Sunday, February 15, 2015

అరవింద్ కేజ్రీవాల్ vs జయప్రకాశ్ నారాయణ్:ఆరు తేడాలు

అన్ని రంగాల్లో అవినీతి మితిమీరి, రాజకీయాలు అక్రమార్కుల అడ్డాగా మారి... ప్రజాస్వామ్యం అడుగడుగునా అపహాస్యమవుతున్న ఈ రోజుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల అవసరం ఎంతైనా ఉంది. సగటు ఓటరు ప్రధాన రాజకీయ పార్టీల పట్ల నమ్మకం కోల్పోయి విధిలేని పరిస్థితుల్లో ఒక సారి ఒక పార్టీకి, తర్వాత మోసపోయిన కసితో మరొక పార్టీకి పట్టం కట్టి రాజకీయ వ్యవస్థను తిట్టుకుంటూ నైరాశ్యంతో ఉన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మార్కెట్ ప్రభావిత సమాజంలో అసమానతలు పెరిగి మానవ సంబంధాలు మరీ బలహీనమై ఒక కనిపించని సంక్షోభ స్థితిలో ఉన్న సందర్భంలో కమ్యూనిస్టు పార్టీలైనా ఆదుకుంటాయని అనుకుంటే... తెలుగు నేల మీద కామ్రేడ్లు నిస్సిగ్గుగా నైతికంగా దిగజారి కమ్మ-రెడ్డి కులాల కింద కింద చీలిపోయి చెప్పరాని నష్టం చేశారు. కొద్దోగొప్పో నమ్మదగిన సీపీఎం నికార్సైన కమ్యూనిస్టుల చేజారి చాలాకాలమయ్యింది. తమ్మినేని వీరభద్రం లాంటి కరుడుగట్టిన కమ్మ నాయకులు మీడియాలో కూడా చేరి కుల వ్యవస్థ వేళ్ళూనుకునే ఏర్పాటు చేస్తున్నారు... రాయల్ గా. మాజీ సినీ స్టార్ చిరంజీవి నేతృత్వంలో వచ్చిన ప్రజా రాజ్యం బడుగు అణగారిన వర్గాలలో ఎక్కడలేని ఆశలు లేపి... అనతికాలంలోనే అవినీతి ఆరోపణలతో కుప్పకూలింది. అధికారమే పరమావధిగా చిరంజీవి మంచి ముహూర్తం చూసుకుని శుభ్రంగా కాంగ్రెస్ లో చేరి... లక్షల మంది బీసీ నాయకులను నట్టేట్లో ముంచారు. 


ఈ దారుణ పరిస్థితులకు ఇంకాస్త ముందుగానే తెలుగునేల మీద మాజీ 
ఐ ఏ ఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్ గారి నేతృత్వంలో ఆరంభమైన లోక్ సత్తా ఉద్యమం ఆశాజీవులకు ఎంతో ఊరట ఇచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా... 'ప్రజలే ప్రభువులు' అన్న నినాదంతో అతి తక్కువ కాలంలో ప్రజల నమ్మకాన్ని చూరగొన్న లోక్ సత్తా నిజంగానే అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఎదిగి... ప్రధాన రాజకీయ పార్టీల నేతల గుండెల్లో గుబులు పుట్టించింది. ఉద్యమం నుంచి రాజకీయ పార్టీ గా మారిన తర్వాత లోక్ సత్తా ప్రజాభిమానాన్ని ఓట్లుగా మార్చుకోలేకపోయింది. 
దాదాపుగా లోక్ సత్తా లాంటి లక్ష్యాలతో... అవినీతిపై సమర శంఖం మోగిస్తూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ )... దేశ రాజధానిలో ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ ఒక ఏడాదిలో రెండు సార్లు అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో... సహజంగానే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, జయప్రకాశ్ నారాయణ్ ల వ్యవహార శైలి మధ్య సారూప్యాలపై చర్చ జరుగుతున్నది. మా విశ్లేషణ ప్రకారం... ఇద్దరి మధ్య, ఈ మాజీ సివిల్ సర్వీస్ అధికారుల నేతృత్వంలోని పార్టీల మధ్య ఈ కింది తేడాలు ఉన్నాయి. 
ఒకటి) క్షేత్ర స్థాయి యంత్రాంగం: ఉద్యమ కాలంలో... అవినీతిపై యమ కసితో ఉన్న ప్రజల మనసులను చూరగొన్న లోక్ సత్తా ఒక ప్రభావశీలమైన క్షేత్ర స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యింది. ఉద్యమ సమయంలో చిత్తశుద్ధి తో పనిచేసిన కార్యకర్తలను ఎన్నికల సమయానికి కాపాడుకోలేకపోవడం ఒక పెద్ద తప్పిదం. దాని మీద విశ్లేషణ లేకపోవడం కూడా నష్టం చేసింది. దీనికి భిన్నంగా ఆప్ నాయకులు గ్రౌండ్ లెవల్ కార్యకర్తలను సమకూర్చుకున్నారు... సందర్భానుసార విశ్లేషణలు, దిద్దిబాటు చర్యలతో. పార్లమెంట్ ఎన్నికల్లో దారుణంగా దెబ్బ తిన్నా... అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్ర స్థాయి యంత్రాంగం ఏర్పడి ఆప్ కు అండగా నిలిచింది. 
రెండు) విద్యాధికుల మద్దతు: ఆప్ కార్యకర్తల్లో ప్రధానంగా విద్యాధికులు (లాయర్లు, జర్నలిస్టులు, టీచర్లు వగైరా) ఉన్నారు. వారు చిత్తశుద్ధి తో పార్టీని సొంతంగా భావించి పనిచేసారు. ఇలాంటి ప్రభంజనాన్ని లోక్ సత్తా సృష్టించలేక పోయింది. దీనికి కారణం... కొందరు నేతల దురహంకార ధోరణి అన్న విమర్శ ఉంది. విద్యాధికులు 'ఒపీనియన్ లీడర్స్' అని, వారి ప్రభావం సాధారణ  ఓటర్ల పై  ఉంటుందన్న కనీస పరిజ్ఞానం లేని  మనిషి  కాదు జేపీ గారు. మనల్ను చూసి జనం వస్తార్లే  అనుకుంటే కుదరదు. 
మూడు) నేతల ధోరణి: ఆప్ నేత ఏకే, లోక్ సత్తా నేత జేపీ ల వస్త్ర ధారణ,పదాల పొందిక, హావ భావాలు విశ్లేషించి చూడండి. ఏ మాత్రం నలగని ఇస్త్రీ బట్టలతో, శుభ్రంగా టక్ చేసి జేపీ దొరబాబు లాగా కనిపిస్తారు. అదేమీ తప్పు కాదు. కానీ, సార్, భారత రాజకీయ వ్యవస్థలో బట్టలు, హావభావాలు ఎంతో కీలక భూమిక పోషిస్తాయి. మహాత్మా గాంధీనే కాక లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి నేతలు ఇందుకు మంచి ఉదాహరణలు. పేద, మధ్య తరగతి వర్గాలకు దగ్గరిగా ఉండేలా... నేతల ధోరణి, శైలి ఉండాలి. ఒక మఫ్లర్ చుట్టుకుని...తన గురించి తాను పట్టించుకోని నేతగా అరవింద్ కలర్ ఇవ్వగలిగారు. అలాగే.. జేపీ గారు రెండో వాక్యంలో ఏమి చెబుతారో ఊహించడం కష్టం కాదు. ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఆయన హావభావాలు ఏ మాత్రం ఉత్తేజం ఇవ్వవు.       
నాలుగు) సమాచార ప్రసారం: ఏకే మాట్లాడుతుంటే... మన అన్నయ్యో, తమ్ముడో ఒక విషయం గురించి విపులీకరిస్తున్నట్లు ఉంటుంది. సామాన్యుల భాషలో ఆయన భావ ప్రసారం ఉంటుంది. అదే జేపీ మాట్లాడుతుంటే... సుద్దులు వల్లిస్తున్నట్లు, ప్రబోధలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. 'ప్రజలారా... మీరు మూర్ఖపు వెధవలు, తెలివి లేని సన్నాసులు. మిమ్మల్ని రక్షించడానికి ఎంతో విజ్ఞానవంతుడినైన నేను వచ్చాను. నేను చెప్పేది విని తెలివి తెచ్చుకుని నాకు ఓటువేస్తే మీకే మంచిది..." అన్నట్లు ఉంటుంది జేపీ ధోరణి. జేపీ పదాల ఎంపిక, భాష, హావభావాలు... ప్రజలను ఆకట్టుకొనేలా అస్సలు ఉండవు. అదే విషయాన్ని సరళంగా చెప్పడం ఎలాగో నేర్చుకోకపోవడం ఒక  లోపం. 
ఐదు) మీడియా డీలింగ్: మీడియా ఒక భస్మాసుర హస్తం లాంటిది. దాన్ని ఎలా వాడుకోవాలో కేజ్రీవాల్ కు బాగా తెలుసు. జేపీ గారికి అస్సలు తెలియదు. ఒక దశలో.. 'టైమ్స్ నౌ' ఛానెల్  తీవ్రవాద జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి అరిచి గీపెట్టినా అరవింద్ ఆ ఛానెల్ షోలకు వెళ్ళలేదు. అది ఒక మంచి నిర్ణయం. అదే... మన జేపీ, వారి అనుచరుడు కటారి శ్రీనివాస రావు గారు...రోజూ మీడియాలో కనిపించడం, నాసిరకం చర్చల్లో పాల్గొనడం కనిపిస్తారు. పాతిక చానెల్స్ లో ఏదో ఒక దాంట్లో రోజూ కనిపించడం ఒక చెత్త ప్లాన్. నిజానికి... జేపీ గారిని చూడగానే మీడియా పక్షి అనిపిస్తుంది.  మీడియా విషయంలో లోక్ సత్తా ప్లానింగ్ ఒక ఫ్లాప్.     
ఆరు) కుల వలయం: జేపీ గారు కులాభిమానానికి అతీతం అని ఎవ్వరూ చెప్పలేరు. కమ్మ పార్టీల పట్ల మెతక వైఖరి తో పాటు, అదే కులానికి చెందిన వాళ్ళను దగ్గర పెట్టుకున్నారన్న అపప్రద వచ్చింది. అది పూర్తిగా నిజం కాకపోయినా... ఈ విషయంలో ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తే జేపీ గారికి బాగుండేది. దేశ రాజధానిలో అరవింద్... ఈ విషయంలో చాలా జాగ్రత్త పడ్డారు. అయితే... కులాన్ని తీసుకునే విషయంలో దేశ రాజధాని ఓటర్లు తెసుకునే దానికి, మన ఓటర్లు చూసే దానికి తేడా ఉంది. అయినా... ఈ కీలక విషయంలో జేపీ జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది.  

అంతేకాక, ప్రతి ప్రసంగంలో సారాయి... డబ్బు కట్టలు... అంటూ పదేపదే లోక్ సత్తా ఊదర కొట్టింది. వివిధ కీలక అంశాల్లో విధాన నిర్ణయాలను అది విస్పష్టంగా ప్రకటించలేదని అనడం తప్పు కానీ...ఎప్పుడూ ఓటర్ చేసే పాపాల గురించి మాట్లాడడం తెలివితక్కువ తనం. 'నీ బతుకు చెడ... తాగి, తిని ఓట్లు వేస్తార్రా... చవటల్లారా..." అన్నట్లు ఉండకూడదు మాటల ధోరణి.  అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రపంచ బ్యాంకు, నూతన ఆర్ధిక వ్యవస్థ, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చేయాల్సిన మార్పులు వంటి అంశాల గురించి చెప్పడం కాదు... స్థానికంగా ఏమి చేస్తామో స్థానికుల భాషలో చెప్పాలి. ఒక పక్కన అన్ని పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చి.. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా తెలివిగా వ్యవహరించడంలో జేపీ బృందం విఫలమయ్యిందని చెప్పక తప్పదు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే... తన కోసం పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేయాలని అయన ఆశగా ఎదురుచూసే దుస్థితి రావడం అత్యంత జుగుప్స కలిగించే విషయం.    

నిజానికి జేపీ గారి కృషి వృధా పోకూడదు. అలాంటి మేధావుల వైఫల్యం ఏ సమాజానికీ మంచిది కాదన్న ఉద్దేశ్యంతో, ఏదో ఒక రోజు ఆయన ముఖ్య మంత్రి పదవి చేపట్టే అవకాశం రావాలన్న సంకల్పంతో ఇది రాస్తున్నాం. పైన పేర్కొన్న విషయాల విషయాలను నెగిటివ్ గా చూడకుండా, వాదనలకు దిగకుండా ఉంటే కమ్యూనికేషన్స్ నిపుణుల బృందంగా లోక్ సత్తాకు సహకరించడానికి ఈ బ్లాగ్ బృందం సిద్ధంగా  ఉంది.

12 comments:

Surya Mahavrata said...

సమయానుకూలమైన పోస్టు. రెండు రాష్ట్రాల్లోని ప్రజలు జేపీ గారిని మర్చిపోతున్నారనే నిస్పృహ నేపధ్యంలో ఇది మంచి ప్రయత్నం. ఒకనాటికి రెంటిలో ఎదో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకపోయినా విస్మరింప సాహసింపరాని పార్టీగా లోక్సత్తా ఎదిగి ఇతర పార్టీలకు ప్రజలకు ప్రగతి దిశా నిర్దేశం చేసే స్థాయిని అందుకోవాలని ఆశిస్తున్నాను.

సుజాత వేల్పూరి said...

రాము గారూ, చక్కగా విశ్లేషించారు. నాలుగో పాయింట్ చాలా బాగుంది. ఇంకోటి..జేపీ పార్టిలో చిత్త శుద్ధితో పని చేసే కార్య కర్తలకు కూడా అందుబాటులో ఉండరు. ఇక ప్రజలకు ఏ మాత్రం అందుబాటులో ఉండి వాళ్లతో మమేకమై తిరిగారో కుకట్ పల్లి వాసులు చెప్పాల్సిందే! ప్రెస్ మీట్ పెట్టినపుడు లోక్ సత్తా ఆఫీసులోనో, టివీ చర్చల్లోనో తప్ప జేపీ ప్రజల్లోకి వెళ్ళిన సందర్భాలు అరుదు. మురికి వాడల్లో పార్టీ అధ్యక్షుడెవరో అక్కడి ఓటర్లకు వివరించి చెప్పడానికి కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డ సందర్భాలున్నాయి.

పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం లేదు. వన్ మాన్ షో పూర్తిగా! జేపీ తర్వాత కటారి తప్ప పార్టీలో ఇక లీడర్లెవరూ ఎక్కడా కనిపించరు, వినిపించరు.

బలమైన కేడర్ ని ఏర్పరచుకోరు. పని చేసే కేడర్ ని కేర్ చెయ్యరు. వాళ్ల అబిప్రాయాల్ని లెక్క లోకి తీసుకోరు.

అందువల్లనే లోక్ సత్తా ఇవాళ విద్యా వంతులైన కార్య కర్తలని అసంఖ్యాకుల్ని దూరం చేసుకుంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపి మద్దతు అని అదనీ ఇదనీ పలు రకాలుగా ప్రవర్తించిన లోక్ సత్తా కార్యకర్తలకే అందనంత వింతగా ప్రవర్తించింది.

ఇకపై ఆ పార్టీ అటు ఏపీలోగానీ, ఇటు తెలంగాణ లోగానీ రాజకీయంగా ఎదిగే అవకాశాలు పూర్తిగా మృగ్యం అని నా అభిప్రాయం.

ప్రజలకు కావలసింది, వారి తెలివి తక్కువ తనాన్ని ఎత్తి చూపే ఎవాల్యుయేటర్ కాదు. తమలో కల్సి తమ కష్టాలేంటో, ఇబ్బందులేంటో తెలుసుకునే నాయకుడు. అది ఢిల్లీ అయినా, హైద్రాబాద్ అయినా సరే!

కొత్త రాజకీయం కోరుకునే ప్రజలు ఢిల్లీ లో ఆప్ కి వేసినట్లే తమకు ఇకపై వోట్లేస్తారని జేపీ అంటున్నారు. 2006 లో ప్రారంభమైన లోక్ సత్తా ఇప్పటివరకూ చేసిన కొత్త రాజకీయమేమిటో జేపీయే చెప్పాలి.

Ramu S said...

Hi ma'am,
After a long time. Thanks for your response and additional inputs.
good day
Ramu

katta jayaprakash said...

One of the best analytical stories on politicians and more on JP and Kejriwal.There is a wall between JP and Kejriwal.All are hundred percent true practically.But JP can never be successful CM with his mind set unless he transforms into common man friendly.JP is a TV and media leader.

JP.

G.P.V.Prasad said...

JP గారు కులాభిమాని కారు కానీ కేజ్రీవాల్ కులాభిమాని, ఎక్కడైనా మీరు కేజ్రీవాల్ దేవాలయం వెళ్ళడం ప్రచారం చెయ్యడం చూసారా?

నిజానికి చెప్పాలి అంటే JP తను తప్పు చెయ్యరు. AAP అధినేత చేసారో లేదో నాకు తెలియదు!

Aravind Murarishetty said...

While this analysis is post-mortem after AAP won power which absolves him of all his mistakes. Many people who analyze make this mistake of overlooking Kejriwal's blunders because he won power. The current state of the nation is because of ingrained belief in people that power is an end in itself. Winning power washes away all sins it seems. The differences seem to be picked up to justify a conclusion (AK is successful than JP).

There are major differences ignored by the writer:

1. Kejriwal will say and do anything to get elected including compromising on corrupt candidates, populism, bribing voters through freebies. Traditional parties already do it, how is AAP different? JP will never say anything just to win an election for himself or party. He could have got 5 seats from TDP but he didn't compromise on agenda for sake of alliance with TDP. How did Kejriwal ally with Congress?

2. Kejriwal indulges in personal attacks, calls all corrupt and sensationalizes to stay in media. JP always comments on issues and solutions and never attacks anyone personally.

3. Kejriwal encourages people to break laws in name of fighting corruption but JP respects law and never asks to break it for political gain.

4. Solutions offered by AAP do not solve problems of people but increase dependence on government. LSP offers long term solutions.

Having said this, LSP needs to find a way to reach, inspire and enlist people in party ranks by offering practical solutions that address short term needs of people. Some ideological compromise without affecting core ideology needs to be reached at.

Ramu S said...

Mr.Aravind,
Thanks a lot for your comments. Some of them are good ones and we've noted them down. cheers.
good day

hai said...

Aravind Murarishetty : I observed your comments are not correct.

1. You are saying that LS never offered any kind of voter attracting promises. But read LS last election manifesto. However for readers interest, one ex i will tell you. They gave a promise as people can go to private hospitals and can get free consultation instead of going to govt hospitals. JP several no. of times said publicly that arogyasri is useless. But for your information arogyasri helps in big diseases. For all normal kind of things like consultation and other tests, people should visit govt hospital only. Because of JP promise, govt hospitals will close shortly.
2. You said Kejrival sensationalized the corrupt leaders. Whats wrong in that? If they are not they can give counter attack. What ever proofs they have they can show.
3.Your point may be correct.
4.Most of the promises are given by AAP are far better than LS. You check 2014 manifesto of LS. Also, one thing I want to tell you here is it is necessary that some basic things should be at reasonable price while providing them to the people. Also, people should get free water. That's govt basic responsibility. Also, Power should be at affordable price... As Delhi most depend on central, its little difficult for them. But for other states, its it ok.

I, me, myself said...

AAP is the new left, they have the same policies and ideology like traditional parties.
People need to understand no matter how honest you are you can not end corruption without reducing the rules and laws & govt intervention.

Sridhar said...

AAP=INC=BJP, can any body tell the difference between these parties. do they have any policy.all do say they have peoples policy.offers all freebees,but dont demonstrate how they achieve the promises. at least JP is better option. winning of AAP in delhi is wrong signal as people will vote for freebees and not intrested in how it is possible.with this kind of socialist policies will left indians as beggers

Unknown said...

లోక్ సత్తా పార్టీ కి ఆమ్ ఆద్మీ పార్టీ కి తేడా ఏంటి ?
జయప్రకాశ్ నారాయణ్ గారు , ఐఎఎస్ కు రిజైన్ చేసినప్పటినుండి , ఇప్పటిదాకా ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నఓ కార్యకర్త గా, 2013 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ గెలిచిన తర్వాత, నేను జెపి గారికి అందించిన లేఖ ఇప్పుడు మీ కోసం..

ఆమ్ ఆద్మీ పార్టీ కి ఆయాచితంగా కలిసొచ్చిన అంశాలు
1. ఢిల్లీ లో రెండు ప్రధాన పార్టీలు మాత్రమే ఉండడం , మూడో పార్టీ లేకపోవడం
2. ఇప్పుడు ప్రజల్లో ప్రభుత్వాలమీద ప్రత్యేకించి కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండడం, 2009 లో ప్రజల్లో అధికార పార్టీ (వై.ఎస్.) ఇంత వ్యతిరేకత లేదు. ఆంధ్రప్రదేశ్ లో అయితే ప్రభుత్వం మీద సానుకూలత ఉంది
3. ఢిల్లీ నగరప్రాంతం కావడం , కులాల పాత్ర అంతగా లేకపోవడం.
లోక్ సత్తా పార్టీ స్థాపించేనాటికి రాష్ట్రం లో తెలుగుదేశం, కాంగ్రెస్, తెలంగాణా రాష్ట్ర సమితి , ఎం.ఐ.ఎం., వామపక్షాలు కొద్దిగా బి.జే.పి,ఉన్నాయి. లోక్ సత్తా తర్వాత ప్రజారాజ్యం పార్టీ వచ్చింది . చిరంజీవి లాంటి పాపులర్ నటుడు స్థాపించిన పార్టీ కనుక ఎక్కువమంది ఆ పార్టీ లో చేరిపోయారు. లోక్ సత్తా కాస్త ప్రభావం చూపించిన హైదరాబాద్ లో కూడా 2009 లో కనీసం ఐదు పార్టీ లు బలంగా ఉన్నాయి. లోక్ సత్తా పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ల గలిగిన రెండు అంశాలు విద్య , వైద్యం. ఈ రెండింటిని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఫీజు రి-ఇంబర్స్ మెంట్ , ఆరోగ్య శ్రీ స్కీములతో ఎన్నికల్లో తనకు అనుకూలంగా మలుచుకుంది.
ఆర్ధిక విధానాల్లో తేడాలు :
లోక్ సత్తా ఆర్ధిక సరళీకరణ ను సమర్థిస్తున్న పార్టీ . సబ్సిడీ లను చాలా వరకు వ్యతిరేకించే పార్టీ. ఈ కారణంగా పేద మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పదే పెట్రోల్ ధరల పెంపు, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల , విద్యుత్ చార్జీల మోత లాంటి విషయాలలో ఎప్పుడూ ప్రభుత్వ పక్షపాతి గానే ఉండి పోయింది. పేదల పక్షం వహించలేక పోయింది. చంద్ర బాబు రెండుకళ్ళ సిద్ధాంతం లాగా జే.పి. రెండు జేబుల సిద్ధాంతం జనానికి అంతగా రుచించలేదు. ఉదాహరణకి ప్రభుత్వ ఆసుపత్రులలో యూజర్ చార్జీల విధింపును లోక్ సత్తా సమర్ధించింది. సేవల మెరుగుదలకు చార్జీల వసూలు తప్పదని వాదించింది. యూజర్ చార్జీలు విధించిన తర్వాత ఆసుపత్రుల పనితీరు మెరుగుపడలేదు,మరి అప్పుడైనా లోక్ సత్తా ఉద్యమించాలి కదా అంటే అదీ లేదు.
మరో ఉదాహరణ చూద్దాం . పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు జే.పి. వాటిని సమర్ధిస్తూ మాట్లాడతారు. ఆర్టీసీ కి పన్నురాయితీ ఇచ్చి ప్రయాణీకుల చార్జీలు పెరగకుండా చూడాలని చెబుతారు. పెట్రో ధరలు పెరిగినప్పుడు తప్ప మరో సారి ఈ మాట మాట్లాడరు. ఆర్టీసి కి పన్ను రాయితీ కోసం ప్రభుత్వానికి ఉత్తరం కూడా రాయరు.
ఇలాంటి విషయాలలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు అనుకూలంగా మాట్లాడింది,ఉద్యమాలు చేసింది. ప్రైవేటు విద్యుత్ సంస్థల అవినీతి వల్ల చార్జీలు పెరుగుతున్నాయని మేము అధికారం లోకి వస్తే చార్జీలు తగ్గిస్తామని చెప్పడం ద్వారా పేద ప్రజలకు దగ్గరయింది.(సశేషం )
మిగతా భాగం నెక్స్ట్ కామెంట్ లో

Gollapudi Srinivasa Rao said...

Good one ramu

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి