Friday, March 12, 2010

చెంచులు, లంబాడాలు--రూరల్ రిపోర్టింగ్

ఫీల్డులోకి వెళ్ళకుండా, ప్రజలను కలుసుకోకుండా....ప్రెస్ నోట్లు, ప్రెస్ కాన్ఫరెన్సులు, ఫోన్స్ మీద తెలుసుకునే సమాచారం ఆధారంగా వార్త రాస్తే ఎందుకోగానీ తృప్తి ఉండదు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి అక్కడి మనుషులతో కూర్చుని మాట్లాడి...వారి జీవన శైలిని, వారి సమస్యలను అర్ధం చేసుకుని రాస్తే ఆత్మానందం ఉంటుంది. ఆ తరహా జర్నలిజం ఎక్కువ తృప్తిని ఇస్తుంది. 

రూరల్ రిపోర్టింగ్ లో భాగంగా...ఒక బ్యాచ్ విద్యార్థులను రెండురోజులపాటు నల్గొండ జిల్లా దేవరకొండ, చందంపేట్ మండలాలలో చెంచు కాలని, లంబాడా తండాల్లో ఎర్రటి ఎండలో తిప్పి తీసుకు వచ్చాను.  ఈ బృందంలో ఎప్పుడూ మారుమూల గ్రామాలు చూడని ఇంగ్లిష్ మీడియం పట్నం పిల్లలు ఉన్నారు. వారు కూడా మొత్తం పర్యటన తర్వాత...ఏదో నేర్చుకున్నామని తృప్తి పడ్డారు. రూరల్ జర్నలిజం వదిలి ఒక ఏడాది దాటిన నాకు కూడా ఈ పర్యటన మంచి సంతృప్తి ఇచ్చింది. 

కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నా...గిరిజనుల విషయంలో అభివృద్ధి ఎక్కడవేసిన గొంగళి అక్కడ అన్నట్లు ఉందని, ప్రభుత్వ ఉద్యోగులు వారి గురించి చిత్తశుద్ధితో పనిచేయడంలేదని, ఆ జిల్లా కలక్టర్ ఒక ఇంపెర్ఫెక్ట్ అధికారి అని నాకు అర్ధం అయ్యింది.  

దేవరకొండ, చందంపేట అనగానే ఆడపిల్లల విక్రయాలు గుర్తుకు వస్తాయి. ముందుగా...చందంపేట్ మండలం తిమ్మాపూర్ అనే గ్రామం దగ్గర నివాసం ఉంటున్న చెంచు కాలనీకి వెళ్ళాం. అక్కడ అరవై మంది జనాభాకు గాని పది పంది ఉన్నారు. మిగిలిన వారు పని కోసం వలస వెళ్లారు. వీళ్ళంతా నాగార్జున సాగర్ కట్టినప్పుడు ఆ ప్రాంతం నుంచి పునరావాసం కింద తరలించబడినవారు.
అక్కడి స్కూలు సార్ రావడంలేదు, వారికి పెన్షన్స్ అందడం లేదు. వారంతా అనారోగ్యంతో బాధపడుతున్నారు.వారంతా క్రైస్తవ మతం పుచ్చుకున్నారు. ఒక మత ప్రవక్త పుణ్యమా అని...తాగబోమని ఒట్టేసుకున్నారట. 

తర్వాత కొన్ని తండాల్లో లంబాడ గిరిజనులను కలుసుకున్నాం. పది మంది ఆడపిల్లలను కని, పదకొండో కాన్పు కోసం ఎదురుచూస్తున్న ఒక మహిళతో మాట్లాడాం. "నాకు పుట్టబోయ్యేది...ఆడపిల్ల అయితే...చంపడమో, అమ్మడమో చేస్తా. నాకు మగపిల్లవాడు కావాలి," అని తేల్చి చెప్పిందామె. 
ఎక్కడికి వెళ్ళినా...మంచి నీటి సమస్య దారుణంగా ఉంది. నేను ఒక ఆరేడేళ్ళ కిందట ఈ తండాల్లో తిరిగినప్పుడు ఉన్న పరిస్థితే ఇప్పుడూ ఉంది.

మార్గమధ్యంలో చందంపేట మండలంలో సాగర్ బ్యాక్ వాటర్ ఒడ్డున ఉన్న వైజాగ్ కాలని కి వెళ్ళాం. సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు వైజాగ్ నుంచి కార్మికులుగా వచ్చిన వాళ్ళు ఇక్కడే స్థిరపడి చేపలుపడుతూ జీవిస్తున్నారు. వీళ్ళలో ఇప్పుడు తెలంగాణా ఉద్యమం గుబులు మొదలయ్యింది. తెలంగాణా వస్తే తమను వైజాగ్ పంపుతారేమో అని వారు దిగులుపడుతున్నారు. ఈ ఏడాది చేపలు సరిగా పడడం లేదని వారు వాపోయారు.
ఒకప్పుడు నక్సల్స్ స్థావరం అయిన కాసరాజుపల్లి లో నైట్ హాల్ట్. అక్కడ గిరిజన విద్యార్థి వసతి గృహం లో టీచర్లు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. చాపల పులుసు, కోడి కూర, టమాటో పప్పు, జొన్న రొట్టెలు...మా శిష్యగణం బాగా ఎంజాయ్ చేసింది. ఆడపిల్లల అమ్మకాలను వెలుగులోకి తెచ్చి అవార్డు గెల్చిన జర్నలిస్టు నరసింహారావు, 'గ్రీన్ క్రాస్' అనే సంస్థ అధిపతి నారాయణ మాతో వుండడం వల్ల మాకు అంతా సహకరించారు. 
అక్కడ ఒక మహిళ ఒట్టి చేత్తో...సజ్జ రొట్టెలు క్షణాల మీద అద్భుతంగా చేసింది. మగ పురుషులు బాగా తాగుతున్నారట. మరొక మహిళ నా స్టూడెంట్ దీప్తి నాయర్ దగ్గరకు వచ్చి తన పసిబిడ్డను ఇవ్వబోయింది. "అమ్మా...నా బిడ్డను నువ్వు తీసుకుపో. నీ దగ్గర పెరిగితే మంచిగా చదువుకొని నీలాగా ఉంటుంది. ఇక్కడ పెరిగితే...మా బతుకుల్లాగానే దాని బతుకు మారుతుంది," అని ఆ గిరిజన మహిళ చెప్పిందట.  ఈ ఘటనతో దీప్తికి మాటల్లేవు. 


కాసరాజుపల్లికి పోవాలంటే పుట్టిలో వెళ్ళాలి కానీ ఎండాకాలం వల్ల సాగర్ లో నీళ్ళు లేవు. మేము సాయంత్రం క్రిష్ణ నీళ్ళలో పుట్టిలో తిరిగాం. ఇక్కడి ఫోటో అదే... అందులో ఆ తెడ్డు వేస్తున్నది నేనే. ఫోటో తీసింది మరొక గిరిపుత్రుడు గోపాలుడు.

కాసరాజుపల్లిలో హాస్టల్ ఆరుబైట పడుకున్నా ఒక్క దోమైనా లేదు. మర్నాడు.. సాగర్ పవర్ హౌసు, పానగాల్లులో ఛాయాసోమేశ్వర దేవాలయం శిల్పకళ చూసాం. ఈ ఆలయంలో ఒక స్తంభం మీద చిన్న బాక్స్ లో శిల్పి ఒక అక్వేరియం చెక్కాడు. అదొక అద్భుతం. అధికారిక వివరణ కోసం కలక్టర్ ను కలిసే ముందు...హెచ్.ఐ.వి./ఎయిడ్స్ పీడిత బాలల కోసం నడుస్తున్న చారుమతి చైల్డ్ కేర్ సెంటర్, అంధ బాలల కోసం పనిచేస్తున్న సంస్థను సందర్శించాము. ఎన్.జీ.వో.లంటే వ్యతిరేకత ఉన్న కలక్టర్ సారు తమకు సహకరించడంలేదని కొందరు బాధపడ్డారు.

మొత్తం మీద...గిరిజన తండాల ఒడిలో ఒక రెండు రోజులు తేలిగ్గా గడిచిపొయ్యాయి. ఒక తండా సర్పంచ్ గా ఉన్న ఒక మహిళ దాపరికం లేకుండా అన్న మాటలు నాకు మాటిమాటికీ స్ఫురణకు వస్తున్నాయి. 
"ఏముంది సారూ...ఓటుకు వెయ్యి ఇచ్చిన. సర్పంచ్ కావడానికి నాలుగు లక్షలు ఖర్చు అయ్యింది. అవి తిరిగి రావడం లేదు. ఏమి చెయ్యాలో తెలియడం లేదు," అని ఆ లంబాడ తల్లి అమాయకంగా అన్నది. మన నీచ నికృష్ట దరిద్రపు రాజకీయనేతలు...అభివృద్దిని వారి తండాలకు తీసుకుపోలేదు కానీ...రాజకీయ అవలక్షణాలను మాత్రం ఆ అమాయకపు గిరిజనులకు దిగ్విజయంగా ఎక్కించారు.   

10 comments:

తుంటరి said...

Good One

Ramu S said...

సవరణలు
ఒకటి) నాలుగో పేరాలో 'పది మంది' బదులు, 'పది పంది' అని వచ్చింది. నిద్రలేకుండా కంపోజ్ చేస్తే ఇలానే వుంటుంది మరి.
రెండు) రెండో ఫోటో పక్క పేరాలో 'పానగాల్లు' అని వచ్చింది. అది చారిత్రాత్మక 'పానగల్లు' గ్రామం. ఇది నల్గొండ శివార్లలో ఉంది.
క్షమించండి
రాము

Vinay Datta said...

I was wondering why you hadn't posted anything, the last two days. So, this is the reason.

Vinay Datta said...

I was wondering why you didn't post anything in the last two days. So, this is the reason.

kvramana said...

అన్నయ్య
ఇది బాగుంది. ఐతె అక్కడి రూరల్ పాత్రికేయ మిత్రులు మీరు పరిశీలించిన విషయాల పైన ఎలా స్పందించరొ కూడ వివరిస్తే బాగుంటుంది. మీరన్నట్లు ఇక్కడి నుంచి వచ్చిన ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు అవన్ని కొత్తగా కనిపించి ఎంజాయ్ చేసి వుండొచ్చు. కాని భావి పాత్రికేయులుగా వాళ్ల పరిశీలనను కూడ వివరిస్తే ఇంకా బాగుంటుంది.
తప్పులు ఉంటె క్షమించండి. కష్టపడి తెలుగు లో రాసే (టైప్) ప్రయత్నం చేసాను
రమణ

Anonymous said...

Ramu garu,
It looks you were too busy to contact me atleast on phone during your tour!
JP Reddy.

Anonymous said...

నల్గొండలో 1995 లో బి.ఎడ్. చదువుతూ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ (ఆలిండియా రేడియో అనుకుంటా) తరపున ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై సర్వే చేయడానికి చందంపేట్ మండలానికి వెళ్ళాను. మేం ఉద్దరించడానికి వచ్చిన అధికారులం అనుకొని ఇళ్ళలో తల్లులు కన్నీళ్ళతో చేతులు పట్టుకున్నారు. బ్యాంకు వాళ్లకు చెప్పి ఏదో ఒక లోను ఇప్పించండి అంటూ బ్రతిమాలారు. ప్రశ్నావళిలో మా ఒక్కొక్క ప్రశ్నకు ఒక జీవితాన్ని చదవాల్సిన అంత బరువైన సమాధానం. పేదరికాన్ని మాక్రో లెవల్ ఇష్యూ గా చూడటం నా జీవితంలో అదే మొదలు. అప్పట్లో లోన్ కట్టకుంటే సామాన్లు, ఇంటి తలుపులు పీక్కపోయే వాళ్లు. అలాంటి దృశ్యాలు చూసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆకలితో ఉన్న మా టీం ఇద్దరికీ అనం పెట్టిన ఆ వూరు అక్కను మరువలేను. దేశానికి నేను చేయాల్సింది ఎంతో ఉందనే భావన ఒక రకమైన ఉద్వేగాన్ని ఆ ట్రిప్ కలిగించింది. నేను ఏ వృత్తిలో ఉన్నా అడ్డ దారులు తొక్కకుండా ఆ స్పిరిటే కాపాడుతోంది. నా పదిహేనేళ్ళ స్మృతుల్ని గుర్తుకు తెచ్చినందుకు రాము గారికి థాంక్స్.

నేటి యువతరాన్ని కూడా ప్రభుత్వం సర్వే పనులకు పల్లెలకు పంపిస్తే వాళ్ళకు దేశ పరిస్థితుల మీద మంచి అవగాహన వస్తుందని నా అభిప్రాయం.

అనామకుడు.

Ramu S said...

JP gaaru,
sorry sir. We had a problem with the Collector's appointment. Hence I couldn't contact any of my friends in Nalgonda. As I was carrying Reliance mobile, I didn't have any phone number. Any way, another batch will come there soon.
Ramu

Anonymous said...

You have done a very good thin by exposing the young would be journalists the atmosphere and the social background of villagers.Infact I wanted the would be rporters to witness the agony of people suffering from fluorosis disease.The collector of Nalgonda is an abnormal specimen and every is unhappy at his administration and personality and he is never people friendly and I feel he is unfit to become a dist head and it is better if he confines ton secretariat building.A dist collector has to be more dynamic,people friendly,a good administrator with human touch and a good listener with tolerance to every one and everything.But these qualities are not seen in him as I gather information from various people.Even his body language is not appealing to the common man.

JP

Unknown said...

OK.SIR,Thank you for your observation.
I am one of the chenchu Tribals.
thimmapur tho saha anni chenchu villages Project officer ITDA-srisailam control lo unna, chenchus ki special ga oka ITDA unna , meeru paina cheppina "valasa velladam" anedi ippatiki anni chenchu villages lo alage undi.
Ilanti visayalu meelanti varu chusi vadileyakunda prasnisthey baguntundi sir.
teacher raledu ani rasaru.
ITDA Teachers nu select chesina vallalo 4 teachers mathrame chenchu villages lo unnaru ITDA nundi.
chenchus hill tribals kabatti chenchu teachers ne vesaru.
inka chala post lu alage unnay. chala valasalu alage unnay.
education , economical position very poor ga undi. intermediate chesina vallu dorakadam chenchu villages nalgonda district lo thakkuva. Employment Guarantee Scheme (special for chenchus ku) migatha districts lo start ayina, ippatiki akkada start kaledu.
officers nu questioning cheyadame meeru chese service sir.
Thank you sir. Thank you very much.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి