ఒకటి-మెట్రో ట్రైన్ లో కూర్చొని చేసే కూల్ ప్రయాణం!
రెండు-మామూలు రైల్లో థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లో కిక్కిరిసిన జనాల మధ్య కేకలు, అరుపుల మధ్య ప్రయాణం!!
అమితాబ్ బచ్చన్ గారి 'పింక్' హిందీ సినిమా మెట్రో జర్నీ అయితే, పవన్ కళ్యాణ్ గారి 'వకీల్ సాబ్' తెలుగు సినిమా రెండో రకపు సందడి ప్రయాణం. ఈ రెంటిలో--క్లాస్, మాస్ ల్లో-- ఏది బెటర్ అంటే... చెప్పలేం. ప్రయాణపు లక్ష్యం-వినోదం. ఒకదానికొకటి పోలికలేకుండా రెండూ లక్ష్యాన్ని సాధించాయి.
'పింక్' రీ మేక్ అని 'వకీల్ సాబ్' ను ఎటెటో తీసుకుపోయారని బాధపడడం దండగ. రీ మేక్ చేస్తున్నప్పుడు మక్కీకి మక్కీ అనువాదం ఉండాలనుకోవడం, కథ ఉన్నదున్నట్టు దిగిపోవాలని అనుకోవడం అనవసరం. కథను నడిపిన తీరు, ఇద్దరు నటుల (అమితాబ్ జీ, పవన్ గారు) నటన వంటి అంశాల్లో హిందీ, తెలుగు సినిమాల మధ్య పోలిక పెట్టుకోవడం కూడా అనవసరమే. ఇదే సినిమాను హాలీవుడ్ డైరెక్టర్ కి ఇస్తే ట్రీట్ చేసే విధానంలో కచ్చితంగా మరికొన్ని మార్పులు ఉంటాయి. అది వాంఛనీయం కూడా.
ప్రేక్షకుల నాడి (పల్స్), స్థానికత (నేటివిటీ), హీరోకున్న ఊపు (స్టేచర్), డబ్బు రాబట్టే లెక్కలు (సేలబిలిటీ) వంటి అంశాలను చూసుకోకుండా ఈ రోజుల్లో రీ మేక్ చేయకూడదు. ఈ కోణాల్లో చూస్తే 'వకీల్ సాబ్' ఘన విజయం సాధించినట్లే. కుటుంబ సమేతంగా నేను చూసిన మొదటి రోజు సెకండ్ షోలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ తో పాటు పలు సన్నివేశాలను జనం ఈలలు, చప్పట్లతో ఎంజాయ్ చేశారు.
'వకీల్ సాబ్' సినిమా ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు. వినోదంతో పాటు పవన్ గారి రాజకీయ అజెండాను స్పష్టంగా మోసింది. ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనను జనం ఘోరంగా దెబ్బతీసిన నేపథ్యంగా గల పంచ్ డైలాగులు బాగానే ఉన్నాయి. మచ్చుకు-"ఆశ ఉన్నవాడికే గెలుపు-ఓటములు ఉంటాయి. ఆశయం ఉన్నవాడికి అదొక ప్రయాణం."
ఓటర్లు ఆ రోజుకు వచ్చేది చూసుకునే అమాయకులని ఒక సారి, తాను వారికోసమే పనిచేస్తానని ఒక సారి, కలిసి పోరాడదామని ఆఖర్లో విసిరిన డైలాగులు కూడా ఈ బాపతే. బ్రహ్మరథం పడతారనుకున్న ఓటర్లు ఘోరంగా దెబ్బతీయడాన్ని జీర్ణించుకోలేని ఉడుకుమోతుతనపు డైలాగులు ఉన్నాయి అక్కడక్కడా. తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు గట్రా లేవని, జీవిక కోసం సినిమాలు చేయాలని చెబుతూ మూడేళ్ళ తర్వాత తెరమీదకు వచ్చిన పవన్ గారు ఈ సినిమాను పొలిటికల్ అజెండాకు వాడుకోవడం తప్పేమీ కాదు. బహుళ ప్రయోజనాల్లో పెద్దదైన పొలిటికల్ అజెండా కు అతికినట్టు సరిపోయే 'పింక్' ను రీ మేక్ కు, రీ ఎంట్రీకి ఎంచుకోవడంతోనే దిల్ రాజు-పవన్ బృందం సగం విజయం సాధించింది.
లాయర్ గారు బాడ్ బాయిస్ ను మూడు సందర్భాల్లో వీర ఉతుకుడు ఉతకడం, పైగా మెట్రో ట్రైన్ లో బజ్జీలు పగలగొట్టడం, కోర్టు రూమ్ లో ఆవేశంతో కుర్చీ విరగ్గొట్టడం.... వంటివి పవనిజంలో భాగంగా తప్పని అంశాలు. కథతో సంబంధం లేకుండా ఇలాంటి సీన్లు లేకపోతే ఒక సెక్షన్ అభిమానులు నిరాశపడతారు. అయితే, పవన్-శృతి మధ్య కెమిస్ట్రీ అస్సలు పండలేదు. ఆ పిల్ల చూడడానికి ఘోరంగా ఉంది. ఇంకా బాగా నటించి ఉండాల్సింది. తాప్సి కి దీటుగా నివేదితా థామస్ ఇరగదీసింది. ముగ్గురు ఆడపిల్లలు పడ్డ మానసిక క్షోభ చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఎంపీ కొడుకు పక్కన జునపాల పోరడు (సుశాంత్ సింగ్ లాగా ఉన్నాడట) కూడా బాగా చేశాడు. ఆడపిల్ల 'వర్జినిటీ' (అనువాదం ఇవ్వని ఈ మాట ఎంతమంది సాధారణ తెలుగు ప్రేక్షకులకు అర్థమవుతుందో!) మీద చర్చ జరగడం బాధకలిగిస్తుంది. ఇది పింక్ మూలం నుంచి తీసుకున్నదే.
అయితే... 'పింక్' తో సంబంధం లేకుండా ఉస్మానియాను, అదీ ఉద్యమాల అడ్డా అయిన ఆర్ట్స్ కాలేజ్ ను, వేదికగా చేసుకోవడం...అనుకున్నదే తడవుగా క్యాంపస్ లా కోర్సులో చేరిపోవడం, తెలంగాణా యాసలో సాగించడం కూడా రాజకీయ అజెండాలో భాగమో కాదో భవిష్యత్తులో తేలుతుంది. ఆర్ట్స్ కాలేజ్ బొమ్మ బదులు, ఆంధ్రా యూనివర్సిటీనో, నాగార్జున యూనివర్సిటీనో చూపించి ఉండవచ్చు. కానీ ఆ పనిచేయలేదు. ఇక్కడ ఏదో మతలబు లేకపోలేదు. షర్మిలమ్మ లాగా పవర్ స్టార్ కూడా తెలంగాణాలో కాలుమోపడంలో తప్పులేదు. స్పేస్ అయితే ఉంది. విత్తనాలు ఇప్పుడు చల్లితే పంట కొన్నేళ్ల తర్వాత చేతికి అందవచ్చు.
నన్ను అడిగితే...ఒక రెండు విషయాల్లో మరింత మెరుగ్గా చేసి ఉండవచ్చు. అంతచేటు ప్రజల కోసం పనిచేసిన లాయర్ సాబ్ మందు చుక్క లేనిదే ఉండలేకవడం ఏ మాత్రం అస్సలు బావో లేదు. దానిబదులు జనజీవనం నుంచి విత్ డ్రా అయి... ఎక్కడో ట్యూషన్లు చెప్పుకుంటూనే, ఆర్గానిక్ ఫామింగ్ చేస్తూనో అనామకంగా బతికినట్టు చూపితే బహుళ ప్రయోజనాల్లో ఒకటిగా ఉండేది. అలాగే.. కోర్టు బాత్ రూమ్ లో రౌడీలను కొట్టి... కోటు మీద లేని దుమ్మును దులుపుకుంటూ రావడం తో పాటు కోర్టులో నటన చాలా అసహజంగా ఉంది. ప్రకాష్ రాజ్-పవన్ మధ్య వాదనలు కూడా సహజత్వానికి దూరంగా ఉన్నా... తెలుగు ప్రేక్షకులకు ఎక్కుతాయి. శరత్ బాబు గారితో చెప్పించినట్లు... తను జనాలకు కావాలని గట్టిగా అనుకునే పవన్ అభిమానులు బాగానే ఉన్నారు.
మరింతకూ... సినిమా చూడాలా? వద్దా?? అని అడిగితే చూడాలనే నేను చెబుతా. హాయిగా నవ్వుతూ 'జాతి రత్నాలు' ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులు 'వకీల్ సాబ్' ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. మెట్రో ట్రైన్ అయినా, థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ అయినా....మనకు ఒకటే!
మొత్తం మీద ఒకటి స్పష్టం: పవన్ కళ్యాణ్ గారి పుణ్యం (ఒక జాడ్యంపై పోరాడుతూ అందించే వినోదం), పురుషార్థం (రాజకీయం) తీర్చింది 'వకీల్ సాబ్.'
ఇన్ని సుద్దులు చెప్పిన ఈ సినీ బృందం... సినిమా ప్రపంచంలో ఉన్న కాస్టింగ్ కౌచ్ లాంటి మహిళలపై అఘాయిత్యాలను నిజజీవితంలో కూడా బాహాటంగా నిరసిస్తే ఇంకా బాగుంటుందని అనుకోవడం అత్యాశ కాదుగదా!
1 comments:
జనజీవనం నుంచి విత్ డ్రా అయి... ఎక్కడో ట్యూషన్లు చెప్పుకుంటూనే, ఆర్గానిక్ ఫామింగ్ చేస్తూనో అనామకంగా బతికినట్టు చూపితే బహుళ ప్రయోజనాల్లో ఒకటిగా ఉండేది.
ఇది గొప్పగా ఉంది రివ్యూలో.
తతిమ్మా రివ్యూ కూడా బాగుంది.
కానీ ఇది సినీ సమీక్ష కాదు.. సినిమాపై అభిప్రాయం
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి