Saturday, March 20, 2010

తగువే ఊపిరి, పంచాయితీనే శ్వాస: ఛానెల్స్ తీరూతెన్నూ

ఒక భార్యా భర్తా మధ్య ఏదో తేడా వచ్చింది. ఆ సాయంత్రానికి భార్య ఇప్పుడున్న డజను తెలుగు ఛానెల్స్ లో ఒక ఛానల్ స్టూడియోలో ప్రత్యక్షమవుతారు. అక్కడ సూటూబూటూ వేసుకుని...పెద్దగా లోకజ్ఞానం (బుర్ర) లేని యాంకర్ లేదా యాంకరమ్మ ఇక రంగ ప్రవేశం చేస్తారు. ఈ లోపు..."ఈవిడతో నేరుగా  మాట్లాడదలుచుకున్నవారు ఫలానా ఫోన్ నంబర్లకు ఫోన్ చెయ్యండి," అని సదరు ఛానల్ స్క్రోల్ తిప్పుతూ ఉంటుంది. ఇక లైవ్ లో ప్రోగ్రాం మొదలవుతుంది. 


యాంకర్: అచ్చమాంబ గారూ....ఇప్పుడు చెప్పండి. అసలు మీ ఇద్దరికీ ఎక్కడ చెడింది?
అచ్చమాంబ: యేమని చెప్పమంటారు? ఆయనకు నా మీద ప్రేమ లేదని ఇవ్వాళ పొద్దున్న ఆయన మాటల్లో బాగా అర్ధమయ్యింది. పద్నాలుగేళ్ళు కాపురం చేశా..ఈ రోజు బాధపడినంత ఎప్పుడూ పడలేదు. 

యాంకర్: అయ్యో...పద్నాలుగేళ్ళు భరించారా? మీకు చాలా ఓపిక ఎక్కువండీ. ఈ విషయం మీరు మీ వాళ్లకు గానీ, పోలీసులకు గానీ చెప్పలేదా?
అచ్చమాంబ: చెప్పలేదు. ఇందులో ఏముందిలే అనుకున్నా. ఏ కుటుంబంలో అయినా...భార్య భర్తల మధ్య....(ఇంకా ఏదో చెప్పా బోతున్డగానే...)
యాంకర్: కనీసం హ్యూమన్ రైట్స్ దగ్గరకైనా వెళ్ళలేదా?
అచ్చమాంబ: అవేమో నాకు తెలియదమ్మా. 
యాంకర్: మీలాంటి వాళ్ళు హుమన్ రైట్స్ దగ్గరకు వెళ్ళాలి. సరే...డైరెక్ట్గా ఎకాయికీ మా స్టూడియోకి వచ్చి ఎక్స్ క్లూసివ్ గా మా ఛానల్ ప్రేక్షకులతో మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు. మీ పోరాటంలో మా ఛానల్ మీ వెంటే ఉంటుంది. ఇప్పుడు..గుంటూరు నుంచి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. 


యాంకర్: గుంటూరు నుంచి సతీష్ గారు. సతీష్ గారూ... అచ్చమాంబ గారితో మాట్లాడండి.
సతీష్: హలో...హలో..అచ్చమాంబ గారు...మీ కథ వింటే గుండె కరిగింది మాకు. మా ఆవిడ ఏడుస్తున్నది కూడా. ఈ కథ వెలుగు లోకి తెచ్చిన ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నా.

అచ్చమాంబ: (ఎలా స్పందించాలో అర్ధంకాక...తడుముకుంటూ) థాంక్స్ అండీ..మీ లాంటి వారి సహకారం ఉంటే...నాకు అంతకన్నా.... కావలసింది ఏముంది?
యాంకర్: థాంక్స్ సతీష్ గారు, మీ అమూల్య అభిప్రాయాలు చెప్పినందుకు. ఇప్పుడే మహిళల సంఘం నాయకురాలు పొద్దు గారు, భార్యా బాధితుల సంఘం నేత రావుగారు ఫోన్ లైన్స్ లో సిద్దంగా ఉన్నారు. ముందుగా...పొద్దు గారూ...మీరు చెప్పండి.

పొద్దు: చెప్పేది ఏముంటుందండీ...ఒకటే కథ. ఆ మగ వెధవ ఎందుకండీ అంత హింస పెట్టాలి? నేను ముందునుంచీ చెబుతూనే ఉన్నాను...చట్టాలు కఠినం చెయ్యాలని. ఇలాంటి వాళ్ళను అస్సలు వదల కూడదు. జైల్లో పెట్టాలి. లేకపోతే చూస్తూ ఊరుకోం. 

అచ్చమాంబ: (బిత్తరపోతూ) అక్కా..అంతోటి మాటలు ఎందుకులెండి. మిమ్మల్ని టీ.వీ.లలో రోజూ చూస్తూ ఉంటాను. మీరు చాలా బాగా మాట్లాడతారు.
పొద్దు: అదిగో చూసారా..ఆ ఆడతల్లి మనసు. భర్తను కనీసం మాటైనా అననివ్వడం లేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అసలు స్త్రీ అంటే...


రావు: హలో..హలో...నన్ను కాస్త చెప్పనిస్తారా? ఏమిటండీ కఠిన చట్టాలు అంటున్నారు. ఎందుకండీ కఠిన చట్టాలు? ఇప్పుడు ఉన్నవి చాలవా? నేను చాలెంజ్ చేస్తున్నాను.
పొద్దు: కఠినం కాకపోతే..మీలాంటి వాళ్ళు ఉండబట్టే..ఈ రోజు పరిస్థితి ఇలా దాపురించింది. 

(ఇలా పొద్దక్క, రావు అన్నయ్యా కాసేపు ఒకళ్లది ఒకళ్ళకు...చివరకు జనాలకు అర్థం కాకుండా...పది నిమిషాలు తిట్టుకుంటారు. యాంకర్ను వారిద్దరూ పట్టించుకోరు. విధిలేక...'ఈ స్పెషల్ స్టోరీలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్..'అని యాంకర్ అంటారు. మూడు యాడ్స్ తర్వాత మళ్ళీ కథ మొదలు)

యాంకర్: స్పెషల్ స్టోరీ కి మళ్ళీ స్వాగతం. అచ్చంమాంబ గారు పడిన నరకయాతన పై మా ఛానల్ చొరవ చూపి చేసిన ఈ లైవ్ కు విశేష స్పందన లభిస్తున్నది. ఇప్పుడు అమెరికా నుంచి...ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. చెప్పండి..విశేష్ గారు.

విశేష్: హలో..హలో...కెన్ యు హియర్ మీ?
యాంకర్: చెప్పండి...పఫెక్ట్లీ...గో ఆహేడ్
విశేష్: అచ్చంమాంబ గారి గురించి విని చాలా ఫీల్ అయ్యామండీ. షికాగోలో ఉన్న మా సంఘం తరఫున మేము ఆమె పోరాటానికి మద్దతు పలుకుతున్నాం. మేము ఆమెకు మీ ఛానల్ ద్వారా ఒక యాభై వేలు పంపుతున్నాం. 

యాంకర్: థాంక్స్ మిస్టర్ విశేష్. వ్య్ ఫీల్ హాపీ ఫర్ దట్. మీరు నేరుగా మా ఛానల్ పేరు మీద చెక్ పంపండి...ఇప్పుడు మరొక కాలర్..

(ఇలా ఒక పది మంది ఫోన్ ఇన్ లో వచ్చి వాళ్లకు తోచింది చెబుతారు. నోటికొచ్చింది వాగుతారు. చాలా చర్చ జరుగుతుంది, దానికి యాంకర్ మసాలా యాడ్ చేస్తారు. ఒక పోలీసు పాత్ర, ఒక జడ్జి పాత్ర యాంకర్ పోషిస్తారు...లైవ్ లో. ఇంత హడావుడి ఎందుకు జరుగుతున్నదో 'బాధితురాలి'కి బోధపడదు. పొద్దున్న జరిగిన గొడవ అప్పుడే తమ ఇంటికి వచ్చిన తమ దూరపు బంధువైన ఒక చానెల్ విలేకరికి చెప్పి తప్పు చేసానేమో అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే... ఇంతలో అచ్చమాంబ గారి ఇంటి నుంచి ఫోన్ వస్తుంది)

యాంకర్: ఇప్పుడే అందిన వార్త. తెలుగు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న...మా ఛానల్లో ప్రసారమైన కథనానికి స్పందిస్తూ అచ్చమాంబ గారి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. (ఇంతలో...బ్రేకింగ్ న్యూస్..."దెబ్బకు కదిలిన అచ్చమాంబ ఫ్యామిలీ")

యాంకర్: హలో...చెప్పండి...మీరు ఎవరు? అచ్చమాంబ గారికి ఏమవుతారు? వారి భర్తను లైన్ లోకి రమ్మని చెప్పండి. ఆమె స్టూడియోలో ఉన్నారు. 
అటువైపు వ్యక్తి: నేను భర్తను కాదండీ. హలో..నేను... అచ్చమాంబక్క ఇంటిపక్క ఉంటానండి. నా పేరు సరస్వతి. అర్జెంటుగా ఆమెతో మాట్లాడాలండీ.
యాంకర్: ఆయన లేడనుకుంటా...సరే.....సరస్వతి గారు...మాట్లాడండి. 
సరస్వతి: (గాబరాగా) హలో...అచ్చమ్మక్కా...ఉన్నావా?
అచ్చమాంబ: సరస్వతి చెప్పమ్మా...మన గోవిందు స్టూడియోకు రమ్మంటే వచ్చా. ఇక్కడ అంతా గందరగోళంగా....(మధ్యలో సరస్వతి అందుకుంది) 


సరస్వతి: అది తర్వాత అక్కా...ఈ టీ.వీ.లో ఈ చర్చ చూసి భయపడి బావ కళ్ళు తిరిగి కింద పడిపోయ్యాడక్కా....ఇప్పుడే నేను 108 కు ఫోన్ చేశా. నువ్వు పొద్దున్న పట్టుపట్టి అడిగిన కంచిపట్టు చీర తెచ్చాడటక్కా. ఈ లోపు నువ్వు టీ.వీ.లో వచ్చేసరికి కళ్ళు తిరిగి పడ్డాడక్కా...నువ్వు అర్జంటుగా రావాలక్కా...

అచ్చంమాంబ: అయ్యో...అయ్యో...(గుండెలు బాదుకుంటూ) ఎంత పనయ్యిందే. చిన్న చీర గొడవ ఎంత పెద్దగయ్యిందే! ఆయన్ను తప్పుగా అనుకున్నా...ఓరి దేవుడో... ఆయనకసలే బీ.పీ., షుగరు. నేను వెంటనే వస్తున్నా. సరస్వతక్కా...ఆ బీరువాపైన యెర్ర డబ్బీలో...గోలీలున్నై...రెండు వెయ్యక్కా..వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళండి.  నేను స్టూడియో నుంచి ఆసుపత్రికి వస్తా. ఆయన మాత్రం జాగ్రత్త అక్కా. గోటితో పొయ్యేది...గొడ్డలి దాకా వచ్చింది. 

(ఇలా...అచ్చమాంబ ఆసుపత్రికి వెళ్తారు. ఈలోపు 'భార్యా భర్తలను నాటకీయ పరిణామాల మధ్య కలిపిన చానెల్ మాది.." అని తాటికాయంత అక్షరాలతో తెర నిండా వేసుకుని...మురుస్తుంది ఈ చానెల్)

యాంకర్: చూసారు కదా...మా ఛానల్ ఒకే ఒక చర్చతో క్షణాలలో ఒక కుటుంబాన్ని ఎలా కలిపిందో. మళ్ళీ ఏమైనా తేడా వస్తే...అచ్చమాంబ గారి పక్షాన పోరాడటానికి మా ఛానల్ ఏ మాత్రం వెనుకాడదని హామీ ఇస్తూ....ఈ స్పెషల్ లైవ్ ప్రోగ్రాం ముగిస్తున్నాం. మళ్ళీ...ఇలాంటి ప్రోగ్రామ్లో కలుసుకుందాం..అంతవరకూ చూస్తూనే ఉండండి ఈ ఛానల్ ను. మేము మీ తోడూ..నీడా..మీరు మా..వెలుగు నలుగు. నమస్తే.
********************------------------------------****************

బాధితులకు ఛానెల్స్ సహాయం చేయవద్దనడంగానీ....మహిళలను కించపరచడం గానీ, ఎవరినో గేలి చేయడం గానీ మా ఉద్దేశం కాదు. ఈ టీ.వీ.ఛానెల్స్ భార్యాభర్తల పంచాయితీల నుంచి లబ్ది పొందాలని చూడ్డం బాగా పెరిగిపోతున్నది. దీన్ని బాధితులు... బాధలో ఉండి, హడావుడిలో పడి గుర్తించడం లేదు. ఈ లోపు చాలా డామేజ్ జరుగుతున్నది. 

టీ.వీ.యాంకర్స్ న్యాయమూర్తి పాత్ర పోషిస్తున్నారు. జీవితాలు మరీ రచ్చ చేయడానికి తెగపడుతున్నారు. పలు సిల్లీ కేసులు లైవ్ లోకి తీసుకొని....రాజీకి ఉన్న మార్గాలను ఛానెల్స్ మూసి వేస్తున్నాయి. పనీ పాటా లేని వాళ్ళను ఫోన్ ఇన్లో తీసుకుని....కాలక్షేపం చేస్తున్నాయి. ఆ రోజు లైవ్ అయ్యాక ఆ కేసులను ఈ ఛానెల్స్ పట్టించుకోవు.  కాబట్టి....అన్యాయాలకు గురయ్యే మహిళలూ..తొందరపడి...ఆవేశంలో మీడియాకు ఎక్కకండి. వెర్రి కోపంతో టీ.వీ.స్టూడియోలకు వెళ్లి లైవ్ లలో పాల్గొనకండి. 

ముందుగా...న్యాయ పోరాటం చెయ్యండి. మహిళా సంఘాల మద్దతు తీసుకోండి. అయినా...మీకు న్యాయం జరగకపోతే...విలేకరుల సమావేశం పెట్టండి.  మీరు ఏదో ఒక ఛానల్ లైవ్ లోకి వెళితే...మిగిలిన ఛానెల్స్ మిమ్మల్ని పట్టించుకోవు. మీ పోరాటానికి బాసటగా నిలవవు. అవి పోటీ పిచ్చిలో పడి నిర్దయగా వ్యవహరిస్తాయి. మీరు నష్ట పోతారు.  

అమాయకులైన అక్కలు, చెల్లెళ్ళను ఛానెల్స్ దారుణంగా వంచిస్తున్నాయని  చెప్పడం ఈ రచన ఉద్దేశ్యం. బాధితులు మీడియాను ఎలా తెలివిగా వాడుకోవాలో సలహా...సహాయం కావాలంటే....మాకు (ఫోన్: 9347474537) ఫోన్ చెయ్యండి. మాకు చేతనైన ఉచిత సహాయం చేయడానికి మేము ప్రయత్నిస్తాం.

12 comments:

chakri said...

మీరింకా టీవీ చూస్తున్నారా... నేను టీవీ అమ్మి 5 ఏళ్ళు ఐంది..

kvramana said...

రాము అన్నయ్య
ఫోస్ట్ బాగుంది. ప్రస్తుతానికి ఆ ఎమ్మెల్యె గారి భార్య సంగతిని ద్రుష్టిలొ పెట్టుకొని ఈ పోస్ట్ ప్రచురించావని అనుకుంటున్నాను. నిన్నటినుంచి ఛానెల్స్ లో వస్తున్న ఈ దిక్కుమాలిన పంచాయతిని కొంచం కొంచం చూసాను. చాలా బాధాకరమైన లైవ్ ఎపిసోడ్స్ అవన్ని. ఒక బైగమీ కేసును ఎంత దారుణంగా పక్క దోవ పట్టించవచ్చొ తెలుసుకున్నాను. ఆ ఎమ్మెల్యే గారి రెండో భార్యకు తాను రెండో భార్యనన్న విషయం ముందే తెలుసు. ఆ ఎమ్మెల్యెకు తాను అధికారికంగా భార్యను కాలెననీ తెలుసు. కేవలం కలిసి తీయించుకున్న ఫొటోలను ఆధారంగా చూపితే సరిపొదనీ తెలుసు. చట్టం రెండో భార్యను గుర్తించదనీ తెలుసు. ఈ విషయాలన్ని ఆమె వెంట ఉన్న మహిళా సంఘాలకీ తెలిసేవుంటాయి. ఐనాసరే వాళ్లంతా ఆమె వెంట ఎలా వచ్చారొ అర్ధం కాలెదు. వాళ్లు సరే మన చానెల్స్ వాళ్లు ఇది బైగెమీ కేసు కదా మీకు పెళ్లైనా అది చెల్లదుకదా అని ఎందుకు అదగలేదో, అంతకంటే ముందు బైగమీ కేసును లైవ్ లో రచ్చబండ పంచాయతీ లొ తెల్చలేమని ఎందుకు అనుకోలేదో కూడ నాకు బోధపడలేదు.
ఈ కేసు దాని లైవ్ తతంగం గురించి తెలిసినవళ్లెవరైనా వుంటె చెప్పి పుణ్యం కట్టుకొండి బాబు.

Malakpet Rowdy said...

TOOOOOOOOO GOOD!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

రాము గారూ, ఈ సత్యనారాయణ విజయలక్స్మిల భాగోతం నిన్న పొద్దున్న నేను ఒక చానల్లో చూశాను.మధ్యాహ్నం ఇంటికి వచ్చేప్పటికి ఆమె ఇంకో చానల్లో కనిపించింది.తిలా పాపం తలో పిడికెడు అన్నట్లు ఆమె గొడవని ఆ రెండు చానల్సూ పంచుకొన్నాయి.తరువాత ఈ గొడవ ఏమైందో ఎవరికీ తెలీదు.మీరు చెప్పింట్లు ఇంకో కేసుని అంది పుచ్చొకొని నానా యాగీ చేసి దీన్ని వదిలేస్తారు వీళ్ళు.

సుజాత వేల్పూరి said...

భార్యా భర్తల గొడవల్లో ఊళ్ళో వాళ్ళంతా కలగజేసుకుని తీర్పులిచ్చే అద్భుత అవకాశం అన్నమాట.

ఆ ఎమ్మెల్యే గారి రెండో భార్య నేపధ్యం అనుకుంటాను ఈ టపాకి. అందులో ఎన్ని లొసుగులున్నాయో ఆమె మాట్లాడుతున్నపుడు మా ఇంట్లో పని చేసే ఎల్లమ్మ టీవీలో చూసి నానా తిట్లూ తిట్టింది...ఆమెని!

"వెంట తిప్పుకున్నాడు" "నమ్మించాడు" "మాయ మాటలు చెప్పాడు" అనే ఆరోపణలకు అసలు విలువ లేదు. ఇప్పుడిలా రోడ్డున పడే ధైర్యం ఉన్నపుడు ఆ ధైర్యమేదో అతగాడు మాయమాటలు చెప్పినపుడే చూపించొద్దూ?ఇవన్నీ చూడకుండా తయారైపోయే మహిళా సంఘాలనేమనాలి? (Ofcourse, I didn't watch the live program)

ఛారిటీ కార్యక్రమాలు కూడా ఇలా గంటల కొద్దీ న్యూస్ ఛానెళ్ళలో నడపటం ఏమీ బాగా లేదు.తర్వాత సహాయం చేస్తారో లేదో గానీ బోల్డు మంది ఫోన్లు చేసి డబ్బు ప్రామిస్ లు చేస్తారు.

మొన్నామధ్య నల్లకుంటలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల తాలూకు పిల్లలు, వాళ్ళ మేనమామల్తో ఒక ప్రోగ్రాం పెట్టారు ఒక ఛానెల్ వాళ్ళు. ఆ మేనమామలు ఇంకా పెళ్ళి కూడా కాని యువకులు."రేపు మాకూ పెళ్ళిళ్ళవుతాయి.ఈ పిల్లల్ని పెంచడం మాకూ భారమే"అంటారు. పిల్లల్ని పెంచుకుంటామని ఫోన్ చేసే వాళ్ళకు మాత్రం పిల్లల్ని ఇవ్వమంటారు. ఆర్థిక సహాయం కావాలట వాళ్ళకి. ఇద్దరూ చక్కగా క్వాలిఫైడ్!బాగా చదువుకున్నవాళ్ళే!కాళ్ళూ చేతులూ సక్రమంగా ఉన్నవాళ్ళే!

ఇలాంటి వాళ్ళకు ఎందుకు సహాయం చేయాలి? ఈ కార్యక్రమాల్ని న్యూస్ ఛానెల్స్ ఎందుకు నెత్తిన వేసుకోవాలి?

Anonymous said...

Ramu garu,

Thank you very much for the post.
I feel very lucky for not having a TV and also lucky as no US channel got these ideas YET.

Unknown said...

Ramu garu

Script bagundhi idey script as it is ga paper lo print ayyetattu chudandi yendukantey me character achamamba lanti vallu chala mandi unnaru vallu andaru ee blog chadavaleru kada,kanism paper dwara ayetey konchem yekkuva mandiki telusuthundhi...

Ramu S said...

రామ్ ప్రసాద్ గారు..
నా స్క్రిప్ట్ ఏ పేపర్ వాడూ వేసుకోడు. ఎందుకంటే...నేను ఎవ్వర్నీ కాకా పట్టలేను, బూట్లు నాకలేను. ఈ బ్లాగ్ పెట్టాక..గతంలో నాతో మంచిగా మాట్లాడిన సీనియర్ మిత్రులు మొహం చాటేస్తున్నారు. నిజం చెప్పడం, రాయడం ఎవ్వరికీ ఇష్టం ఉండదీ రంగంలో.
మొత్తం మీద మీరు ప్రోత్సాహకరంగా చెప్పారు కాబట్టి, ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది. 'ప్రజాశక్తి' వాళ్ళను అడిగి చూస్తాను. వాళ్ళు వేస్తె...ఇస్తాను. థాంక్స్
రాము

WitReal said...

thats a good & realistic reflection on these programs

but, you are only seeing the tip of the whole business till now.
when media became business, they started squeezing all possible sources of income.

These live panchayats are for TRP.

there are many dark panchayats where they make money by squeezing both parties (pl. don’t throw the blame on the owners. Journalists are equally part of this)

WitReal said...

On different note, Today’s Eenaadu editorial page has a good article on piracy.

I guess, thats a "just" response to the hungerstrike. Hope you understand my point.

Anonymous said...

A very good piece of advice to all women who are in family and personal troubles either with their better halves or parents and it is most appreciable that you have come forward to help the helpless women who are lured for live shows of channels to help them voluntarily.
Family and husband wife matters must be sorted out within four walls except in the cases where the wife is physically and mentally harassed\ and some cases can be sorted out by the elders of the both the families and no one needs the channels help for solving the problems as the channels drag the women to the streets thus loosing the respect and sympathy of the society they would be isolated.
The channel behave in a sadistic manner humiliating the women who are involved in affairs and problems.
There are many family problems due to extra marital relations faced by the anchors,news readers and other staff but how many among these are brought to the live shows?Why Karim and his lover second wife were not interviewed when Karim was attacked with acid by the relatives of his second wife?It looks one leading senior anchor had repented for going to live channel for her problem with her parents due to her love affair leading to marraige with her personal assistant.Let us hope our inocent house wives never get into the trap of the sadistic channels .
JP.

Anonymous said...

ఈ ముష్టి టీవీ ఛానళ్లు పోవాలని ఏడుకొండలవాడికి ఒక మొక్కు కోరుకోవాలి ఎవరైనా...పైత్యం ముదిరి ప్రకోపించుతుంది. నేనీమధ్య ఏ జర్నలిస్టుతో మాట్లాడినా ఒకటే అర్ధం అవుతుంది...జ్ఞానం అనేది ఈ వృత్తికి అవసరం లేదు. బాగా పొగరు, రౌడీ ఆలోచనలు, దురుసుతనం వుంటే చాలు.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి