Saturday, October 31, 2009

మీడియా కార్యాలయాలలో...ఫోన్ టాపింగ్ భయం?

పత్రిక లేదా ఛానల్ నిర్వహణ ఇప్పుడు కోట్ల రూపాయల బిజినెస్. సంఘోద్ధరణ కాకుండా....ఇతర వ్యాపారాల పరిరక్షణ, నాలుగు డబ్బులు, దాంతో పాటు ఒక రాజ్య సభ సీటు పొందటమే ధ్యేయంగా  మహానుభావులు కదన రంగం లోకి దూకారట. 
వ్యాపార అనుకూల పవనాలు పెద్దగా లేకపోయినా...ఉత్తర భారతంలో ఇతర ఛానెల్స్ ప్రకటనలు రాక కుదేలవుతున్నా...ఒక గ్రాండ్ ప్లాన్ తో పత్రికో, ఛానలో పెట్టి...అందుబాటులో వున్న తురుంఖాన్ జర్నలిస్టుల సహాయంతో వార్తా ప్రసార గురుతర బాధ్యతను నెత్తికెత్తుకున్నారు మన వ్యాపారవేత్తలు.

పచ్చళ్ళు, చిట్టీల యాపారంతో జీవితం మొదలెట్టి ఇంత పెద్ద మీడియా సామ్రాజ్యాన్ని ఏలుతూ....రాజకీయ రంగాన్ని వూరి బైట రాజమహల్ నుంచి
ఆయన శాసిస్తుంటే...వూళ్ళో వుంటూ రియల్ ఎస్టేటు, చిట్ ఫండ్స్, విద్య తదితర రంగాల్లో వీర మొనగాళ్ళమైన మనం తక్కువ తిన్నామా? అన్నది ఈ కోటీశ్వరుల సందేహం, ధీమా. వారు అలా అనుకున్నారో లేదో....అప్పటి దాక..."మనిషి బతుకింతే" అని వూసురో మని బతికిన జర్నలిస్టులకు గిరాకీ పెరిగింది. డిమాండ్, సప్లై సిద్ధాంతం పనిచేసింది. మన మిత్రులు డొక్కు స్కూటర్లు మార్చి కార్లు కొన్నారు, బ్యాంకు బ్యాలన్స్ పెరిగింది. ఖరీదైన బట్టలు కట్టారు, లేటెస్టు మొబైల్ ఫోన్లు ఒకటి కాదు రెండు మోయడం మొదలెట్టారు. మొత్తం మీద మన వారు కొంత ధైర్యం తెచ్చుకున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం.

కానీ...కాలం ఒక్క లాగా ఉండదు కదా. ఈ డబ్బులు పోసి ఛానల్ పెట్టిన బడా బాబులు వూరుకోరు. ఈ జర్నలిస్టులు కప్పల తక్కెడ తంతుగా..ఎక్కడ ఎక్కువ జీతం వస్తే అక్కడకు జంప్ చేస్తూ...వైరి ఛానల్ లో చేరుతూ...సుఖంగా వుండే తమకు బీ పీ, షుగర్ వంటి జబ్బులు తెచ్చిపెట్టడాన్ని యజమానులు సహించలేక పోయారు.  ఇట్లా అయితే లాభం లేదని...ఈ జనాన్ని కంట్రోల్ చేసే "మనోడు" ఎవడా అని ఆలోచించారు. 


ఉదాహరణకు...నాగార్జున సాగర్ కెనాల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంటు లో కూలీలను బాగా కంట్రోల్ చేసి...రిటైర్ అయి ఇంట్లో వున్న ఫలానా గొట్టం గాడైతే (జి.జి.)...వీళ్ళను కంట్రోల్ చేయవచ్చని యజమాని గారు నిర్ధారణకు వచ్చారు. ఇంత ప్రపంచ 'గ్ఞానం' వున్న తనకు దేముడు ఇచ్చిన సువర్ణ అవకాశంగా జి.జి. భావించాడు..ఈ అసైన్ మెంట్ ను.

ఇలా..యజమానులు పెట్టిన జి.జి.లు... 'కాస్ట్ కటింగ్' లో భాగంగా ఉద్యోగాలు పీకటం ఆరంభించారు. "ఏమండీ..జి.జి. గారు చెప్పారండి. మీరు రేపటినుంచి వుద్యోగానికి రానక్కరలేదు. ఐ.డి. కార్డు, సెల్ ఫోన్ చిప్పు ఇచ్చి పోన్డెం," అని హెచ్.ఆర్. శాఖ వారు చెప్తే..ఏడుస్తూ ఇళ్ళకు వెళ్ళిన విలేఖరులు కోకొల్లలు. ఇక్కడ గొడవ చేస్తే...మరొక ఛానల్ లో ఉద్యోగం రాదన్న భయం జనానిది. ఈ విషయం జి.జి. గాడికి తెలుసు. 


వాడిది అసలే...గట్టి బుర్ర. అందుకే...ఒక్క మూడు నెలల్లో జర్నలిజాన్ని, జనాన్ని కాచి వడపోసాడు. ఎలాంటి వార్తలు ప్రసారం చేయాలో...ఏ విలేఖరిని ఎలా వాడుకోవాలో వాడే సెలవిస్తుంటే...వీర పరమ వీర జర్నలిస్టులు..."జి.జి.గారు చెప్పారు. వారు చెప్పింది అక్షర సత్యం," అని ఫాలో అయిపోతున్నారు. జర్నలిజం సాగర్లో ఏమీ కలవలేదులెండి!

మీడియా..కార్పోరేట్ స్థాయికి చేరడంతో...ఈ జి.జి. గాళ్ళు మరి కొన్ని పద్ధతులు ప్రవేశ పెడుతున్నారని సమాచారం. అందులో ఫోన్ల ట్యాపింగ్ ఒకటి. ఇది రూఢి కాని పక్కా సమాచారం. పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన నేతలే..ఫోన్ టాపింగ్ ను నిరూపించలేక పోయారు కదా! మనమెంత. ఆఫీసు లలో వుండి..పెద్ద బేరాలు కుదుర్చుకుని..ఉడాయించే పెద్ద చేపల కోసం ప్రారంభమైన ఈ టాపింగ్ చాలా మీడియా సంస్థలలో జరుగుతున్న పునకార్లు.

"నిజమే...ఫోన్ ట్యాప్ కు గురవుతున్న ఫీలింగ్ కలుగుతోంది," అని గాజు మేడ  మీడియా హౌస్ లో పనిచేసే ఒక జర్నలిస్టు చెప్పాడు. దీనికి సాక్ష్యం ఏమిటంటే...అదెలా సాధ్యం అన్నాడు. "మా ఆఫీసు లో అయితే...సీ.సీ. కెమెరాలు పెట్టినట్లు తెలుసు కానీ...ట్యాపింగ్ విషయం తెలియదు. ముందు జాగ్రత్తగా..ముఖ్య విషయాలు..ఆఫీసు ఫోన్లో మేము మాట్లాడుకోం," అని మరొక ఛానల్ విలేఖరి అన్నాడు. 


ఎవ్వరిని దీని గురించి అడిగినా..."నాకు అలానే అనిపిస్తున్నది" అంటున్నారు. అయ్యా/ అమ్మా...జర్నలిస్టులుం గార్లు...ఈ వార్త నిజమో కాదో తెలియదు...నాతో చాలా మంది టాపింగ్ గురించి మాట్లాడుతుంటే..భయమేసి మిమ్మల్ని అలెర్ట్ చేస్తున్నానంతే. "ఛ..ఛ..మా యజమాని మంచి వాడు..మా జి.జి. కూడా వాకే," అని మీకు అనిపిస్తే...దీన్ని వదిలేయండి.

సెల్లు ఫోన్లు అంతగా లేని రోజుల్లో...ఒక పిల్ల పత్రికా జర్నలిస్టు హైదరాబాద్ నుంచి...రాజమండ్రి లోని తన గురుతుల్యుడైన సబ్ ఎడిటర్ కు ఒక లేఖను సంస్థ వారి తపాలా విభాగం ద్వారా పంపాడు. వీరిద్దరూ "బీ"లు. అది రాజమండ్రి చేరీ చేరగానే అక్కడ ఒక "కే" దాన్ని గుట్టు చప్పుడు కాకుండా...తీసి చదివి..దాన్ని పెద్ద బాస్ కు పంపాడు. దాంతో "బీ"ల వుద్యోగం వూడింది. ఒక పదిహేను సంవత్సరాల కిందటే...లెటర్లు చించే చదివే కుక్కబుద్ధిని యాజమాన్యాలు పెంచి పోషిస్తే..ఇప్పటి నక్కజిత్తుల మ్యానేజ్మేంట్లు ఫోన్ లు ట్యాప్ చేయవన్న నమ్మకం ఏమిటీ???

3 comments:

Chandamama said...

రాము గారూ,

గత రెండువారాలుగా మీ బ్లాగు చూస్తున్నాను. ఇన్‌సైడ్ జర్నలిజంలో నక్కిన నగ్ననిజాలను ఏమాత్రం పక్షపాతం లేకుండా అందరినీ అన్ని వర్గాలవారిని, కులాలవారిని, వాయిస్తున్నట్లుంది. తెరమీద కనిపించే మీడియా తళుకు బెళుకుల వెనుక దాగిన వాస్తవాలను మీ 20 ఏళ్ల అనుభవం సాక్షిగా వెలికి తీస్తున్నారు. ఎందుకయినా మంచిది మీరు దెబ్బయిపోకుండా జాగ్రత్తగా ఉండండి.


నాకు తెలిసిన హెచ్ ఎంటీవీ మిత్రుడు కూడా ఈ మద్య తన ఫోన్ ట్యాప్ అవుతున్నదేమో అనే సందేహాన్ని వెలిబుచ్చాడు. దానికి వేరే కారణం గురించి ఊహించుకున్నాము గాని ఇలా జరుగుతోందని ఊహించలేదు. మన సెల్‌ఫోనే మన ఉద్యోగాలను ఊడగొట్టే స్తితి వచ్చేసిందన్నమాట. అమ్మో జాగ్రత్తగా ఉండాల్సిందే మరి..

చూసిన వెంటనే మీ బ్లాగును నా బ్లాగులో లింక్ చేశాను. చూడండి.
అబినందనలతో..

snehitudu said...

అన్నయ్యా..నీ బ్లాగు బాగుంది...మీడియా గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాను..నువు ఇలాగే మీడియాలోని గుంట నక్కల గురించి రాస్తూ ఉండూ..ఓ కంప్లెంట్ అన్న... నువు కొన్ని ఛానల్స్ ను పట్టించుకున్నట్టు అనిపించడం లేదు..మహా,స్టూడియో ఎన్,హెచ్.ఎం.టీవి అన్నమాట...ఇక్కడ అందరూ నీతిమంతులు, బుద్దిమంతులే ఉన్నరంటావా....ఇంకోటి ఓ చిన్న మాట సాయం చేయి అన్నయ్య ఇంకా మన తెలుగులో ఏమైనా న్యూస్ ఛానల్స్ వస్తున్నాయా..వస్తే వాటి వివరాలు కాస్త రాయవా...

vardhini said...

ilanti panikamalina mangment vari vallne koni channels brastupaduthunavi....ilanti othidla valla sariga pani cheya leka... evarithonu communicate kaka...
evaru emi matladukuntunaro vinali ani choose varu gunta nakkala kani Henam....