Saturday, October 17, 2009

కొత్త పండగలు వస్తే ఎంత బాగుండు!

ఇప్పుడున్న హిందూ పండగలలో ఒక్క సంక్రాంతి ఒక్కటే కాస్త రీజనబుల్ పండగ అనిపిస్తుంది నాకు. పంట ఇంటికి వచ్చిన శుభ సందర్భంగా...ధన ధాన్యాలతో పల్లెలు తులతూగే మంచి తరుణం అది. రైతు దేశానికి వెన్నెముక కాబట్టి...ఆయన పడిన కష్టానికి ప్రతిఫలం వచ్చిన సందర్భంగా కొంత మజా చేసుకోవడంలో తప్పేమీ లేదు. 


మిగిలిన పండగలు ఎలా వున్నప్పటికీ ఈ దీపావళి...వినాయక చవితి చాలా బాధ కలిగిస్తాయి. ఈ టపాసులు కాల్చి నరకాసుర వధను సెలెబ్రేట్ చేసుకోవాలని ఎవరు రూల్ పెట్టారో తెలియదు కాని..అది చాలా నష్టం కలిగిస్తున్నది. ప్రతి సారి దీపావళికి ముందు..బాణసంచా తయారీ కర్మాగారాలలో చాలా మంది ప్రమాదవశాత్తు అకాల మరణం పొందుతారు. బాణసంచాకు డబ్బు తగలేయలేక ఇబ్బంది పడే సగటు జీవులు కొందరైతే...ఆనందంగా టపాసులు పేలుస్తూ ప్రమాదవశాత్తు గాయాల పాలై చనిపోయే వారు మరికొందరు. పైగా కాలుష్యం--శబ్ద పరంగా...పొగ పరంగా. 


ఎప్పుడూ పక్క యింటి వాడికి కూడా కనిపించని.. వినిపించని ఒక పొరుగింటి ఆయన...ఈ ఉదయాన్నే కొత్త బట్టలు కట్టుకుని కొడుకును వెంటబెట్టుకుని బాంబుల మీద బాంబులు పేలుస్తూ కనిపించాడు. ఇదొక డాబు ప్రదర్శన, చిన్న పిల్లవాడి ధైర్యానికి విషమ పరీక్ష. వీధి వీధంతా ఆ బాంబు పేలుడు తాలూకు పేపర్ పేలికలు చిందర వందరగా పడిన చీకాకు దృశ్యం. వీధిలో పోతుంటే ఎప్పుడు ఒక రాకెట్ వచ్చి పొరపాట్న మీదపడి సజీవదహనం చేస్తుందేమోనాన్న పిచ్చి భయం. హాయిగా తిరగలేని బతుకు.


ఇక వినాయక చవితి...ఒక పెద్ద ఘోష. వీధులన్నీ మైకాసురుల కబ్జాలలోనే. రకరకాల గణపతులు...వీధికి అడ్డంగా పందిళ్ళు...భజనలు...చందాలు. ఇవన్నీ పర్వాలేదు కాని...పొలోమంటూ విగ్రహాలను దగ్గర్లోని నీటి వనరులో పడెయ్యడం, ఈ కార్యక్రమానికి ప్రభుత్వం బందోబస్తు ఏర్పాటు చేయడం...ఒక వింత. పైగా..ఈ విగ్రహాల తరలిపు సందర్భంగా హిందూ, ముస్లింల మధ్య ఎక్కడ మత కలహాలు జరుగుతాయేమోనాన్న భయంతో జనం బిక్కుబిక్కు మంటుంటారు. పాపం..పోలీసులు పెళ్ళాం బిడ్డలతో గడపకుండా...వీధుల్లో కాపలా వుండాల్సిన దుస్థితి. 

అలాగే...ముస్లిం సోదరులు...చర్నకోలాతో రక్తం వచ్చేట్లు కొట్టుకునే పండగ కూడా భయం కలిగిస్తుంది. దసరా, ఉగాది, రంజాన్, క్రిస్మస్ లు ...ఇతర జనాలకు ఇబ్బంది కలిగించకుండా...కాస్త నాగరిక ఉద్దేశ్యాలతో వున్న పండగలుగా అనిపిస్తాయి. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో కొట్టుకు చచ్చే మతస్థుల మధ్య (ఇంట్రా అండ్ ఇంటర్ రెలిజియన్) ఈ పండగలు ఒక బంధాన్ని, ఏకతను సాధిస్తా యనడంలో సందేహం లేదనుకోండి.


కొత్త కొత్త కారణాలతో...కొత్త పండగలు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎవడి నుంచో అరువు తెచ్చుకున్న...మదర్స్ డే, ఫ్రెండ్ షిప్ డే..వంటి వాటికి మతం రంగు పులిమి...పండగలుగా మారిస్తే! ఉదాహరణకు--ఫలానా రోజున ఇరుగుపొరుగు వారు కలిసి భోజం చేయాలి. ఆ రోజే వారికి వున్న పాత తగాదాలు పరిష్కరించుకోవాలి. ఇదంతా...ఫలానా పురాణంలో చూచాయగా వుంది. ఒక వేళ అలా చేయకపోతే...వచ్చే జన్మలో కాలో, చెయ్యో, మరో వైకల్యమో వస్తుందని...కూడా వుందని జనానికి నూరి పోయాలి. సగానికి సగం మంది ఆ "ఇరుగు పొరుగు పండగ" ను ఉత్సాహంగా జరుపుకొంటారు. ఇది సమాజ శాంతికి ఎంతొ ఉపకరిస్తుంది.

అలాగే... పరులను మోసం చేసిన వారు..అక్రమంగా ప్రజాధనాన్ని కాజేసిన వారు...తన పొట్ట తప్ప పరహితం పట్టని వారు..మతోన్మాదాన్ని రెచ్చగొట్టిన వారు...ఇతరులను మాటలతో చేతలతో బాధ పెట్టిన వారు...తల్లి దండ్రులను అవసాన దశలో వదిలేసే వారు "ప్రాయశ్చిత్త పండగ" నాడు...ఉపవాసం ఉండి..వీధులు వూడ్చి...రోడ్డు పక్క బిచ్చం ఎత్తుకోవాలని...అలా చేయకపోతే..రౌరవాది నరకాలతో పాటు..అంగస్తంభన జరగదని ప్రచారం చేయాలి.

ఇలాగని ఒక పురాణంలో వుందని...ఒక భాష్యం చెప్పి...ఈ ప్రచార బాధ్యతను ఒకటి రెండు మఠాలకు అప్పగించాలి. ఇప్పటికిప్పుడు కాకపోయినా...అందరూ కాకపోయినా...ఎప్పటికైనా...కొందరైనా..ఈ శిక్షలకు భయపడి మంచిగా మసులుకుంటారు. నాకే గనక భగవంతుడు అనే వాడు యెదురైతే...కాళ్ళ వెళ్ళా పడి ఈ ప్రతిపాదనలు ఓకే చేయించుకొస్తాను. మరి ఇప్పటికి వుంటా.
 

3 comments:

సుజాత said...

రాము గారూ,
ఇవాళే చూస్తున్నాను మీ బ్లాగు. బ్లాగు చాలా బావుంది. పోస్టులన్నీ పదునైన భావాలతో, సూటి వ్యక్తీకరణతో చాలా డైనమిక్ గా ఉన్నాయి. దీన్ని కూడలి అగ్రిగేటర్ కి జత పరిచారా? ఒకసారి koodali.org ని చూసి మీ బ్లాగును జతపరచండి. ఇటువంటి బ్లాగులు కేవలం స్నేహితుల సర్కిల్లో మాత్రమే చదివితే చాలదు. దీనికి వీక్షకులు ఎక్కువమంది ఉండాల్సిందే!

దయచేసి వర్డ్ వెరిఫికేషన్ తీరివేస్తే వ్యాఖ్యాతలకు సులువుగా ఉంటుంది కామెంటడం!

Anonymous said...

అలా చేయకపోతే..రౌరవాది నరకాలతో పాటు..అంగస్తంభన జరగదని ప్రచారం చేయాలి.

rocking

Indian Minerva said...

"అలా చేయకపోతే..రౌరవాది నరకాలతో పాటు..అంగస్తంభన జరగదని ప్రచారం చేయాలి."

:)

బాగున్నాయి మీ పోస్టులు...