Friday, October 23, 2009

టీవీ చానెళ్ళు, వార్తా పత్రికల ఓవర్ యాక్షన్!

వరద సహాయానికి సంబంధించి టీవీ చానెళ్ళు, వార్తా పత్రికల హంగామా చూస్తే 'ఔరా...ఏమి ఈ దాతృత్వ ధోరణి' అనిపిస్తుంది. మనం పన్నులు కట్టి నడిపిస్తున్న ప్రభుత్వాలను పక్కనపెట్టి ఈ మీడియా ను నమ్ముకుంటీ చాలేమో అన్న దుర్భ్రమ కలుగుతుంది. 

ఈ సీ.ఈ.ఓ.లు, చీఫ్ ఎడిటర్లు నిజంగా బాధతో నిద్రపట్టక...ఈ దాతృత్వానికి పాల్పడుతున్నారా? లేక ప్రచార కండూతి లేదా తీట తీర్చుకోవడానికి ఈ వరద సహాయాన్ని వాడుకుంటూన్నారా?...ఆ వరదరాజ స్వామికే తెలియాలి. 

వరద విలయాన్ని చూసి ప్రజలు డబ్బులు, బియ్యం, పాత బట్టలు ఇస్తారు. వారా పని చేసేలా మీడియా ప్రోత్సహిస్తుంది. ఇది ఎప్పటినుంచో వుంది. కానీ..ఇప్పుడు తాజా ధోరణి ఏమిటంటే...టీ వీ చానెళ్ళు, వార్తా పత్రికలు పోటీపడి ఈ వసూళ్లు చేసి...అవే క్షేత్ర స్థాయికి వెళ్లి పంపిణీ చేస్తున్నాయి. మేము గొప్ప అంటే మేము గొప్ప అని డబ్బా కొట్టుకుంటున్నాయి. రాజకీయ నేతలు ఇలాంటి ఉపద్రవాలను మొసలి కన్నీరు కార్చడానికి వాడుకుంటారు. మీడియా ఈ దుర్లక్షణాన్ని అలవరుచుకొని ఏమి సాధిస్తుంది?


అయ్యా, మనం కుడి చేత్తో సహాయం చేస్తే..ఎడమ చేతికి అయినా తెలియకూడదంటారు. మీరు (అంటే ఈ మీడియా బాబులు) జనం దగ్గర వసూలు చేసి...మీ లోగోల కింద పంపిణీ చేయడం ఎంతవరకూ సమంజసం? కర్నూలులో విలేకరులు పోటీలు పడి తమ బాస్ లు హైదరాబాద్ నుంచి పంపిన దుస్తులు, సామగ్రి, పప్పూ ఉప్పు పంపిణీ చేస్తున్నారు. తమ తమ ఛానెల్స్ పేరిట తయారు చేయించిన ఫ్లేక్సీలు, బ్యానర్లు కట్టిన వాహనాలను పదేపదే చూపిస్తూ చంపేస్తున్నారు. ఇలాంటి  ఛీప్ ట్రిక్ కు పాల్పడినా...జనం తమ ఛానెల్స్ పట్ల ఆకర్షితులు అయి చూస్తారని...తద్వారా..టీ.ఆర్.పీ. రేటింగ్ పెరుగుతుందని వీరికి ఎవరైనా చెప్పరా? లేక నిజంగానే వారు వారి కర్తవ్యాలను కొత్తగా నిర్వచించుకొని నెరవేస్తున్నారా?


మన రవి ప్రకాష్ అనబడే వెలిచెర్ల రవి బాబు గారు ఒక అడుగు ముందుకేసి హైదరాబాద్ లో ఫిలిం బాబులతో..భామలతో కలిసి ఒక పెద్ద ర్యాలీ తీయించారు. ఆ రోజంతా.. టీవీ-9 లో ఆ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసారు. రవిబాబు జర్నలిస్ట్ నన్న స్పృహ కోల్పోయి...రెచ్చిపోయి రాజకీయ ప్రసంగం చేసారన్న వాదనా వుంది. 

నిజంగా...బాధ పడే... ఆయన అలా మాట్లాడి వుండవచ్చు. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం బుద్ధి తక్కువ పనే అవుతుందేమో! రవి బాబే కాదు..అందరు మీడియా బాబులూ వరద సహాయ కార్యక్రమాలలో పీకల లోతు కూరుకుపోయి....ఇతర సమస్యలను పెద్దగా పట్టించుకోలేక పోతున్నారు.


ఇక పత్రికలూ...దాతల లిస్టు రోజూ వేస్తున్నాయి. జనం ఆ లిస్టులో స్థానం పొందాలని దానం చేస్తున్నారా? ఈ లిస్టు ప్రచురించడం వల్ల జనానికి ఎలాంటి ప్రయోజనం? అన్నవి సైతం అర్ధం కావడం లేదు. జనం గుండె కరిగి పంపుతున్న చెక్కులు తమ పేరిట పంపమని పలు సంస్థలు పిలుపునిస్తున్నాయి. అవన్నీ నిజంగా బాధితులకు అందుతున్నాయో లేదో...ఎవడికి తెలుసు అన్న బూతుసందేహం పిచ్చి బుర్రలకు రావచ్చు. అలా భావించడం తప్పు...మీడియా బాస్ లు దైవాంశ సంభూతులు. ఆషాడ భూతులు కాదు.


రామోజీ రావు గారు 'ఈనాడు' ను వేదికగా చేసుకుని గతంలో ఇలానే విరాళాలు సేకరించి...ఈనాడు-సూర్య భవనాల పేరిట కొన్ని ఇండ్లు కట్టించారు. జనం డబ్బుతో కట్టించిన వాటికి 'ఈనాడు'కు ఏమిటి సంబంధం...అని కొదరు గొణిగారు. ఇప్పుడు అన్ని పత్రికలూ, ఛానళ్ళు తెగ రెచ్చిపోయి ప్రచార ఆర్భాటం మధ్య వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. 

అసలీ మీడియా వారు తామూ కష్టపడి సేకరించిన విరాళాలు...రెడ్ క్రాస్, సీ ఎం సహాయ నిధి లాంటి వాటికి ఇవ్వకుండా తామేదో ఘనకార్యం చేసినట్లు ప్రచారం చేసుకోవడం నాకు మంచిగా అనిపించడం లేదు. ఈ ఓవర్ యాక్షన్ వల్ల జనంలో మీడియా పట్ల ఏహ్యభావం పెరిగి...భవిష్యత్తులో దానగుణం మందగిస్తుందేమో అని కూడా అనిపిస్తుంది. మరి మీకు యేమనిపిస్తున్నది?

7 comments:

Anonymous said...

Telugu TV channels la over action hechu meerutondi. 'Parayi sommu Pamu lantidi' ane aksharasatyam teliyanattu pravartistunnaru. Aina, political partiesu "parayi sommu danam ma danam tho samanam" annattu pravartinchi, media vallu ilanti panule cheste, inka rajakiya nayakulaki media ki theda undademo? Where's the 'press for people'???

విశ్వామిత్ర said...

ప్రతీవాళ్ళకి ఏదో ఒక కండూతి ఉండటం సహజమే కదండీ!! నష్టపోయిన వారు కొంత సాయం పొందుతున్నరు కదా.కాబట్టి వారి పబ్లిసిటీగురించి పట్టించుకోవడం మానేస్తే మంచిదేమో!!

pavan said...

Chaala baaga chepparandi.
Media channels choosthunte memintha chesam ante memintha chesam ani dappu kottadam tappithe inkem ledanipisthundi.

Vallu panche clothes unna cover meeda media channel names print cheyyadam endukandi, kevalam pracharam koraku mathrame. Aa printing ayye karchu kaneesam inko 10 mandi ki aina upayogapadi undedi.

Edo aasinchi chese sahayam asalu sahaayame kaadu.

Anonymous said...

konni media samusthalaithe ekanga prajaprathinidhulu, vyaparulu, raithula vadhaku velli balavanthanga viralalau vasulu chesthunnayi. endukante poti patrikala kante make ekkuva viralalau vachayani cheppadaniki. idi nijamo kado doubt unna vaaru kanukkovachu.jillalaku phone chesthe chebutharu

Anonymous said...

oka tv chanel reporter ayithe ekanga airforce choper ekki memu kuda sainyam tho kalisi pani chesthunnamu antu oka ahara potlam jaravidichi pose koduthunnadu. asalu chuse valla gurinchi vallemantukuntunnaro artham kadhu

చదువరి said...

నిజమేనండి, వీళ్ళ హడావుడి మరీ అతిగా అనిపిస్తోంది.

vardhini said...

Nijame ramu garu... They are trying to publicity....nijaga help cheyali ani unte brand name use cheyakunda cheyamanadi...ye okaru ala cheyaru

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి