Saturday, November 28, 2009

మహిళలే మన ఛానెల్స్ కు మసాలా దినుసులు!

ఈ ఎలక్ట్రానిక్ మీడియా మహిళల మీద బతికేస్తున్నది, నిర్లజ్జగా. మోసపోయిన స్త్రీ, దాడికి గురైన అబల, అవమానం ఎదుర్కుంటున్న మహిళతో పాటు...ఒంటి ఒంపుసొంపులు ప్రదర్శించే సుందరాంగి వీళ్ళకు కథా వస్తువులు. ఏ ఛానల్ చూసినా...సామాజిక బాధ్యత గాలికి వదిలి, శృంగారం కేంద్రంగా స్టోరీలు ప్రసారం చేస్తున్నాయి.


సినిమాలలో ముద్దు సీన్ లు ఎక్కువగా చూపిస్తున్నారని బాధపడుతూ...ఒక ఛానల్ ఒక ఫీచర్ ప్రసారం చేసింది. అందులో...అన్ని సినిమాలలో ఎన్ని రకాల ముద్దు సీన్ లు వున్నాయో అన్నీ...ఒక చోట చేర్చి ప్రసారం చేసింది. ఇదొక ఛీప్ ట్రిక్. జనం వెర్రిబాగుల వారన్న భ్రమతో చేసే పిచ్చి ప్రయత్నం.
గత కొన్ని రోజులుగా ప్రధాన ఛానెల్స్ లో ప్రసారమైన కథనాలు చూస్తే...ఛానెల్స్ ఎంత తెలివిగా అమ్మాయిలను చూపి పబ్బం గడుపుకున్నాయో తెలుస్తుంది.


విజయవాడ వివాహిత జ్యోతి, కర్నూలు కుర్రోడు కార్తీక్ ల మధ్య వ్యవహారం TV-9 కు పెద్ద వార్త అయి కూర్చుంది. ఒక నాలుగు రోజుల పాటు...మొహానికి గుడ్డ చుట్టుకొని అమాయకంగా జ్యోతి చేసిన వాదనను, పొగరుతో కార్తీక్ ఇచ్చిన సమాధానాలను ప్రసారం చేసిందీ ఛానల్. ఒక సారి జ్యోతి భర్త కూడా లైవ్ లోకి వచ్చాడు..అంటే అమాయకంగా. నిజంగానే ఒక అమ్మాయి..ఒక వెర్రి వెధవ చేతిలో మోసపోతే...ఇలానా 'బహిరంగ విచారణ' జరిపేది?
ఛానల్ యజమాని కూతురుకో, రిపోర్టర్ అక్కకో ఇలాంటి అన్యాయమే జరిగితే...ఇలానే డీల్ చేస్తారా? ఏదో ఆవేశంలో ఆ అమ్మాయి లైవ్ లోకి వస్తానన్నప్పటికీ ఛానల్ వారు వారించ వద్దా? ఆ మాత్రం సామాజిక బాధ్యత వారికి లేదా? 

కానీ..ఆ ఛానల్ అలా చేయలేదు. ఎందుకంటే...అక్కడ విక్టిం ఒక అబల. అలాంటి కథలే జనాలకు నచ్చుతాయి, రేటింగ్స్ పెంచుతాయి. ఆమె బాధ ఛానల్ కు వరం. ఆ అమ్మాయికి మేలు చేసే ముసుగులో...దారుణమైన రీతిలో వ్యవహరించిందీ ఛానల్. ఇలా చేయడం వల్ల నిజంగా ఆ అమ్మాయికి మేలు జరిగిందా? అన్నది పరిశోధించాల్సిన అంశం.


అంతకు ముందు..ఒక ఆంధ్ర ప్రాంతపు అమ్మాయి...ఒక ఎస్.ఐ.పై కొన్ని ఆరోపణలు చేసింది. ఆ చూడ చక్కని అమ్మాయిని కొన్ని ఛానెల్స్ కొన్ని రోజుల పాటు నిత్యం చూపించాయి. పిచ్చి ప్రశ్నలతో ఇంటర్వ్యూలు ప్రసారం చేసారు. స్త్రీ లకు సహాయం చేసే ముసుగులో బాధితులైన వారిని గ్లామరైస్ చేసి చూపించడం భావ్యం కాదు.

ఇప్పుడు ఒక తెలంగాణా ఎం.ఎల్.ఏ.తన భర్త అని వీధికెక్కిన ఒక మహిళను అంతా చూపిస్తున్నారు. ఇంటర్ వ్యూ ల మీద ఇంటర్ వ్యూ లు ప్రసారం చేస్తున్నారు. ఇక మసాజ్ సెంటర్ లపై దాడిలో దొరికిన అభాగినులపై మన వారికి వున్న ఆసక్తి అందరికీ తెలిసిందే. సెక్స్ ఎలిమెంట్ వున్న చోట మీడియా ఉంటున్నది. స్త్రీ లు వున్న చోట సెక్స్ ఎలిమెంట్ వున్నదని మీడియా నిరూపిస్తున్నది. దీనివల్ల చిన్న పిల్లలతో కలిసి హాయిగా ఇంట్లో కూర్చుని టీ.వీ.చూసే భాగ్యం కరువయ్యింది. ఎప్పుడు ఏ బూతు కార్యక్రమం వస్తుందో అని భయపడి చావాల్సివస్తున్నది.



విద్యార్థినులపై యాసిడ్ దాడులు జరిగినప్పుడు...తెగ రెచ్చిపోయే ఛానెల్స్...టీ.ఆర్.పీ.రేటింగ్స్ పిచ్చిలో పడి తాము సమాజానికి చేస్తున్న చేటును విస్మరిస్తున్నాయి. ఏదైనా..హీరోయిన్ సినిమాతో సంబంధం లేని ఒక పని చేస్తే...ఆ వార్తే చూపేటప్పుడు...ఛానెల్స్ వారు ఆ హీరోయిన్ ఒంటి ఒంపు సొంపులు చూపే పాత క్లిప్పింగ్స్ వేస్తున్నారు. ఇదొక తరహా శాడిజంకాక మరేమిటి? ఛానెల్స్ లో సినిమాలపై వస్తున్న ప్రత్యేక కార్యక్రమాలలో గాసిప్ తో పాటు అశ్లీలం ఎక్కువగా ఉంటున్నది. ఈ శృతిమించిన భాగోతాన్ని అరికట్టే యంత్రాంగం లేక పోవడం దురదృష్టం. 


శుక్రవారం నాడు మహిళా సంఘం నాయకురాలు జయ వింధ్యాల నాలుగు మంచి మాటలు చెప్పారు. మీడియా ధోరణి మారితే...సమాజంలో చాలా మంచి జరుగుతుందని ఆమె చెప్పిన మాట నూటికి నూరు పాళ్ళు నిజం. 

ఈ ప్రగతిశీల మహిళలు అశ్లీల కార్యక్రమాలు ప్రసారం చేసే ఛానెల్స్ కు చర్చల కోసం వెళ్ళకుండా..బైట్స్ ఇవ్వకుండా వుంటే వాటి తిక్క కుదురుతుంది. మహిళల హక్కుల కోసం తెగ బాధ పడుతున్న అక్కయ్యలూ....మీరు ప్రచార కండూతి మాని చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన సమయమిది. అశ్లీలం చూపే ఛానెల్స్ ఎదుట ఒక్క సారైనా ధర్నా చేసారా మీరు? మీ నిరసన తెలియజేసారా? మీరు చెయ్యరు...ఎందుకంటే...ఆ ఛానల్ వారు స్టూడియో కు పిలవక పోతే మన ఊపిరి ఆడదు, ప్రపంచం మునిగిపోతుంది. పిచ్చి తల్లులూ..మీకు తెలీకుండానే...ఈ యాజమాన్యాలు మీకు జోల పాడుతూ జో కొడుతున్నాయి.
 

సెక్స్ మానవ బలహీనత. నాలుగు గోడల మధ్య గుట్టుగా ఉండాల్సిన దాన్ని పచ్చి బజారు అంశం చేయడం అవసరమా? ఒక పక్క సినిమాలు, మరొక పక్క ఈ టీ.వీ.ఛానెల్స్ యువతను దారుణంగా ప్రేరేపిస్తున్నాయి. ఒక వేడి వేడి సన్నివేశాన్ని తెరపై చూస్తే...వయసులో ఉన్న ఎవడి మనసైనా లయ తప్పుతుంది. కామ వాంఛ శరీరాన్ని దహించివేస్తుంది. అది ఒక రసాయనిక ప్రక్రియ. శరీరాన్ని సమతా స్థితికి తేవడానికి వున్న మార్గాలు అన్వేషిస్తుంది ఈ పాడు శరీరం. ఈ క్రమంలోనే...అపరిపక్వపు ప్రేమ వ్యవహారాలు, సహకరించని అమ్మాయిలపై భౌతిక దాడులు. 

"బాస్...ఇది పోటీ ప్రపంచం. మా ఓనర్ నాలుగు డబ్బుల సంపాదన కోసం ఛానల్ పెట్టాడు. మాకు మసాలా అవసరం. తప్పదు," అని ఒక సీనియర్ జర్నలిస్టు కుండబద్దలుకొట్టాడు. ఓ.కే. సార్...నిర్లజ్జగా మీరు...బుల్లి తెరల మీద నీలి జర్నలిజానికి పాల్పడండి, జనం బలహీనతను సొమ్ముచేసుకోండి, సమాజాన్ని నాశనం చేయండి. అలాంటప్పుడు...."మెరుగైన సమాజం కోసం," "జనం పక్షాన" వంటి టాగ్ లైన్స్ వదిలేయండి, సిగ్గుతో పాటు. రూపర్ట్ మర్దోక్ లాగా...నీనింతే...చూస్తే చూడండి..లేకపోతే చావండి అని ప్రకటించండి. 

10 comments:

రాంగోపాల్ said...

రాము గారు,
మహిళల గురించి TVచానెల్స్ చేసే రగడ అక్షరాల నిజమండి. TRP రేటింగ్ కోసం చానెల్స్ ఎంతకైనా దిగజారుతున్నాయ్ మీ మాటలతో నేను ఏకిభవిస్తున్నాను. ఈ టపా చాల చాల బాగుంది.

Anonymous said...

You are right.

Anonymous said...

Ramu garu meeru cheppindi 100% correct. kutumba samethamga chudagga cinemaalu leka films ni avoid chestunnam..but intlo andaru kurchoni chuse vidhamgaa leni ee news channels ni elaa avoid cheyalo theleetam ledu..eppudu etuvanti news chupisthaaro theleetam ledu...editing department, newsreaderslo kuda ladies untaaru kada..vallaki etuvanti ibbandi kalagadantaara??

Siri

Unknown said...

రాముగారు ఆ విజయవాడ అమ్మాయి జ్యోతి ,కార్తిక్ ఇంటర్నెట్ వ్యవహారం ఏదో జాతీయ సమస్య లా అన్ని రోజులు ప్రచారం చేసారు , పైగా విదేశాల్లో వున్నా ఆ అబ్బాయి ఇంటికి మా కెమెరా మెన్ మీ దగ్గరికి వస్తాడు మీ సాక్ష్యాలు చూపండి అన్నారు తర్వాత వెళ్ళారో లేదో ?ఇంకా దేశం లో ఇలాంటి సంఘటనలు గంటకి మూడు జరుగుతాయి ,అమ్మాయిలు అమాయకం గా ఉండి పర్సనల్ విషయాలు చెప్పడం వేబ్కాం ఆన్ చెయ్యడం లాంటివి చేస్తే నెక్స్ట్ మినిట్ లో సెక్స్ సైట్స్ లో కనిపించడం సర్వ సాధారణం , అదేదో tv9 వెలుగు లోకి తీసుకోచినట్టు బిల్డ్ అప్ . ఇంకా నయం తెలుగు చానల్స్ లో realty shows మొదలవ్వ లేదు ,లేక పొతే హిందీ వాటిల్ల స్నానం చేస్తున్న సీన్స్ కూడా చూపించే వారు . అయినఅదెంతో దూరం లో లేదేమో .

Praveen Mandangi said...

రాము గారు, మీరు నూతిలోని కప్పలా మాట్లాడుతున్నారు. శ్రీకాకుళం, ఒంగోలు లాంటి సాధారణ పట్టణాలలో కూడా ఇంటర్నెట్ కేఫ్ లని సెక్స్ కేఫ్ లుగా మార్చేసిన సందర్భాలు ఉన్నాయి. నాకు కూడా శ్రీకాకుళంలో ఒక ఇంటర్నెట్ కేఫ్ ఉంది. అశ్లీల వెబ్ సైట్లు చూస్తున్న ముగ్గురు కస్టమర్లని బయటకి గెంటెయ్యడం కూడా చేశాను. వాళ్ళలో ఒక స్కూల్ స్టూడెంట్ కూడా ఉన్నాడు. ఇంకో ఇంటర్నెట్ కేఫ్ ఓనర్ ఇద్దరు స్కూల్ స్టూడెంట్లని బయటకి గెంటేశాడు. వాళ్ళిద్దరూ అన్నాచెల్లెళ్ళే కానీ వాళ్ళు చూసేవి మాత్రం పచ్చి అశ్లీల సైట్లు. 2002 టైమ్ లో ఇంటర్నెట్ గురించి తెలిసినవాళ్ళు తక్కువ. ఆ రోజుల్లో కూడా ఒంగోలు పట్టణంలో ఇంటర్నెట్ కేఫ్ లు సెక్స్ కేఫ్ లు గా ఉండేవి. ఒక ఇంటర్నెట్ కేఫ్ ఓనర్ కి వెబ్ సైట్ అడ్రెస్ లు అడిగితే సెక్స్ వెబ్ సైట్ల అడ్రెస్ లు మాత్రమే చెప్పేవాడు. జనం సెక్స్ గురించి ఏమీ తెలియని అమాయకులు కారు. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి భోగం గుడిసెలు అన్నట్టు సీక్రెట్ గా అయినా వ్యభిచారం చేస్తారు.

KumarN said...

మధ్యలో రూపర్ట్ మర్డాక్ ఏం చేసాడు సార్? :-)

Praveen Mandangi said...

దీన్ని మసాలా అని ఎందుకు అనుకోవాలి? హైవే పక్కన గుడిసెలు పెట్టి తోలు వ్యాపారం చేసేవాళ్ళు పల్లెటూర్లలో కూడా ఉన్నారు. పత్రిక విలేఖరి అయిన మీకు ఈ విషయం తెలియదా?

సుజాత వేల్పూరి said...

ఈ పోస్టు ప్రగతి శీల మహిళా వేదిక సంధ్య చదివే ఏర్పాటు చేయాలి మీరు!ఊ అంటే టీవీ స్టూడియోలకు పరుగెత్తుకొచ్చేది ఆవిడే!

priya said...

excellent sir.. chala baga chepparu.. kani naku oka anumanam- rupert murdoch ni enduku mention chesaru?
asalu ilanti progs and news stories valna janalaki keedu jarugutundi ani teliyagane ventane aa channels ni ban cheseyali.. sir ilanti channels, ilanti vipareeta pokadala madhya journalism chadivi em labham sir? ee vipareeta dhoranini marchalema?

Praveen Mandangi said...

అవి మసాలా కార్యక్రమాలని ఎలా అనుకుంటున్నారు? వాళ్ళు వ్యభిచారం చెయ్యొద్దు అనే చెపుతున్నారు కానీ చెయ్యొచ్చు అని చెప్పడం లేదు కదా. నేను వ్యభిచారానికి వ్యతిరేకమే కానీ ఈ కార్యక్రమాలు మసాలా కార్యక్రమాలని అనుకోను. వ్యభిచారాన్ని చట్టబద్ధం చెయ్యాలని డిమాండ్ చేసే ఒక కేరళ మహిళ వ్రాసిన పుస్తకాన్ని సమర్థించిన కొందరు సోకాల్డ్ పెద్ద మనుషులు మసాజ్ సెంటర్ల గురించి మాట్లాడితే మసాలా అనడం విడ్డూరంగా ఉంది.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి