Tuesday, June 18, 2019

పుత్రికోత్సాహం పేరెంట్స్ కు...గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు!

(ఎస్. రాము) 
ఏదో ఆసక్తి కలిగించడం కోసం ఆ శీర్షిక కానీ... తల్లిదండ్రులకు పుత్రికలు ఉత్సాహం తెప్పించే సందర్భాలు అనేకం ఉంటాయి. నిన్న (జూన్ 17, 2019) ఉస్మానియా విశ్వవిద్యాలయం 80 వ స్నాతకోత్సవం సందర్భంగా ఠాగోర్ ఆడిటోరియంలో  మా అమ్మాయి మైత్రేయికి గవర్నర్ నరసింహన్ గారు యుధ్వీర్ గోల్డ్ మెడల్ ప్రదానం చేసిన ఘట్టం అలాంటిదే. కాకపోతే, తానూ మాతోపాటు మురిసిపోయిన అపూర్వ ఘట్టం అది. 

ఇరవై ఏళ్ళ కిందట (1998-99 బ్యాచ్) నేను ఆర్ట్స్ కాలేజ్ లో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (ఎం సీ జె) ప్రవేశ పరీక్షలో ఫస్టు రాంకు లో పాసై సీటు సాధించాను. అప్పుడు 'ఈనాడు' లో సాయంత్రం నుంచి రాత్రంతా ఉద్యోగం చేసి వీలున్నప్పుడల్లా క్లాసులకు పోయి చదివాను. అప్పటికే బాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (బీ సీ జె) లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినందున 'షోయబుల్లాఖాన్ గోల్డ్ మెడల్' వచ్చింది.  ఎం సీ జె లో మూడు గోల్డ్ మెడల్స్ (ఓవరాల్ మార్క్స్, ఎడిటింగ్, ప్రాజెక్టు రిపోర్ట్) మనకే దక్కాలన్న పిచ్చి ఆశ ఉండేది. ఎడిటింగ్ లో మూడు మార్కుల తేడాతో వేరే అమ్మాయికి ఆ మెడల్ వచ్చింది. ఓవరాల్ గా కూడా ఆ అమ్మాయికి గోల్డ్ మెడల్ వచ్చింది. నేను మాత్రం అత్యుత్తమమైన ప్రాజెక్టు రిపోర్ట్ కు ఇచ్చే 'ఉర్దూ అకాడమీ గోల్డ్ మెడల్' తో సంతృప్తి పడాల్సి వచ్చింది. జర్నలిస్టుగా, జర్నలిజం బోధకుడిగా పనిచేస్తూ  అదే డిపార్ట్మెంట్ లో పీ హెచ్ డీ పట్టాపొందినా రెండు మెడల్స్ చేజారిన అసంతృప్తి మిగిలిపోయింది. 

విధివశాత్తూ...  నా కూతురు మైత్రేయి కూడా జర్నలిజం కోర్సు చేయాలనుకుని హైదరాబాద్ లోని 'రచన జర్నలిజం కాలేజ్' లో చేరింది. 2016-18 సంవత్సరానికి గానూ ఉన్న ఏకైక యుథ్వీర్ గోల్డ్ మెడల్ సాధించింది. ఇరవై ఏళ్ళ కిందట నేను మిస్ అయిన మెడల్ ఇది కావడంతో నాకు ఆనందం అనిపించింది. ఫాదర్స్ డే మరుసటి రోజున తాను నాకు ఇచ్చిన కానుక అని...గర్వంగా ప్రకటించింది.  ఇది తెలిసిన మిత్రులు... 
 తండ్రిని మించిన కూతురంటూ అభినందనలు పంపారు. అందరికీ థాంక్స్. 
అయితే... మా ఇంట్లో ఉన్న మూడు జర్నలిజం గోల్డ్ మెడల్స్ చెందాల్సింది... హేమ కుమారికి. అప్పట్లో నాకు, ఇప్పట్లో మైత్రేయికి స్ఫూర్తినిచ్చింది తనే. ఎనిమిదేళ్ల పాటు టెలివిజన్ జర్నలిస్టుగా పనిచేసిన హేమకే ఇవి అంకితం. 

1 comments:

Jai Gottimukkala said...

Hearty congratulations to Maitrayee & the proud parents!

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి