Saturday, October 3, 2009

డెడ్ బాడీ నుంచి కల్లు తీసిన యాంకరమ్మ !?

 "జంధ్యాల గారు నవ్వించడంలో దిట్ట. ఆయన ఎన్నో హాస్యాస్పద సినిమాలు తీసారు," అని యాంకరమ్మ చదివింది ఒక టీవీ ఛానెల్లో. ఏ తెలుగుతక్కువ జర్నలిస్ట్ రాసి ఇస్తే ఈ అమ్మడు చదివిందో..లేక సొంత బుర్ర పెట్టిందో తెలియదు. "హాస్య రస ప్రధాన" లేదా "హాస్య పూరిత " లేదా "నవ్వులు పండించే"..వంటి మాటలు వాడితే సరిపోయేది. ఇలాంటి తప్పులు రోజూ దొర్లుతున్నాయి టీవీ లలో. మీరు అలాంటి తప్పులు గమనించి వుంటే ఈ బ్లాగ్ కు పంపండి. ఓ యాంకరమ్మ విచిత్ర భాషా విన్యాసంపై మన "అర్భకుడు" చేసిన కామెంట్ చూడండి.
----------------------------------------------------------------------------------------------------------


వినేవాడు అమాయకుడు అయితే, చెప్పేవాడు వేదాంతి అని సామెత. ఇది మన తెలుగు టీ వీ చానల్స్ కి అతికినట్టు సరిపోతుంది..కాపోతే, కాసిన్ని సవరణలతో..వినే వాడితో పాటు, చూసే వాడు కూడా అమాయకుడనిన్నీ, ఇంకా అవసరమైతే వెర్రి వాజమ్మ అనిన్నీ మన తెలుగు న్యూస్ చానల్స్ కి బోల్డంత నమ్మకం..దాంతో పాటే..తాము చూపించి, వినిపించేదే తెలుగు భాష అని కూడా గొప్ప నమ్మకం..అందులో భాగంగానే..తమ సొగసరి యాంకర్ లతో ఇష్టమొచ్చిన తెలుగు (?) ని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తుంటారు..అది వారి బాధ్యతగా కూడా భావిస్తుంటారు.

మన ఖర్మానికి సరిగ్గా ఏ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని, మన శాయశక్తులా టీ వీ తెలుగు న్యూస్ చూద్దామని ప్రయత్నం చేశామా...మన చెప్పుతో మనల్నేకొట్టుకునే ఒక భయానక అనుభూతికి లోనవుతాం.

ఇటీవల మెరుగైన సమాజం పేరిట నడుస్తున్న ఒక ప్రక్రియ లో భాగంగా ...అక్షరాలూ గుర్తు పట్టలేని కొందరు యాంకర్లను మన మీద వదిలిన ఒక ఛానల్--ఒక వార్తా ప్రసారం చేసింది..`డెడ్ బాడీ నుంచి కల్లు తీసిన వైనం' అని ఆ యాంకరమ్మ చదువుతుంటే...భోజనం చేస్తూ వార్తలు చూద్దామనే ఒక చిన్న పాటి తాపత్రయానికి లోనైన ప్రేక్షకులకు పొల మారి,  గొంతులో మెతుకులు, ముక్కులోకి వచ్చి పడ్డాయి. 


ఇంతకీ ఆ యాంకరమ్మ చెప్పదలుచుకుంది ఏమిటంటే...డెడ్ బాడీ నుంచి కళ్లు తీసిన వైనం అని అన్న మాట. ఆమె నేర్చుకున్న తెలుగులో లేదా..ఆమెకు తెలిసిన తెలుగులో `ళ` అనే అక్షరం లేదన్న మాట.. ఆ విషయం మన మెడుల్లా అబ్లాన్ గేటా..అంటే మన చిన్న మెదడుకి తెలియదు కాబట్టి..సాధారణ ప్రేక్షకులైన మనం ఆ విషయాన్ని అవగతం చేసుకోలేక పోయాం. ఆ చనిపోయిన వ్యక్తి నేత్ర దానం చేశాడు కాబట్టి..ఆయన డెడ్ బాడీ నుంచి శస్త్ర చికిత్స ద్వారా కళ్ళను వేరు చేస్తున్నరనిన్నీ,  అందువల్ల ఆ నేత్ర దాత శ్లాఘనీయుడనిన్నీఆ యాంకర్ తాలూకు భావనగా మనం అర్ధం చేసుకోవలసి ఉంటుంది. కాస్త శ్రమ పడక పోతే విషయాలు ఎలా అర్థం అవుతాయి చెప్పండి?


అయితే, సదరు చిన్న వార్త వెనుక ఇంత టీకా తాత్పర్య సహిత టిప్పణి ఉంటుందనే ఇంగితం మన బోటి సాధారణ ప్రేక్షకులకు ఉండదు కాబట్టి...మనం ఇంకా అంతటి తెలుగు భాష ఉచ్చారణ స్థాయికి చేరుకోలేదు (?) కాబట్టి..మనమే సర్దుకు పోవాలన్నది ఇక్కడ అర్ధం చేసుకోవలసిన విషయం అన్న మాట!

ఇది ఒక తరహా భాషా పరమైన హింస అయితే, మరో బాపతు వ్యవహారం కూడా మనకు తరచూ అనుభవం లోకి వస్తూ ఉంటుంది.
మంగళ వారం నిందితులను పోలిసులు అరెస్టు చేసి --బుధవారం కోర్టులో హాజరు పర్చారనే తరహాలో తరచూ తెలుగు పత్రికల్లో వార్తలు వస్తుంటాయి. వారాల ప్రకారం నిందితులు కానీ, కోర్టులు కానీ ఉండరని మన చిట్టి బుర్రలకు తటాలున తట్టదు కాబట్టి, మనం సాధారణం గానే కొంత గందరగోళానికి లోనవుతాం. అయితే..ఇక్కడ మన సంయమనాన్ని టెస్ట్ చేయటానికే ఈ బోటి తిక్క భాషా వినియోగం వల్ల--అసలు వాక్య నిర్మాణం తన సహజ సిద్దమైన అందాన్ని పోగొట్టుకుంటోంది అనే స్పృహ మనకి కలుగుతుంది కానీ...సదరుపత్రిక లేదా ఛానల్  నిర్వాహకులకు కలగదు. వాళ్ళు అనే పదానికి `వాల్లు' అనటం లేదా అలా పలికించటం గొప్ప అనుకుంటారో లేక, యాంకర్ల డొక్కా శుద్ధి అంట మేరకే ఉంటుందో మనకి ఎప్పటికీ బోధపడని ఒక గొప్ప రహస్యం!


ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి..హిందీ, ఇంగ్లీషులతో పాటు, కొన్నిప్రాంతీయ భాషా చానెళ్ళు ..ఎంత పద్దతిగా తమ భాష పట్ల అనురక్తిని ప్రకటిస్తాయో గమనిస్తే..మన తెలుగు చానెళ్ళు ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలో తెలుస్తుంది.. మెరుగైన సమాజాలను నిర్మించే ముందుగా.. మెరుగైన భాష మాట్లాడగల రీతిలో తమ యాంకర్లకు తర్ఫీదు ఇప్పిస్తే..తెలుగు వీక్షక లోకం, కాస్తంత హాయిగా వార్తలు చూసే సౌభాగ్యం కలుగుతుంది...ఇట్లు..
అర్భకుడు..