Thursday, November 12, 2009

జనారోగ్యం పట్టని.....గాలివాటం మీడియా

నిశితంగా గమనిస్తే...మన తెలుగు మీడియా ఒక తెలియని వ్యాధితో బాధపడుతున్నట్లు కనిపిస్తుంది. అన్ని పేపర్లు..ఛానెల్స్...ఏదో ఒక అంశాన్ని తీసుకుంటాయి. దానిపై తెగ రాయడమో/చూపించడమో చేస్తాయి. ఇంతలో మరొక కొత్త అంశం పుట్టుకొస్తుంది...అన్ని పత్రికలూ, ఛానెల్స్ పొలోమంటూ కొత్త అంశాన్ని పట్టుకుంటాయి. పాత అంశాన్ని ఇక పట్టించుకోవు. పాత విషయాన్ని ప్రసారం చేసేటప్పుడు..."ఇది చాలా ముఖ్య విషయం" అని ఊదరకొట్టే ఛానెల్స్ కొత్త అంశం మోజులో పడి పాత దాని సంగతి 'ఫాలో అప్' చేయడం మరిచిపోతాయి. ఈ క్రమంలో చాలా నష్టం జరుగుతున్నది.

గత వారం మీడియా ధోరణి ఎలా సాగిందీ...ఎన్ని మంచి విషయాలు ఎలా మరుగున పడిందీ...ఒక సారి చూద్దాం. ఈ కింది విషయాలు మీడియా లో ప్రముఖంగా చోటు చేసుకున్నాయి.
ఒకటి) గ్రేటర్ ఎన్నికలు: ఒకడ్ని బట్టలు చినిగేలా ప్రత్యర్ధులు కొట్టడాన్ని ప్రముఖంగా చూపించారు. దానం నాగేందర్ వ్యవహారం, తెలుగు దేశంలో టికెట్ల చిచ్చు మీడియా దృష్టిని ఆకర్షించాయి. అన్ని ఛానెల్స్ జనాల మధ్య చర్చా వేదికలు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం చేసాయి/చేస్తున్నాయి.

రెండు) పీ.ఆర్.పీ.--కాంగ్రెస్ విలీనం: చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్లు అన్ని పెద్ద ఛానెల్స్ ప్రసారం చేసాయి. అందుకు అనుగుణంగా తమ కొమ్ములు తిరిగిన విలేకరుల చేత మాట్లాడించాయి. 
మూడు) 'స్పందన' పేరిట సినిమా పరిశ్రమ వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఒక మూడు రోజుల పాటు TV-9 కు మేతను అందించింది. 
నాలుగు) గాలి జర్ధనరెడ్డి  కర్నాటక బీ.జే.పీ.లో సృష్టించిన కల్లోలం కూడా ప్రముఖంగా ప్రసారమయ్యింది. "ఆంధ్ర జ్యోతి", "ఈనాడు" గ్రూపులు ప్రత్యేక కథనాలు అందించాయి. "ఆర్" అనుకూల మీడియా...ఏదో తప్పదన్నట్లు కొన్ని వార్తలు చూపించి మిన్నకున్నాయి. 
ఐదు) "అనితా..అనితా" అనే పాత పాడిన కుర్రోడికి చరణ్ రాజ్ సినిమా అవకాశం ఇవ్వడాన్ని ముందుగా Zee-24 గంటలు...ఆ తర్వాత TV-9 ప్రసారం చేసాయి. 
ఆరు) ఇతర రాజకీయ వార్తలు అంటే...ఒకడిని మరొకడు బండ బూతులు దోక్కోవడం...కూడా యథాప్రకారం మన ఛానెల్స్ లో చోటు చేసుకున్నాయి. కే.సీ.ఆర్. నిరశన దీక్ష ప్రకటన...ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూలు, ప్రజలతో ఆయన ముఖాముఖి... టీ.వీ. స్పేస్ ను చాలా తినేశాయి.

ఏదో ప్రజా సేవ చేద్దామని ఉజ్జోగం వదిలి 'లోక్ సత్తా' లో చేరిన కటారి శ్రీనివాస రావు గారిని...స్టుడియోలో కొన్ని రాజకీయ వృషభాల మధ్య వదిలి యాంకర్లు వినోదం పొందారు. 
.....ఇలా ఒక దాని తర్వాత ఒక విషయాన్ని స్వీకరించి...అదే ఆ రోజుకు వార్త అని నమ్మి...జనానికి చూపాయి ఛానెల్స్, పత్రికలు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పెచ్చరిల్లిన 'వైరల్' జ్వరాల సంగతి ఛానెల్స్ కు పట్టలేదు. పత్రికలు జిల్లా అనుబంధాలలో వార్తలను ఇచ్చాయేమో గాని...ఛానెల్స్ మాత్రం లక్షల మందిని ప్రభావితం చేసే 'హెల్త్ రిపోర్టింగ్' ను పూర్తిగా విస్మరించాయి. ఇస్తే పూనకం వచ్చినట్లు వార్తలు ఇవ్వడం...లేదంటే..పూర్తిగా విస్మరించడం మీడియాకు అలవాటు. "డెత్ టోల్" (మరణాల సంఖ్య)ను బట్టి కథనాలు ఇవ్వాలనుకోవడం వెర్రితనం. ఒక్కసారి మీడియా దృష్టి పెట్టి స్కాన్ చేస్తే...ఈ రోజు  'అనారోగ్య ఆంధ్రప్రదేశ్' సాక్షాత్కరిస్తుంది.


ఒక పది మంది చచ్చినప్పుడో...వంద మంది ఆసుపత్రి పాలయినప్పుడో మన ఛానెల్స్ ఆరోగ్యం పట్ల కథనాలు గుప్పిస్తాయి. కానీ...ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో..ఎవరో ఒకరు ఏదో ఒక వైరల్ జ్వరం తో ఇబ్బంది పడుతున్న సంగతిని పట్టించుకోవడం లేదు. చాలా మంది వైద్యానికి డబ్బు ఖర్చు చేయలేక చస్తున్నారు. ఏజెన్సీ లో కూడా పరిస్థితి దారుణంగా వున్నదని అంటున్నారు. మధ్యాహ్నం పూట వైద్యులతో సమాధానాలు ఇప్పిస్తున్నారు...బాగానే వుంది కానీ అధికారుల కళ్ళు తెరిపించి పరిగెత్తించే కథనాలు కావాలిప్పుడు.  

హెల్త్, సైన్సు రిపోర్టర్లు లేకుండానే పత్రికలు, ఛానెల్స్ బండి నడుపుతున్నాయి. ఈ గాలివాటం జర్నలిజం బదులు కొంత సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ..జనాన్ని మీడియా ఆదుకోవాలి. ఎందుకంటే...మీడియా పట్టించుకోనిది...ప్రభుత్వం పట్టించుకోదు కాబట్టి. 

3 comments:

పుల్లాయన said...

బాగా చెప్పారు.

అర్క said...

ఎదురుగా కనబడినదాన్ని లేదా కనబడిన వాటిల్లో మనకు బాగా నచ్చిన, నలిగిన అంశాన్ని స్వీకరించి, అదే అత్యంత ఆవశ్యక సమస్య అయినట్లుగా భావించడం ఈ మధ్య మీడియా యొక్క అతిపెద్ద బలహీనత అయిపోయింది. వివిధ సామాజిక పరిస్థితులు, సమస్యలు, వాటి నేపథ్యాలు, మూలాలు, పాత్రికేయ విలువలపై కనీస అవగాహన లేని పాత్రికేయుల సంఖ్య పెరిగిపోవడమే దీనికి మూలకారణమని నా భావన. కొద్దో గొప్పో సరుకున్న వారిని సరైన దిశలో నడిపించగల యాజన్యాలు లేకపోవడం, ఉన్న యాజమాన్యాలు వాళ్ళ బలహీనతలను, స్వార్థాలను, సంకుచిత దృక్పథాలను వదల్లేకపోవడం వల్ల ఏది నిజమైన సమస్య? అనే దానికి అర్థంలేకుండా పోయింది. మీడియా విశ్వసనీయత కోల్పోవడానికి ముఖ్యకారణం ఇదేనని నా అభిప్రాయం. ఈ అంశంపై మరిన్ని ఆలోచనాత్మక టపాలు వ్రాయగలరని ప్రార్థన.

శాంతిమిత్ర said...

మీ ఆర్గ్యుమెంట్ బాగుంది. ఇక్కడ మరో విషయం కూడా వుంది. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అది ప్రజోపయోగమా? కాదా? అనే విచక్షణతో ఆ వార్తలను ప్రసారం చేయాలి. ఉదాహరణకు నిన్న జరిగిన కెసిఆర్ నిరాహారదీక్షనే తీసుకుందాం. తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేయవచ్చు లేదా పోరాటాలు చేయవచ్చు. కానీ జరిగిన విధ్వంసం ఒక ఎత్తు అయితే, దాన్ని మీడియాలో చూపడం ద్వారా జరుగుతున్న నష్టం మరో ఎత్తు. విధ్వంసం జరుగుతున్న ప్రాంతాల్లో ఎవరోవకరిని కదిలించి ‘‘తరువాత మీరు ఏం చేయబోతున్నారు’’ అని ప్రశ్నిస్తారు. లేకపోతే ఆ తరహా ప్రశ్నలు వేస్తుంటారు. అన్ని ఛానళ్ళలోనూ ఇదే తరహా పోటీ. దీనివల్ల మంచి చెడులను పక్కన పెట్టి ఉద్రేకం, ఉద్వేగంతో ఊగిపోయే నిరసనకారులను ఈ తరహా ప్రశ్నలు అడగడంతో వారు మరించి రెచ్చిపోతున్నారు. వీరిని చూసి ప్రశాంతంగా వున్న ప్రాంతాల్లో కూడా అగ్గి రాజుకుంటున్నది. మీడియాలో పోటీ వుండాలి. కానీ అది సమాజ హితం కోరేవిధంగా వుండాలి. తమ స్వార్థం కోసం, తమ రేటింగ్ పెంచుకోవడం కోసం జరుగుతున్న విధ్వంసాలను పదేపదే చూపడం, యాంకర్లు తమ ప్రశ్నల ద్వారా నిరసనకారులకు లేని ఆలోచనలను కూడా కలిగించడం ఎంత వరకు సబబు. నేనూ ఒక జర్నలిస్టునే. కానీ ఈ తరహా ప్రసారాలు మనస్థాపం కలిగిస్తున్నాయి. అంశం ఏదైనా కావచ్చు. దాని వల్ల సమాజానికి, ప్రజలకు నష్టం జరుగుతుందనుకుంటే అలాంటి సంఘటనలను పదేపదే ప్రసారం చేయకుండా ఒక వార్తగా మాత్రమే చూపితే చాలావరకు నష్టాన్ని నివారించవచ్చు. ఇటువంటి విధ్వంసాల వల్ల ఎన్నో బస్సులు పాడవుతున్నాయి. దీని నష్టం మళ్ళీ ప్రజలపైనే. చైతన్యవంతులైన జర్నలిస్టుమిత్రులు ఆలోచించాలి. ఏ వార్తకు ఎంతవరకు కవరేజ్ ఇవ్వాలో అంతవరకే ఇస్తే అందరికీ ఉపయోగకరంగా వుంటుంది.
- ప్రజామిత్ర

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి