Tuesday, November 11, 2014

ప్రొ.నాగేశ్వర్ చేతికి 'ది హన్స్ ఇండియా' పగ్గాలు-నాయర్ నిష్క్రమణ?

ప్రస్తుత ఎం ఎల్ సీ, ప్రముఖ వార్తా విశ్లేషకుడు, సూపర్ వక్త, కరెంట్ అఫైర్స్ బ్లాగర్, సివిల్ సర్వీస్ శిక్షకుడు, ఉస్మానియా యూనివెర్సిటీలో జర్నలిజం బోధకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ (ఈ పక్క ఫోటో) కు కపిల్ గ్రూప్ యాజమాన్యం 'ది హన్స్ ఇండియా' ఆంగ్ల పత్రిక సంస్కరణ బాధ్యతను అప్పగించింది. ఈ నిర్ణయం తో సంబంధం ఉందో లేదో కానీ... నాలుగేళ్ళుగా ఆ పత్రిక ఎడిటర్ గా ఉన్న పీ విశ్వనాథ్ నాయర్ పదవికి రాజీనామా  సమాచారం. ఒక కన్సల్టెంట్ గా హన్స్ బాధ్యతలు తీసుకున్న నాగేశ్వర్ గారు ఇప్పుడు శాసన మండలిలో సభ్యుడిగా ఉన్నారు. ఇండియా కరెంట్ అఫైర్స్ అనే బ్లాగ్ (http://thekntv.blogspot.in/) నడుపుతున్నారు, ప్రజల డబ్బుతో నడుస్తున్న 10 టీవీ కి గౌరవ చైర్మన్ గా కూడా పనిచేస్తున్నారు.  

సీనియర్ ఎడిటర్ కొండుభట్ల రామచంద్ర మూర్తి గారి మస్తిష్కం లో ఒక టాబ్లాయిడ్ గా  పురుడుపోసుకున్న హన్స్ ఇండియా... ప్రింటింగ్ ఇబ్బందులు, మార్కెటింగ్ వసతులు వగైరాల రీత్యా బ్రాడ్ షీట్ పేపర్ గా కొనసాగింది. తెలుగు పేపర్ల మాదిరిగానే ఇంగ్లిష్ పేపర్ ను నడిపేయవచ్చన్న దుర్భ్రమ, ఇంగ్లిష్ పేపర్ల డిజైన్ పట్ల అవగాహనారాహిత్యం, పాత నమ్మకస్తులను అకామిడేట్ చేసుకోవాలన్న ఆత్రం, పొగిడే వాళ్ళు ఇచ్చే తప్పుడు సలహాలు పాటించే తత్త్వం, మార్కెటింగ్ వ్యూహం లో తప్పిదాల వల్ల హంస కాస్తా కాకై కూర్చుంది. ఇది కపిల్ బొక్కసానికి పెద్ద బొక్క పెట్టాక... అనివార్య కారణాల వల్ల మూర్తి గారు బైటికి వచ్చారు. 

మూర్తి గారు వీడిన శిధిల సామ్రాజ్యం చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియని పరమ సాత్వికజీవి కపిల్ యజమాని వామన రావు గారికి విష్ణుమూర్తి లాగా కనిపించారు... తెలుగు ఛానెల్స్ దశ-దిశ మార్చే దమ్మున్న ఏకైక మొగాడు రాజశేఖర్. భారీ ప్యాకేజ్ తో రాజా ని తీసుకున్నాక కొన్నాళ్ళకు వామనుడికి అర్థమయ్యింది మూడో కాలు నెత్తి మీదికి వచ్చేస్తోందని... అని ఒక మిత్రుడు చమత్కారంగా అన్నారు. ఇంగ్లిష్ జర్నలిజంలో శిక్షణ, ప్రవేశం ఏ మాత్రం లేనివారికి పగ్గాలు ఇస్తే హింసకు గురికాక తప్పదన్న కనీస జ్ఞానంలేని వామన రావు గారిని అనక తప్పదు. వామనరావు గారిని ఒకరిద్దరు మిత్రులు కలిసి కొంపకొల్లేరు అవుతుందని చెబితే... నీట ముంచినా... పాల ముంచినా ఆ మూర్తి గారిదే భారమని చెప్పారట. కానీ అది జరగలేదు.   

ఈ పరిణామాల మధ్య... హన్స్ కు జవజీవాలు పోసే పనిలో భాగంగావామన రావు గారు హన్స్ సంస్కరణ బాధ్యతలను నాగేశ్వర్ గారికి అప్పగించారని సమాచారం. ఈ నేపథ్యంలో... డెక్కన్ క్రానికల్ ఎదుగుదల లో కీలక భూమిక పోషించిన నాయర్ గారు ఎడిటర్ షిప్ వదిలేసి వెళ్ళిపోతున్నట్లు సమాచారం. 

"నాయర్ గారు వెళ్ళడం పక్కా. రాజశేఖర్ గారు కూడా డిసెంబర్ ఐదో తేదీన వెళ్ళిపోతారట. సాక్షి ఛానెల్ లో పని కుదిరిందట. మళ్ళీ మా ఛానెల్ లో పత్రికలో కొత్త ఉత్సాహం రావడం ఖాయం," అని ఒక ఇన్సైడర్ చెప్పారు. అది నిజమో కాదో కాలమే తేల్చాలి. All the best...prof.Nageswar.             

1 comments:

శ్రీకాంత్ చారి said...

>>> ఇండియా కరెంట్ అఫైర్స్ అనే బ్లాగ్ (http://thekntv.blogspot.in/) నడుపుతున్నారు

Seems the blog has now changed to http://www.indiacurrentaffairs.org/