర్టర్ వడ్లమూడి స్వాతి కార్టూన్ లో చెప్పినట్లు... ఫోన్ మీదకు వచ్చిన బొద్దింకను చూసి జడుసుకు చచ్చే వాడూ యుద్ధ నినాదాలు చేయడం ఫ్యాషన్ అయ్యింది.

కాశ్మీర్ నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులపై, పొట్టచేతబట్టుకుని వచ్చిన వ్యాపారులపై దాడులకు దిగడం ఘోరమైన అమానుషం. ఇట్లా చేయకండ్రా నాయనా.. అన్నందుకు.... ఈ మొత్తం వ్యవహారంలో...  జర్నలిస్టు బర్ఖాదత్ ను ట్విట్టర్ లో ఘోరంగా అవమానించడం, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పై మాటల దాడికి దిగడం... వంటివి ఆపితే బాగుంటుంది. ఫ్రీ గా దొరికిన సోషల్ మీడియా లో ఇష్టమొచ్చింది రాసి పారేయడం ఆపి సంయమనం పాటించాల్సిన సమయం ఇది. అంత తీట గా ఉంటే అర్జెంట్ గా యుద్ధం చేయాలనడానికి కారణాలు రాసి వాదన వినిపించడం వరకూ మంచిదే కానీ... పనిలో పనిగా ఇతరుల దేశభక్తిని శంకించడం, మాటలతో దాడులకు దిగడం ఏమి సంస్కారం? జవాన్ల పై దాడి జరిగిన ప్రతిసారీ ముస్లిం జర్నలిస్టులు హృదయాన్ని చీల్చి భారత్ జెండాను చూపించాలంటే ఎలా?

అందరి ఆవేశాలు అర్థం చేసుకో దగినవే. బ్లడ్ బాయిల్ అవడం సహజమే. చదువుకున్న అందరం కాస్త నాగరికంగా వ్యవహరిస్తే మంచిది. లేకపోతె... అనుమానిత చేతబడి ఘటనలో మాబ్ కు చదువూ సంస్కారం ఉన్న వాళ్లకూ పెద్ద  తేడా ఏముంటుంది? 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి