Saturday, January 16, 2010

మీడియాకు దూరంగా..పల్లె తల్లి ఒళ్లో..చల్లచల్లగా..

చాన్నాళ్ళ తర్వాత... ఈ సవాలక్ష ఛానెల్స్ కు, వార్తా పత్రికలకు దూరంగా ఒక నాలుగు రోజులు నాణ్యంగా బతికి తీరాలనుకున్నాను. ఈ పండగ పుణ్యాన అది సాధ్యం అయ్యింది. అలాగే, కుటుంబంలో పిల్లలందరూ...ఈ సంక్రాంతి రోజు మా ఊరుకు వెళ్లి తీరాలని మేము వేసిన ప్లాన్ కూడా పారింది. ఇది నాలుగు రోజులు గుర్తుండే మధుర సంక్రాంతి.


పల్లె నిజంగా తల్లి ఒడి, చల్లని బడి. అక్కడి ప్రజలు అమాయకులు. ఆదరించి అక్కున చేర్చుకుంటారు. కాయకష్టాన్ని నమ్ముకుంటారు. గుండెలనిండా ప్రేమతో పలకరిస్తారు. మంచి చెడ్డలు కనుక్కుంటారు, మన ఎదుగుదల చూసి హృదయపూర్వకంగా పులకరిస్తారు. 


ఇది ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామం. గురువారం ఉదయం కారులో ప్రయాణం మొదలయ్యింది మొదలు...మా ఊరు గురించే ఆలోచనలు. రజాకార్ల దాడి నుంచి తప్పించుకునేందుకు మా తాతా వాళ్ళు పొరుగున ఉన్న కృష్ణా జిల్లా నెమలిలో తల దాచుకున్నారు. ఇంట్లో అమ్మమ్మా వాళ్ళు ఉన్నప్పుడు ఒకసారి ఒక నిజాం ముఠా దుర్భుద్ధితో మా ఇళ్ళ  చుట్టుముడితే...మా కుటుంబంతో కలిసి మెలిసి ఉండే ఒక ముస్లిం కుటుంబం రక్షించింది. ఇది యాదికొచ్చింది. ఇది రెండు స్వాతంత్ర్య పోరాటాలు చేసి పునీతమైన నేల. లౌకికత్వానికి ప్రతీక.


ఈ ఆలోచన పరంపర కొనసాగుతూనే పోయింది. గొల్లపూడి పక్కనున్న రెబ్బవరం గ్రామం...నా క్రీడా ప్రాంగణం. స్కూలు గ్రౌండ్, ఇంగ్లిష్ చెబుతూ ఎప్పుడూ కొట్టే డీ.పీ.రంగారావు గారు, పద్యాలు నేర్పిన వెంకటప్పయ్య గారు, అప్పట్లో ట్యూషన్ లో ఇంగ్లిష్ రైమ్స్ చెప్పిన కుసుమ టీచర్, స్కూల్ ఎగ్గొట్టి మేము రాళ్ళతో కొట్టిన గిన్నె చెట్లు, పశువుల డాక్టర్ గా మా నాన్నగారికి ఉన్న మంచి పేరు...అన్నీ స్ఫురణకు వచ్చాయి. అవన్నీ నాతో పాటు ప్రయాణం చేస్తున్నహేమ, నా పద్నాలుగేళ్ళ కూతురు మైత్రేయి కి వివరించాను. నా తొమ్మిదేళ్ళ కొడుకు ఫిదెల్ రఫీక్ స్నేహిత్  ఒక్క రోజు ముందే...నా తమ్ముడు, వాడి సతీమణి, వారి ముగ్గురు చిన్న పిల్లలతో కలిసి

వెళ్ళిపొయ్యాడు కాబట్టి చాలా మిస్ అయ్యాడు. ఆరో తరగతిలో కల్లు కొండయ్య తో కలిసి  బీడీలు, సిగరెట్లు తాగి ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అమ్మతో తిన్న తన్నులు, పేక ముట్టుకున్నా, వక్కపొడి తిన్నా...నాన్నకు కట్టలు తెంచుకునే ఆగ్రహం గురించి వారికి ఎప్పుడో చెప్పేసా.


పచ్చని చేల మధ్య కొండచిలువలా ఉన్న తార్రోడ్డు మీద కారు దూసుకుపోతుంటే...వైరా వచ్చింది. అక్కడ రోడ్డు మీద ఉన్న మా కాలేజ్, దాని వెనుక చెరువు పక్క ఉన్న నా బాడ్మింటన్ గ్రౌండ్ చూపించాను. ఒక పది కిలోమీటర్ల ప్రయాణం కాగానే...రెబ్బవరం రానే వచ్చింది. రోడ్డు పక్క స్కూలు చూస్తే...ప్రాణం ఎందుకో లేచి వచ్చింది. అది శిధిలావస్థకు చేరింది. గ్రౌండ్ కుంచించుకుపోయింది. ఎప్పటికైనా....ఈ స్కూల్ ఋణం తీర్చుకోవాలి. 
మరొక రెండు కిలో మీటర్లకు గొల్లపూడి వచ్చింది. 

ఒక రోజు ముందే అక్కడ చేరుకున్న...ఫిదెల్ మా ఇంటిపక్క ఉన్న ఖాళీ స్థలంలో వీధిలో పిల్లలతో కలిసి చెక్క బ్యాటు, తుమ్మ వికెట్ల తో చెమటలు కారేలా క్రికెట్ ఆడుతుంటే...నాకు ఆనందం వేసింది. ఈ పిల్లలు హైదరాబాద్ లో పడి బాల్యపు అనుభూతులు చాలా కోల్పుతున్నారు అన్న బాధ కొద్దిగా తొలిగిపోగానే...మా ఇంటి పక్క గుడిలో గంట మోగింది.
పిల్లలంతా...పోలో మంటూ గుడిలోకి వెళ్లారు. అదొక చూడ ముచ్చటి సీన్. మాకు ఒకప్పుడు అది నిత్యకృత్యం. వీడు ఒక కొబ్బరి చిప్ప లో ప్రసాదం తెచ్చాడు. ఆ గుడిలో ఉదయం నాలుగున్నర నుంచి మోగే మైకు వల్ల నేను భగవత్గీత తో పాటు చాలా విషయాలు నేర్చుకున్నాను. "ఎంట్రా..చిప్ప తెచ్చావ్?" అని ఎవరో అడిగితే..."ఎవరో....ఆ అయ్యగారికి చెప్పారు...డాక్టర్ గారి...మనవడనో ఏదో చెప్పారు. ఆయన అప్పుడు ఈ కొబ్బరి చిప్ప ఇచ్చారు," అన్నాడు మన వాడు...ప్రసాదం అంటిన వేళ్ళు నాకుతూ.

అన్నయ్య కూతుళ్ళు ముగ్గురితో సహా..వివిధ సైజుల వారితో వీధిలో ఒక చిన్నపాటి క్రికెట్ టీం బయలుదేరింది. మర్నాడు...పెద్దలంతా..పండగ హడావుడిలో ఉండగా...పిల్లలు రకరకాల ఆటలు ఆడారు. నాన్న కట్టిన ఊయల తమ్ముడి మూడేళ్ళ కవల పిల్లలకు మంచి ఆట వస్తువయ్యింది. మా నాన్న ఊయల ఊపుతుంటే...వాళ్ళు మైమరిచి పోయారు. పిల్లలు ఖో-ఖో కూడా ఆడారు. వైరా కాలేజ్ లో నేను ఈ ఆటలో ఒక ప్రముఖ ఆటగాడిగా ఉండే వాడిని. 
నాన్న అమ్మా కష్టపడి పెంచిన జామ చెట్టు కింద పడక కుర్చీలో కూర్చుని ఆలోచిస్తుంటే...ఈ సారి ఊళ్ళో మార్కండేయులు లేని వెలితి కనిపించింది. డెభై ఏళ్ళ మార్కండేయులు మా ఇంటి ముందు ఉండే వాడు. మంచి రైతు. ఊరు వెళ్ళినప్పుడు వ్యవసాయం స్థితిగతులు తెలుసుకోవడానికి నాకు ఆయన ది బెస్ట్ శాంపిల్. తనకు ఇష్టమైన చింతకాయ పప్పు చేయించుకుని పడుకున్న మార్కండేయులు...అకస్మాత్తుగా గుండె పోటు వల్ల కన్నుమూసాడు. చిన్నపుడు మా అందరికీ నీళ్ళు పోయించి అమ్మకు సాయంగా ఉన్న వెంకట రమణ ఇంటికి స్వయంగా నేను వెళ్ళాను. ముగ్గుబుట్ట లాంటి జుట్టు, గారపట్టిన పళ్ళు, వంగిన నడుము, మో కాళ్ళ  నొప్పులతో (ఫ్లోరోసిస్ పుణ్యం) ఎదురొచ్చింది. రామయ్యా...బాగున్నావా...అని  ఆప్యాయంగా చేతులు నిమిరి ఇంట్లోకి తీసుకెళ్ళింది. కుర్చీ వద్దని వసాట్లో కూర్చుంటే...విలవిలలాడింది. చాలా మంది తెలిసిన వాళ్ళు కలిసి తృప్తిగా మాట్లాడారు. మేమంతా...కులం మతం వంటి వాటికి అతీతంగా బతికాం. అందుకే...హైదరాబాద్ లో ఏ కుటిలుడైనా...కుల ప్రస్తావన తెస్తే...వాడు ఒట్టి వెర్రిబాగుల వాడిలాగా కనిపిస్తాడు మాకు.   



పిల్లలకు కాసేపు ఎసోప్ ఫేబుల్స్ వినిపించాను. కానీ వారి మనసంతా ఆటలపైనే. మొత్తం మీద సాయంత్ర పిల్లలందరినీ దీసుకుని...నాన్న, పొలాలు చూసే వెంకటి, నేను ముందుగా మెట్ట పొలం చూపించాం. ఆ పొలంలో నా చిన్నప్పుడు ఒక పెద్ద తెల్ల తాచును చూసి రెండు కిలోమీటర్లు పరిగెత్తిన విషయం గుర్తుకు వచ్చి భయమేసింది. ఆ పొలంలో వేరుశేనగకు రాత్రి నీళ్ళు పెట్టడానికి మా కుటుంబం అంతా వస్తే...ఇంటి దగ్గర మేము అపురూపంగా పెంచుకున్న నాలుగు మంచి కుందేళ్ళను వీధి కుక్కలు చంపిన సంఘటన కూడా కళ్ళ ముందు మెదిలింది. 

పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చి...వంటి పొలాలు...వాటికి కావాలిసిన నీటి వసతి గురించి పిల్లలకు చెప్పాము. మా వూరి పంట పొలాలు, కాల్వ గట్టు, డొంక దారి వెంట పిల్లలను తిప్పాం. అవన్నీపాతికేళ్ళ కిందట నేను కలియదిరిగిన దార్లు. "రండి నాన్నా...ఈ ఊళ్ళో ఇంకా ఎన్నాళ్ళు ఉంటారు?" అంటే....నాన్న ఒక మాట అన్నారు. "అంతా బాగుంటుంది కానీ...అక్కడ (హైదరాబాద్) ఇక్కడ ఉన్న ప్రశాంతత ఉండదురా...ఈ పొలాలు, ప్రజలు, వాతావరణం ఇచ్చే ప్రశాంతతే వేరు," అని ఆయన అంటే...మనం ఈ ఉరుకుల, భుగభుగ పొగల నగరం లో ఏమి కోల్పోతున్నామో అర్థమయ్యింది.  
అందుకే ఈ సారి సంక్రాంతి నాకు చాలా తృప్తిని ఇచ్చింది. పట్నంలో పెంచుతున్న మన పిల్లలను కనీసం సంక్రాంతి నాడైనా ఇక్కడ ఒక మూడు రోజులు ఉన్చాలనుకున్నా. కాకపోతే...ఒకటే బాధ వేసింది. నగరంలో మనకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తూ...పల్లెల్లో విపరీతంగా కోత విధిస్తున్నారు. ఇది సమన్యాయం కాదు. వారికి మనలా మంచి నీరు అందడం లేదు. తాగునీరు, ఆరోగ్యం, విద్య, రోడ్లు వంటి మౌలిక విషయాలలో ఇంకా పల్లెల్లో ఎక్కడవేసిన గొంగళి ఆక్కడే!అయినా మీడియా మనకు సుందర ప్రపంచాన్ని మాత్రమే చూపించి జోలకొడుతున్నది కదా!!


(గమనిక: నేను కొన్నాళ్లుగా పేపర్లు, ఛానెల్స్ చూడకపోవడం వల్ల ఇలా మీడియా కు దూరమైన ఒక అంశాన్ని రాసాను. నచ్చినా, నచ్చకపోయినా...నాకు రాయండి.)

13 comments:

Anonymous said...

ఖమ్మం జిల్లా చాలా బాగుంటుంది.

Dr.Pen said...

మొత్తానికి సంక్రాంతి చాలా సంబరంగా జరుపుకొన్నారన్న మాట. మీ అనుభవాలు, అనుభూతులలో మమ్మల్నందరినీ తేల్చి ముంచారు. మీ అబ్బాయి ఆసక్తికరమైన పేరు వెనకాల కథ ???

admin said...

సర్, అసలు..ఈ మీడియా కి దూరం గా.. ఈ మీడియా లేని లోకానికి... వెళ్ళిపోవాలని ఉంది... ఆల్టిది ఏమైనా ఉంటె చెప్పండి

Srikanth said...

very nice blog sir! though I didn't grew up in a village (grew up in Nizamabad)..childhood memories are always to cherish. I miss the simplicity of those days...

సుజాత వేల్పూరి said...

మీడియాలో ఉండే అనేక కుళ్ళు కోణాల్ని(కొన్ని మాకు తెలుసు కదా మరి) మాకు వివరిస్తున్నా, మీరు అన్నీ మీడియా పోస్టులే రాయాలని పాఠకులు ఆశించరు.

హాయిగా పల్లె ఒడిలో నాలుగు రోజుల గడిపి రావడం ఎవరికి బావుండదు? చిన్నప్పటి మధుర స్మృతులు తల్చుకోవడం ఏ మనసుకు సాంత్వన నివ్వదు? అది నలుగురితో పంచుకోవాలని ఎవరికి అనిపించదు? ఆ విషయాలన్నీ నెమరు వేసుకోవడం ఎంతో మధురంగా ఉంటుంది. వర్తమానం కంటే, వచ్చు కాలంకంటే గత కాలమెప్పుడూ మేలుగానే తోస్తుంది.

నగరంలో ఏమి కోల్పోయారో అక్కడ తెలుసుకుంటూనే మరో పక్క అక్కడి వసతుల గురించి మరో పక్క ఆలోచించడం మానవీయకోణం(మీ పత్రికా భాషలో చెప్పాలంటే)అనిపిస్తోంది.

అప్పుడప్పుడూ ఇలాంటి పోస్టులు కూడా రాస్తూ ఉండండి.

Anonymous said...

thank you ramu garu for your honest feeings. everybody feel about the same. I grownup in Costal Andhra as it is my native and worked for 2.5 years in Vizag agency and later 5 years in Bhadrachalam agency. I feel the same about each of the place and I visit each of them to reminisce them and now I work in Adilabad/Karimnagar. Because of the recent disturbances I am so disappointed. My situation is that any body can say that I belongs to a particular region and actually i am not

VEMAVARAPU GOPALA KRISHNA MURTHY said...

Dear Ramu,
I am very happy to see your blog while browsing net. After going throgh tour profile I understood that you were nothing but Suravjjula Ramu.
Regarding the article one must relax brathing village fresh air and true affection of people.
First of all I stunned to see your photo with a french cutting. Hope that being a techer proffessor it is appropriate.
lastly I wish you success in bringing awareness in the commercial brains of Journalists.
V.Gopala Krishna Murthy

Ramu S said...
This comment has been removed by the author.
Ramu S said...

ఇస్మాయిల్ గారూ,


నిడివి పెరుగుతుందన్నఆందోళనతో...స్వోత్కర్ష పెరుగుతుందన్న భయంతో... మరిన్ని వివరాలు అందించలేక పోయాను. సుజాత గారు సూచించినట్లు ఇకపై వేర్వేరు విషయాల మీద కూడా ఇదే బ్లాగ్లో రాద్దామని అనుకుంటున్నాను. స్పందించిన మీ అందరికీ థాంక్స్. ఇకపోతే, పిల్లవాడి పేరు వెనుక పైత్యం (మా అమ్మ మాటలో) ఇలా వుంది.


విద్యార్థి రాజకీయాలలో ఉండడం మూలంగా....అంతర్జాతీయ రాజకీయాలు చదివి, రాసిన ('ఈనాడు' ఎడిట్ పేజి లో ఒక వంద వ్యాసాలు వివిధ పేర్లతో రాసాను) కారణంగా...క్యూబా వీరుడు ఫిదెల్ కాస్ట్రో అంటే నాకు భక్తి, గౌరవం. అందుకే...ఫిదెల్ అన్న పేరు తగిలించాను. ఆ పేరుతోనే నేను ఒక్కడ్నే పిలుస్తా. మొత్తం మీద దమ్మున్న నేతండీ ఆయన. గత ఏడాది ఒక ఫెలో షిప్ మీదఅమెరికాలోని మయామి వెళ్ళాను. అక్కడి నుండి క్యూబా వెళ్లాలని విశ్వ ప్రయత్నం చేశా కానీ రూల్స్ ఒప్పుకోలేదు.

ఇక 'రఫీక్' అన్న వాడు నా ప్రాణ మిత్రుడు. మతానికి అతీతంగా కూడా వుంటుంది కాబట్టి హేమ దీనికి ఒకే అన్నది. ఇక 'స్నేహిత్' విషయం. నేను, హేమ ఒక ఆరేడేళ్ళు ప్రాణ మిత్రులుగా వుండి...తర్వాత పెళ్లి చేసుకున్నాం కాబట్టి...కూతురు పేరు 'మైత్రేయి' అని కొడుకు పేరు "స్నేహిత్" అని ఎప్పుడో అనుకున్నాం. అది అమలుచేసాం. వెరసి...ఈ బుడతడి పేరు....'ఫిదెల్ రఫీక్ స్నేహిత్' గా రికార్డు లలోకి ఎక్కింది. ఈ మధ్య మా వాడి టేబుల్ టెన్నిస్ ప్రతిభపై 'ది హిందూ'లో రాసిన ఒక వ్యాసంలో రిపోర్టర్ గారు వీడి పూర్తి పేరు రాస్తే...భలే ఆనందం వేసింది. పెద్దయ్యాక ఫిదెల్ తన పేరు గురించిఏమి అంటాడో వేచి చూడాల్సిందే! --Ramu

Anonymous said...

మీ భార్య, పిల్లలు, వృత్తి... అంతా మీ ఆలోచనల్లో ఒదిగి పోయారు. అదృష్టవంతులు. వీళ్ళంతా మిగతా వాళ్ళ జీవితాల్లోని సేం క్యారెక్టర్ల లాగా మిమ్మల్ని ఒక పట్టు పడితే చూడాలని నాకు సరదాగా ఉంది.

Ramu S said...

saar/ma'am
cheemakainaa apakaaram talapettanivaadini. Meekendukandee anta kopam/paga naa meeda? idi daarunamandee.
--ramu

Saahitya Abhimaani said...

Ramu Garoo,

Well written about your visit to your native place. I am also presently in my native place (Vijayawada) and enjoying seeing all my childhood places, whatever left of them.

Your idea of writing about other matters, besides Journalism and its trends, is quite good and commendable idea.

రవిచంద్ర said...

ఇలాంటి వ్యాసాల మీద మీరు తప్పకుండా వ్యాసాలు రాయండి. జర్నలిజం అంటే కేవలం వ్యవస్థ గురించి మాత్రమే కాదు. పల్లె జీవన విధానాల గురించి కూడా బ్రహ్మాండంగా రాశారు.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి