Friday, February 10, 2012

కిరాతకపు టీచర్లారా...మా పూవులను చిదిమేస్తారా?

చిన్నప్పుడు స్కూల్లో ఇంగ్లిషు, లెక్కల టీచర్ల వల్ల నేను ఎంత నరకం అనుభవించానో, జీవితంలో ఎంత కోల్పోయానో....నిన్న చెన్నై లో స్కూలు క్లాసు గదిలో ఒక స్టూడెంట్ చేతిలో హత్యకు గురైన టీచర్ ఉదంతం గురించి పేపర్లో చదువుతుంటే గుర్తుకువచ్చాయి. పిల్లల జీవితంలో టీచర్లు, సార్ల కున్న ప్రాధాన్యాన్ని సమాజం, జనం సరిగా గుర్తించలేదని, ఇది మున్ముందు మరిన్ని ప్రమాదాలు తేబోతున్నదని నాకు గట్టిగా అనిపిస్తున్నది.

నేను ఖమ్మం జిల్లా రెబ్బవరం గ్రామంలో ఏడో తరగతి దాకా, తర్వాత వైరాలో పది దాకా చదివాను. మా ఇంగ్లిషు సారు పేరు పాండురంగారావు గారు. రెబ్బవరం పక్కనే ఉన్న మా అమ్మమ్మ గారి ఊరు గొల్లపూడి నుంచి వచ్చి ఆయన పాఠాలు చెప్పేవారు. తమ గ్రామంలో పోలీస్ పటేల్ గా పనిచేసి చనిపోయిన మా తాతయ్య గారంటే ఆయనకు ఎందుకో గౌరవం, కోపం ఉండేవి. నాకు తెలిసి మా తాతకు మంచి పేరుంది. జనాలు పోలీసుల జులుంకు గురికాకుండా, పేదల పట్ల సానుభూతితో ఉండేవారు. రజాకార్లు దాడికి వస్తున్నారని తెలిసి పొరుగున ఉన్న కృష్ణా జిల్లాకు వెళ్లి తలదాచుకున్నారు.


నాకు చిన్నప్పుడు రెబ్బవరంలో ట్యూషన్ చెప్పిన కుసుమ మేడమ్ వల్ల ఇంగ్లిషు పట్ల చాలా ఆసక్తి ఉండేది. ఈ పాండురంగారావు చేతిలో పడిన తర్వాత నా బతుకు బస్టాండయింది. దరిద్రుడు రోజూ క్లాసులో తిట్టే వాడు. మా తాత ప్రస్తావన తెచ్చేవాడు. వాడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే చెయ్యిని దొప్ప లాగా ముడిచి ఒంగబెట్టి వీపు మీద  కొట్టేవాడు....చాలా కసిగా. అందుకే వాడికి "దొప్పడ రంగారావు" అని పిల్లలు ముద్దుపేరు పెట్టారు. శ్రద్ధగా పాఠం విననిచ్చేవాడు కాదు, మధ్యలో దేని గురించి అడిగి కొడతాడో అని వణికి చచ్చేవాడిని. పైగా ఒక క్రీడాకారుడిగా, మంచి స్పీకర్ గా, నటుడిగా ఒక గుర్తింపు ఉన్న నాకు దప్పడ రంగారావు ధోరణి అస్సలు మింగుడుపడేది కాదు. అందుకే సాధ్యమైనంత మేర వాడి క్లాసు ఎగ్గొట్టే వాడిని. దాంతో ఇంగ్లిషు చంకనాకి పోయింది, నేను బేవార్సుగా మిగిలాను కొత్తగూడెంలో ఒక మిత్రుడు దొరికేవరకూ.

చెన్నైలో పిల్లవాడు టీచర్ మీద చేసిన అఘాయిత్యం దప్పడ రంగారావు మీద చేయాలని నేను చాలా సార్లు అనుకున్నాను. వాడి వల్ల నా జీవితం దెబ్బతింటున్నదని నాకు అపుడే తెలుసు. చాలా సార్లు ఫిర్యాదు చేసినా ఇంట్లో వాళ్లు  పెద్దగా పట్టించుకోలేదు. అందుకే, వాడు స్కూటర్ మీద వైరా నుంచి గొల్లపూడి వెళుతున్నపుడు మధ్యలో రోడ్డుకు అటూ ఇటూ ఉన్న రెండు చెట్లకు కనిపించని ఒక వైరొకటి అడ్డంగా కట్టి దానికి తట్టుకుని వాడుపడిపోగానే తల మీద పెద్ద బండరాయి వేసి చంపి...మర్నాడు ఏమీ తెలియని వాడిలా స్కూలుకు వెళ్లాలని నాకు చాలా సార్లు అనిపించింది. అప్పట్లో వచ్చిన ఏదో సినిమాలో ఒక హత్య అలాగే జరిగింది మరి. అదీ మరీ బాగోలేదు కాబట్టి, వాడి బండి టైరుకు దబ్బనంతో పంక్చర్ చేసి వాడిని ఇబ్బంది పెట్టాలని అనిపించేది కానీ దొరికితే పరువుపోతుందని, శిక్ష పడుతుందని ఆగిపోయాను. ఒక టీచర్ నా జీవితాన్ని మార్చేశాడు. నేను ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టింది.

ఇంకొక నికృష్టపు సారు రెబ్బవరం ప్రభుత్వ పాఠశాలలో లెక్కల సారు సోమనర్సయ్య గారు. వాడికి కోపం వస్తే జస్టర్ ముండా కొడకా అని తిట్టే వాడు. నేను పశువుల డాక్టర్ గారి అబ్బాయిని కాబట్టి, క్లాసు ఫస్టు కాబట్టి నాకు పెద్దగా తిట్లు గట్రా ఉండేవి కావు. కానీ ఆ సారు దగ్గరు ఒక తుపాకీ ఉండేది. సాయంత్రం కాగానే ఒకరిద్దరు స్టూడెంట్స్ ను తీసుకుని బైటికి వెళ్లే వాడు. ఆయన పిట్టలను గురిచూసి కాల్చితే...చచ్చి కిందపడిన పిట్టలను ఏరుకు రావడం ఆ పిల్లల పని. నన్ను ఒక రోజు తీసుకువెళ్లిన గుర్తు. ఆ రోజంతా నేను నిద్రపోలేకపోయాను. సారు వారి ఈ మారణకాండను ఆపే వారెవరూ లేరా అని చాలా బాధపడేవాడిని. ఎందుకో మా నాన్నకు తెలిసినా దాన్ని పట్టించుకోలేదు. 


ఇదిలా ఉండగా, మా రెబ్బవరం గ్రామానికి రేషన్ షాపు మా అమ్మమ్మ గారి ఊరైన గొల్లపూడిలో ఉండేది. రేషన్ కార్డు మీద పంచదార తెచ్చేపని (ఆరో తరగతిలో అనుకుంటా) నాకు అప్పగించాడాయన. రేషన్ కార్డు, డబ్బు చెల్లింపు బాధ్యత నాది. మోసే బాధ్యత చాకలి వెంకటేశ్వర్లు ది (పాపం...వాళ్లు బట్టలు ఉతుకుతారు కాబట్టి ఆ పేరుతోనే వాడిని పిలిచేవారు).
కాల్వగట్టు మీద పొలాల మధ్య గుండా ఒక రెండు మూడు కిలోమీటర్లు నడిచివెళ్లి చక్కెర తెచ్చే బాధ్యత మా ఇద్దరిదీ. దరిద్రుడు...స్కూలు టైమ్ లోనే ఆ పనికి పంపాడు. అంతా బాగానే అయింది కానీ ఇంకాసేపటికి సార్ ఇంటికి వస్తామనగా మా వెంకటేశ్వర్లు నెత్తిమీద ఉన్న చక్కెర సంచీ జారి కిందపడింది. అపుడు వెంకటేశ్వర్లు పడిన కంగారు, వాడి మొహంలో వెర్రిభయం నాకు ఇప్పటికీ గుర్తు. "భయపడకు...ఇది నీ ఒక్కడి తప్పు కింద కాకుండా ఇద్దరం కలిసి చేసిన తప్పుగా చెబుదామ"ని ఒకసారి అసలు "ఇది కింద పడ్డట్టే చెప్పకుండా ఉంటే పోలా" అని మరొకసారి అనుకున్నాం. ప్లాన్ బీ అమలు చేయడంలో భాగంగా కింద పడిన చక్కెరను జాగ్రత్తగా సంచీలోకి ఎత్తాం. దాన్ని సార్ ఇంటికి చేర్చి స్కూలుకు పోయాం. 


అప్పుడు సారు మా క్లాసులో ఉన్నారు. చక్కెర తెచ్చామన్న విషయం చెప్పగానే..."వెరీ గుడ్...చూడండ్రా వీళ్లు చెప్పిన పని జాగ్రత్తగా చేసుకొచ్చారు...డాక్టర్ గారి అబ్బాయి చాకు..." అని సారు కితాబు ఇవ్వగా నేనూ వెంకటేశ్వర్లు ఒకరి మొహం ఒకరం బెరుకు బెరుగ్గా చూసుకున్నదీ నాకు ఇప్పటికీ గుర్తే.
సరే...క్లాసు అయింది. సార్ ఇంటికి వెళ్లాడు. చక్కెర రంగు తేడా ఉండటంతో విషయం కనిపెట్టాడు. మర్నాడు...క్లాసుకు రాగానే..."ఏర్రా...ఆ జెస్టర్ ముండాకొడుకుల"ని మా గురించి వాకబు చేశాడు. సార్ కనుక్కోలేదని గట్టిగా నమ్మి క్లాసుకు వచ్చిన మేము అణుబాంబు మీద పడినట్టు ఉలిక్కిపడి...లేచి తప్పు ఒప్పుకున్నాం. ఒప్పందం ప్రకారం...తప్పు ఇద్దరిదీ అని చెప్పాం. ఇక ఆ రోజు నుంచి క్లాసులో నరకం ప్రారంభమయింది. రోజూ...జెస్టర్ ముండాకొడుకులంటూ తిట్టి పాఠం మొదలు పెట్టేవాడు కఠినాత్ముడు. ఈ అవమానం భరించలేక నేనూ వెంకటేశ్వర్లు...లెక్కల క్లాసు ఎగ్గొట్టి ఊరికి దగ్గర్లో రోడ్డుపక్క చెట్ల మీద గిన్నెకాయలు రాళ్లతో కొట్టి తినేవాళ్లం. అలా లెక్కలూ మఠాష్. నేను పదో తరగతి లెక్కల సబ్జెక్టులో ఎలా పాసయ్యానో చెబితే మీరు ఆశ్యర్యపోతారు.
 డాక్టర్ కావాలని మా అమ్మ కన్న కలలు, అయితీరతానని చిన్నపుడు నేనిచ్చిన మాట...ఈ దరిద్రుల వల్ల సఫలం కాలేదని నా నమ్మకం. లెక్కల్లో వీక్ అయి పోవడంతో మిగిలిన సబ్జెక్టులూ గుండె ధైర్యంతో చేయలేక...ఎంసెట్ లో కొన్ని వేల ర్యాంకులు వచ్చి సీటు రాకుండా పోయింది.
ఈ విధంగా స్కూలు టీచర్ల ప్రభావంతో ఎంతో కోల్పోయిన నేను కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నాను.


1) నా కూతురు, కొడుకుతో టీచర్ల గురించి వాకబు చేస్తాను. ఎవరైనా హర్ట్ చేస్తుంటే వెంటనే స్పందిస్తాను. నల్గొండలో ఒక తెలుగు సారు మా అమ్మాయిని కొడితే చెయ్యి వాచింది. నేను స్కూలుకు వెళ్లి వాడికిచ్చిన డోసు వాడికి జీవితంలో గుర్తుంటుంది. వాడి చెంప పగలగొట్టబోయి తమాయించుకుని ఆగాను...మనసు గట్టిగా చెప్పడంతో. ఇంకెవర్నీ కొట్టవద్దని వాడిని ప్రాధేయపడుతూ...ఒక గంట పాటు నేను ఏడిస్తే ప్రిన్సిపాల్ కంగారుపడ్డాడు. అలాగే ఆటల కారణంగా ఫిదెల్ అప్పుడప్పుడూ మాత్రమే స్కూలుకు వెళ్లాడా మధ్యన. ఒక టీచర్ "నువ్వేమైనా వీ.ఐ.పీ.వా..." అని అడిగి కించపరచడం మొదలు పెట్టింది. ఆమెనూ జాగ్రత్తగా సెట్ చేశాను. మొన్నటికి మొన్న నా స్నేహితుడి కొడుకును లెక్కల టీచర్ కొడితే...గౌతమ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కు ఫోన్ చేసి..పేపర్ వాళ్లు మీ టీచర్ కిరాతకత్వం గురించి అడుగుతున్నారని అబద్ధంతో బెదిరించాను
2) దాదాపు ట్రబుల్ సమ్ టీచర్లందరినీ కలిసి...నాకు మార్కులు వద్దనీ, మా పిల్లలకు జీవితపు విలవలు నేర్పండనీ, సృజనాత్మకతను చంపవద్దని చాలా పకడ్బందీగా చెప్పివస్తాను. మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే...అటు టీచర్ హర్ట్ కాకుండా, ఇటు మన వార్డ్ బలికాకుండా ఉండాలి. చాలా కసరత్తు అవసరం.

3) గురుదేవో భవ..., దండం దశగుణం భవేత్..అనే సొల్లు సామెతలు నమ్మకండి. ఇవి కలికాలానికి అతకని మాటలు. ఎవరైనా సార్ లేదా టీచర్ పిల్లల మీద చేయి చేసుకుంటే వెంటనే స్పందించండి. కంప్లయింట్ చేయడం వల్ల మిగిలిన టీచర్లు గ్యాంగప్ అవుతారు కాబట్టి స్వయంగా వెళ్లి నేరుగా ఆ కిరాతకులతోనే మాట్టాడటం ఉత్తమం
4)  హత్యలు, ఆత్మ హత్యలు వాటిలో రకాల గురించి మన టీవీలూ ఛానళ్లు పదేళ్ల వయస్సు దాటిని ప్రతొక్కరికీ నేర్పాయి. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు కాబట్టి...పిల్లల ప్రవర్తనను జాగ్రత్తగా గమనించాలి. పిల్లలు బాగా డిస్ట్రబ్డ్ గా అనిపిస్తే...ఆ రోజు స్కూలు మాన్పించటం ఉత్తమం. పిల్లలు హాయిగా ఇంట్లో ఉండి నిద్రపోతే ఎంతో రిఫ్రష్ అవుతారు. మనతో మనసు విప్పి మాట్టాడతారు.


5) స్కూలుకు పోతేనే చదువు వస్తుందని అనుకోవడం మన మూర్ఖత్వం. తల్లో తండ్రో జాగ్రత్తగా పాఠాలు చెప్పినా చాలు. లేదా కథలు చెప్పినా పర్వాలేదు. 

6) బందులు జరగాలి మళ్లీ మళ్లీ...అని పిల్లలు అనుకుంటున్నారంటే వారి మీద ఏదో ఒత్తిడి పనిచేస్తున్నదనే అర్ధం. ఒక ఫ్రెండ్ లా వారితో మాట్టాడితే...వాళ్లు ఎన్నో చక్కని విషయాలు చెబుతారు. చదువు ప్రాధాన్యం చెబుతూనే వారు ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం ఇవ్వాళ ప్రతి పేరెంట్ విధి.
 7) టీచర్లారా...మీ  వ్యక్తిగత జీవితంలో కంగాళీతనంతో వచ్చిన నిస్పృహను పిల్లల మీద తీర్చుకోవాలని అనుకోకండి. A tap on their back works wonders. 


ఇప్పటికే ఓవరయింది. ఉంటాను. చెన్నైలో టీచర్ ను కిరాతకంగా చంపిన పిల్లవాడిని కలిసి కాసేపు మాట్టాడాలని నా మనస్సు కోరుకుంటోంది. బిడ్డడు...ఎంత నిస్పృహతో ఆ పనిచేశాడో కదా! 

30 comments:

సుజాత said...

hmmm! other side of the coin!!

సుజాత said...

But...some more to say.....

ఎంత శిక్షించిన టీచర్లనైనా సరే మీరు వాడు, వీడు దరిద్రుడు అనడం నాకు జీర్ణం కావడం లేదు!

ఇప్పటి పిల్లల మీద, మీడియా, సినిమా, ఇంటర్నెట్ వీటన్నింటి ప్రభావం ఉంటుందనుకోండి! అయితే మాత్రం చంపేయడమేనా?

చిన్నప్పుడు మాక్కూడా కొట్టే టీచర్లు, కఠినులైన టీచర్లు ఉండేవాళ్ళే! చేతులు వెనక్కు తిప్పి స్కేలు తో కొట్టేవాళ్లు లెక్కల మాష్టార్లు! అప్పట్లో చచ్చేంత నొప్పి, దానికంటే అవమానం బాధించేవి. ఇప్పుడు గుర్తొస్తే నవ్వొస్తుంది తప్ప చంపేంత కసి ఎప్పుడూ కలగలేదు.

టీచర్ తన మీద చూపే వివక్ష వాడు తల్లిదండ్రులతో చెప్పే ఉంటాడు. నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న వాళ్లను ఏం చెయ్యాలి? వాళ్లు సరిగ్గా పట్టించుకుని టీచర్ తోనూ, పిల్లాడితోనూ, ఉమ్మడిగానూ మాట్లాడి ఉంటే రెండు జీవితాలు నాశనమయ్యేవా?

ఆ.సౌమ్య said...

ఆ పిల్లాడు అలా చేసాడంటే దానికి సగం బాధ్యత వాడి తల్లిదండ్రులు, మిగతా సగం బాధ్యత టీచర్లు వహించాల్సిందే.

వాడి మానసిక పరిస్థితిని, బాధను గమనించని తల్లిదండ్రులే ఎక్కువ బాధ్యత వహించవలసి వస్తుందేమో!

ఏది ఏమైనా ఛంపేంత కోపం వాడిలో ఉండేలా తయారవ్వడం, టీచరు చనిపోవడం చాలా బాధాకరం.

వసంతం.నెట్ said...

మీ ఉద్దేశం ఇప్పుడు ఆ తమిళ్ టీచర్ చాలా తప్పుచేసినట్టు, పిల్లవాడిది ఏ తప్పు లేనట్టుగా ఉంది.ఇది ఎంతవరకు సమర్ధనీయం !!!మీకు,నాకు ఇద్దరికీ వాస్తవంగా ఏమిజరిగిందనేది తెలియదు? అవునా, కాని మీరు మీ వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలను ఆదారం చేసికుని తప్పు టీచర్లదే అన్నట్టు తీర్మానించడమే విడ్డూరంగా ఉంది.అది మీ నుంచి రావడమే...ప్చ్. ఇంతకీ నేను టీచర్ని కాదండోయ్ !

Ramu S said...

సుజాత గారూ...
రాసిన తర్వాత నేనూ అనుకున్నాను వాడూ వీడూ దరిద్రుడూ గురించి. కానీ అవెందుకో తీసేయ బుద్ధి కాలేదు. అవి జరిగి పాతిక ముప్ఫై ఏళ్లయినా నాలో ఇంకా ఆ కసి ఉండటం నాకే ఆశ్యర్యం కలిగింది. ఆ కసిని తీసేసి గారూ, గీరూ అని కృతకంగా రాయడం ఆత్మవంచన కాగలదేమో అనిపించింది. ఇన్నాళ్లూ మనసులో అభిప్రాయాలు ఉన్నవి ఉన్నట్లు రాసి...ఇప్పుడు సంఘ మర్యాద కోసం ఈ నీచ నికృష్ణ దౌర్భాగ్యులకు మర్యాద ఇవ్వడం నాకు తగదని, అది మిమ్మల్ని మోసం చేయడమేనని అనిపించింది. పిల్లలను కొట్టి తిట్టి అవమానించి కించపరిచే ఏ టీచరూ మర్యాదకు అర్హుడు కాడని నేను నమ్ముతున్నాను.
రాము

Ramu S said...

వసంతం గారూ...
ఈ హత్యను నేను సమర్ధించడం లేదు. నా సంఘటనల ఆధారంగా టీచర్లంతా ఇంతే అని నేను చెప్పడం లేదు. మనకు గుర్తుండిపోయే మంచి టీచర్లు కచ్చితంగా ఉంటారు. గతంలో మనం అనుకున్నట్టు ఏదీ బ్లాంకెట్ స్టేట్ మెంట్ లా ఇచ్చేయలేం. కానీ నా పరిశీలనలో తేలింది ఏమిటంటే..వ్యవస్థ, కొందరు (మెజారిటీ) టీచర్లు...పిల్లలను దారుణంగా ఒత్తిడికి గురిచేస్తున్నారు. అపార్ధం చేసుకోకండి.
రాము

SHANKAR.S said...

రాము గారూ ముందుగా మీరు గురువులను సంబోధించిన తీరు నాకు నచ్చలేదు.ఆ వయసులో శిక్షించే గురువులపై కోపం, భయం ఉండటం సహజం. క్రమంగా మనకి మెచ్యూరిటీ వచ్చేకొద్దీ అది గౌరవంగా మారుతుందని నా అభిప్రాయం.

సరే ఆ విషయం పక్కనపెట్టి టీచర్లు అందరూ మంచి వాళ్ళే అని నేను అనను కానీ ఇలాంటి సంఘటనలలో తల్లిదండ్రుల పాత్ర లేదంటారా? ఒక్కప్పుడు గోడకుర్చీ వేయించడం, బెత్తంతో తట్లు తేలేలా కొట్టడం చేసేవారు. మరీ రక్తాలు కారేలా కొడితే తప్ప తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకునే వారు కాదు. మరి ఇప్పుడు? గట్టిగా మందలిస్తేనే స్కూళ్ళ మీద దండయాత్రలకి దిగుతున్నారు.

అసలు స్కూళ్ళలో జరిగే ప్రతి చిన్న విషయానికీ అతిగా స్పందించే మీడియా కూడా ఇందుకు ఒక కారణమేమో అని నా అభిప్రాయం. హోం వర్క్ చేయలేదని స్టూడెంట్ కి పనిష్మెంట్ ఇచ్చినా దాన్నో బ్రేకింగ్ న్యూస్ చేసేస్తూ టీచర్లు ఎలాంటి పరిస్థితులలోనూ విద్యార్ధులకి పనిష్మెంట్ ఇవ్వకూడదూ, పొరపాట్న ఇచ్చినా అది నేరం, ఘోరం, చట్ట విరుద్ధం లాంటి ఇంప్రెషన్ సమాజంలో కలిగిస్తున్నది మీడియాయేనేమో అనిపిస్తుంది.మీరేమంటారు??

వసంతం.నెట్ said...

నేను 100% సౌమ్య గారితో ఏకీభవిస్తున్నాను.మీరు గౌరవనీయ వృత్తిలో ఉన్నవారిని ఇలా వ్యక్తిగతంగా పేర్లతో సహా చెబుతూ తిడుతూ మీ కసిని ఇలా బ్లాగురూపంలో వెలువరిచడం, విలువల గురించి మాట్లాడే మీలాంటి విజ్ఞులకి తగదేమో ఆలోచించుకోవాలి.

karthik said...

టీచరైనా ఎవరైనా తనకు కరెక్ట్ అనిపించిన పద్దతిలో పిల్లలకు పాఠాలు నేర్పించడానికి ప్రయత్నిస్తారు.. అందరూ పిల్లలు/టీచర్లు ఒకలాగే ఉండరు కనుక ఇలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగుతుంటాయి.. మీరు మీ పిల్లల విషయం లో చూపిస్తున్న శ్రద్ధ అభినందనీయం.
కానీ మీరిలా మీ టీచర్లని కించపరచడం మీ స్థాయికి తగలేదు. వాళ్ళకు చేతనైన పద్దతిలో చదువు చెప్పడానికి ప్రయత్నించారు. అది మీ విషయం లో వర్కౌట్ అవలేదు. మీరు బాగా హర్ట్ అయ్యారు. అగ్రీడ్!! కానీ జీవితంలో ఎంతోమంది మనల్ని అదేపనిగా కావాలని హర్ట్ చేస్తునారు.. వాళ్ళతో పోల్చుకుంటే ఆ టీచర్లు చేసింది ఎంత?? Cant you forgive them and move on??

one suggestion about your vadu-vadu verbatim about teahcers: Many around look upto you and such verbatim only reduces their respect towards you.

Ramu S said...

డియర్ సర్...
అలాగని నన్ను కొట్టని, గోడకుర్చీ వేయించని టీచర్లు లేరని కాదు. వారిని నేను పెద్దగా ద్వేషించడం లేదు. వారి చర్యలు పెద్దగా గుర్తు కూడా లేదు. వీరు గుర్తుకు రావడానికి కారణం...వారి విపరీత పోకడలు. వీరి గురించే రాయడానికి కారణం నాకు ఒక్కడికే నష్టం కలిగించారని కాదు. వీరివల్ల చాలా మంది నష్టపోయారు. ఇలాంటి వారికి మర్యాద ఇవ్వవలసిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేక, వీరిని ఒట్టి పేర్లతోనో, గారు తగిలించో రాయడం నాకు ఆత్మవంచన అవుతుంది. ఈ ఇద్దరు టీచర్ల వల్ల నేను, నా మిత్రులూ చాలా దారుణంగా నష్టపోయాం కాబట్టి ఇలా రాశాను. మీరిలా బాధపడకండి...ప్లీజ్.

రాము

buddha murali said...

ఈ విషయం పై నిన్న ndtv లో మంచి చర్చ జరిగింది. మన తెలుగు చానల్స్ కు ఎందుకో కానీ ఇది చర్చించాల్సిన పెద్ద విషయం అనిపించలేదు. మన కార్పోరేట్ జూనియర్ కాలేజీల్లో ఏట ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు చాలానే జరుగుతున్నాయి. వీటికి మరో రూపమే చెన్నై లో జరిగింది

Ramu S said...

అవును మురళి గారూ...
ఒక ప్రముఖ ఎడిటర్ నాతో ఈ మధ్యన చెప్పిన ఒక మాట ఆశ్చర్యానికి గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఏడాదికి కనీసం పాతికమంది విద్యార్ధులు కార్పొరేట్ కాలేజీల్లో ఆత్మహత్య చేసుకుంటున్నారట. కానీ అవి పత్రికలలో రావట. ఎందుకంటే...ఈ కాలేజీలు సాలుకు పది, పదిహేను కోట్ల రూపాయల మేర ప్రకటనలు ఇస్తాయట. వాటి పేర్లు రాస్తే అడ్వర్ టైజ్ మెంట్లు ఆగిపోతాయని భయం. అదీ పరిస్థితి.
రాము

supraja said...

The kid who has stabbed his teacher to death might be psychologically unstable with overdose of aggressive mentality.Cannot agree with your views.
The poor performance by you in mathematics in your school days may not be just because of your sadistic teacher,as majority of students in our country are not accessible to good teachers,irrespective of the subject in question.However they are able to still make it.
It might also be possible that you are just a dumb ass to grasp the essence of subject.
"Pani raani vadrangi pani mutlani thittinattundi mee varasa"...

వసంతం.నెట్ said...

చూసారా ప్రతిఒక్కరు మీరు టీచర్లని నిందించిన వైనం గురించి ఎలా ఎత్తిచూపిస్తున్నారో.మీరు దారుణంగా తిట్టడమే నాకు ఆశ్చర్యం కలిగిస్తే, ఇంకా మీరు మీ వ్యాఖ్యానాలని సమర్ధించుకోవటమే మరింత శోచనీయం.

మీ వాదన ప్రకారం చూస్తే "కసబ్"గాడికి కూడా తను చేసింది సబబే అనిపిస్తుంది.మీరు మీడియాలో పనిచేస్తున్నారు కాబట్టి దేన్నైనా,ఎలాగైనా సమర్ధించుకోవచ్చు అని గట్టిగా నమ్ముతూ ఆచరణలో కూడా చూపిస్తున్నారు.

SHANKAR.S said...

రాము గారూ మీరు నేను చెప్పినదాంట్లో మొదటి పేరాకే జవాబిచ్చారు తప్ప నేను లేవనెత్తిన మిగిలిన ప్రశ్నల గురించి మీ అభిప్రాయం చెప్పలేదు. వాటి మీద మీ స్పందన తెలియజేస్తారని ఆశిస్తున్నాను.

మైత్రేయి said...

పొట్ట కూటి కోసం ఉద్యోగాలు చేస్తూ, బాగాడబ్బులు దొబ్బి కొద్ది చిల్లర వీళ్ళ మొహాన కొడుతున్న యాజమాన్యం నుండి, పెంపకం లోపంతో, రక రకాల సామాజిక కారణాల వల్ల పిల్లల్లా ప్రవర్తించనని పిల్లల్తో అంతులేని ప్రెషర్ అనుభవిస్తున్న టీచర్లనా మీరు ఇలా తిడుతున్నారు? ప్రవేట్ కాలేజీల్లో, స్కూళ్ళలో టీచర్ల పరిస్థితులు ఎప్పుడైనా చూసారా? మార్కులు మంచిగా రాకపోతే డబ్బులు పోసామని తల్లి దండ్రులు తిడతారు. చెప్తే పిల్లలు చంపుతారు వాళ్ళ గతి ఏమిటి?
అసలు జరిగిన విషయం పూర్తిగా చదివారా? ఆ టీచరు పిల్లవాడి ని కొట్టలేదు, తిట్టలేదు. వాళ్ళ నాన్నకు చెప్పింది. స్పెషల్ క్లాసు పెట్టి ఖాళీ టైమ్ లో వాడికి పాఠం చెప్పటానికి సిద్ధ పడింది. సంవత్సరంలో ఏ పదిరోజులో కూర్చుండే సభలోనే కుదురుగా కూర్చోలేని పెద్దలుంటే ఈ పిచ్చిది ఏవడో కని దేశానికి ఒదిలేసిన పిల్లాడ్ని బాగుచెయ్యాలనికొని తాపత్రయ పడింది.
కత్తులు కటారులు హత్యలు, రక్తాలు మామూలు విషయాలు గా చూపించే మీ మీడియా నే అసలు దోషి. ఇవన్నీ పిల్లలకు అందకుండా చెయ్యలేని తల్లిదండ్రులు దోషులు.

Ramu S said...

శంకర్ గారూ...
మీడియా దాని అవసరాలను బట్టి ప్రవర్తిస్తుంటుంది. మునుపటి వారం...టీచర్ల మీద స్టోరీ చేయడం వల్ల టీ ఆర్ పీ రేటింగ్ పెరిగితే ఈ సారి కూడా మరో స్టోరీ వేస్తారు. మీడియా గురించి మాట్టాడుకోవడం అనవసరం ఇలాంటి విషయాలలో. తల్లిదండ్రులంతూ ముకుమ్మడిగా మీరు చెబుతున్నట్లు ప్రవర్తిస్తారని నేను అనుకోను. మన తండ్రుల తరం, మన తరం మధ్య సున్నితత్వంలో తేడా ఉందేమో?

నోట్**అయ్యలారా, అమ్మలారా, ఈ పోస్టు మీద మీ అభిప్రాయలు రాయాలనిపిస్తే రాయండి. అంతే తప్ప నన్ను సంస్కరించడానికో, నా ధోరణిని తప్పు పట్టడానికో కామెంట్లు రాయకండి. అది మీకు, నాకూ టైం వేస్ట్.
రాము

Ramu S said...

మైత్రేయి గారూ..
టీచర్లను అందరినీ నేను అనడం లేదు. కిరాతకపు టీచర్లను మాత్రమే అంటున్నాను. అదే హెడ్డింగులో చెప్పాను. మీరు చెప్పిన దానితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మీడియా పాత్రను ముందుగా తప్పుపట్టాలి.
ఆ పిల్లవాడు టీచర్ ను చంపడం తప్పే. మనం దాన్ని ఖండించాల్సిందే.
రాము

प्रवीण् शर्मा said...

చాలా రోజుల క్రితం తెలుగు బ్లాగులలో జరిగిన చర్చ ఇది. మన రాష్ట్రంలోని ఒక పాఠశాలలో తెలుగు మాట్లాడే పిల్లల మెడలో "I am a telugu donkey" అని బోర్డ్ పెట్టించేవారని శిరీష్ కుమార్ గారు చెపితే నేను నమ్మలేదు. ఒకవేళ అతను చెప్పినది నిజమైతే అది హైదరాబాద్‌లో జరిగి ఉంటుందని అనుకున్నాను. శిరీష్ గారు ఇంకో రచయిత వ్రాసిన వ్యాసాన్ని పేస్ట్ చేశారు. అది చూస్తే అలా జరిగినది నెల్లూరులోనని తెలిసింది. రైల్వే పోలీసులు దొంగల మెడలో పలకలు పెట్టి ఫొటోలు తీసి వాటిని స్టేషన్‌లలో పెడతారు. ఒక పలక మీద "ఇతను సూట్‌కేస్‌ల దొంగ" అని వ్రాసి ఉంటుంది, ఇంకో పలక మీద "ఈమె జేబు దొంగ" అని వ్రాసి ఉంటుంది. స్కూల్‌లలో పిల్లల మెడలకి పెట్టే బోర్డ్‌ల మీద గాడిద అనో, కుక్క అనో వ్రాసి ఉంటుంది. పిల్లలకి చదువు చెప్పే పద్దతి ఇదేనా అని సందేహం వస్తుంది.

Raj said...

"చెన్నైలో టీచర్ ను కిరాతకంగా చంపిన పిల్లవాడిని కలిసి కాసేపు మాట్టాడాలని నా మనస్సు కోరుకుంటోంది. బిడ్డడు...ఎంత నిస్పృహతో ఆ పనిచేశాడో కదా! " - This is not really expected from you...he is a killer..ఇది ఏదో ఆవేశంలో చేసాడని నేను అనుకోవడం లేదు..పక్కా planning తో చేసాడు..I strongly condemn this act..Parents are responsible for his psychic behavior and killer instinct..

త్రివిక్రమ్ Trivikram said...

"హత్యలు, ఆత్మ హత్యలు వాటిలో రకాల గురించి మన టీవీలూ ఛానళ్లు పదేళ్ల వయస్సు దాటిని ప్రతొక్కరికీ నేర్పాయి."

ఆ అబ్బాయికి కూడా హత్య చేయాలనే ఆలోచన ఒక సినిమా చూశాకే వచ్చిందట! "During questioning by police, the boy said he had recently seen the Hindi movie Agneepath and was influenced by the hero who takes revenge on those who falsely implicate his father."

http://www.thehindu.com/todays-paper/tp-national/article2877172.ece

Uday Kumar said...

ఈ బ్లాగ్ రచయిత ధైర్యం గా తన అభిప్రాయం చెప్పిన తీరు అభినందనీయం. పిల్లలో జరిగే మానసిక సంఘర్షణ ని ఎవరూ ఎలా తగ్గించాలో ప్రయత్నించడం లేదు. తల్లిదండ్రుల పోటీ వలన, అనేక పాఠశాలలమధ్య ఆధిపత్య లేదా మనుగడ కోసం జరిగే పోరు వలన మార్కులొకటే ప్రతిభా మారకాలుగా మారడం వలన పిల్లల్ల మీద, ఉపాధ్యాయులమీద, తల్లిదండ్రుల మీద సంస్థల నిర్వాహకులమీద చివరికి సమాజం మీద తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది. ఇలాంటి సంఘటనల వలన ఎక్కువ కోల్పోయే వాళ్ళు తల్లిదండ్రులే.... ఆ అబ్బాయి తల్లిదండ్రులు సంఘంలో ఎటువంటి ఒత్తిడి ప్రస్తుతం ఎదుర్కుంటున్నారో ఆలోచిస్తే చాలా బాధ కలుగుతుంది. ఒకర్ని దూషించే బదులు తల్లిదండ్రులే పిల్లలతో తరుచూ మాట్లాడటం ద్వారా వారి మనసులోని భయాందోళనలను తగ్గించాలి. ఎమైనా ఇక్కడ ఒక ఉపయుక్తమైన చర్చకు కార్అణమైన రచయిత అభినందనీయుడు ఆయన బాష ... మా ఉపాధ్యాయుల పట్ల ఆయన వాడిన పదజాలాలను అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాను..

Ramu S said...

ఉదయ్ కుమార్ గారూ...
నా బాధ అర్ధం చేసుకున్నందుకు మీకు థాంక్స్. ఇక్కడ నేను వాడిన సో కాల్డ్ దూషణ సంబంధ పదాలు కిరాతకపు టీచర్లను ఉద్దేశించినవి మాత్రమే. ఇంగ్లిషు సార్ చేయడం వల్ల.... నేను కొంత కోలుకుని మళ్లీ చదువుకోగలిగా కానీ...నా మిత్రులు ఇప్పటికీ ఇంగ్లిషు ఫోబియాతో ఇబ్బంది పడుతున్నారు. కొందరు టీచర్లు ఎంతో అద్భుతంగా భావి భారత పౌరులను తీర్చి దిద్దుతున్నారు. మీరన్నట్లు తల్లిదండ్రులు తెచ్చే ఒత్తిడి, నాణ్యత లేని టీచర్లు, మీడియా...ఈ పెడ పోకడలకు బాధ్యత వహించాలి. మంచి గురువులకు ఎప్పుడూ మన సమాజం రుణపడి ఉంటుంది.
రాము

నండూరి వెంకట సుబ్బారావు said...

రామూ గారూ,
మీ జీవితంలో చాలా డ్రామా ఉంది. మీ బాధ నాకు నాణేనికి మరోవైపు. నేను టీచరుగా చాలా సంవత్సరాలు పని చేశాను. చాలా క్రూరంగానే దండించేవాడిని. కానీ నా వ్యక్తిగత ఆవేశాలు, ఉద్వేగాలు పిల్లలు మీద చూపించడానికి ఎప్పుడూ దండించలేదు. నా విద్యార్థులలో తొంభై శాతం పైగా ఇప్పటికీ నాతో స్నేహంగా, గౌరవంగా ఉంటున్నారు. మిగిలిన కొద్దిమంది నన్ను ఎక్కడా పరోక్షంగా అయినా తిట్టినట్టు నాకు తెలియదు.
మీకు సహజంగానే ఉద్వేగాలు ఎక్కువని నాకు అర్థమయ్యింది. మాటలో కఠినంగా ఉండాలా, మృదువుగా ఉండాలా అని నిర్ణయించుకొనే హక్కు మీకుంది. కనుక మీ వ్యాసాన్ని నేను తప్పు పట్టడం లేదు. అయితే అది నాణేనికి ఒక వైపు మాత్రమే అని గుర్తుంచుకుంటే చాలు.
సమాజంలోని అన్ని రంగాలలో లాగే ఈ రంగంలోనూ చాలా అసమర్థులు, అయోగ్యులు ఉన్నారు. కానీ మీడియా దీన్ని భూతద్దంలో చూపిస్తూ (మీరు చెప్పినట్లు వీరి వల్ల ప్రకటనలు రావు కదా. భయం లేదు.) ఉంటాయి.

Anonymous said...

ముందుగా కామెంట్స్ చూసి మీ టపా దగ్గరికి వచ్చాను.
మీ ఆవేశం అర్థం చేసుకోవచ్చు, కాని సందర్భం కుదరలేదు.
బహుశా మీరు అప్పటి మీ భావాలని యధాతథంగా వ్రాసి ఉంటారు.
అన్ని వృత్తులలోనూ చెడ్డవాళ్ళు ఉన్నట్లే, టీచర్లలో కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు.
నేను చదువుకున్న స్కూల్లో ఇద్దరు టిచర్లు ఇలాగే ఉండేవారు. ఒకాయన హిందీ టీచరు. ఆయన వల్ల ఫస్ట్ క్లాసు పోగొట్టుకున్నవాళ్ళు ఎంతోమంది.
కాని మిగతావాళ్ళు బాగా చెప్పేవారు.
కె వి సుబ్రహ్మణ్యం గారు 9, 10 తరగతులలో మా లెక్కల మాస్టారు.
నేను ఇంజనీరు అయ్యానంటే ఆయన లెక్కలు చెప్పడం వల్లనే అని గుర్తుచేసుకుంటాను.

Ramu S said...

నండూరి గారూ...
క్రూరంగా దం డించారా? దండించడమే తప్పయితే క్రూరంగా దండించడం ఇంకా తప్పు. దయచేసి వెంటనే టీచర్ ఉద్యోగం వదిలేయండి. పిల్లలు బాగు పడతారు. పిల్లలు, వారి తల్లి దండ్రులు భరిస్తే....కొనసాగండి. మీ ఇష్టం...వారి ఇష్టం.
ఇకపోతే...పోస్ట్ మీద మీ అభిప్రాయం రాయడం బాగుంది కానీ...నా శూల పరీక్ష, శీల పరీక్ష చేయకండి. నాకు సహజంగా ఏమేమి ఎక్కువో అని బాధపడకుండా...అంచనాకు రాకుండా..విషయం మీద మీ అభిప్రాయం చెబితే మంచిందని నా అభిప్రాయం.
రాము

వంశీ కృష్ణ said...

ఇలాంటి టీచర్లు నేను చదివేటప్పుడు ఉన్నారు. మా హిందీ టిచర్ అయితే అందరికి చాల భయంగా ఉండేది.
పాఠం రాని వాళ్ళు నిలబడండి అంటే అందరు నిలబడే వాళ్ళు. క్లాసు టాపార్స్ కూడా ఎందుకంటే ఎక్కడైనా చిన్న తప్పు పోతే విధించే దండన బాగా ఉండేది.
ఇలాంటి వారితో చదవాలంటేనే విస్సుగేత్తేది.

yaramana said...

పోస్ట్ చాలా బాగుంది.
మీ పోస్ట్ చదివి పిల్లల్ని దండించే ఆటవిక టీచర్లు సిగ్గు పడతారని ఆశిస్తున్నాను.
అసలు పిల్లల్ని దండించే టీ్చర్లని టీచర్లు అనరాదు.
ఏ కారణానయినా సరే పిల్లల్ని దండించేవాడు శిక్షార్హుడు.
పిల్లల్ని తన్నే టీచర్లు మానసిక రోగులని గుర్తించాలి.
మీ పోస్టులో రాసిన ప్రతి అక్షరాన్ని సమర్ధిస్తున్నాను.

Sudhakar said...

మీరు చెప్పిన లాంటి టీచరు ము.కొ లు నా జీవితం లో కూడా వున్నారు. వారి శునకానందానికి, పైశాచికత్వానికి ఎంత బలయ్యానో నాకే అప్పుడు అర్ధం కాలేదు. వికృత మనస్తత్వాలు, జీవితం లో పెద్దగా నెగ్గలేని ఈ వెధవలు తెలివైన విద్యార్ధుల మీదా, వారి ట్యూషన్లు చదవని వారి మీదా సాధించే తత్వం ఇంట్లో చెప్పినా అర్ధం అవ్వని కాలం లో చదవటం నా బ్యాడ్ లక్. అయితే ఒక కాన్వెంట్ టీచర్ నన్ను సాధించి కొట్టిన చెంప దెబ్బకి నాకు ఫీవర్ రావటంతో, మా వాళ్ళు ఒక రేంజిలో ఆ కాన్వెంట్ ని పీకి, కొత్తగా వాణి విద్యా నికేతన్ అని కాన్వెంట్ మొదలెట్టి ఆ కాన్వెంట్ ని దివాళా తియ్యించిన తీపి గుర్తులు మాత్రం మర్చిపోలేను....:-)

Naagarikuda Vinu said...

అద్రుశ్టవషాత్తు నాకు మరీ అంతటి దరిద్రమైన ఉపాధ్యాయులు తగల లేదు. అందుకే నాకు చదువు చెప్పిన వారంటే నాకు అపారమైన గౌరవం, అభిమానం. ఇక పోతే మీ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా మీరు పిల్లల్ని అందరినీ అభం శుభం తెలియని అమాయకులుగా, ఉపాధ్యాయులందరినీ కీచకులు, రాక్షసులుగా చిత్రీకరించటం ఏం బాలేదు. ఇక్కడ మనం పిల్లల్ని తప్పు పట్టలేం, వారు తెల్ల కాగితాల లాంటి వారు. పిల్లల ప్రవర్తన అనేది వారు ఉండే వాతవరణం, తల్లిదండ్రుల మీద ఆధారపడి వుంటుంది. ఈ మధ్య పిల్లల పై అతి గారాబం బాగా ఎక్కువైంది. ముప్ఫై ఐదు యేళ్లదాకా డబ్బు వేట లో పడిపోయి, సంసార జీవితాన్ని నిర్లక్షం చేసి, ఆపై అతి కష్టం పై పిల్లల్ని కని, అతి గారాబం చేసి, చిన్న మాట కూడా అననీయకుండా వార్ని పెంచి, దేనికీ పనికి రాని దేభ్యపు ముండాకొడుకుల్ని తయారు చేసి దేశం మీదకి వదిలిపెట్టడం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకి మావయ్యో, చిన్నాన్నో ఇంతికి వస్తే, చంటిగాడు మావయ్యకి మొట్టికాయ వేయటం, లేదా వెనక నుండి వచ్చి బాబాయి వీపుపై గుద్ది పారిపోవటం ఇలాంటివన్నీ మనకి సరదాగా అనిపించినా రాను రాను ఏం చెసినా నడుస్తుంది, ఎవరూ ఏమీ అనరు అనే ధైర్యం వాళ్ళకి వస్తుంది. మీ బాబు స్కూల్ లో మా వాడిని బాగా గిల్లితున్నాడు, మా పాప ని ఏడిపిస్తున్నాడు అనే మాటల్ని మనం రోజూ వింటూనే ఉంటాం. అలాంటి సందర్భం లో తల్లిదండ్రులు పిల్లలకి సరైన బుధ్ధి చెప్పాల్సింది పోయి, వారిని వెనకేసుకొని వస్తుంటారు. మొక్కై వంగనిది మానై వంగునా అని ఇలాంటి చేష్టలతోనే మనం సమాజానికి విజయవాడ మనోహర్ లని, రౌడీలని గూండాలని అందించేది.