Thursday, October 1, 2009

మన TENGLISH యాంకర్లు

తెలుగు జర్నలిజంలో మహా మొనగాళ్ళు అనదగ్గ మంచి జర్నలిస్టులు వున్నారు. నాకు అలాంటి వారిలో కొందరితో సహవాసం వుంది. అలాంటి వారిలో "అర్భకుడు" ఒకడు. మా..(ఇక నుంచి మన) అర్భకుడికి బుర్రనిండా ఆలోచనలే. తడుముకోకుండా మాటలతో తన్నేస్తాడు. సదాలోచన పరుడు కాబట్టి ఆవేశం కాస్త ఎక్కువే. మన బ్లాగ్ చూసి "అర్భకుడు" వూరుకాని వూరి నుంచి పంపిన మొట్టమొదటి వ్యాసం ఇది. నో హార్డ్ ఫీలింగ్స్ ప్లీజ్. మంచి కోసం మనం మారదాం...ఇక చదవండి...
--------------------------------------------------

చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత మహాదేవ అని వెనకటికి ఒక సామెత ఉంది.. అలాగే రొజూ చచ్చే వాడికి ఏడ్చేవాడు ఎవరూ ఉండరని కూడా అంటూ ఉంటుంటారు.. అలాంటిది వింత టీవీ చానల్స్ వార్తలు వింతగా కాకుండా ఎలా ఉంటాయి దొర గారూ?

అయినా మన పిచ్చి కానీ...గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు వచ్చాయని విసుకుంటే ఎలా... తెలుగు న్యూస్ చానల్స్ అన్న తర్వాత, ఆ మాత్రం తెలుగులేమి తనం, సందర్భ శుద్ధి లేకపోవడానికి మనమే ఎడ్జెస్ట్ అయిపోవాలి కానీ, చానల్స్ ని నిందించ కూడదు సారూ..

వార్తలు ఎలా చదవాలో తెలియక పోవడం ప్రాధమిక లక్షణం అయి కూర్చున్న తర్వాత, మీరెంత నెత్తీ నొరూ కొట్టుకున్నా ప్రయోజనం ఉండదనే పరమార్ధ సూత్రాన్ని ఒంట బట్టించు కోవాలి మరి..అన్నింటికీ అన్నీ కావాలంటే ఎలా?

సర్దుకుపోవాలి....తెలుగు చానల్స్ అన్న తర్వాత..అందునా న్యూస్ చానల్స్ అన్న తర్వాత బోల్డన్ని విపరీతాలకు, వికారాలకు సిద్ధమైపోవాలనే కనీసపు ఇంగితం మనకు కొరవడటం మన తప్పే అనుకోవాలి కానీ...అవతలి వారి మీద ఆగ్రహం మన పెదవికే చేటు అనేది మనం గ్రహించాలి సుమా! అప్పుడు మనల్ని మించిన ఆత్మ జ్ఞాని మరొకడు ఉండదనే వాస్తవాన్ని తెలుసుకోగలుగుతాం.

ముఖ్య మంత్రి లాంటి జనాదరణ ఉన్న నేత ఆకస్మికంగా నేలకొరిగితే---టీ వీ లలో సంయమనం కోల్పోయి.. ఎలా పడితే అలా వార్తలు ప్రెసెంట్ చేసే యాంకర్లు మన కు దొరకటాన్ని మన దౌర్భాగ్యం గా భావించటం కన్నా ----మనం చేయగలింది ఏమీ లేనప్పుడు, కనీసం అధికార భాషా సంఘం దృష్టికి ఈ విషయం తీసుకు వచ్చి...అలాంటి TENGLISH యాంకర్లకు తెలుగు నేర్పించే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుందని నా అభిప్రాయం...ఇట్లు అర్భకుడు!!!!!!!