Thursday, January 21, 2010

ఇది ఒక సంతోషికి సారా మిగిల్చిన వ్యధ... సారో కథ

ఆమె పేరు సంతోషి. పేరుకు తగినట్లు నవ్వుతుండే మొహం ఆమెది. ఆమెకు ఈ రోజు పుట్టెడు దుఃఖం కలిగింది. సంతోషి భర్త ఎప్పట్లాగానే నిన్న రాత్రి దోస్తులతో కలిసి తాగడానికి వెళ్ళాడట. పొద్దున్నే శవమై కనిపించాడు. నిండా 35 సంవత్సరాలు లేని ఆమె ఇళ్ళలో పనిచేస్తూ ఇప్పటికే ఐదుగురు పిల్లలను పోషిస్తున్నది. నిత్యం సాధించి...వేధించే తాగుబోతు భర్త ఉన్నా లేనట్లే...అనిపిస్తుంది కానీ...సమాజంలో రక్షణ కోసం ఒక మగతోడు కావాలని సగటు స్త్రీ కోరుకుంటుంది కదా!

"అయ్యా...రాత్రి పోయిండు. దోస్తులే కొట్టి చంపారు," అని ఏడుస్తూ దీనంగా ఉదయాన్నే ఫోన్ చేసింది...సంతోషి. సమస్యలు ఉన్నప్పుడు ఏడుస్తూ కూర్చోవడం కాదు...కష్టపడి అధిగమించాలన్న జీవన సత్యాన్ని నిత్యం మాకు అందరికీ నేర్పేది ఆ పిచ్చి తల్లి. మా ఇంట్లో పని చేస్తుందామె.  
 సంతోషి భర్తను సంస్కరించాలని గతంలో నేను చేసిన ఒక ప్రయత్నం గుర్తుకు వచ్చింది. ఒక రోజు అతన్ని పిలిపించి...ఆరు నెలల పాత పేపర్లు ఇచ్చి...అమ్ముకు రమ్మన్నాను. అమ్ముకొస్తే...ఆ డబ్బు తనకే ఇచ్చి...'తాగుడు మాను బాబూ.." అని హితబోధ చేద్దామన్నది నా ప్లాన్. ఆ రోజు పేపర్లు కట్టకడుతున్నప్పుడు, తీసుకెడుతున్నప్పుడు చూసాను అతన్ని. అప్పటి నుంచి మళ్ళా కనిపించలేదు. 


"అమ్మా...సార్ పేపర్ల కట్ట ఇస్తే..ఒక ఎనిమిదొందల దాకా వచ్చింది. మొత్తం తాగుడుకు పెట్టాడు," అని సంతోషి చెప్పింది హేమకు. ఒక రెండు సార్లు తాగి కింద పడి దెబ్బలు తగిలించుకుంటే...ఆమె ఆసుపత్రిలో చేర్పించి సపర్యలు చేసింది. ఏ పని చేయకుండా....చిన్నా చితకా పని చేసినా...ఒక పైసా ఇంట్లో ఇవ్వకుండా...తాగి సంసారాలు గుల్ల చేసే వారు అడుగడుగునా ఉన్నారు. ఈ సారా మహమ్మారిపై మాత్రం ఇప్పుడు జరుగుతున్న స్థాయి ఉద్యమాలు రావడం లేదన్నదే బాధ.
ముగ్గురు పిల్లలు పుట్టాక....యాసిడ్ తాగి అక్క మరణిస్తే...ఆమె భర్తనే సంతోషికి కట్టబెట్టారు. ఆ మరణం అనుమానస్పదమైనది అయినా...వయస్సు అంతరం చాలా ఉన్నా...అక్క సంతానం కోసం సంతోషి పెద్దల నిర్ణయాన్ని శిరసావహించినట్లు హేమకు చెప్పింది.  తాగుడు వల్ల కలిగిన బాధలు విని మేము చాలా బాధ పడేవాళ్ళం కానీ...మాది నిస్సహాయ స్థితి.

తాగుడుకు బానిస అయిన వ్యక్తి వల్ల ఒక కుటుంబం...అందులోని భావి తరం సభ్యులు ఎలా బాధ పడతారో సంతోషి ఫ్యామిలీని చూస్తే అర్థమవుతుంది. తండ్రి డబ్బు ఇవ్వడు కాబట్టి...మొదటి భార్య కొడుకు తొమ్మిదో తరగతి చదువుతూ...ఉదయం పేపర్ వేస్తాడు, బడి నుంచి వచ్చాక ఒక కిరాణా షాప్ లో ఒక నాలుగు గంటలు పనిచేస్తాడు. పెళ్ళికి ఎదిగిన ఒక అమ్మాయి...ఒకరి ఇంట్లో ఒక వృద్ధురాలికి సేవ చేసేందుకు కుదిరింది. తండ్రి వల్ల వీళ్ళ చదువులు దెబ్బ తిన్నాయి. ఆ అమ్మాయికి హేమ అక్షరాల వరకు నేర్పింది...కానీ...అది సరిపోదు. ఇతర ముగ్గురు చిన్నారులకు దగ్గరలోని ప్రభుత్వ స్కూల్ లో సంతోషి చదువు చెప్పిస్తున్నది. ఏ రకంగా చూసినా...ఆమెది సంతోషం లేని జీవితం. ఈ కుటుంబం బాధ చూసి వీధిలో అందరికన్నా ఎక్కువ జీతం ఇస్తున్నది హేమ. సంసార బాధల్లో పడి కొన్ని రోజులు రాక పోయినా ఏమీ అనేది కాదు. ఇదంతా..సమస్యకు అసలు పరిష్కారం కాదు కదా!
        

రెక్కాడితే గానీ...డొక్కాడని సంతోషి లాంటి కుటుంబాలను ఈ సారాయి సర్వ నాశనం చేస్తుంది. ఆదాయం కోసం ప్రభుత్వం దీన్ని పెంచి పోషిస్తున్నది. ఎన్నికల అప్పుడు నేతలు మందు పంచి ఓటర్లను జోకొడతారు. లోక్ సత్తా మినహా ఒక్క రాజకీయ పార్టీ కూడా దీన్ని పెద్ద సమస్యగా చూడడం లేదు. అందరూ కావాలని మౌనం పాటిస్తున్నారు కానీ...ఈ మద్యం మన గ్రామీణ భారతాన్ని దారుణంగా దెబ్బ తీస్తున్నది. మన అభివృద్ధికి ఇది పెద్ద అవరోధం. దీన్ని పట్టించుకునే నాథుడేడీ?

7 comments:

kvramana said...

annayya
we know how some of the anti-liquor campaigns were carried out earlier. You and I witnessed it first hand. Personally, I feel there is no way you can solve this problem. Primarily, the government is dependent upon the liquor revenue. If those who can afford it are all over, the copy cats seeking cheap liquor, etc are natural. Will the government ever ban liquor? As long as there is higher class seeking this 'luxury', the middle and lower classes will anyway try to emulate them. God save people like Santoshi
Ramana

Indian Minerva said...

ఆ భర్తవల్ల తనకు తన కుటుంబానికీ ఎటువంటి ఉపయోగమూలేకపోగా ఒక అతని తాగుడు పెద్ద తలకాయనొప్పి అయినప్పుడు అతన్ని అతని తాగుడుకు వదిలి వచ్చేసి తన పిల్లల (అక్క పిల్లలవి కూడా) బాగోగులు తాను చూసుకొని వుండాల్సింది. ఇప్పుడుకూడా చనిపోయినతరువాతైనా అసలు బాధపడటమెందుకో నాకర్ధంకావట్లేదు.

Anonymous said...

I also agree with minerva.

JP said...

Lack of Spiritual knowledge is one of the primary reasons for all the problems living beings are facing.

మనకి అన్ని మంచి పవిత్రమయిన గ్రందాలు వున్నాయి ఆచరించేవారు తక్కువ.

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

మినర్వా గారూ, మీ ప్రశ్నకు సమాధానం మొదటి పేరాలోనే ఉంది.

>>>
నిత్యం సాధించి...వేధించే తాగుబోతు భర్త ఉన్నా లేనట్లే...అనిపిస్తుంది కానీ...సమాజంలో రక్షణ కోసం ఒక మగతోడు కావాలని సగటు స్త్రీ కోరుకుంటుంది కదా!
>>>

Anonymous said...

It is a routine story in our state and one has to pity the condition of the poor lady with so many children.It is the tolerance,sentiment of Indian woman that compels her to lead the life with a alcoholic.I come across many woman suffering like this woman but helpless as they cannot lead an independent life with personal earnings only.There are many woman's organisations,associations but they have no time to take up the cases of these helpless woman as they cannot get back anything by taking up such cases!
I feel the society must isolate and boycot the alcoholics and the people should not mingle with them in the society as long as they continue to harass physically and mentally their better halves and children.It is true that it is better to leave the husband who is an alcoholic but the future of the woman will be uncertain most of the times as very few women with children settle with another man.In such cases the only solution is to admit the alcoholic husbands in a deaddiction centre til he becomes normal.CAN ANY ONE GIVE ANY SOLUTION TO THIS MALADY OF THE SOCIETY?

JP Reddy.

Indian Minerva said...

ఏంటో ఈ మగతోడు? ఇంటి ధ్యాస పట్టకుండా కల్లుదుకాణాల దిరిగే వ్యక్తిపై మగతోడు కోసమైనా ఆధార పడొచ్చునంటారా? మరి అలాంటి మగాడు ఎన్ని విధాలుగా రక్షణ కల్పించగలడు? ఎవరికి ఆ రక్షణ అవసరం? తను గనుక చెయ్యల్సిన పని ఎప్పుడో చేసుంటే బుధ్ధి మారి ఆ మగాడే తిరిగిచ్చుండేవాడు లేకుంటే కొద్దిగానైనా పెరిగిన తన స్థాయి తనకు రక్షణ కల్పించి వుండేది. భర్త ఎలాంటివాడైనా సేవలుచేసి తరించదం ఈ కాలానికి సరిపడదు. ఇప్పటి సరైనదల్లా భర్తను మార్చడం లేదా తనదారి తను చూసుకోవడం.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి