Wednesday, May 5, 2021

సూపర్ జర్నలిస్టు భళ్ళమూడి రామకృష్ణ (ఆర్కే)కు అశ్రు నివాళి!

తెలుగు జర్నలిజంలో బాగా రాసేవారు (only writing-committed to the profession)... బాగా మేసేవారు (only corruption-as much as possible), బాగా కూసేవారు (Only talking-in studios)...బాగా చేసేవారు (Only recommendations-for everything)...  బాగా నాకే వారు (Only praising-the government) ఉన్నారు. ఇందులో మొదటి రకం పక్కా ప్రొఫెషనల్స్ కొరత ఎంతో ఉంది. ఇది కాక... నాణ్యత పెంచడానికి వృత్తినిబద్ధతతో ప్రయత్నంచేసే వారు బహు అరుదు. 

వృత్తి సంబంధ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే... తాను నేర్చిన విద్యను నలుగురికి పంచడం బాధ్యతగా భావిస్తూ... అందులో తృప్తిని వెతుక్కున్న జర్నలిస్టు భళ్ళమూడి రామకృష్ణ (ఆర్కే). కరోనా పై పోరాడుతూ అయన ఈ ఉదయం గాంధీ ఆసుపత్రిలో కన్నుమూశారు. అయన వయస్సు 54 సంవత్సరాలు. భార్య వందన, కూతురు శ్రీలాస్య ఉన్నారు. 

విజయనగరం జిల్లా బొబ్బిలిలో 29-08-1967న  విద్యాధికుల కుటుంబంలో జన్మించిన ఆర్కే (పాలొలికే బుగ్గలతో ఉంటాడు కాబట్టి 'పాలబాబు' అని ఇంట్లో ముద్దుగా పిలుస్తారు) ఎం ఎస్సీ-ఫిజిక్స్ చదివాడు. ఆంగ్ల బోధకుడైన తండ్రి నుంచి వారసత్వంగా సాహిత్యాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన జర్నలిజంపై మక్కువతో 1991-92 లో "ఈనాడు" కంట్రిబ్యూటర్ గా చేరాడు. "ఈనాడు జర్నలిజం స్కూల్" లో 1993లో చేరి బ్యాచ్ ఫస్టు వచ్చారు. సంస్థ గుండెకాయగా భావించే జనరల్ డెస్క్ లో చేరి తెలుగు, ఇంగ్లిష్ భాషా సామర్ధ్యం మెండుగా ఉండడం వల్ల మంచి పేరు తెచ్చుకున్నాడు. అక్కడ పనిచేస్తున్నప్పుడే జర్నలిజం స్కూల్ పిల్లలకు క్లాసులు తీసుకునేవాడు. డెస్కులో చేరిన కొత్త వారికి నిలదొక్కుకోవడానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. 



'సార్... ఎన్టీఆర్ ను కాదని మనం చంద్రబాబును ఎందుకు సమర్ధించాలి?' అని ఒక సంస్థాగత మీటింగులో ఈనాడు ఛైర్మన్ రామోజీ రావు గారిని ఆనాడు అమాయకంగానైనా సూటిగా అడిగి ఒక 30 నిమిషాల పాటు పెద్దాయన వివరణ ఇచ్చేలా చేసిన మొనగాడు... ఆర్కే. పదవులు రావనో... తొక్కేస్తారనో తను ఎన్నడూ భయపడలేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంలో, రాయడంలో  భయమెందుకు? అన్నదే ఏకైన సూత్రం. ఇది చేసిన నష్టం భారీగానే ఉన్నా... రాజీ పడకుండా ఇబ్బందిపడుతూనైనా బండి నడిపాడు. 

ఆర్కే ప్రతిభను గమనించి ఈనాడు యాజమాన్యం... అప్పుడే కొత్తగా వస్తున్న మాధ్యమం ఈ-టీవీ కి పంపింది. అక్కడా తనదైన ముద్రవేశాడు. ఎందరో మెరికలను తయారుచేశాడు. తర్వాత ఎన్-టీవీ, ఐ-న్యూస్ ఛానల్స్ లో పనిచేసి ప్రింట్ జర్నలిజం వైపు మారాడు. డెక్కన్ క్రానికల్, హన్స్ ఇండియా లలో పనిచేసిన ఆర్కే చివరకు ఆంధ్రజ్యోతిలో చేరాడు. "నాణ్యత కోసం నేను పడిన తాపత్రయాన్ని పొగరుగానో మారేదనో అనుకున్న వాళ్ళు ఉన్నారు. కొందరు ఛానెల్స్ లో నాకు మంచి అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు," అని ఆర్కే అన్నాడు. వ్యాస రచయిత రాము, రామకృష్ణ ఈనాడు రోజుల్లో దిగిన ఫోటో ఈ పైన ఉంది. 
 
ఆర్కే శివైక్యం చెందిన సందర్భంగా ఈ రోజు రాసిన లేఖ ఇదీ:::::


పాలబాబూ.... 
రెండు రోజుల్లో కోలుకుంటావని అందరం అనుకుంటే... ఏంటి బ్రదర్ 54 ఏళ్లకే ఇలా వెళ్లిపోయావ్? 
మూడు నాలుగు నెల్లుగా దాదాపు రోజూ గంట చొప్పున మాట్లాడుకున్నాం. ఎన్నోటి విషయాలు చర్చించుకున్నాం! జర్నలిజం, ప్రపంచ విశేషాలు, లోకల్ రాజకీయాలు, భోజనాలు, జనాలు...ఎన్నని విశ్లేషించాం! అవే నాకు మధురానుభూతిగా మిగిల్చి పోయావ్. నిజానికి, నీతో ఈనాడు లో జనరల్ డెస్క్ లో పోటీపడి రాసిన బ్యానర్లు, నువ్వు పడిపడినవ్విన బోలెడన్ని హెడ్డింగులు ఎప్పటికీ గుర్తుంటాయి. వీటితో పాటు, చింతల్ బస్తీ మెస్ లో మనం తిన్న ములంగ కాడలు, వస్తూ వస్తూ వేసుకున్న స్వీట్ పాన్లు, పండిన నోటితో చిద్విలాసంగా నువ్వు  నడిచి వస్తుంటే... 'అయ్యా.... ఆర్కే..' అని ఒక డెస్క్ ఇంచార్జ్ చేసిన వ్యాఖ్యలు.... ఎప్పుడూ మరచిపోను. డ్యూటీ అయ్యాక నిమ్స్ ప్రాంగణంలో తాగిన టీలు, తిన్న మిర్చి బజ్జీలు.... 
దీంతో పాటు నా 'సావిర్జినిటి', నీ ' వర్జీనియా వూల్ఫ్'  నా మదిలో ఆనందంగా నిలిచిపోతాయి. ఎంత బనాయించావురా... 'రాజకీయ ఆర్తి-భంగపడ్డ మూర్తి' శీర్షికను! నీ హాస్య ప్రియత్వం, సంభాషణా చతురత, సునిశిత విశ్లేషణా సామర్థ్యం ఎల్లకాలం గుర్తుండి పోతాయి. 

నేను ఏప్రిల్ లో రెండు రోజులు వరసగా థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసి వస్తే... కొవిడ్ ను పట్టించుకోకుండా ఏంటిదని మందలించావే! ఎన్ని జాగ్రత్తలు చెప్పావ్! చూడరా అన్నా... ఈ పాడు కోవిడ్ కనీసం నిన్ను కలవకుండా...చేసింది. నీకో దండ వేసి దండం పెడదామని నేను, హేమ సిద్ధమవుతుంటే...ఆ జీ హెచ్ ఎం సీ వాళ్ళు అంబర్ పేట కు ఆల్రెడీ తీసుకుపోతున్నారని చెప్పారు. పంచభూతాల్లో నీవు లీనమయ్యే లోపే ఇది రాయాలనుకున్నా. దుఃఖం ఆగడం లేదురా అన్నా. నువ్వు ఆసుపత్రిలో చేరాక... మాట్లాడాల్సింది. నీకు అది డిస్ట్రబెన్స్ అవుతుందనుకున్నారా అన్నా. ఘోరమైన తప్పు జరిగిపోయిందే!
 
ఎందుకురా.... నువ్వు నీ మరణం గురించి నాతో అంత లోతుగా చర్చించావ్? ఈ మధ్యనే రెండు మూడు సార్లు ఇదే ప్రస్తావించావ్.  ఇప్పుడు అర్థమయ్యింది ఆర్కే. 'నాకు ఏదైనా అయితే వీళ్లకు (వందన గారికి, లాస్యకు) అండగా ఉండాలి," అని నువ్వు మాటిమాటికీ చెబితే నేను నిన్ను తిట్టా... పిచ్చివాగుడు ఆపాలని. నువ్వు మాట ఇవ్వాలని పట్టుపట్టినప్పుడు నాకు అర్థంకాలేదు అన్నా. బహుశా నువ్వు ఊహించినట్లే దాటిపోయావ్ మా అందరినీ వదిలేసి. నేను మాటకు కట్టుబడి ఉంటారా... అన్నా. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ వాళ్ళిద్దరికీ నేను, నా కుటుంబం బాసటగా ఉంటాం. ఈ రోజు నేను చేస్తున్న పునరుద్ఘాటనరా ఇది. 
  
అన్నా... నువ్వు.. అద్భుతమైన ప్రతిభావంతుడివి. నిన్ను నిన్నుగా నేచురల్గా ఎదగనివ్వని, అవకాశాలకు అడ్డంపడిన వెధవ ఎవ్వడూ నీలా ఒక్క పేరా అయినా రాయలేడు. కొన్ని లెక్కలు కలిసొచ్చాయి వారికంతే. నిన్ను ఇంగ్లిష్ జర్నలిజంలో చేర్చాలని... మనం ఈనాడు లో ఉండగానే నిన్ను ఒక ది హిందూ జర్నలిస్టు దగ్గరికి తీసుకుపోయాం. కానీ ఈ లోపు ఈ-టీవీ లో వచ్చి దేశ రాజధానికి వెళ్లిపోయావ్. తర్వాత మనం దూరమైనా... హేమ ఎన్-టీవీ లో చేరాక వారానికి ఒక సారి మాట్లాడుకున్నాం. అవన్నీ మధుర అనుభూతులే. మధ్యలో చాలా అంతరం వచ్చినా.... గత ఏప్రిల్  ఇబ్బంది నుంచి నువ్వు బైటపడ్డాక... నేను రోజూ మాట్లాడాలని పెట్టుకుని మాట్లాడాను...  నువ్వు వేగంగా కోలుకుని హాయిగా ఉండాలని. ఈ నెల్లో అహోబిలం సహా కొన్ని ప్రాంతాలకు, మా ఊరికి వెళ్లాలని అనుకుంటే... అకస్మాత్తుగా వెళ్లిపోయావ్ మిత్రమా. 
నీ జీవితంలో, మరణంలో రెంటిలోనూ వ్యవస్థ వైఫల్యం, యాజమాన్యాల కర్కశత్వం, అపోహలతో కక్షగా మెలిగిన కొందరి రాక్షసత్వం ఉన్నాయి. మనం వాటిని కూలంకషంగా మాట్లాడుకున్నాం... నాకు అవన్నీ గుర్తు ఉంటాయి. వదిలేద్దాం. 
ఏడాదికి పైగా నువ్వు ఇంటి నుంచే పనిచేయడానికి సహకరించిన ఆంధ్ర జ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణ గారికి, ఎడిటర్ శ్రీనివాస్ గారికి, సీనియర్ మిత్రుడు వక్కలంక రమణకు నీ తరఫున ఈ రోజున ధన్యవాదాలు. నిన్ను మామూలు మనిషిగా చూడాలని గట్టిగా అనుకున్న ఈనాడు ఆంధ్ర ప్రదేశ్ ఎడిటర్ మానుకొండ నాగేశ్వర రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. కోవిడ్ పాజిటివ్ అని తెలిసినా గత వారం అయన మీ ఇంటికి వచ్చి మందులిచ్చి, అర్థగంట ఉండడమే కాదు... నీ ప్రాణాలు కాపాడేందుకు కొన్ని గంటల పాటు ఫోన్లో ఆయన అందుబాటులో ఉన్నారు. రేగళ్ల సంతోష్ నీ గురించి ఎంతో తపన పడ్డాడు. పాపం ఎన్ని ఫోన్ కాల్స్ టంచనుగా తీసుకుని తనకు చేతనైన సాయం చేశాడో! ఇతర మిత్రుల ప్రయత్నాలు, ప్రేయర్స్ వర్కవుట్ కాలేదు. మేము దురదృష్టవంతులం...అన్నా. 

నీతో పనిచేసిన, నీ నుంచి వృత్తిపరమైన నైపుణ్యాన్ని పొందిన అనేక మంది నాతో మాట్లాడారు. ఏమ్వోయ్, బ్రదర్, సోదరా... అని నువ్వు పిలిచిన వారూ కుమిలిపోతున్నారు. 
ఆర్కే... మేమంతా నీ ఆత్మకు శాంతి, స్వర్గలోక ప్రాప్తి కలగాలని ప్రార్థిస్తాం. అంతకు మించి మేమేమి చేయగలం. 

పాలబాబూ.... ఇక సెలవ్... 
నీ 'బోసమ్' ఫ్రెండ్'
రాము

10 comments:

శ్యామలీయం said...

ఒక మహమ్మారి మానవాళి మీద విరుచుకు పండింది.
-- నిత్యం రోగవార్తలు వినలేక తల్లడిల్లుతున్నాం.
-- నిత్యం మరణవార్తలు వినలేక కుమిలిపోతున్నాం.
ప్రభుత్వాల శత్రుత్వాలు యుధ్ధాలను సృష్టిస్తాయి.
-- ఆ యుధ్ధాల పుణ్యమా అని ఎందరో నిష్కారణంగా చనిపోతున్నారు.
ప్రభుత్వాల అలసత్వం రోగాలను మహమ్మారులుగా మారుస్తున్నది.
--- అ మహమ్మారుల పుణ్యమా ఎందరో నిష్కారణంగా చనిపోతున్నారు
సామాన్యులం ఏమి చేయగలం?
-- బ్రతికి ఉండటమే గొప్ప అదృష్టం అనుకోవటం తప్ప?

SK said...

Very very sad. It is shocking. Never expected he would leave us soon. The days spent with him in Eenadu are nostalgic..His beautiful and complete smile haunt me. Aayana aatmaku sadgathi kalagaalani Devunni prarthistunna...

Mana kathalu said...

రాము గారు మీతో మాట్లాడాలి ప్లీజ్ మెసేజ్. WhatsApp number 9515053546

Karnakar said...

Very said. Rest in peace Sir.

Satish Suryanarayana said...

నువ్వు ఎదిగాక నన్ను మర్చిపోకు. ఏం బ్రదర్ ఎలా ఉన్నావ్? అక్కడే ఉండిపోకు. మంచి అవకాశం వస్తే వెళ్లిపో.. ఇలా మీరు చెప్పిన ప్రతిమాటా గుర్తుంది. V6లో ఏడాది పరిచయాన్ని జీవిత కాలం గుర్తుంచుకొనేలా చేసి..నన్ను ప్రోత్సహించిన వైనాన్ని ఈ శోక సమయంలో.. అక్షర నివాళిగా అర్పిస్తున్నాను.ఆర్కే సార్ అమర్ రహే.

V6లో ఉన్నప్పుడు.. రామూ సర్ .. మిమ్మల్ని గుర్తు చేసుకున్నాం. మీ పేరు తలవగానే ఎంతో ఆత్మీయంగా పెదవులపై నువ్వులు పూయించేవారు ఆర్కే గారు. మీరంటే ఆయనకు ఎంతో అభిమానం.

Satish Suryanarayana said...

నువ్వు ఎదిగాక నన్ను మర్చిపోకు. ఏం బ్రదర్ ఎలా ఉన్నావ్? అక్కడే ఉండిపోకు. మంచి అవకాశం వస్తే వెళ్లిపో.. ఇలా మీరు చెప్పిన ప్రతిమాటా గుర్తుంది. V6లో ఏడాది పరిచయాన్ని జీవిత కాలం గుర్తుంచుకొనేలా చేసి..నన్ను ప్రోత్సహించిన వైనాన్ని ఈ శోక సమయంలో.. అక్షర నివాళిగా అర్పిస్తున్నాను.ఆర్కే సార్ అమర్ రహే.

V6లో ఉన్నప్పుడు.. రామూ సర్ .. మిమ్మల్ని గుర్తు చేసుకున్నాం. మీ పేరు తలవగానే ఎంతో ఆత్మీయంగా పెదవులపై నువ్వులు పూయించేవారు ఆర్కే గారు. మీరంటే ఆయనకు ఎంతో అభిమానం.

Unknown said...

Very Sad, Rest in Peace Sir

Pavan Sriram said...

Journalism lanti vruththilo hundha ga brathakadam antha suluvu kaadhu. Aayana jeevithanni klupthamga vivarinchina meeku modataga dhanyavaadalu.
May his soul rest in peace. My deepest condolences to Vandana aunty and Lasya��

Haji said...

Great journalist rk sir

Andhra Pradesh Live said...

నాలుగేళ్ల పరిచయం. జన్మ జన్మల బంధం తెగిపోయిన భావన. ఏడాదిగా రోజూ మాట్లాడుకొనే వాళ్ళం. వెళ్ళిపోయాక తెలుస్తోంది.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి