Wednesday, October 4, 2017

బూతు వెబ్ సైట్స్ మీద 'మా' చేసింది మంచిదే... కానీ...

ఈ రోజున అంటే అక్టోబర్ నాలుగో తేదీన సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) బూతుపై సమరం ప్రకటించింది. బూతు వెబ్ సైట్స్ మీద చర్య తీసుకోండని కోరుతూ సైబర్ క్రైమ్ కు 'మా' బృందం ఒక పిటిషన్ సమర్పించింది. ఇంతకన్నా గొప్ప వార్త ఇంకోటి ఉంటుందా?

నిజంగానే కొన్ని సైట్లు ఘోరంగా రాస్తున్నాయి. పిచ్చి బొమ్మలు జమ చేసి, మార్ఫింగ్ చేసి, బూతు మాటలు చేర్చి, పుకార్లు రాయడం.. వాటిని యూ ట్యూబ్ లో పెట్టి ప్రసారం చేయడం ఎక్కువయ్యింది. జనం కూడా చిత్రంగా వీటిని ఆదరిస్తున్నారు. ఈ మధ్యనైతే పాపం.. టీవీ ఆర్టిస్టులు, చిన్న నటుల మీద కూడా ఇష్టమొచ్చినట్లు రోత రాతలు రాస్తున్నారు. ఇలాంటి వెబ్ సైట్స్ దాదాపు 250 దాకా ఉన్నట్లు గుర్తించారు.  కొంత మంది హీరోయిన్స్ మీద వెబ్సైట్స్ పచ్చి బూతు రాయడంతో 'మా' కు వేడి తగిలింది. అందుకే 'మా' బృందం పోలీసులను ఆశ్రయించింది. 

ఈ అంశం మీద 'బూతుకి వాత' అంటూ టీవీ-9 ఈ రాత్రికి ఒక చర్చ జరిపింది. పిటిషన్ సమర్పించిన వారిలో ఒకరైన 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా ఇలాంటి అడ్డగోలు రాతల మీద చాలా ఆవేదన వెలిబుచ్చారు. 'మాకు చాలా ఫిర్యాదులు వచ్చాయి. అవి చూస్తే చాలా బాధేస్తుంది," అని చెప్పారు. ఈ విషయంలో ఒక  ఫిర్యాదు రావడం తో హ్యాపీ గా ఫీల్ అవుతున్నట్లు సైబర్ క్రైమ్ ఎస్. పీ. రామ్మోహన్ చెప్పారు. సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మాట్లాడుతూ... కంటెంట్ తో పాటు ఇంటెంట్ కూడా ముఖ్యమని చెప్పారు. 

అయ్యా సినీ మహానుభావులూ... ఈ సమాజంలో నేర ప్రవృత్తి, బూతు పెరగడానికి, విలువుల క్షీణత లో సినిమాల పాత్ర ఏమిటో ఒక్కసారి ఆలోచించండి. మీరు చేస్తే... అది కళా పోషణ. ఇతరులు టెక్నాలజీ ఉపయోగించి చేస్తే అది నేరం. హతవిధీ! టీవీ నైన్ వారి చర్చలో.. సినీ ప్రపంచం సినిమాల్లో చూపిస్తున్న బూతు సీన్లు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ గురించి ప్రస్తావన రాకపోవడం విచారకరం. జర్నలిజం చదువుకున్న కత్తి మహేష్ కనీసం దీన్ని ప్రస్తావించపోవడం బాధాకరం. 

'మేమూ మా సినిమాల్లో బూతు చూపబోము. ఆడ పిల్లల ను చీప్ గా చూపబోము. ఇలా వచ్చే సినిమాల మీద చర్య తీసుకుంటాం," అని 'మా' ఒక డిక్లరేషన్ ఇస్తే బాగుండు.  కుటుంబాలు పిల్లలతో కలిసి చూసే సినిమాలు తీయలేక సెక్స్, వైలెన్స్ మీద ఆధారపడి బతికే వాళ్ళు నీతులు వల్లిస్తే బాగుండదని అనుకోడానికి వీల్లేదు.  

3 comments:

విన్నకోట నరసింహా రావు said...

బాగా చెప్పారు 👏. సినిమా వారి పద్ధతి గురివింద గింజ సామెతలాగా ఉంది.

Surya Mahavrata said...

సాక్షాత్తూ ఏఎన్నార్ గారే ఒక సభలో సినిమాల ప్రభావం సమాజం మీద ఉండేట్టయితే దేవదాసు చూసిన ప్రతి భగ్నప్రేమికుడూ తాగుబోతైపోడెందుకు అని ప్రశ్నించి ఆశ్చర్యపుచ్చేరు. ఎంత సెక్సూ వయలెన్సూ వైపరీత్యం తెరలమీద చూపించినా అది జనాన్ని ఏ రకంగానూ ప్రభావితం చెయ్యదనుకొనే వారు ఇలాంటి వెబ్సైట్ల గురించి పడే ఆవేదనలో చిత్తశుద్ధి లేనట్టే.

విన్నకోట నరసింహా రావు said...

ఏయన్నార్ అలా అన్నారా? సినిమావారు కదా అలాగే అంటారు లెండి. ఎందుకంటే సినిమా రంగం వారి వృత్తి, బతుకుదెరువు, వ్యాపారం కదా, సమర్ధించుకోవాలిగా, కాబట్టి అటువంటి విచిత్ర లాజిక్కులే మాట్లాడతారు. పైగా ఇప్పుడు కాలం మారింది, మాటతీరూ మారింది. మీకిష్టం లేకపోతే థియేటర్ కి రాకండి (ఒక పేరుగాంచిన ఒకప్పటి దర్శకుడు / నిర్మాత అన్న మాటలు ఇవి. అతనంటే ఒకప్పుడు నాకు మంచి అభిప్రాయం ఉండేది బాలన్సుడుగా మాట్లాడతాడని), " గొట్టాంగాళ్ళు " కూడా రివ్యూలు వ్రాయడమేనా, ఈ సినిమా నీలాంటి వాళ్ళ కోసం కాదు "తాతా" నీ మనవళ్లు మనవరాండ్ర కోసం అని కొంతమంది సినీప్రముఖులు పబ్లిక్ గా టీవీ మీదా సోషల్ మీడియాలోనూ అంటున్నారని విన్నాను. దానర్థం - మేమింతే, సమాజం మీద ప్రభావమా అదేమిటీ - అని.
ఇప్పుడు సినిమావాళ్ళ బొమ్మలే మోర్ఫింగ్ అయి అశ్లీల వెబ్సైట్లల్లో దర్శనమిస్తున్నాయనే సరికి వాళ్ళకి నొప్పిగా ఉన్నట్లుంది. తమ సినిమాల ప్రభావం తమకే తగులుతుందనుకునుండరు. ఏదైనా తనదాకా వస్తేగానీ తెలియదు అని పురాతనకాలంలోనే పుట్టిన సామెత ☝️🙂.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి