ABN-ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రజారాజ్యం పార్టీ పై ప్రసారం చేసిన ఒక కథనం ఈ రోజు సంచలనం కలిగించింది. చిరును, అల్లు అరవింద్ ను, పార్టీని టార్గెట్ చేసుకుని వేమూరి రాధాక్రిష్ణ గారి ఛానల్ ప్రసారం చేసిన కథనం... పీ.ఆర్.పీ. శ్రేణులకు బాధ కలిగించింది. వాళ్ళు...హైదరాబాద్ లో ఛానల్ ఆఫీసు మీద దాడి చేశారు, జర్నలిస్టులను గాయపరిచారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అయితే...ఈ ఉదంతం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నది.
మీడియా హౌసు లకు జెండాలు, అజెండాలు ఉంటే ప్రమాదమని, జర్నలిస్టులు వాడే పదజాలం...చేసే సూత్రీకరణలకు ఒక ప్రాతిపదిక ఉండకపోతే అది అనైతిక జర్నలిజం అవుతుందని, అలాగే ఏ స్టోరీ విషయంలోనైనా బాధ కలిగితే రాజకీయ పార్టీలు మీడియాను కట్టడి చేసేందుకు ఉన్న వేదికలను వాడుకోకుండా...దాడులకు తెగబడడం అప్రజాస్వామికమని ఈ ఘటన తెలియజేస్తున్నది.
చిరంజీవి పార్టీ విషయంలో కొన్ని మీడియా హౌసులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాయన్నది వాస్తవం. చిరు ఒక ఛానలో, పేపరో పెట్టుకోవడం మినహా గత్యంతరం లేని పరిస్థితి. కొందరు ఎం.ఎల్.ఏ.లు జరిపిన సమావేశం నుంచి కూపీ లాగి..పీ.ఆర్.పీ. దుకాణం బంద్! అన్న అర్థంలో 'ఈనాడు' బ్యానర్ ప్రచురించింది గతంలో. ఇప్పుడు ఆ పార్టీ మీద ఆంధ్రజ్యోతి చానెల్ ప్రసారం చేసిన వార్త కూడా జర్నలిజం విలువలకు కట్టుబడి లేదు.
జర్నలిజం మౌలిక సూత్రాలు తెలియని, ప్రొఫెషనలిజం లేని వారికి పెద్ద పదవులు కట్టబట్టడం వల్ల గానీ లేదా రాజకీయ అజెండాతో కావాలని గానీ ఆ ఛానల్ ఈ వార్త ప్రసారం చేసిందని భావించాలి. ఎన్నికలలో ఓడిపోయినంత మాత్రాన, కొందరు ఆ పార్టీని విడిచి వెళ్ళనంత మాత్రాన, పార్టీ నాయకులు ఏదో సందర్భంలో ఒక మాట అన్నంత మాత్రాన...ఆ పార్టీ పని అయిపోయిందని నిర్ధారణకు రావడం తప్పు. దానిపై ఇప్పటికిప్పుడు ఒక స్టోరీ చేయాల్సిన పనిలేదు. ఒక వేళ...దీని మీద ఒక పొలిటికల్ స్టోరీ చేయాల్సి వస్తే...ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా...చిరంజీవి వివరణ తీసుకోవాలి తప్పనిసరిగా. అలా కాకుండా...ఇష్టమొచ్చిన పదజాలం వాడి..వ్యాఖ్యలు చేస్తూ...జనాలలో ఒక అభిప్రాయం సృష్టించే ప్రయత్నం చేయడం ముమ్మాటికీ తప్పు.
'ఆంధ్రజ్యోతి' గతంలో టీ.ఆర్.ఎస్. మీద కూడా ఇలాంటి కథనాలే రాసింది. (అందుకేనేమో...టీ.ఆర్.ఎస్.ఒక ఛానల్ పెట్టుకుంది). ఎం.ఆర్.పీ.ఎస్. విషయంలో కూడా ఈ పత్రిక వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. ఈ నేపథ్యంలో...ఇక్కడ మనం ఒక ముఖ్య విషయం గమనించాలి. వివరణలు..గట్రా లేకుండా వార్తలు రాయడం....'బాధితులు' దాడి చేయడం...'యిది పత్రికా స్వేచ్ఛ'కు విఘాతం అని జర్నలిస్టులు ధర్నాలు చేయడం...రివాజుగా మారింది.
ఈ మీడియా హౌజ్ ప్రసారం చేసే కథనాలు/ చర్చలలో జర్నలిజం ప్రమాణాలు ఎంతవరకు ఉన్నాయో...ఆ ఛానల్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సీనియర్ జర్నలిస్టు రాధాకృష్ణ గారు.. అన్నీ నాకు తెలుసు అని విర్రవీగకుండా....వెంటనే ఒక నిపుణుడైన జర్నలిస్టును 'అంబుడ్స్ మన్' గా పెట్టుకుని లోపాలు దిద్దుకోవడం మంచిది. లేకపోతే...భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరిన్ని జరిగే ప్రమాదం ఉందని వారికి ఆవేదనతో విన్నవించుకుంటున్నాం.
దాడి తర్వాత ఈ ఛానల్ లైవ్ లో యాంకర్లు వాడిన భాష కూడా మెచ్చదగినదిగా లేదు. "పీ.ఆర్.పీ 'కట్టు' కథలు" అన్న శీర్షిక కింద...ఆ పార్టీ ప్రెస్ మీట్ ను ప్రత్యక్ష ప్రసారం చేశారు. యాంకర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఒక పధ్ధతి ప్రకారం స్టోరీ వాడితే ఇలాంటి సమస్యలు రావు. అసలు రాధాక్రిష్ణ గారి దృక్కోణంలో ఒక కీలక లోపం నిన్న రాత్రి నాకు స్పష్టంగా కనిపించింది.
కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరిని 'ఓపెన్ టాక్ విత్ ఆర్.కే.' అన్న కార్యక్రమంలో ఆయన భక్తితో అడిగిన ఒక ప్రశ్న నాకు నవ్వు తెప్పించింది.
"ఇప్పుడు..ఎప్పటికైనా...పురందేశ్వరి ముఖ్యమంత్రి పదవి చేపడతారని జనంలో ఒక విస్తృత అభిప్రాయం ఉంది," అంటూ ఆయన ఒక ప్రశ్న అడిగారు. ఇది ఎంత హాస్యాస్పదం! ఇక్కడే జర్నలిజంతో పెద్ద చిక్కు వచ్చింది. 'విస్తృత అభిప్రాయం' అంటే ఏమిటి? దానికి శాస్త్రీయ ప్రాతిపదిక ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోకుండా...స్వీపింగ్ ప్రకటనలు చేయడం వల్ల జనాలకు జర్నలిజం మీద నమ్మకం పోతున్నది.
'విస్తృతంగా' జనం అనుకుంటున్నారు..అన్నప్పుడు దాన్ని సమర్ధించేందుకు తాను జరిపిన సర్వేనో, డాటానో చెప్పాలి. అది జర్నలిస్టు బాధ్యత. అందుకే...మన విశ్వ విద్యాలయాలు 'రీసెర్చ్ మెతడాలజి' అన్న ఒక సబ్జెక్టు బోధిస్తాయి. కథనాలలో శాస్త్రీయత చాలా అవసరం. అప్పుడు 'బాధితుడు' సైతం కిమ్మనడు.
ఈ దాడి సంఘటన దరిమిలా...రోడ్ల మీద పీ.ఆర్.పీ., చిరులకు వ్యతిరేకంగా విలేకరులు ఆవేశంగా నినాదాలు చేశారు. వీరి ఐక్యత బాగున్నది. బాబూ...ఇలా దాడులు జరిగినప్పుడే కాకుండా...మీ యాజమాన్యాలు అపాయింట్ మెంట్ లెటర్స్ ఇవ్వనప్పుడు, చెప్పా పెట్టకుండా ఉజ్జోగాలు ఊడపీకినప్పుడు కూడా...ఇదే ఐక్యత ఉంటే...చాలా బతుకులు బాగుపడతాయి. అయినా ఇది వేరే విషయం.
ఈ రోజు జరిగిన ఘటన చిరంజీవి గారికి కూడా ఒక కనువిప్పే. వ్యతిరేక వార్త వస్తే...ఉపశమనం పొందడానికి మార్గాలు ఉన్నాయని గుర్తించాలి. ఇది సినిమా కాదు...'లేప్పారేయ్యడానికి.' ప్రెస్ కౌన్సిల్ ఉంది, కోర్టులు ఉన్నాయి. ఆ పార్టీ మీడియా నిర్వహణలో నిజానికి చాలా లోపాలు ఉన్నట్లు కనిపిస్తుంది. జర్నలిస్టులపై దాడి చేసిన వారిని చిరు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూసుకోవాలి.
నన్నడిగితే....రాధాకృష్ణ, చిరు ఇద్దరూ ఏకాంతంగా కూర్చుని....ఒకరి బాధ ఒకరు పంచుకొని...తప్పులు తెలుసుకొని..సారీలు చెప్పుకుంటే....బాగుంటుంది. ఎందుకంటే...మనకు మీడియా ముఖ్యమే, రాజకీయ పార్టీ ముఖ్యమే.
ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మధ్యవర్తిత్వం నెరిపి శాంతిని నెలకొల్పే ఒక వ్యవస్థ ఉంటే బాగనీ....ఆ వ్యవస్థను చిత్తశుద్ధి-నిజాయితితో మనం నిర్వహిస్తే ఎలా ఉంటుందని నాకు చాలా సార్లు అనిపించింది. కానీ...అహంకారాలు, అపనమ్మకాలు, ఆరోపణాస్త్రాలు పుష్కలంగా ఉన్న ఈ కాలంలో మనల్ని వీళ్ళు దూరనిస్తారా?
14 comments:
:) I appreciate your frankness!
ఈ విషయంలో మీడియాదే తప్పుగా కనిపిస్తుంది .ఈ మధ్య మీడియా రెచ్చిపోతుంది . ప్రజల తరపున వాళ్ళివని వకల్తాను పుచ్చుకుని లేనిపోని వివాదాలు సృష్టిస్తుంది . అసలు మీడియా అనేది ప్రజల అజెండాలను తమ (పత్రికల) అజెండాగా చేసుకోవాలి - అంతేగాని తమ వ్యక్తిగత అజెండాలను ప్రజల అజెండాగా ప్రచారం చేస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే పత్రికలు తమ కొసం తప్ప ప్రజల కోసం పని చేస్తాలేదని స్పష్టంగా తెలిసిపోతుంది . మీడియా తమకు నచ్చిన వాళ్ళను ఆకాసానికెత్తెస్తుంది - నచ్చని వాళ్ళను అదః పాతాళానికి తొక్కెస్తుంది . పురుందేస్వరి ఇంటర్వ్యు కూడా ఇలాంటిదే. జనం అనుకుంటున్నారట ఆవిడ ముఖ్యమంత్రి కావాలని . ఈ జనానికి ఏమీ పనిలేదా ఆవిడని ముఖ్యమంత్రిని చేయడం తప్ప ?
avunu ee samasyanu OPEN HEART WITH RK programm dwara solve chesukovachu anukonta?
ఈ మీడియా వారి మీద 1940-50 ల లోనె అయ్యాన్న్ రాండ్ ఫౌంటైన్ హేడ్ రాసింది. కాని మన దేశం లో మొదట పేపర్లను/పత్రికలను పెట్టిన వారంతా ఒక పవిత్ర ఆశయానికి పేట్టుకొన్నారు. అది స్వాతంత్ర పోరాటాన్ని ప్రజలోకి తీసుకు పోవటానికి పేట్టారు చాలా నిజాయితిగా ఉన్నది ఉన్నట్లు గా రాసే వారు. ఆంధ్ర పత్రిక లాంటి వారు ఎక్కడ అబద్దాలను నిజాలుగా రాయటం, దిగజారడం చేయ కుండా మిడియా కి ఒక నిజాయితి గురితింపు తెచ్చారు.ఆ పాత పత్రికలకు ఉన్న నిజాయితీని వలన ప్రజలు అన్ని పత్రికలు ఇలా నీజమే రస్తారని కొంత కాలం క్రితం వరకు నమ్మేవాఉ. కాని కొన్ని పత్రికలు తమ స్వలాభాల కొరకు ఎంత హీనస్థాయి తీసుకొని వేళ్లారో అందరికి ఇప్పుడు తెలుసు, ఇకటి.వీ. లలో టి.వి.9 గురించి ఎవ్వరు చెప్పనవసరం లేదు. రానున్న రోజులలో ఈ పత్రికలు ఎల్లొ పేజిల వ్యాపారం అంటె ఇళ్ళు ఎక్కడ ఉన్నాయి, మాల్స్ లో డిస్కౌంట్ ఎంతా అనే వాటికి తప్పించి ఎవ్వరు చదవరు/కొనరు. రాము గారు పేపర్ కన్న నిజాయితి గా రాసే వ్యక్తులను మాత్రమే జనం నమ్ముతారు. కనుక బ్లగర్స్ ఆషామాషిగా కాకుండా ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకునే విధంగా వారి వ్యాశాలని రాయటం మంచిది. పేపర్ పని రానున్న 3 సం|| చాలా ఆటు పోట్లకి గురౌతాయి ఎందుకంటె అప్పుడు సెల్ లోనే అధిక శాతం ప్రజలు పేపర్ చదువుతారు కనుక.
దొందు దొందే
వార్త జర్నలిసం విలువలకు కట్టుబడి లేకున్నా...దాడులను ఎట్టి పరిస్థితుల్లో సమర్దించలేమ్...నిరసన మరో విదంగా తెలియచేస్తే బాగుండేది...
When law enforcement fails people tend to give their own verdict.that is what happening in recent days.
చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఊరికే అనలేదు. మీడియా వాళ్ళు చేసే దుర్మార్గాలకు ఎప్పుడో ఒక సారి ఇలాంటి ఝలక్ లు తగులుతుంటాయి. they badly deserved it.
I donot agree with 'ksvs'. I don't think this story supported PRP's daadulu. It has discussed the reasons for the situation and values of journalism.
An organisation involving experts from various fields should be formed to solve such problems and most importantly,to prevent such problems.
You are right sir...
* ఎందుకంటె అప్పుడు సెల్ లోనే అధిక శాతం ప్రజలు పేపర్ చదువుతారు కనుక*
చిన్న సవరణ అప్పుడు సెల్ లో ప్రజలు నెట్ యాక్సెస్ చేయటం చాలా సులభ తరమౌతుంది(కనెక్టివిటి స్పీడ్, తక్కువ ఖర్చు). అదేకాక పేపర్లో రాసిన వార్త నిజమా కాదా అని తెలుసు కోవటానికి వారు బ్లాగుల మీద ఆధారపడతారు. ఇప్పటికి మనం చేసేది అదే అయినా బ్లాగులు చదివె ప్రజల సంఖ్య రెండు మూడు సంవత్సరాల తరువాత చాలా ఎక్కువ అవుతుంది.
Andhrajyothy paper and channel chandrababu naidu pempudu kukkalu...tama caste meedunna durabhimananni ABN varu bahuchakkaga chatukunnaru.....
మీడియా ప్రసారం చేస్తే ఆవార్తను ఖండించటానికి ప్రజాస్వామ్య రీతిలొ సవాలక్ష మార్గాలున్నాయి. అంతే కాని దాడులు సమర్దనీయం కాదు. ఇంకా కోర్టులున్నాయి.అంతే కానీ ఎవరు వ్యతిరేకంగా మాట్లాదితే వారిని తన్నుకుంటూ పోవటానికి ప్రజా స్వామ్య పార్తీయా లేక గుండా గిరా.దీనివల్ల చిరంజీవి మరింత పలచన కావటం తప్ప వరిగేది శూన్యం .ఈ మద్య మీడీయా అతి పోకడలతో ఈచర్యలు సమర్దించే వారూ లేకపోలేదు .ఎదగవలసిన పార్తికీ ఇటువంటి చర్యలు ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుంది............................సదాశివరావు
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి