Saturday, June 7, 2014

ప్రియురాలి ప్రజెన్స్...దిల్ రియాక్షన్...

పెళ్లి ముహూర్తం ఖరారైన ఒక యువ జంట మధ్య ఏర్పడిన మనస్ఫర్ధలు తీర్చే గురుతర బాధ్యత భుజస్కందాల మీద వేసుకుని... చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ భన్వర్ లాల్ గారితో మీటింగ్ కు సచివాలయానికి వెళ్ళిన నాకు నా (రాము) కూతురు ఒక ఎస్ ఎం ఎస్ పంపింది. ఏడున్నరకు షో కాబట్టి, టికెట్లు ఆన్ లైన్ లో బుక్ చేయడం అయిపొయింది కాబట్టి...తొందరగా రమ్మని సందేశం. 
"భాగ్ మిల్కా భాగ్" చూశాక థియేటర్ లో నేను సినిమా చూడలేదు. సినిమాలంటే పెరిగిన అసహ్యం, భాగ్యనగరంలో థియేటర్ల దోపిడీ కార్యక్రమం, సినిమా కు పోవాలంటే ఎదుర్కోవాల్సిన ట్రాఫిక్ భయం, ఉబ్బపోసే బేస్ మెంట్ లో పార్కింగ్ ఫైటింగ్... వంటి కారణాల వల్ల థియేటర్ల మొహం చూడట్లేదు.
 
ఫర్ ఏ చేంజ్... కారులో కాకుండా, ఆటోలో పోదామని నిర్ణయించాం. ఒక రెండు పాప్ కార్న్ పొట్లాలు, ఒక డబ్బాడు కూల్ డ్రింక్... అక్షరాల 498 రూపాయలు అయ్యాయి. ఇది రాయల్ దోపిడీ. దీన్ని అరికట్టే నాథుడే లేడనుకుని హాల్లోకి వెళ్ళాం.   
ఇక హాల్లో-పక్కన ఒక జంట... సినిమా మొదలై లైట్లు పూర్తిగా మలగక ముందే...బిజీ అయిపోయింది. హాళ్ళలో కక్కుర్తి పడే వారు ప్రేమికులై ఉంటారా? లేక టూ మచ్ రొమాంటిక్ భార్యాభర్తలై ఉంటారా? అన్న సందేహం కలిగింది. ప్రేమికులా... పెళ్ళైన జంటా...అన్నది తేలాలంటే వారి కార్యకలాపాలను, సరస సల్లాపాలను కాసేపు నిశితంగా చూస్తే చెప్పవచ్చు. కానీ, పక్క సీట్లో భార్యా పిల్లలను పెట్టుకుని ఈ పరిశోధనా కార్యక్రమంలో మునిగి తేలితే పరువు పంచనామా కాకతప్పదు. కాబట్టి, దృష్టంతా సినిమా మీద కేంద్రీకరించే ప్రయత్నం చేసాను.     

ఇక ఫిల్ము మొదలయ్యింది. అనుకున్న స్థాయిలో లేదు. చై (నాగ చైతన్య) నటన, డైలాగ్ డెలివరీ బాగోలేవు. అక్కినేని నాగార్జున నటన భేష్. అద్భుత నటుడు అక్కినేని నాగేశ్వర రావు గారిని చూస్తే.. అప్పటికే ఆయన మొహం కళ తప్పిందనిపించింది. మొత్తానికి మూడు తరాల నటులను చూశాం, కానీ... మందుకు, బూతుకు పెద్దపీట వేశారు. ఒకే రకమైన ఫీలింగ్ రెండు జంటలకు కాకుండా ఒక జంటకు పరిమితం చేసి ఉంటే బాగుండేదేమో. సినిమా కు పెట్టిన దాదాపు 1100 రూపాయలు స్వర్గీయ నాగేశ్వర రావు గారికి నివాళి... బాధ పడకూడదని అనుకుని బైట పడ్డాం.   
 
నిజమైన ప్రేమికుల మధ్య గుండె లబ్ డబ్ కమ్యూనికేషన్ ఒక్కటే నాకు బాగా నచ్చింది-ఈ సినిమాలో. కాలేజ్ రోజుల్లో ఒకే అమ్మాయితో ప్రేమలో పడి, ఐదారేళ్ళు ప్రేమ సామ్రాజ్యం నిర్మించి, సెల్లు లు లేని ఆ రోజుల్లో వేల కొద్దీ ప్రేమ లేఖలు రాసి రాటు తేలి, ఆమెనే పెళ్ళాడిన నాకూ, ఆ అమ్మాయికీ ఈ తరహా కమ్యూనికేషన్ అనుభవంలో ఉన్నదే. అది నిజంగా అద్భుతంగా ఉండేది. ఈ గుండె స్పందన చూసి... నాకు, తనకూ అప్పట్లో వింతగా అనిపించేది. గాఢ నిద్రలో ఉన్నా, పది మంది లో ఉన్నా తన రాక, ప్రజెన్స్ తో గుండె చప్పుడు మారేది.  

మీకు కూడా ఇలాంటి అనుభవం ఉందా? సెలవు రోజైన ఆదివారం నాడు...కాసేపు గుర్తు చేసుకుని సరదాగా రాయండి.

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి