Saturday, March 17, 2012

నా మొబైల్ ఫోన్ తీసుకుని....సైకిల్ ఇచ్చిన వైనం...

(మొబైల్ ఫోన్ స్టోరీకి కొనసాగింపు)
సరే...ఎంతో శ్రమించి మన జర్నలిస్టు మిత్రుడు ఇచ్చిన ఫోన్ నెంబర్ ను పోలీసోళ్లకు ఇచ్చిన తర్వాత అర్ధమయింది...వారి వల్ల జాప్యం జరుగుతుందని. మార్చి మూడో తేదీ రాత్రి నేనే ఆ ఫోన్ నెంబర్ కు ఫోన్ చేశాను. ఒక మహిళ ఫోన్ లైన్ లోకి వచ్చారు. ఈ మహిళలతో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్టాడాలి. అసలే మనం బెదిరించాల్సిన విషయమిది. అందుకే...చాలా సౌమ్యంగా "అమ్మా..." అని మాట్టాడాను. నా అదృష్టం బాగుండి...ఆమె తన పక్కనున్న భర్తకు ఇచ్చింది. ఆయన ఫోన్ ఎత్తుతూనే..."చెప్పన్నా..." అని అన్నాడు. 


నిజం చెప్పొద్దూ...."మన తెలంగాణోడే కదా....డీలింగ్ చాలా వీజీ" అనిపించింది. "అన్నా...నా పేరు రాము. నేను ఒక విలేకరిని..." అంటూ మొదలుపెట్టి...నా ఫోన్ పోయిన విధానం...పోలీసులు దాన్ని ట్రాక్ చేసి నంబర్ సంపాదించిన పద్ధతి...అంతా పూసగుచ్చినట్లు చెప్పాను. నేనో దేశ ముదుర్నని కలరొచ్చే రెండు మూడు వాక్యాలూ చెప్పాను. తన ఇంటి అడ్రసు తన దగ్గర ఉందనీ, ఒక వేళ మొబైల్ ను పారేసినా...కేసు తన మీదికే వస్తుందని...తను ఫోన్ కట్టేసే లోపే దడదడా చెప్పేశాను. మనకు తెలీని వ్యక్తితో ఫోన్ లో ఇలా డీల్ చేయడం మనకు కొత్త. ఒక దశలో బీపీ పెరిగి కాస్త కటువుగానే మాట్టాడబోయా. చెప్పింది వింటున్నాడు కాబట్టి...అత్తెలివి ప్రదర్శించడం లేదు కాబట్టి...వితండవాదం చేయడం లేదు కాబట్టి...సీరియస్ గా డీల్ చేయాల్సిన పనిలేదని అర్ధమయింది.


"అన్నా...నేను ఇవ్వననలేదుగా...ఎల్లుండి (మార్చి ఐదు) లాల్ బహదూర్ స్టేడియం కు వచ్చి...చూడు. ఫోన్ నీదయితే తీస్కపో...." అన్నాడు. మధ్యలో ఫ్లో లో పేరు అడిగితే...చటక్కున చెప్పాడు. అప్పుడర్ధమయింది...ఇక మన ఫోను మనకు వచ్చినట్టే అని. 

శుక్రవారం నాడు ఇలా మనోడితో మాట్టాడాను. శనివారం రాత్రి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి ఒక తుక్కు ఐడియా వచ్చింది. ఎల్.బీ స్టేడియం కు రమ్మన్న తను అక్కడ తనను కలిశాక...మనల్ను మొత్తగా కుమ్మితే? అది ఎవ్వడికీ చెప్పుకోలేం. కీడెంచి మేలెంచాలి... పైగా రోజులు బాగోలేవని అనిపించి నా అరేంజ్ మెంట్ నేను చేసుకున్నా. చిన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ లో నుంచి నేర్చుకున్న ఒక ఐదారు పంచ్ లతో ఎప్పుడైనా ఒకరిద్దరిని మ్యానేజ్ చేయగలం గానీ...వాడు ఐదారుగురితో వచ్చి....దంచితే కష్టం కాబట్టి...నేను ఒక గట్టి సహచరుడిని అలర్ట్ చేశా. ఆ ఉత్సాహవంతుడైన సహచరుడు మరో ఘాట్టి సహచరుడ్ని తెచ్చాడు. వాళ్లిద్దరినీ దూరంగా ఉంచి...నేను తను చెప్పిన ప్రదేశానికి వెళ్లా...భయంకరమైన అలర్ట్ తో. చిన్నప్పుడు మధుబాబు గారి నవలలు, షాడో పాత్రలు ఒంటబట్టించుకుంటే...వచ్చే చిక్కిదే మరి.

ఖాకీ దుస్తులు వేసుకున్న ఒక వ్యక్తి..."నువ్వేనా...అన్నా..." అని అడుగుతూ నా దగ్గరకు వచ్చాడు. నన్ను చూసి నమ్మనట్లు నా ఫోన్ కు ఫోన్ చేసి...రింగ్ అయ్యాక...నమ్మాడు. నా ముద్దుల ఫోన్ ను ఒక తళుకు సంచీలోంచి తీసి..."ఇది నీదేనా అన్నా....తీసుకో.." అని ఇచ్చాడు. 


నాకు మతిపోయింది. నెల రోజుల పాటు నాకు దూరమైన నా ఫోన్ నా చేతికి వచ్చింది. మనసులో...మనకు సహకరించిన జర్నలిస్టుకు జోహార్లు చెప్పుకుని...ఫోన్ తిరిగిచ్చిన అతనితో కాసేపు మాట్టాడా. ఎక్కడ ఎలా దొరికిందో తెలుసుకునే లోపే మనం ఏర్పాటు చేసుకున్న సహచరులు దూసుకువచ్చారు. వాళ్లను ఆపి...చర్చ సాగించా. "అన్నా...నువ్ ఫోన్జేసి మంచి పన్జేసినవ్...లేకుండా దీన్నమ్ముదమని అనుకున్న. అమ్మి పోరగాడికి ఒక సైకిల్ గొందమని అనుకున్నా..." అని చెప్పాడు. దొరికిన ఖుషీలో ఒక సైకల్ కొనిబెట్టన్నా...అని అడిగాడు నిర్మొహమాటంగా.


వార్నీ యబ్బ నా పదివేల ఫోను...ఒక తుక్కు సైకిల్ కోసం అమ్ముదామనుకున్నవా...అని...మనసులో అనుకుని సహచరుల్లో ఒకడికి చెప్పి బండి మీద ఎక్కించుకుని కాలనీలో ఒక చోటకు తెమ్మనమని చెప్పా. నేను కారెక్కి వెడుతుంటే..."ఛీ...నీకు ఎందుకంత నిర్లక్ష్యం...నీనెంత ఫీలయ్యానో తెలుసా...." అని నా ఎర్ర ఫోన్ వెక్కివెక్కి ఏడుస్తూ అడిగింది. నేను దాన్ని ఓదార్చి....ఇంకెప్పుడూ అలా జరగదని భరోసా ఇచ్చి దాన్ని చొక్కాకు తుడిచి శుభ్రం చేసి ఒక మంచి ముద్దిచ్చా...ఆనందంతో. ఇంటికెళ్లాక చూస్తే...ఫోన్ లో ఉన్న ఫోటోలు అన్నీ మనోడు డిలీట్ చేసినట్లు అర్ధమయింది. జాతీయ జట్టు కోచ్ (పోలెండ్ వాసి) తో కలిసి ఫిదెల్ ను, సోమ్ నాథ్ ను నేను తీసిన ఫోటోలు, కొన్ని వీడియో క్లిప్స్ అన్నీ పోయాయి. సర్లే...దక్కిందే దక్కుళ్ల అనుకున్నా.

నిజానికి మా ఇంట్లో మూడు సైకిళ్లుంటాయి. ఒకటి మైత్రికి నేను చిన్నప్పుడు కొన్నది. రెండు...ఆటల పోటీల్లో ఫిదెల్ సంపాదించినవి. వాటిని ఎలా వదిలించుకోవాలా...అని నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఈ రోజు ఇలా గాడ్ సెంట్ అవకాశం వచ్చింది. "తల్లీ... నీ సైకిల్ తో అటాచ్ మెంట్ గట్రా లాంటి సెంటిమెంట్స్ ఉన్నాయా...." అని అడిగితే...నిక్షేపంగా ఇవ్వమని తను చెప్పింది. క్విడ్ ప్రొ కో అరేంజ్ మెంట్ లో భాగంగా...ఇంట్లోని ఒక సైకిల్ ను నా తెలంగాణా సోదరుడికి ఇచ్చి...దాన్ని ఆటోలో ఇంటికి తీసుకుపోవడానికి మరో వంద కావాలంటే...అదీ చదివించుకుని...విజయగర్వంతో ఇంట్లోకి పోయా.

ఫోన్ దొరికినోడిని కాలనీకి పిలింపించి సైకిల్ ఇచ్చి రాజలాంఛనాలతో పంపినందుకు నా సహ ధర్మచారిణి, సహచరులతో పాటు....విషయం తెలిసిన ఒక పోలీసాఫీసరూ నవ్వారు. నిజానికి నేనేమీ ఫీల్ కాలేదు. ఎందుకంటే...ఖరీదైనవి దొరికితే...మనం ఉంచుకుంటే బాగని చాలా మందికి అనిపిస్తుంది. సంస్కారం ఉంటే తప్ప వెనక్కు ఇవ్వబుద్ధికాదు. ఎల్ బీ ఎస్ లో తాను ఊడుస్తుంటే ఫోన్ దొరికిందని, ఎవరిదని నలుగురిని అడిగాక...తాను ఇంటికి తీసుకుపోయానని చెప్పినోడిని ఏమి చేస్తాం? He deserves a gift.

మా కాలనీలో రోడ్డు మీద నా సైకిల్ ప్రదానం కార్యక్రమం జరుగుతుండగానే...బుద్ధి తక్కువై నేను అనుమానించిన మా పని అవ్వ అటు పోతూ కనిపించింది. ఆమెను పిలిచి...."అవ్వా...నిన్ను రెండు మూడు సార్లు అడిగా కదా ఫోన్ గురించి. ఆ ఫోన్ ఈ సారుకు దొరికింది..." అని పరిచయం చేశాను గుండెలో చెప్పలేని బాధతో. 
"భలేటోడివయ్యా...దొరగ్గానే ఇవ్వొచ్చుగా...నన్ను అడిగిండు జూసినవా..." అని మా మెయిడు తనకు క్లాసు పీకింది. ఆ మాటలు నాకు తూటాల్లా తగిలాయి. తనను అనుమానించి అడిగిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆమెకూ కొంత చదివించుకుని...చెంపలేసుకున్నా.  
(ఫోన్ పోవడానికి...తిరుపతి వెంకన్నకూ లింకేమిటి?... మరో పార్టులో)

3 comments:

శశి కళ said...

nijalu oppukovalante....goppa manasu kavali...meekundi...

కిరణ్ said...

అందరూ మీలా తెలివి ప్రదర్శించేవారే ఉంటారా.. ఆ ఇచ్చినతను దోస్తానకి అర్హుడు.. గిఫ్ట్ కి మాత్రమే కాదు..

సుజాత వేల్పూరి said...

ఇక్కడ కిరణ్ గారి కామెంట్ నాకు నచ్చింది. అడగ్గానే "ఏం పీకుతావో పీక్కో"(అనేవాళ్లు లేరంటారా) అనకుండా ఫోన్ ఇచ్చాడు. నిర్మొహమాటంగా మీ సంతోషం కొద్దీ సైకిల్ ఇమ్మని అడిగాడు. స్నేహానికి కూడా అర్హుడే!

మీరు ఆపకుండా అరగంట కలరింగ్ ఇచ్చాక "నేను ఇవ్వనని అన్లేదుగా అన్నా?(ఇంత కలరింగ్ అవసరమా?)అన్నాడు కూడా!

రాము గారూ రాము గారూ, భలే ఉంది మీ ఫోన్ కథ! దీన్ని ఒక కథగా రాయండి. ఆశావహ దృక్పథం తో ఉన్న కథలు మాత్రమే వేసే పత్రికను వదిలి మంచి కథలు వేసే మరేదైనా పత్రిక్కి పంపండి!

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి