Tuesday, April 13, 2010

ఏపీ భవన్ దగ్గర విలేకరులు, కెమెరామెన్ ఇక్కట్లు

 సొంతూళ్ళకు దూరంగా విధినిర్వహణలో భాగంగా దేశ రాజధానిలో ఉంటున్న విలేకరులు, కెమెరామెన్ ఢిల్లీలో ఆంధ్ర ప్రదేశ్ భవన్ దగ్గర నానా ఇబ్బందులు పడుతున్నారు. సెక్యూరిటీ పేరిట ఒక అధికారి వీరిని వేధిస్తున్నట్లు అక్కడి తెలుగు విలేకరులు సమాచారం ఇచ్చారు. 

"కనపడని మావోయిస్టు నాయకులను సాకుగా చూపి ఢిల్లీ తెలుగు మీడియా మిత్రులని చచ్చేట్టు వేధిస్తున్నాడు.... ఇక్కడి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ వాసన్. వెర్రి బాగా ముదిరిన ఈయన ఇక్కడి జర్నలిస్టులకు  మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ మీడియా కి నిలువ నీడ లేకుండా చేస్తున్నాడు," అని ఒక విలేకరి మిత్రుడు చెప్పారు. 
 
ముఖ్యమంత్రి రోశయ్యని టార్గెట్ చేస్తూ మావోయిస్టు లీడర్ ఆశన్న రెక్కీ చేశాడనీ, ఆయనకు ఢిల్లీ తెలుగు మీడియా ప్రతినిధులు సహకరిస్తున్నారనీ రాష్ట్ర డీ జీ పీకి నివేదికలు పంపి మరీ...మీడియా వాహనాలకి ఏపీ భవన్లో ఎంట్రీ లేకుండా వాసన్ చేసారని విలేకరులు ఆరోపిస్తున్నారు. 
 
రోశయ్య ప్రాణాలకు ఢిల్లీ మీడియా-- అది కూడా తెలుగు మీడియాలోని కొందరు మావోఇస్టు మిత్రుల వల్ల-- ముప్పు ఉందంటూ వాసన్ పంపిన అడ్డగోలు నివేదిక మీద కనీసం విచారణ కూడా జరపకుండా...ఉన్నఫళంగా వో.బీ. వ్యాన్లను బయటికి పంపేసిన రెసిడెంట్ కమిషనర్ రజత భార్గవ ఇక్కడ నిస్సహాయుడైన అధికారిగా ఉండిపొయ్యారట.
 
"మీడియా కంటబడాలంటేనే చిరాకు పడే వాసన్ లాంటి పోలీసు ఆఫీసర్లను పెట్టుకుని ఇక్కడ నిర్వాకం వెలగబెడుతున్న రోశయ్య ప్రభుత్వం..నిజానికి చేయాల్సింది ఏపీ భవన్ నుంచి మీడియాని కాదు బయటకు పంపాల్సింది. ఈ భవంతిలో సంఘవ్యతిరేక కార్యకలాపాలకు, చీకటి నిర్వాకాలకు పాల్పడే కొందరు సిబ్బందిని ముందు బయటకు పంపాలి," అని విలేకరులు కోరుతున్నారు. 
 
చూడబోతే...కొన్ని చీకటి వ్యవహారాలు బైట పడకుండా ఉండేందుకే మీడియాను దూరంగా ఉంచుతున్నారని చెబుతున్నారు. ఏళ్ళ తరబడి అక్కడే తిష్ట వేసిన ప్రైవేటు టూర్ ఆపరేటర్లు సాగిస్తున్న దందాలు, వాటి వ్యవహారాలలో ఏపీ భవన్ సిబ్బంది లాలూచీలు..అన్నీ బయటపడతాయనే....ఈ అడ్డగోలు వాదనలు తెరమీదకు తెచ్చారని కూడా మీడియా ప్రతినిధులు గొణుక్కుంటున్నారు. నిజంగా సీ.ఎం.గారికి ముప్పు ఉంటే...దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలి గానీ...ఇలా మీడియా వాళ్ళను అందరినీ....ఇబ్బంది పెట్టడం బాగోలేదు.

12 comments:

శివ said...

మూకలాగా ఎగబడుతూ, కెమెరాలను మైకులను మొహాలమీద పెడుతూ అల్లరి అల్లరిగా ప్రవర్తిస్తూ ఉన్న ఈ రిపోర్టర్లను ఒక కమోప్లాజ్ గా వాడుకుంటూ దుష్ట శక్తులు ఏమైనా చెయ్యవచ్చు, కాదంటారా?? అందుకే దేనికైనా ఒక పరిధి ఉంటుంది. అది దాటి ప్రవర్తిస్తే "వాసన్" లు బాల పడతారు.

ఇలా వాసన్ నుండి వి.సి శుక్లాలు అవుతారు. ఇందిరా గాంధి కాలంలో సెన్సారింగు పెడితే ప్రజలు నిరసించారు. కాని ఇప్పుడు ప్రభుత్వం సాహసించి ఆపనే చేస్తే దాదాపు నాలు దశాబ్దాల క్రితం వచ్చిన స్పందన ప్రజల నుండి వస్తుందంటారా??? ఈ మొత్తానికి కారణం ఏమిటి, అది విశ్లేషిచండి, కారణాలు నిష్పక్షపాతంగా చూపించండి.

ఈ రోజులలో ఎవరినీ నమ్మటానికి లేదు. సెక్యూరిటీ తరువాతే ఎదైనానూ

శివ said...

"......... సంఘవ్యతిరేక కార్యకలాపాలకు, చీకటి నిర్వాకాలకు పాల్పడే కొందరు సిబ్బందిని ముందు బయటకు పంపాలి," అని విలేకరులు కోరుతున్నారు............"

ఏం? ఇవి ఇవ్వాళే వీళ్ళ కళ్ళబడ్డాయా? ఇన్నాళ్ళ నుండి తెలియదా? వీళ్ళను లోపలి రావద్దు అంటే ఇలా అనటం ఎంత సబబు. అక్కడ జరిగే ఆకృత్యాలను బయట పెట్టలిగాని అదొక బ్లాక్ మెయిలు గా మీడియా వాడుకోవటం ఎంతవరకు సమర్ధించ తగ్గ విషయం?

Anonymous said...

శివ గారితో ఏకిభవిస్తున్నాను,

ఇన్నాళ్ళు ఆ స౦ఘ వ్యతిరేక శక్తులు మీడియా క౦ట పడలేదా? లేక మీడియా వాళ్ళు ఆ శక్తులతో లాలూచీ పడ్డారా?

"ఏళ్ళ తరబడి అక్కడే తిష్ట వేసిన..." మరి ఇన్నేళ్ళు మీడియా చప్పుడు చేయలేదే౦?

madhuri said...

Siva's questions and comments should be taken seriously. His perception of the situation is right.

Anonymous said...

AP Bhavan Clerical staff are known for their corruption, head strong behavior and indecency. All the AP media persons in are bowing their heads since there is no other go. They can't sit any where else. They can't park their vehicles any where. They can't interact with AP politicians any where else with that much ease. AP Bhavan authorities are much worried about 24 hours vigilant media. They all should come together and fight against these odds.

విశ్వామిత్ర said...

మీడియామీద దానిలో పనిచేసే వారిపైన ఎవ్వరికీ సానుభూతి లేదు. జర్నలిజం అనేది ఒకప్పుడు గౌరవమైన వృత్తి. మీరు సానుభూతి ఆశించి ఈ టపా రాసిఉంటే సో...సారీ!!

Ramu S said...

సర్... సమస్యను సమస్యగా తీసుకోకుండా విలేకరుల తిక్క కుదిరింది అన్నట్లు మాట్లాడితే ఎలా సార్? వాళ్ళ విధి నిర్వహణలో ఇది ఒక సీరియస్ ప్రాబ్లం. సానుభూతితో అర్థం చేసుకుంటే బాగుటుంది. నిజంగా విలేకరులలో నక్సల్స్ ఉంటె...చట్టం ప్రకారం చర్య తీసుకోవాలి గానీ...అందరినీ ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. మనం ఏ విషయాన్ని ఆ విషయంగా చూస్తే మంచిదేమో?

శివ గారి పాయింట్ మీద...ఒక ఢిల్లీ విలేకరి నాతో మాట్లాడారు. తాము చాల రోజులుగా అక్కడి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. 'ఈ శివ గారికి విలేకరులంటే ఎందుకు అంత మంట?," అని ఆ పెద్దాయన నన్ను అడిగారు.
రాము

విశ్వామిత్ర said...

శివగారికే కాదు..నాకు కూడా మంటే....నాతోబాటు ఇంకా చాలామందికి మంటే...ఏ.పీ.భవన్‌లో విషయాన్ని ఎందుకు తెరకెక్కించలేదు? తెరకెక్కిస్తే తరువాత వచ్చే లబ్ది పోతుందని. ఎటువంటి కిక్‌బేక్ లేకపొతెనే గగ్గోలు పెడతారన్నది అందరికీ విషయమే. అవునో కాదో మీరు గుండెలమీద చెయ్యి వేసుకొనె చెప్పండి.

Sravya Vattikuti said...

కనపడని మావోయిస్టు నాయకులను సాకుగా >> ఇది సాకు ఎందుకవుతుందండి కనపడే సత్యమే కదా మీడియా జనాలకు ఈ మావోయిస్టు నాయకులంటే మహా యిది మరి వీరికి వాళ్ళ వసూళ్ళలో ఎంత గిడుతుందో గాని .ఇక్కడ శివ గారితో , విశ్వామిత్ర గారితో నేను ఏకీభవిస్తున్నా! మీడియా జనాలుకు కూడా మామాలు జనాలమే అనే స్పృహ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాము.

శివ said...

ఇక్కడి వ్యాఖ్యల పరంపరకు కొనసాగింపు ఇక్కడకూడా చూడండి.

http://apmediakaburlu.blogspot.com/2010/04/blog-post_8943.html

Chandamama said...

సమాచార సేకరణకు నానా అగచాట్లూ పడుతున్న మీడియాలోని కింది స్థాయి ఉద్యోగుల పట్ల కాస్త సానుభూతి ఉండాలనుకోవడం తప్పేమీ కాదు. కానీ వ్యక్తుల జీవితాల్లోకి మీడియా, అవాంఛనీయ ధోరణులతో దూరటం మొదలయ్యాక మీడియాపై సదభిప్రాయం దాదాపు లేకుండా పోయిందివ్వాళ. జర్నలిస్ట్ ప్రపంచం ఇవ్వాళ ఎంతగా కరప్ట్ అయిందో ప్రపంచానికి ఇవ్వాళ బాగా తెలుసు. జర్నలిస్టుల నైతికవర్తన ఇవ్వాళ ప్రపంచం ముందు దోషిగా నిలబడింది. మీడియా యాజమాన్యం ఏం చెబితే అది చేసేయడమే రివాజుగా మారిన కాలంలో జర్నలిస్టుల అగచాట్ల గురించి చెప్పినా సానుభూతి ప్రకటించే పరిస్థితిని ప్రపంచం దాటేసింది. అందుకే ఎపీ భవన్‌లో జర్నలిస్టుల పాట్లను సమర్థిస్తూ ఈ కాలమ్‌లో ఒక్కరూ ముందుకు రావడం లేదు. ఈ ధోరణి సమంజసం అయినా కాకున్నా, ఇవ్వాళ జర్నలిస్టులపై సదభిప్రాయం లేదన్నదే వాస్తవం. దీనికి ఎవరు కారణం అన్నది ఎవరికి వారు ఆత్మ శోధన చేసుకోవలసిందే.
అయితే మావోయిస్టులనుంచి ముడుపులు అందుతున్నాయి కనుకే జర్నలిస్టుల్లో ఎక్కువ మంది వారికి మద్దతు ఇస్తున్నారనే వ్యాఖ్య ఏరకంగా చూసినా సమర్థనీయం కాదు. దండకారణ్యంలో మావోయిస్టులను ప్రజలు సమర్థిస్తున్నారంటే దానికి ఒక రీజన్ ఉండవచ్చు. కానీ జర్నలిస్టుల్లో కూడా మావోయిస్టులను సమర్థించేవారే ఎక్కువగా ఉన్నారన్న విషయం నిజమే అయితే దానికి ముడుపులు కాక మరేదో కారణం అయి ఉంటుంది. సాక్షాత్తూ ప్రభుత్వాల చేత దశాబ్దాలుగా నిషేధానికి గురైన మావోయిస్టులకు ఎక్కువమంది విలేఖరులు మద్దతు ఉందనే అభిప్రాయమే నిజం అయితే మావోయిస్టుల అణచివేతలో కేంద్రం ఓడిపోయినట్లే. మొత్తంమీద చూస్తే ఫోర్త్ ఎస్టేట్‌గా తమకు ప్రత్యేక సౌకర్యాలు, ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకునేంతవరకు వారిపట్ల ప్రజాబిప్రాయం సానుకూలంగా ఉండదు. వీటికి ప్రత్యేక ముడుపులు, ప్రత్యేక రాయితీలు, ప్రత్యేక పలుకుబళ్లు కూడా తోడయితే ఇక చెప్పవలసిన పనిలేదు. తమమీద జరుగుతున్న ముప్పేట విమర్శలను సమర్థించుకునే స్థితికి కూడా జర్నలిస్టు ప్రపంచం దూరం కావడమే విషాదకరం. విమర్శ చేస్తేనే 'హూ ఈజ్ దిస్ శివ' అనేంత అసహనం పేరుకుపోతోందంటే... ఇది మీడియా విశ్వసనీయతకు ఏమాత్రం మంచిది కాదు. ''విశ్వసనీయత ఇతరులకు మాత్రమే ఉండాలి. మాకెందుకు'' అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. తామేం చేసినా, ఏం రాసినా చెల్లిపోతుందనే ధీమా ఉంటే ఉంచుకోండి. కానీ ఇది బ్రాడ్‌గా మీడియాకు మంచిది కాదు. "తెరకెక్కిస్తే తరువాత వచ్చే లబ్ది పోతుందని. ఎటువంటి కిక్‌బేక్ లేకపొతేనే గగ్గోలు పెడతారన్నది అందరికీ విషయమే. అవునో కాదో మీరు గుండెలమీద చెయ్యి వేసుకొనె చెప్పండి." రామూ గారూ, జర్నలిస్టు ప్రపంచంలో మీరు చాలా సీనియర్. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? లబ్దికోసం ఒక రాత రాయడం, లబ్ది ఉందనుకుంటే ఎలాంటి ముఖ్యమైన రాత కూడా రాయకపోవడం పత్రికా ప్రపంచంలో ఉందా లేదా.. సూటిగా చెప్పండి. పుట్టపర్తి సాయిబాబా చేస్తున్న కనికట్టు విద్యను ప్రపంచానికి చూపించిన ఆ గొప్ప స్లోమోషన్ వీడియో 93లోనే స్వయానా ఒక పెద్ద పత్రికాఫీసులోనే 'మాయమై'పోయింది. మనం నీతి చెప్పే పక్షంలోనే ఉన్నామంటారా రాముగారూ?

Anonymous said...

కొన్ని సంవత్సరాల క్రితం ఒక తెలుగుబ్లాగరు "మీడియా ఒక మాఫియా" అనే హెడ్డింగుతో వరసగా సీరియల్ పోష్టులు చేసాడు. "హవ్వ ఎంత మాటన్నాడు ?" అని ఆ రోజుల్లో మేం బుగ్గలు నొక్కుకున్నాం. కానీ ఆయన చెప్పినదే కరెక్టని ఆ తరవాతి పరిణామాలు నిరూపించాయి.

జర్నలిస్టుల ఇబ్బందులు వాస్తవమైనవే కాదనలేం. కానీ ప్రస్తుత సమాజంలో వాళ్ళకి బ్లాక్‌మెయిలర్ల కంటే పెద్ద ఎక్కువ హోదా లేదు. జర్నలిస్టు అని చెబితే చాలు, జనం వెనక్కి తిరిగి చూడకుండా పరుగెట్టి పారిపోతున్న పరిస్థితి ఉంది. జర్నలిస్టుని అని చెప్పుకుంటే ఎవరూ ఇల్లు కూడా అద్దెకివ్వని పరిస్థితి ఉంది. ఇంకా వరష్టు కేసు చెబుతాను. ఒక Men's Rights Forum వారి సైటులో వారు యువకులకిచ్చిన సలహా ఏంటంటే : "మీరు పెళ్ళి చేసుకోబోయే వధువు బంధువర్గంలో పోలీసువాళ్ళు, లాయర్లు, జర్నలిస్టులూ, ఫెమినిస్టులూ లేకుండా చూసుకోండి. అందుకోసం ముందే ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ చేత విచారణ చేయించండి." అని !

People simply think they can do better without these fourth estate guys and girls. ఈ క్రిమినల్/ ఔట్‌కాస్ట్ ఇమేజి లోంచి జర్నలిస్టులు అర్జెంటుగా ఏదో ఒకటి చేసి బయటపడాల్సిన అవసరముంది.