ఈ జీవితంలో లంచం ఇవ్వకుండా బతకలేని పరిస్థితి దాపురించింది. లంచం ఇవ్వకపోతే పనులు సాగవు. మన అవసరం...లంచావతారం గాడికి పంట పండిస్తుంది. అర్జెంటుగా పని కావాలనుకుని మనం కోరుకుంటాం. ఈ పాయింట్ నే వాడు కాష్ చేసుకుంటాడు. మనం రాజీ పడం. వాడూ రాజీ పడదు. ఇలా..లంచం మధ్యనే సాగుతుంది జీవితం.
ఒక అసాధారణ క్లిష్ట పరిస్థితిలో అర్జంటుగా నేను బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. ఒక సారి రిజర్వేషన్ చేయించుకుంటే ట్రైన్ కాన్సిల్ అయ్యింది. కాబట్టి మరో సారి రిజర్వేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఎమర్జెన్సి కోట (ఈ.క్యు.) కింద చేసిన ప్రయత్నం వర్క్ అవుట్ కాలేదు.
నాతో పాటు పది మంది స్కూల్ పిల్లలు వున్నారు. వారంతా ఒక టేబుల్ టెన్నిస్ పోటీలో పాల్గొనాల్సివుంది. వారికి బెర్తులు పొందేందుకు నేను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఒక గుజరాతి స్టూడెంట్ తండ్రి తెలివిగా టికెట్ కలెక్టర్ గారి చేతిలో ఒక వెయ్యి రూపాయలు పెడితే పని వెంటనే అయిపోయింది.
"సార్...మీతో పాటు నేను రావటంలేదు. టీసి ట్రైన్లో మళ్ళీ మరో ఫైవ్ హండ్రెడ్ అడిగితె ఇవ్వండి," అని పిల్ల వాడ్ని నాతో పంపిస్తున్న ఆ గుజరాతి అన్నారు. అక్కడే సమస్య వచ్చింది. నేను ఎప్పుడూ ఎవరికీ లంచం ఇవ్వలేదు. మరి కొంత సొమ్ము రాబట్టేందుకు ట్రైన్లో టీ.సి. చేసిన ప్రయత్నాలు, వాడిని తప్పించుకుని నేను ఆడిన నిద్ర డ్రామా మరిచిపోలేనివి. వాడు నా బెర్తు దగ్గరకు కనీసం పది సార్లు వచ్చాడు. నేను పది సార్లు నిద్ర నటించాను. చివరకు నా చేతుల మీదుగా లంచం ఇవ్వలేదన్న తృప్తితో రైలు దిగాను.