Sunday, October 11, 2009

వేధించే వెంటాడే వెర్రి బాస్ లకు చురకలేద్దాం రండి..


"ఏంటి అన్నయ్యా...నీకు నలభై వేల జీతం అవసరం అంటావా?"
--ఇదొక బుర్ర మీసాల బాస్ సెటైర్.
"అన్నయ్యా...నీకో విగ్రహం కట్టించాలన్నయ్యా."

--ఇది ఆ మహానియుడే వేసే మరో చురక.
"ఏమ్మా...ఏమనుకుంటున్నావ్ నీ గురించి? వుద్యోగం చేయాలని లేదా?"
--ఇది మరో వెర్రి బాస్ హెచ్చరిక.
"పిచ్చ పిచ్చగా వుందా..ఇంటికి పంపుతా."
--ఇదొక ముట్టె పొగరు ఇన్ ఛార్జ్ బెదిరింపు. 
"ఏంటమ్మా ...నీ నడకలో పొగరు..మాటలో పొగరు..రాతలో పొగరు...చూపులో పొగరు..."--ఇదో గడ్డం గాడి పిచ్చ అబ్సర్వేషన్.
"ఎవడ్రా నువ్వు...ఈ తప్పు మరో సారి చేస్తే...హుస్సేన్ సాగర్లో తోస్త.."
--ఇది వేరొక బాస్ గాడి చీకాకు కామెంట్.
"మీ జిల్లా వాళ్ళకు బుర్ర మోకాలులో వుంటుందయ్యా."
--ఇది ఓ మెల్లకంటి సోమలింగం గాడి గుడ్డి స్టేట్ మెంట్.
"నువ్వు ఒక్క మాటైన మాట్లాడకు..నేను చెప్పింది చెయ్యి అంతే.."

--ఇది ఇంగ్లీష్ ముక్క రాక పోయినా ఓ అంగ్రేజీ పేపర్ బ్యూరో ఇంచార్జ్ గా వెలగపెడుతున్న ఒక నోటి తీట బాస్ గాడి ఆర్డర్.  


మీరు జర్నలిస్టు అయివుంటే...ఇందులో ఏదో ఒక కామెంట్ ఎప్పుడో ఒకప్పుడు బాస్ అనబడే అధికార మదోన్మత్త
వెర్రి అంధ బధిర క్రూర మానవరూప మృగం నుంచి విని వుంటారు. ఆత్మాభిమానం వుంటే...ఏదో ఒక ప్రత్యామ్నాయం చూసుకుని వుద్యోగం వీడి వెళ్ళిపోతారు--మనశాంతిని వెతుక్కుంటూ. గతిలేక పోతే...మాటల ఈటెలు భరిస్తూ...అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్లు ఇంట్లో వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తారు. "ఈ దరిద్రపు ఫీల్డు ఎందుకు ఎంచుకున్నాన్రా భగవంతుడా" అని చావలేక బతుకుతుంటారు. 
      
అందరు బాస్ లను ఒకే గాటన కట్టడం తప్పు. కొందరు మంచి మనుషులూ..మనసున్న వారూ బాస్ లు గా వున్నారు, కానీ ఈ శాతం బహు తక్కువ. జర్నలిస్టులు నలుగురు ఒక చోట కలిస్తే బాస్ ల గురించే ప్రస్తావన వస్తోంది. "గురూ...చస్తున్న ఈ ఎదవతో," అనో..."ఈ దొంగ నాకొడుకు చస్తే బాగు," అనో..."చిన్న వుద్యోగం దొరికినా చాలు..పారిపోతా..." అనో జర్నలిస్టులు అనుకోవటం కద్దు. చాలా పత్రికలూ, ఛానల్ లలో వుద్యోగులు క్షణమొక గండంగా భయంతో బతుకుతున్నరనేది అక్షర సత్యం.


ఆడ పిల్లలు కూడా చాలా సఫర్ అవుతున్నారు ఈ వృత్తిలో. కొందరు సాలరీ ప్యాక్ తో పాటు మనశాంతి కోసం కొన్ని కీలక విషయాలలో రాజీ పడుతున్నారని భోగట్టా. దీనిపై మాట్లాడేందుకు వారు ఇష్టపడరు.


నిజానికి బాస్ లు వేధించి పీడించుకు తినే  పరిస్థితి అన్ని రంగాలలోనూ వుంది కానీ..మీడియాలో ఇది పెచ్చు మీరి వెర్రి తలలు వేస్తున్నది. జర్నలిజం క్రియేటివిటీతో కూడుకున్న వ్యవహారం కాబట్టి బాస్ లకు వేధించేందుకు పనిని ఒక సాకు గా చూపే అవకాశం పుష్కలంగా వున్నది. బాస్ లూ .....మనందరం..ముందుగా మనుషులం. బతకండి...ఇతరులనూ బతకనివ్వండి..


తనకు తాను మహా మేధావిగా భావించుకునే ఒక  దిక్కుమాలిన బాస్...తనకు నచ్చని కొత్త సబ్ ఎడిటర్ పెట్టిన హెడ్డింగ్ లపై అందరి ముందూ పెద్దగా కామెంట్ చేస్తూ పిల్లవాడిని హింసించి మానసిక ఆనందం పొందే వాడు. ఈ దుర్మార్గుడు సెలవులో వెళితే...డెస్కులో అప్పటికే సెలవులో వున్న వారు కూడా డ్యూటీ కి రావటానికి ఆసక్తి చూపేవారు. వాడి ఆబ్సెన్స్ ను జనం అంతగా ఎంజాయ్ చేసే వారు.  ఇది పది, పన్నెండు ఏళ్ళ కిందటి మాట. ఇప్పటికీ...వేరే పేపర్ కు మారినా ఈ వెర్రి వాడి హింసా ప్రవృత్తి మారక పోవటాన్ని బట్టి చూస్తే...సహోద్యోగులను హింసించి ఆనందించడం ఒక నయం కాని జబ్బు అని అవగతమవుతుంది. మనం ఆ జబ్బును నయం చేయవచ్చేమో ప్రయత్నిద్దాం.


ఇదేమి వింత? మీడియాలో ప్రజాస్వామ్య యుతంగా చర్చ జరగకుండా ఎలావుంటుంది? ఈ తరహా బాస్ లు ఇతరులు తమ అభిప్రాయాలు వెల్లడించడాన్ని సహించరు. హింసిస్తున్నప్పటికీ...పడి వుండాలి. లేకుంటే...సెలవలు సరిగా ఇవ్వరు. ప్రమోషన్లు రానివ్వరు. మన తప్పుల చిట్టాలు దగ్గర పెట్టుకుని నానా రకాలుగా హింసించి చంపుతారు. వీళ్ళ సంతానానికి ఇలాంటి బాస్ లు వుద్యోగంలో ఎదురైతే?


తరచి చూస్తే...మీడియాలో బాస్ ల 'మోడస్ ఆపరండి' గమ్మత్తుగా వుంటుంది. ముందుగా ఒకటి రెండు సెటైర్లు విసిరి చూస్తారు. మనం లొంగిపోయి "సార్.. మీరు ఇంద్రుడు...మీ అంత  బుర్ర ఎవ్వడికి లేదీ భూ మండలంలో.." అని సుద్ధ అబద్దాలతో పొగిడి పారేస్తే...నో ప్రాబ్లం. గొంతు ఎత్తామా...మన అభిప్రాయం చెప్పామా...మన పని ఖతం. పనిలో తప్పులు ఎంచుతారు. ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తారు. మన బ్యాచ్ మేట్ను ప్రోత్సహిస్తూ...మనలను తొక్కడానికి ప్రయత్నిస్తారు. 

తర్వాత..ఒక పథకం ప్రకారం...మనం "సెన్సిటివ్" అనీ..."షార్ట్ టెంపర్" అనీ ప్రచారం చేస్తారు. యాజమాన్యాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఇలా చేసే వారు చాలా వరకు మిడిమిడి జ్ఞానం గాళ్ళే అని వేరే చెప్పనవసరం లేదు.

మీడియాలో వారిని జలగల్లా పీడిస్తున్న బాస్ ల భరతం పట్టడం ఈ బ్లాగ్ ప్రధాన ఎజండాలలో ఒకటి. బాస్ వేధింపు...వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కెరీర్ ను నాశనం చేస్తుంది కాబట్టి వారి నిజ స్వరూపం బైట పెట్టడం..బడ్డింగ్ జర్నలిస్టులను వూరడించడం...మనశాంతి పొందటానికి సహకరించడం దీని వుద్దేశ్యం. రండి..ఈ వేదికను వాడుకోండి...తిక్క బాస్ ల వెర్రి చేష్టలను ఎండ గట్టండి.

1 comments:

Swarupa said...

nenu, mahatma bossnu ala endagattaamani, athanni prasninchamane kadaa Murthy mammalni target chesadu... Finalga meme gelichamu... Athi Ghoranga NTV management tho GET OUT anipinchukuni athanu akkannunchi bayata paddadu.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి