Monday, August 11, 2014

రామోజీ!...అభినందనలతో మీకో విన్నపం

ఆగస్టు 10, 2014 నాటికి 40 సంవత్సరాలు పూర్తిచేసుకున్న 'ఈనాడు'కు, ముఖ్యంగా పత్రిక స్థాపకుడు చెరుకూరి రామోజీ రావు గారికి, హృదయపూర్వక అభినందనలు. సంప్రదాయాలకు భిన్నమైన నిర్ణయాలతో తెలుగు భాషను సార్వజనీనం చేసినా, తెలుగు ప్రజల భావ ప్రసరణ ప్రక్రియలో విప్లవాత్మకమైన తేడా తీసుకొచ్చినా, పత్రిక పరమావధి సమాచార వ్యాప్తి కి మించిన కసరత్తని నమ్మి పాటించినా... ఆయనకే చెల్లింది. 

వార్త సేకరణ, ప్రసరణ, ప్రచురణ లలో తనదైన ముద్ర వేసిన రామోజీ వార్తకు, వ్యాపారానికి, నమ్మిన సిద్ధాంతాలకు తిరుగులేని మార్కెట్ ఏర్పాటుచేయడంలో ఎవ్వరికీ అందని ఎత్తుకు ఎదిగి పోయారు. వార్తా పత్రిక నిర్వహణలో ప్రతి రంగాన్ని ఆకళింపు చేసుకుని... స్వయంగా సరిచూసుకుని సవరించుకుని రామోజీ సృష్టించిన అద్భుత వ్యవస్థ 'ఈనాడు.' వారితో అభిప్రాయ భేదాలున్నా... రామోజీ గారి గొప్పతనం... 'ఈనాడు' కర్మాగారం లో మెలిగిన, నలిగిన వారికే బాగా తెలుస్తుంది. వార్తల విశ్లేషణలో, ఒక వార్త నుంచి మరొక కొత్త యాంగిల్ సృష్టించడంలో అనితరసాధ్యమైన తెలివిడి రామోజీ కి మాత్రమే సొంతం.  

కులం-ప్రాంతం-వ్యాపారం-రాజకీయం-ప్రజాస్వామ్యం-కర్తవ్యం-పత్రిక...లకు విడివిడిగా కలివిడిగా రామోజీ కున్న నిర్వచనాలు వర్తమాన భారతీయ జర్నలిజం లో మరే వ్యాపార వేత్తకు, ఛీఫ్ ఎడిటర్ కు లేవని చెప్పవచ్చు. "అబ్బ... నేనే గనక ఆ కులం లో పుట్టి ఉంటేనా...కత వేరుగా ఉండేది" అని లోలోపల అనుకోని రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఉండరంటే...ఒక సెక్షన్ కు ఆయన ఇచ్చిన మనోబలం, గుండె ధైర్యం అలాంటివి. ఇలాంటి రామోజీ మరొకరు పుట్టరు. ఆయన నిజమైన లెజెండ్. 
  
అప్పుడు రాజకీయ శూన్యంలోంచి నందమూరి తారక రామారావుకు, ఆయన తర్వాత రాజకీయ స్మశానం నుంచి నారా చంద్రబాబు నాయుడుకు ప్రాణం పోసిన రాజకీయ బ్రహ్మ రామోజీ. ప్రతీకారేచ్ఛతో రగిలిన వై ఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వారితో సమరానికి సిద్ధమైనా, ఉండవల్లి అరుణ్ కుమార్ తన వ్యాపార ఆయువుపట్టుపై చావు దెబ్బ తీసినా... నిలబడి నిలదొక్కుకున్న ఘనత, మొండి ధైర్యం రామోజీకే చెల్లు. రామోజీ ప్రజా సేవ అనుకున్నది మనకు ఫక్తు కులగజ్జి రాజకీయం అనిపించవచ్చు. ఆయన విహిత కర్తవ్యం అనుకున్నది మనకు అప్రాజాస్వామికం అనిపించవచ్చు.  ఎవరి సిద్ధాంతాలు వారివి, ఎవరి అభిప్రాయలు వారివి. 

కానీ ఈనాడు బాధ కలిగించే విషయం ఏమిటంటే... ఈ నలభై ఏళ్ళ ప్రస్థానంలో 'ఈనాడు' కోసం అహరహం శ్రమించి...హక్కులను ఫణంగా పెట్టి... కుటుంబ సౌఖ్యాలను పక్కకు నెట్టి నోరు మూసుకుని పనిచేసిన సీనియర్ జర్నలిస్టులపై వేటు వేయబూనటం. రామోజీకి గానీ, అయన వారసుడు కిరణ్ కు గానీ...ఇది మీకు ధర్మం కాదు. మీ పత్రిక, మీ మీడియా, మీ వ్యాపార, మీ రాజకీయ సామ్రాజ్య విస్తరణ కోసం మీకు తెలియకుండానే మీ కొమ్ము కాసిన సైన్యాన్ని వధశాలకు పంపాలనుకోవడం మీకు మంచిది కాదు. మిగిలే నాలుగు డబ్బుల కోసం...మానవత్వం మరిచి వ్యాపార నీతి పేరుతో వీళ్ళను సజీవ సమాధి చేయడం భావ్యం కాదు.  

తెలుగు జాతి అద్భుత కితాబులో మీ కంటూ బంగారు పుటలపై మీరు స్వహస్తాలతో నిర్మించుకున్న చాప్టర్ ను చరిత్ర హీనం చేసుకోకండి, రామోజీ!సుమన్ పోయినప్పుడు మీరూ, మేమూ ఎలా మూగగా ఎలా రోదించామో, దాదాపు అదే రీతిలో ఈ సీనియర్ జర్నలిస్టులు, ఇతర ఉద్యోగులు... వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు మౌనంగా రోదిస్తున్నారు. కాలేజీలకు వెళుతున్న తమ పిల్లల భవిత ఏమిటా.. అని వారంతా దిగులుతో చస్తున్నారు.  ఈ చారిత్రిక దినాన...మీరిచ్చే భరోసా కోసం సీనియర్లు ఎదురుచూస్తున్నారు. దయచేసి మీరు మౌనం వీడండి.  

కర్టెసీ: http://www.vanityfair.com/

2 comments:

విశ్వామిత్ర said...

sir, with your permission shall i share it on my facebook page ?

Sitaram said...

OK sir but we'll be happy if you mention the source.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి